అయినా అప్పుడప్పుడు మురళిని అయన కలుసుకుని క్షేమ సమాచారాలు విచారిస్తూనే వుంటాడు. భార్యకు తెలియకుండా మురళికి అయన మూడు వేలదాకా అప్పిచ్చాడు. మురళి నాన్న అప్పుగానే తీసుకుని, ఇప్పటికి ఓ వెయ్యి రూపాయలు తీర్చే శాడు కూడా. అందుకాయన కాస్త బాధపడ్డా మురళి సంగతి తెలిసుండి ఊరుకున్నాడు.
ఆయన రేపు చనిపోతాడా? ఎందుకు? ఎలా?
ఆప్రయత్నంగా మురళి ఒక పర్యాయం బట్టల షాపుకు వెళ్ళి పెదనాన్న గారినీ పలకరించాడు. అయన మనిషి పిడిరాయిలా గున్నాడు. కబుర్లు కూడా చలాకీగా చెబుతున్నాడు.
"ఈయన రేపు మరణించడమేమిటి? అర్ధం లేని మాట!" అనుకున్నాడు మురళి.
2
సుదర్శనం నెమ్మదిగా నడుస్తున్నాడు. ఉండుండి అటూ ఇటూ చూస్తున్నాడు. అలా నెమ్మదిగా ఒక ఇరుకు సందులోకి దూరాడు. ఆ సందులో కొంతదూరం నడిచి ఒక పెంకుటింటి ముందాగాడు. నెమ్మదిగా ముందుకు వెళ్ళి తలుపు తట్టాడు.
తలుపులు తెరుచుకున్నాయి. సుమారు ఇరవయ్యేళ్ళ అమ్మాయి తలుపు తీసింది. - "వచ్చేరా ?" అందాయన్ను చూసి, ఆమె పేరు విమల-
సుదర్శనం నవ్వి , లోపలకు వెళ్ళి తలుపులు వేసేశాడు.
ఒక గంట తర్వాత సుదర్శనం బయటకు వచ్చాడు.
విమల ఇంట్లోంచి రోడ్డు మీదకు వచ్చాక సుదర్శనం అడుగుల వేగం హెచ్చించాడు.
ఒక పర్యాయం టైము చూసుకున్నాడు. టైము నాలుగుంపావయింది. ఆ సమయంలో రోడ్డు కవతల వైపున్న ఒకతను సుదర్శనాన్ని పిలిచాడు.
"ఎవరిని ---నన్నా?" అన్నాడు సుదర్శనం ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ . అవతలి వ్యక్తిని ఆయనేక్కడా చూసినట్లు లేదు.
"మిమ్మల్నే -- అర్జంటుగా ఒక మాట చెప్పాలి --" అన్నాడతను.
సుదర్శనం రోడ్డు దాటసాగాడు. స్పీడుగా వస్తున్న టాక్సీ హరన్ సుదర్శనం చెవిలో వినపడింది. అయన ఒకడుగు ముందుకూ -- ఒకడుగు వెనక్కు వేశాడు.
టాక్సీ సుదర్శనాన్ని గుద్దుకుని మీద నుంచి వెళ్ళిపోయింది. జరిగిన ప్రమాదాన్ని టాక్సీ డ్రైవర్ గుర్తించినట్లున్నాడు. ఆగకుండా టాక్సీని పోనిచ్చాడు. ఇంతలో ఎవరో చూశారు -- "అయ్యో -- యాక్సిడెంట్ --" అని అరిచారు . జనం పోగయ్యారు.
3
జరిగినదంతా విని ఆశ్చర్యపోయాడు మురళి. సరిగ్గా జ్యోతిష్కుడు చెప్పిన ప్రకారమే మర్నాడు పెదనాన్న గారు పోయారు. అయితే అది మామూలు మరణం కాదు, హత్య!
అంటే ఆ జ్యోతిష్కుడేవరు? అతనికి హత్య జరుగుతుందని ఎలా తెలుసు?- హత్యకి అతనికీ ఏమన్నా సంబంధముందా? - ఒక వేళ ఉందనుకుందామంటే అతని విషయం ఒకరోజు ముందుగా తనకెందుకు చెప్పాడు?
ఒక్క ప్రశ్నకు సరైన జవాబు అందడం లేదు.
మురళి కుటుంబం ప్రస్తుతం సుదర్శనం ఇంట్లోనే ఉంటున్నారు. హత్య జరిగిన కారణంగా పోస్టు మార్టం జరిగాక కానీ శవం బంధువుల చేతి కందజేయబడలేదు. మనిషి పోయి అందరూ పుట్టెడు దుఃఖంలో ఉంటె పోలీసుల ప్రశ్న లొకటి!
పోలీసుల పరిశోధన కొన్ని కొత్త సమాచారాలనందించింది. సుదర్శనం గారికి విమల అనే ఇరవయ్యేళ్ళ అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. అయన తరచుగా వెళ్ళి ఆమెను కలుసుకుంటుంటాడు.
హత్య జరిగిన నాడు అయన విమల ఇంటి దగ్గర్నుంచే వస్తున్నాడు. విమల చెప్పిన సమాధానాన్ని బట్టి తన మరణం గురించి సుదర్శనానికి చూచాయగా కూడా తెలియదు. అయన చాలా ఉల్లాసంగా ఉన్నట్లు, అది ఆయనకు మామూలేనని ఆమె చెప్పింది.
ఇంక యాక్సిడెంటు గురించి పోలీసుల పరిశోధన ప్రకారం -- అది ముందుగా ప్లాను వేసుకుని చేసిన పని కాదు. కేవలం సుదర్శనం దురదృష్టము, అవతలి టాక్సీ డ్రయివరు అజాగ్రత్తా కలసి -- ఒక మనిషి ప్రాణాలు పోవడానికి దారితీశాయి.
సుదర్శనం మరణానికి కారణభూతమైన టాక్సీ దొరికింది. కానీ ఆ సమయానికి డ్రయివింగ్ సీటులో ఉన్న వ్యక్తీ దొరకలేదు. నిజానికి ఆ టాక్సీని డ్రైవరు వీర్రాజు . ఆతను ఒక్క క్షణం టాక్సీని ఆపి సోడా తాగాలనుకున్నాడు. ఆతడు సోడా తాగుతుండగా టాక్సీ తుర్రుమంది.
వీర్రాజు టాక్సీని ఎవరు ఎందుకు దొంగిలించారన్నది పోలీసులకు అర్ధం కాలేదు. కానీ ఒక మనిషిని హత్య చేయడం కోసం మాత్రం అయుండదని పోలీసులను కుంటున్నారు. కారణం ఏమీ లేదు. హత్య చేయడానికి ఎవరూ అటు వంటి పద్దతి ఎన్నుకోరు. పదిమంది తిరిగే రోడ్డు మీద ఒక మనిషిని గుద్దేసి తప్పించుకోవడం చాలా కష్టం. అంత రిస్కు తీసుకోడానికి ఆ వ్యక్తీ కాకలు తిరిగిన హంతకుడయుండాలి.
పోలీసుల అభిప్రాయంలో మరేదో కారణానికి వీర్రాజు టాక్సీని దొంగలించాడు హంతకుడు. హడావుడిగా వెడుతూ యాక్సిడెంట్ చేసి సుదర్శనం ప్రాణాలు తీశాడు. జరిగిన పొరపాటు గ్రహించి - టాక్సీని పక్క దారులు తొక్కించి తను మాయమయ్యాడు. అతనికి సంబంధించి మరే వివరాలూ దొరకలేదు వారికి.
ఈ వివరాలన్నీ తెలిసిన మీదట మురళికి -- ఇది ముందుగా నిర్ణయించుకుని చేసిన హత్యయేనని రూడి అయిపొయింది. హంతకుడు నిజంగానే చాలా తెలివైన వాడు. అపూర్వసాహాసం కలవాడు. తాననుకున్నది అనుకున్న టైముకి ఖచ్చితంగా సాధించగలిగాడు. అది పదిమంది ఎదుట!
అయినా పట్టుబడలేదు. పైగా పోలీసుల ఆలోచనల్ని తప్పుదారి తొక్కించడం లో కూడా కృతకృత్యుడయ్యాడు. ఇది కేవలం యాక్సిడెంటని వారు నమ్ముతున్నారు.
అయితే తనకు తెలిసిన సమాచారం పోలీసులకు అందజేస్తే ఏమవుతుంది?
ఏదేమైనా పోయిన పెదనాన్న బ్రతికిరారు. కానీ తను పోలీసుల దృష్టిలో పడతాను.
జరగవలసిన తంతులన్నీ జరిగేక మురళి కుటుంబం యదాస్థానానికి వెళ్ళిపోయేరు.
మురళిని అత్యంతాశ్చర్యంలో ముంచేసే సంఘటన మరొకటి జరిగింది. ఇన్సురెన్సు ద్వారా మురళికి ఏభై వేల రూపాయలోచ్చాయి.
సుదర్శనం రెండు సంవత్సరాల క్రితం ఏభై వేలకు ఒక పాలసీ తీసుకుని నామినీగా మురళి పెరిచ్చాడు. అయన అలా తన కుటుంబ సభ్యులందరికీ వచ్చేల చాలా ఇన్సురెన్స్ లు చేశాడు. కానీ మురళి పేరున చేయడం చాలా ఆశ్చర్యం.
పెదనాన్నకు తనమీద గల అభిమానానికి చాలా ఆశ్చర్యమూ, సంతోషమూ గలిగాయి. మురళికి అటువంటి పెదనాన్న దారుణంగా హత్య చేయబడినందుకు అతనికి చాలా బాధనిపించింది. అడపాతడపా అవసరంలో మురళికి అయన సహాయపడుతుండేవాడు. తను లేకపోతె మరెవ్వరూ అతనికి సహాయపడరనే ఉద్దేశ్యంలో అయన ఈ ఇన్సురెన్స్ తీసుకుని వుండాలి. ఈ విషయాన్నయన చాలా గోప్యంగా ఉంచాడు.
ఇలా డబ్బు రావడం సుదర్శనం హత్య పట్ల మురళికి గల బాధ్యతను పెంచింది. అతను సుదర్శనం హత్య జరిగిన సమయంలో తనేం చేస్తున్నదీ మరీమరీ అలోచించి చూశాడు. ఆ సమయంలో అతను ఆఫీసులోనే ఉన్నాడు. అందుకు కొలీగ్సందరూ సాక్ష్యమున్నారు. అదీకాక తనకు డ్రయివింగ్ చేతకాదు.
యాభై వేలంటే మాటలు కాదు. అంత పెద్ద మొత్తం వస్తుందని తెలిసి హత్య చేశాడనుకోవడానికి కూడా అవకాశాలున్నాయి. పోలీసుల దృష్టిలోని కెళ్ళినదో లేదో తెలియదు కానీ -- మురళికి మాత్రం ఇప్పుడు పోలీసులంటే చచ్చేటంత భయంగా ఉంది.
4
మురళి బస్ స్టాపు లో నిలబడి ఉన్నాడు.
"మిస్టర్ మురళీ!' రోడ్డు కవతల పక్క నుంచి ఎవరో చెయ్యూపుతూ పిలుస్తున్నారు.
మురళి రోడ్డు క్రాస్ చేసి అవతల వైపు కెళ్ళాడు.
'గుర్తున్నానా?" అన్నాడతను.
ఆశ్చర్యంగా చూశాడు మురళి. లాంగ్ హైర్, నీలం పాటు మీద పింక్ షర్టు వేసుకున్నాడు. కాళ్ళకు ఖరీదైన జోళ్ళున్నాయి. సుమారు పాతికేళ్ళువుండవచ్చు. ముఖం తనకు పరిచయమైనదే.
అతను జ్యోతిష్కుడు. పెదనాన్న చనిపోతాడన్న విషయాన్ని కరక్టుగా చెప్పగలిగాడు. హటాత్తుగా మురళి శరీరం జలదరించింది. అతను జ్యోతిష్కుడెం కర్మ -- హంతకుడు!
"ఉన్నారు---'అన్నాడు మురళి.
"నేను నాలుగున్నర అన్నాను , అంతే, ఇంచుమించు నాలుగున్నరకి --' అన్నాడతను గర్వంగా.
'చాలా పకడ్బందీగా హత్య చేశారు. చాలా ధైర్యంగా తిరుగుతున్నారు --" అన్నాడు మురళి.
'అతను నవ్వాడు -- "నేను హత్యలు చేయడమా?" అన్నాడు -- "నిజం చెప్పాలంటే సుదర్శనానికీ నాకూ ఏ సంబంధమూ లేదు. అయన మరణం వలన నాకే ప్రయోజనమూ లేదు, అయన పోవడం వల్ల కొంత మందికి ఆకస్మిక ధనలాభం కలిగింది. అటువంటి వాళ్ళే ఎవరో ఆయన్ను చంపి ఉండాలి --" అన్నాడతను మురళి వంక అదోలా చూస్తూ.
మురళీ కాళ్ళలో వణుకు పుట్టింది. అతను లేని ధైర్యం తెచ్చుకుని-- "అదిసరే -- మీరు గొప్ప జ్యోతిష్కుడిలాగున్నారు. హంతకుడేవరో చెప్పగలరా?" అనడిగాడు.
'చెప్పను. కానీ హత్య ఎలా జరిగింది చెబుతాను" అన్నాడతను తాపీగా.
మురళి ఒకసారి చుట్టూ చూశాడు. రోడ్డు మీద జనం మాములుగా తిరుగుతున్నారు. ఎవ్వరూ తమని పట్టించుకోవడం లేదు. రోడ్డు కవతల వైపు తను ఎక్కవలసిన బస్సు వచ్చి కదుల్తోంది- " చెప్పండి" అన్నాడు మురళి.
'చాలా సింపుల్! ఒక టాక్సీ డ్రైవర్ కి వంద రూపాయలిచ్చి అతని టాక్సీ తీసుకున్నాడనుకొండి. ఆ తర్వాత తను చంపదల్చుకున్న చోట ఒక మనిషిని కాపు పెట్టి రోడ్డు కటుపోతున్న మనిషిని ఇటు పిలిపించాడనుకొండి. ఈలోగా టాక్సీ సుదర్శనం మీంచి వెళ్ళిపోయిందనుకోండి -- దాన్ని హత్యగా నిరూపించడానికి బ్రహ్మదేవుడికి కూడా వీలుకాదు. హత్యగా నిరూపించలేనంత కాలం ఈ టాక్సీలో వెళ్ళిన హంతకుణ్ణి ఎవరూ పట్టుకోలేదు --" అన్నాడతను సింపుల్ గా.
'ఈ క్షణాన మిమ్మల్ని నేను పట్టించగలను"-- అన్నాడు మురళి.
అతనికి నవ్వొచ్చింది --'సరే- నన్ను పట్టిస్తారు. ఏమని చెబుతారు?" అనడిగాడు.
