సుధాకరరావు ఆలోచిస్తున్నాడు. అతని బుర్ర సరిగా పనిచేయడం లేదు. కుసుమని తనది కాకుండా చేయడానికి ప్రయత్నాలూ జరుగుతున్నాయన్న వార్త అతని పట్ల ఆశని పాతమయింది. అతనొక పర్యాయం జేబులు తడుముకున్నాడు.
"కాగితం , కలం నా దగ్గరున్నాయి" అన్నాడతను నవ్వుతూ. "మీరు రాయబోయే ఉత్తరం మీ జీవిత సమస్యను తొలగించగలదని నమ్ముతున్నాను."
"అనుకోని మలుపు తిరిగింది నా జీవితం. ఏమవుతుందో నేను నమ్మకంగా చెప్పలేను" అన్నాడు సుధాకరరావు నిస్పృహగా.
'అలాగనుకోవద్దు. నాకు జోస్యం తెలుసు. మీరు రాయబోయే ఉత్తరం, మీ సమస్య లన్నింటినీ తొలగించేస్తుంది" అన్నాడతను.
"నాకెన్నో సమస్యలు లేవు. ఉన్నదల్లా ఒక్కటే!"
"కానీ, ఆ సమస్యకీ , మీ జీవితానికీ ముడిపడి వుంది. ఆ సమస్య తొలగితే మిగతా జీవిత సమస్యలు అటో మేటిక్ గా తొలగిపోతాయి."
సుధాకరరావు కాగితం అందుకున్నాడు. పెన్ను అతని వద్దనే వుంది. "ఏమి రాయాలో నాకు తోచడం లేదు. మీరు చెప్పండి . చెప్పినట్లు రాసేస్తాను" అన్నాడు.
అతను చెప్పడం మొదలుపెట్టాడు. సుధాకరరావు రాస్తున్నాడు. అతను పూర్తీ చేయగానే సుధాకరరావు ఉత్తరం చివర సంతకం పెట్టేశాడు. అతను ఉత్తరాన్ని నాలుగు మడతలుగా చేసి జేబులో పెట్టుకున్నాడు. తన పాంటు జేబులోంచి రెండు చాక్ లెట్స్ తీశాడు. "విష్ యూ అల్ ది బెస్ట్ . ఈ స్వీట్ తీసుకోండి" అన్నాడతను.
అతను రేపర్ విప్పి తన చాకొలేట్ నోట్లో వేసుకున్నాడు. ఇద్దరూ చాక్ లెట్స్ చపప్రిస్తున్నారు. కొద్ది క్షణాల మౌనం అనంతరం సుధాకరరావు "నా కళ్ళు తిరుగుతున్నాయి" అన్నాడు. అతను కంగారుగా , "అదేమిటి , ఇంతవరకూ బాగానే వున్నారు గదా" అన్నాడు.
"మైగాడ్ , నాకేదో అనుమానంగా వుంది. మీరు.... మీరు....." సుధాకరరావు మరి మాట్లాడలేదు. అతని చూపుల్లో ఎదుటి వ్యక్తీ పట్ల అనుమానం కనబడుతోంది. కానీ, అప్పటికే సమయం మించి పోయినట్లుంది. అతను వెనక్కు పడిపోయాడు.
అతను లేచి తన జేబులోంచి ఉత్తరాన్ని సుధాకరరావు జేబులోకి తోసేశాడు. సుధాకరరావు కళ్ళు మూతలు పడ్డాయి. మనిషి అచేతనంగా వున్నాడు.
అతను కదిలాడు. టైము చూసుకున్నాడు. టైము ఏడు గంటల నలభై ఒక్క నిముషాలయింది. ఓసారి నవ్వుకుని ముందడుగు వేశాడతను.
అతనింక వెనక్కు రాలేదు.
సుధాకరరావు మరి లేవలేదు.
6
"పాపం సుధాకరరావు పోయేడటరా" అంది జానకమ్మ.
ఉలిక్కిపడి , "ఎలా తెలిసింది?" అన్నాడు మురళి.
"ఉత్తరం వచ్చింది. ఆత్మహత్య చేసుకున్నాడుట" అంటూ ఉత్తరాన్నందించిందామె.
మురళి ఆతృతగా దాన్నందుకుని చదివాడు. ఎక్కవ విశేషాలేమీ లేవు. ఫలానా రోజు రాత్రి సుధాకరరావు ధవళేశ్వరం లో ఆత్మహత్య చేసుకున్నాడన్నది అందులోని సారాంశం.
హటాత్తుగా మురళికి జ్యోతిష్కుడు గుర్తుకొచ్చాడు. సుధాకరరావు చనిపోతాడని అతను చెప్పాడు. సరిగ్గా అదే రోజు, అదే రాత్రి, ఏడు గంటల నలభై నిమిషాలకు చనిపోతాడన్నడతడు. ఈ ఉత్తరంలో టైము విషయం రాసి లేకపోయినా మిగతా వివరాలు సరిపోయాయి.
ఎవరీ జ్యోతిష్కుడు అతనికి వీళ్ళ చావు గురించి ఎలా తెలుస్తోంది? తెలిస్తే తెలిసింది, తనకెందుకు చెపుతున్నాడు?
మొట్టమొదట తాన పెదనాన్న చావు గురించి చెప్పాడు. చెప్పిన టైము ప్రకారం అయన పోయాడు. అయితే అయన మరణం వల్ల తనకు యాభై వేలు కలిసొచ్చాయి. అలా కలిసోస్తాయని తనకు తెలియదు. కానీ , అతనికి తెలిసినట్లే కనబడుతోంది.
కానీ, తనకు యాభై వేలు వస్తే అతనికేం ప్రయోజనం? వాటా కావాలంటాడా? అడిగితె మాత్రం తను ఇస్తాడా? అయినా తనకు యాభై వేలు రావడంకోసం అతనొక హత్య చేసి తన ప్రాణాల నెందుకు రిస్కులో పెట్టుకుంటాడు?
ఆ విషయం అలాగుంచితే ఇప్పుడు సుధాకరరావు ఆత్మహత్య సంగతి ఏమిటి? సుధాకరరావు ఆత్మహత్య రోజులూ, గంటలూ , నిముశాలతో అతనెలా చెప్పగలిగాడు? ఎలాగో చెప్పగలిగాడనుకున్నా ఆ విషయం తనకెందుకు చెప్పాడు? సుధాకరరావు మరణానికి, తన జీవితానికి సంబంధ మేమిటి?
అంతా అయోమయంగా వుంది మురళికి.
బహుశా ఆ వ్యక్తీ జ్యోతిష్యం నేర్చుకుంటున్నాడెమో? తను లెక్కలు కట్టి ఒక విషయాన్ని ఊహించి అది నా బోటి వాడికి చెబుతున్నాడు. అది సరిగ్గా జరిగినపుడు అతనికి జ్యోతిష్యంలో గల ప్రతిభను గుర్తించగల వ్యక్తీ కనీసం తను వుంటాడు.
ఇలా జరిగి వుండడం అసంభవ మనిపించింది. మురళికి. తన ఆలోచనల్లో ఎక్కడో లోపముంది? జ్యోతిష్యం సహాయంతో చావు పుట్టుకలు గంటలూ, నిమిషాలలో చెప్పగలగడం అంత సింపుల్ విషయం కాదు, ముఖ్యంగా చావుకు సంబంధించినంతవరకూ ఆ విషయాన్ని దేవుడొక్కడే నిర్ణయించగలుగుతాడు?
ఒక మనిషిని ఒక సమయంలో ఒక ప్లాన్ లో చంపాలనుకునే వాడికి, చావు గురించి కరెక్టుగా చెప్పగల శక్తి వస్తుంది. అటువంటి వాడే హంతకుడు! ఒక పధకం వేసుకుని ఒక వ్యక్తిని చంపాలనుకునే హంతకుడికి హతుడి మరణసమయాన్ని ముందుగా చెప్పగల శక్తి వస్తుంది!
ఈ జ్యోతిష్కుడు తప్పనిసరిగా హంతకుడయి వుండాలి' అయితే సుధాకరరావు ఆత్మహత్య చేసుకోలేదా? హత్య కావించబడ్డాడా? ఈ విషయాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవాలనుకున్నాడు మురళి.
పుట్టెడు దుఃఖంలో ఉన్న కుసుమను చూస్తె మురళికి చాలా జాలి కలిగింది. ఆమె కలలన్నీ కరిగిపోయాయి.
మురళి కొంత సమాచారం సేకరించాడు.
సుధాకరరావు ఆత్మహత్య చేసుకున్నడనడంలో అనుమానం లేదు. కానీ, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మాత్రం అర్ధం కావడం లేదు.
మురళి పనికట్టుకుని ధవళేశ్వరం రావడానికి మరో కారణముంది! జ్యోతిష్కుడు సుధాకరరావు మరణం గురించి తనకు ముందుగా చెప్పాడంటే, దానికీ తనకూ ఏదో సంబంధముండి వుండాలి. అదేమిటో తెలుస్తుందనే ఆతనిక్కడకు వచ్చాడు. కానీ సూచన ప్రాయంగా కూడా ఆ విషయం తెలియదు.
ఏది ఏమైనా పెద్ద సమాచారమేమీ రాబట్టకుండానే తిరుగు ప్రయాణమయ్యాడు మురళి.
అతను బస్సు దిగుతుండగా , "హలో మురళీ!" అన్న పిలుపు వినిపించింది. మురళి బస్సు దిగి చుట్టూ చూశాడు. ఎరిగున్న ముఖం ఎక్కడా కనబడలేదు.
"హుష్ - ఇక్కడ!" ఈసారి చపట్లు కూడా వినిపించాయి.
ఆ దిక్కుగా చూసి ఉలిక్కిపడ్డాడు మురళి.
బస్ స్టాండ్ లో , కాస్త షెడ్ లో , గోడ పక్కగా నిలబడి ఉన్నాడు జ్యోతిష్యుడు.
మురళి చురుగ్గా అటుకేసి నడిచాడు.
'అనుకోకుండా కనిపించారు. మీ గురించే చూస్తున్నాను. ఏదో ఊర్నించోస్తున్నట్లున్నారు. ధవళేశ్వరం నుండా?" అన్నాడు జ్యోతిష్కుడు.
'అవును, మీ జోస్యం నిజమయింది" అన్నాడు మురళి.
అతడు నవ్వి "నేను నిజాన్నే జోస్యంగా చెబుతాను. నిజం కాకేమవుతుంది?" అన్నాడు.
"సుధాకరరావు చాలా మంచివాడు. ఎప్పడూ, ఎవరికీ కీడు తలపెట్టనివాడు. చెప్పుకోదగ్గ ఆర్ధిక సమస్యలు లేవతనికి. ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి అంగీకరించింది. అటువంటి అతను కేవలం మీ జ్యోతిష్యాన్ని నిజం చేయడానికే అన్నట్లు ఆత్మహత్య చేసుకున్నాడు" అన్నాడు మురళి బాధగా.
అతను పెదవి విరిచాడు. ఓసారి తనూ బాధగా నిట్టూర్చి , "ఏం చేస్తాం చెప్పండి. విధిని యెదిరించి మనిషి బ్రతకలేడు. ఎలా జరగాలనుంటే అలా జరగాల్సిందే" అన్నాడు.
"కానీ, ఖచ్చితంగా యెలా చెప్పగలుగుతున్నారు మీరు, జరగబోయే చావుల గురించి.'
'అది నేను చెప్పినా మీకు అర్ధం కాదు. హిమాలయాల్లో వెయ్యేళ్ళు తపస్సు చేసిన ఒక మహర్షి దగ్గర ఈ ఉపదేశం పొందాననుకొండి. అదంతా యెందుకు లెండి కాని, మీ కిప్పుడు మరో ముఖ్యమైన విశేషం చెప్పడానికి వచ్చాను."
ఉలిక్కిపడ్డాడు మురళి, "కొంపతీసి మళ్ళీ యెవరి చావు గురించో కాదు గదా -'
"తెగ్జాట్లీ , నన్ను మీరు బాగా అర్ధం చేసుకున్నారనుకుంటాను. రామాయమ్మగారు తెలుసా మీకు .'
"ఏ రామాయమ్మగారు?" అన్నాడు మురళి ఆశ్చర్యంగా .
