......వారం రోజుల తర్వాత
ఆరోజు షూటింగ్ లో చాలా బిజీగా వున్నాడు విమల్.
"సార్..ఇంటి నుంచి ఫోన్." ప్రొడక్షన్ మానేజర్ చెప్పాడు. సెట్లోంచి, స్టూడియో ఆఫీస్ రూమ్ లో కెళ్ళాడు విమల్.
"హలో! విమల్ హియర్."
"నేనే.....వందనని."
"చెప్పు."
"డాక్టర్స్ రిపోర్ట్స్ పంపింది......బాబే." ఆ మాటంటున్నప్పుడు కృష్ణ వందన ముఖంలో కనిపించే, ఆనందాన్ని ఊహించుకున్నాడు విమల్ - చిరాకేసింది.
"ఇంటికొచ్చాక చెప్పొచ్చు గదా, షూటింగ్ మధ్యలో డిస్ట్రర్బ్ చేసావ్.....విసుక్కున్నాడు విమల్.
"బాబని కన్ ఫర్మ్ అయింది కాబట్టి , మిమ్మల్ని డిస్ట్రర్బ్ చేసినట్టు అవునా?"
"బాబయినా పాపయినా నా బిడ్డే, ఫోన్ పెట్టేయ్." క్రెడిల్ మీద రిసీవర్ని పెట్టేసి, వచ్చేసాడు విమల్.
----ఆరోజు రాత్రి కృష్ణ వందనకు, విమల్ వాగ్యుద్ధం జరిగింది.
బాబు పుడతాడని చెప్పిందగ్గర్నుంచి , అంతకు పూర్వం చూపించిన అభిమానం తగ్గిందని, ఎక్కువ బయటకు తీసికెళ్ళడం లేదని, మునుపు వున్నంత సంతోషంగా ఉండడం లేదని----
భార్య అలా నిలదీయడం నచ్చలేదు విమల్ కి. అప్పటికే షూటింగ్ వల్ల బాగా అలసిపోయాడు.
"మునుపున్నంత సంతోషంగా నేనెందుకు లేనో తెల్సా ! రాన్రానూ నువ్వేంటో కొంచెం , కొంచెం అర్ధం అవుతున్నావు కాబట్టి.......నీ ఫీలింగ్స్ తప్ప, ఎదుటి వ్యక్తీ ఫీలింగ్స్ ని అర్ధం చేసుకునే జ్ఞానం నీకు లేదని తెల్సింది కాబట్టి ....." ఆ మాటలకు కృష్ణ వందన ఏదో అనబోయింది అప్పటికే డైనింగ్ హాల్లోంచి వెళ్ళిపోయాడు విమల్.
* * * *
ఓ రోజు రాత్రి పదకొండు గంటల కొచ్చాడు విమల్. తను నటించిన సినిమా ప్రివ్యూకి హాజరై వచ్చాడు. విమల్ నటించిన ప్రతి ప్రివ్యూ కి అంతకు పూర్వం కృష్ణ వందన కూడా వెళ్ళేది. మొట్టమొదటిసారి భార్య లేకుండా , తానొక్కడే వెళ్ళొచ్చడు.
మళ్ళీ గొడవ చేసింది కృష్ణ వందన.
"రోజు రోజుకి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావ్. ఇంతకు మునుపు ఎక్కడి కెళ్ళినా నన్ను తీసుకెళ్ళేవాడివి.....ఇప్పుడు ప్రివ్యూ కూడా నన్ను తీసుకెళ్ళడం లేదు. కనీసం రమ్మని పిలవడం లేదు..."
"నీకిపుడు ఏడో నెల రాత్రి పూట నిన్ను తిరగొద్దని డాక్టర్ చెప్పింది. అందుకే ప్రివ్యూకు తీసుకెళ్ళలేదు...."
'అబద్దమైన అతికినట్టు ఆదాలన్నారు పెద్దలు....ప్రివ్యూకి ప్రేగ్నేస్సికి ఏమిటి సంబంధం.....నాతొ కలిసి బయటకు తిరగడం నీకిష్టం లేదు....అని చెప్పొచ్చుగా...."
"నీకూ రాన్రానూ , మతి పోతోంది వందనా.....ఏవేవో ఊహించుకొంటున్నావ్.....దానివల్ల నీ ఆరోగ్యానికే నష్టం గుర్తుంచుకో.......
"నా మీద పెద్ద ప్రేమన్నట్టు.....పైగా నా హెల్త్ గురించి మాట్లాడ్డం....." విసవిస లాడుకుంటూ లోపలి కెళ్ళిపోయింది వందన.
బెడ్ రూమ్ లో కూడా ఎడముఖం, పెడ ముఖంలా తయారైంది వ్యవహారం. ఆలస్యానికి లక్షా తొంభై ప్రశ్నలు, సూటి పోటీ మాటలు . ఒక పక్క వస్తున్న అవకాశాల ద్వారా హీరోగా నిలబడడానికి విమల్ చేసే ప్రయత్నాలు, రెండో ప్రక్క ఏదో జరిగి పోతోందని తనలో తనే ఊహించుకొని క్రుంగి పోతున్న కృష్ణ వందన.
చాలామంది ఆకర్షణను ప్రేమనుకుంటారు, ప్రేమనే కాంక్ష పెళ్ళితో పూర్తయి పోతుందనుకుంటారు. వీళ్ళకు తెలీని విషయం ప్రేమకు పెళ్ళికి అసలు సంబంధం లేదని. ప్రేమ మనసుకు చెందిన గాడమైన అనుభవం. ఆ అనుభవం అద్దాల గదిలో దీపం లాంటిది. ఆ దీపాన్ని ఇద్దరి మనసులూ కాపలాగా నిలిచి కాపాడుకోవాలి. లేనప్పుడు భ్రమ మిగులుతుంది. ఆ భ్రమ అతి త్వరలో అసూయగానూ, ద్వేషంగానూ మారడానికి అట్టే సమయం పట్టదు. అలాంటి సందిగ్ధ పరిస్థితిలో విమల్ కృష్ణవందన ఉన్నారన్న విషయం వాళ్ళకు తెలీదు.
విమల్ సినిమా షూటింగ్ లో ఊటీ వున్నప్పుడు కృష్ణ వందన బాబుకి జన్మ నిచ్చింది. ఫోన్ అందుకున్న వెంటనే కొడుకును చూడడానికి వచ్చాడు విమల్.
"నా పోలికే కదూ......ఆనందంగా అంది కృష్ణ వందన.
"ముక్కు కూడా పొడవుగానే వుంది.......నీలా కోపం కూడా ఎక్కువే చూడు....." విమల్ మాటలకు చురుగ్గా చూసింది వందన.
* * * *
బారసాల ఫంక్షన్ కి, జయేంద్ర అన్ని పనులూ వదులుకుని డిల్లీ నుంచి వచ్చాడు. దూరం వల్ల కృష్ణ వందన తరపున ఎవరూ రాలేదు.
పురోహితుల తతంగమంతా అయ్యాక బాబు పేరు ప్రసక్తి వచ్చింది.
"వాళ్ళ నాన్నమ్మ పేరు రుక్మిణి మీద వచ్చేట్టుగా చూడండి......" జయేంద్ర కొడుకు వేపు, కోడలి వేపూ ఆనందంగా చూస్తూ అన్నాడు.
"మా డాడీ పేరు పెడదామని .....ఎప్పుడో అనుకున్నాం మావగారూ...." నిర్మొహమాటంగా అంది కృష్ణ వందన.
కన్పించని కత్తి చేసిన కన్పించని గాయం అది.
"ఏం బాబూ విమల్....." ప్రశ్నార్ధకంగా చూసిన విమల్. తన తండ్రి ముఖంలోకి చూడలేకపోయాడు. భార్యని ఎలా వారించాలో తెలీక విలవిల్లాడాడు.
"ఏం మావగారూ.......డాడీ పేరుమీదుగా రాదా కుమార్ బాగోదా....."
కోడలి ముఖంలోకి చూడలేకపోయాడు జయేంద్ర.
"బాగుంటుందమ్మా......ఎవరి పేరు పెడితేనేంటి ?" సర్దుకున్నాడాయన.
విమల్ మాత్రం చాలా బాధపడ్డాడు. కృష్ణ వందన అవ్వేవీ పట్టించుకోలేదు.
* * * *
అన్నాపూర్ణ స్టూడియో స్ లోని సెకెండ్ ఫ్లోర్లో రైన్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది.
ఫేమస్ బొంబాయి తార హెలీనా, విమల్ మీద పిక్చరైజ్ చేస్తున్నారు. పాట నుంచి గ్రిస్పింగ్ గా వుంది. స్టెప్స్ వెరైటీగా వున్నాయి. ఆ పాట స్టెప్స్ కోసం విమల్ చేసిన కృషి స్పష్టంగా కన్పిస్తోంది. తను అనుకున్న మేరకు పిక్చరైజేషన్ సంతృప్తిగా వస్తున్నందుకు డైరెక్టర్ ఆనందంగా వున్నాడు.
