"ఏం అఖ్ఖర్లేదులే."
"మన పెళ్ళికి మీ డాడీ ఒప్పుకున్నారా?"
ఓరకంట విమల్ వేపు చూసింది కృష్ణవందన.
అతని దగ్గరగా వెళ్ళి, చేతివేళ్ళతో అతని జుత్తుని చెరిపేసి, బుగ్గల్ని పట్టుకుని గిల్లి, పెదాల మీద ముద్దు పెట్టుకుని, ముక్కును పట్టుకుని లాగేసి.
పరుపరుగున ఆ గదిలోంచి బయటికోచ్చేసి "సీయూ.....విమాల్.' అనేసి , కారేక్కేసింది కృష్ణ వందన.
ప్రేమకైనా, ద్వేషానికైన స్త్రీ పరాకాష్ట.....
అందుకే ఆ సమయంలో కృష్ణ వందన స్వభావం అసలేం అర్ధం కాలేదు విమల్ కి.
* * * *
కృష్ణవందనతో విమల్ పెళ్ళికి అభ్యంతరం పెట్టలేదు జయేంద్ర.
న్యూయార్క్ నుంచి కృష్ణవందన , పిన్ని, జె.ఆర్. రావు కొంతమంది ఆయన బిజినెస్ పార్టనర్స్ వచ్చారు.
జయేంద్ర తరపున రాజకీయ నాయకులందరూ వచ్చారు.
ఆ సమయంలో రుక్మిణి లేనందుకు జయేంద్ర బాధపడ్డాడు.
తండ్రిని వినమ్ర ఓదార్చింది.
మొత్తం సినిమా ప్రపంచం అంతా అట్టహాసం చేసింది. వైభవంగా పెళ్ళి జరిగిపోయింది.
విమల్, కృష్ణ వందన హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళారు.
అయిదు నెలలు గడిచాయి .
* * * *
"నీకు బాబు కావాలా, పాప కావాలా!" అలా అడుగుతున్నా కృష్ణ వందన వేపు, ఆశ్చర్యంగా ,ఆనందంగా చూసాడు విమల్.
షూటింగ్ మధ్యలో ఊటీ, అర్జంటుగా రమ్మని ఫోన్ చేసింది వందన. ఇంటికి రాగానే, అప్పటికే తయారైపోయి సిద్దంగా ఉంది.
"మనం సింధుజ కాంటినెంటల్ కి వెళ్తున్నాం."
సిటీ శివార్లలో ఉన్న సింధుజ కాంటినెంటల్ కి పెళ్ళాయ్యాక ఎన్నోసార్లు వెళ్ళారు వాళ్ళిద్దరూ. అక్కడ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్, ముందు కూర్చుని , ఎన్నోన్నో గంటల సేపు కబుర్లాడుకున్నారిద్దరూ. కాసేపు స్పోర్ట్స్ రూమ్ లో , మరి కాసేపు మినీ థియేటర్లో, లేదా విశాల మైన చెరువుగట్టు ముందు కూర్చుని, ఎన్నెన్నో కబుర్లను కలబోసుకున్నారు వాళ్ళిద్దరూ.
"నువ్వానందించే వార్త ఈ అందమైన ఎటమాస్పియర్లో చెప్పాలాని....."సిగ్గుపడుతూ అంది కృష్ణ వందన.
ఆ వార్త విమల్ కి థ్రిల్లింగ్ గా ఉంది. ఎంతో సంతోషం వేసింది. చటుక్కున తల్లి గుర్తుకొచ్చింది.
రంగురంగుల దుస్తుల్లో అదేదో దేశపు జండాలా నిలబడ్డ బేరర్ వేపు చిరగ్గా చూస్తూ -
"రెండు అయిస్ క్రీమ్ " అని చెప్పేసి, అతను వెళ్ళిపోగానే విమల్ రెండు భుజాల మీద చేతులు వేసి, కళ్ళలోకి చూస్తూ.
"చెప్పు .....విమల్, నీకు బాబు కావాలా, బేబీ కావాలా .....!"
"నాకు బేబీ కావాలి." ముక్కుని, ముక్కుతో రాస్తూ అన్నాడు విమల్.
"నీకేం కావాలి......" అడిగాడు విమల్.
"నాకా! బాబు కావాలి." అంది కృష్ణ వందన.
చిన్న నీటిచుక్క సముద్రం అవుతుంది. రెండు మనసుల మధ్య నిజమైన అవగాహన లేనపుడు చిన్న మనస్పర్దే , భయంకరమైన అగాదానికి దారితీస్తుంది. వాళ్ళిద్దరూ ఆ సమయంలో మరిచిపోయిన విషయం అదే.
"ఇంటికి ఆడపిల్లే అందం, ఇప్పటివరకూ మనింట్లో నువ్వే ఆడపిల్లవి కదా......నీకో ఆడపిల్ల తోడుగా ఉంటే బాగుంటుంది కదా." హుషారుగా అన్నాడు విమల్.
ఐస్ క్రీమ్ తింటూ ఓరకంట చూసింది విమల్ వేపు, కృష్ణవందన 'అందమైన బాబుంటే, తోడున్నట్లు కాదా!"
"ఐ లైక్ బేబీస్......నీకు పాపే పుడుతుంది. .....దానికి మా మమ్మీ పేరు పెడదాం, " తన మనసులోని మాటను చెప్పాడు విమల్.
"లేదు ......బాబే పుడతాడు .....వాడికి , మా డాడీ పేరు పెడదాం." మాట్లాడలేదు విమల్.
మనసు, లోలోపలి పొరల్లో ఏదో అసహనం......
"ఒక్క బిడ్డతోనే మనం ఆగిపోం కదా, అలాగేలే ." ముఖంమీద నవ్వును పులుముకుంటూ అన్నాడు విమల్.
"డాక్టర్ చెప్పింది .....బాబే పుడతాడు. ఒక్క బాబుతోనే పుల్ స్టాప్ పెట్టేద్దాం, ఇద్దరు , ముగ్గుర్ని కనడం నాకిష్టం లేదు." ఖరాఖండీ గా చెప్పేసింది కృష్ణవందన.
"డాక్టర్ ....కన్ ఫర్మ్ డ్ గా చెప్పిందా?" మళ్ళీ అడిగాడు విమల్.
"అవును. కావలిస్తే ఫోన్ చేసి అడుగు."
"రేపు మరోసారి మనిద్దరం వెళ్దాం.' అన్నాడు విమల్.
"ఏం.....నేన్చేప్పిన మాటమీద నీకు నమ్మకం లేదా?" కృష్ణ వందన గొంతులో కోపం ధ్వనించింది.
"అది కాదు వందనా!" ఏదో చెప్పబోయాడు విమల్.
"ఓకె, అలాగే వెళ్దాం. కానీ బాబు కాదు, పాప పుడుతుందని డాక్టరు చెప్పిందనుకో...." ఆగి విమల్ వేపు చూసింది వందన.
"చచ్చినట్టు పాపను కంటావ్.....అంతేనా ?" నవ్వుతూ అన్నాడు విమల్.
"చచ్చినా ......అబార్షన్ చేయించుకుంటాను." సీరియస్ గ అంది కృష్ణవందన.
ఆ మాటతో , ఎవరో శరీరమ్మీద పెళ్ళున కమ్చీతో కొట్టినట్టుగా బాధపడ్డాడు విమల్.
తేరుకోడానికి అయిదు నిమిషాల సేపు పట్టింది.
"పద.....వెళ్దాం!" లేచాడు. దారిలో చెప్పాడు.
"తల్లి వవుతున్నావ్......ఇంకా చిన్నపిల్లలా ప్రవర్తించకూడదు."
ఆ మాటకు రియాక్షన్ లేని చూపులతో చూసింది విమల్ వేపు కృష్ణ వందన.
కృష్ణ వందన మనస్తత్వాన్ని అంచెల వారీగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు విమల్.
