ప్లస్ - మైనస్
వసుంధర
దేశంలో జాతీయ పరిశోధన సంస్థలెన్నో వుండి వుండవచ్చు. కానీ ఆంధ్ర దేశంలో నెలకొల్పబడిన 'అంతర్యామి" పరిశోధన సంస్థ కోక ప్రత్యెక స్థానం వున్నది. అది జాతీయ సంస్థ కాదు. రమణమూర్తి దాని అధినేత.
దేశమంతటా విస్తరించుకున్న అతికొద్ది ప్రముఖ వ్యాపార సంస్థల్లో ఓ సంస్థకు చెందినవాడు రమణమూర్తి.
విజ్ఞానశాస్త్రం అతడి వ్యాపారం కావడం వల్ల అతడు "అంతర్యామి" సంస్థను నెలకొల్పాడు. ఈ సంస్థ దేశానికేన్నో విధాల తోడ్పడుతున్నది.
దేశంలో ఎందరో మేధావులు తమ ప్రతిభను చూపించుకునేందుకు సరైన అవకాశం దొరక్క -- విదేశాలకు తరలిపోతున్నారు. అటువంటి వారికి ఆకర్షనీయమైన వెతనాలిచ్చి -- వారి ప్రతిభకు తగిన ప్రాజెక్టు ల నిస్తున్నది . సైంటిస్టులు కనిపెట్టిన ముఖ్య విశేషాలను వెంటనే పరిశ్రమ లకు తరలించే ఏర్పాట్లున్నవి.
తండ్రి, తాత, సోదరులు , తదితర బంధువర్గం - అందరూ వ్యాపార రంగంలో మునిగి తెలుతున్నప్పటికీ రమణమూర్తి మాత్రం చదువు మీదనే శ్రద్ధ పట్టి ఫిజిక్సు లోనూ, యింజనీరింగు లోనూ కూడా డాక్టరేట్ డిగ్రీలు తీసుకున్నాడు. విదేశాలు వెళ్ళి శిక్షణ పొందాడు. అంతర్యామి స్థాపించాడు.
అంతర్యామికి ప్రచారం కంటే కార్యసాధనే ముఖ్యం. అందులోనూ ఆంధ్ర దేశంలో ఆంధ్రుడి చేత స్థాపించబడింది. ఈ కారణంగా నెలకొల్పబడిన పది సంవత్సరాల వరకూ అంతర్యామి గురింఛి దేశంలోని నిరుద్యోగ విజ్ఞాన శాస్త్ర పట్టభద్రులకు మించి యింతరులకు అట్టే తేలియదు.
అయితే ఇటీవల అంతర్యామికి చాలా పెద్ద పేరు వచ్చింది. దేశమంతటా ప్రచారం లభించింది.
దేశంలో జరుగబోతున్న ఆసియా క్రీడోత్సవాల సందర్భంగా అంతర్యామి సంస్థ ఓ కృత్రిమ ఉపగ్రహాన్ని రూపొందించింది. ఆ ఉపగ్రహం భూమి చుట్టూ ప్రరిభ్రమిస్తూ టెలి కమ్యునికేషన్ వ్యవహారాలకు సంబంధించి చాలా వ్యవహారాలు చక్కబెడుతుంది. ముఖ్యంగా దేశమంతటా టెలివిజన్ ప్రసారాలు చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది.
ఈ ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటంటే -- ఇది పూర్తిగా భారతదేశంలో , భారతీయుల చేత తయారుచేయబడింది. అంతరిక్ష కక్ష్యలోనికి వదలడానికి ఇతర దేశస్థుల సహకారం అవసరం లేదు. అన్నింటికీ మించి దీని ఖరీదు చాలా స్వల్పం. రమణమూర్తి మేధాశక్తికి నిదర్శన మది.
రమణమూర్తి ముందు ప్రధానమంత్రిని కలుసుకుని తన పరిశోధన వివరాలు అందజేశాడు.
అతడిది జాతీయ సంస్థ కాకపోవడం వలన ముందు ప్రభుత్వం గింజుకుంది. కానీ అల్పార్ధమున అసల్ప ప్రయోజనాలున్నా ఈ ఉపగ్రహాన్ని కొనుగోలు చేయాలనే చివరికి నిర్ణయించింది.
అప్పుడు అంతర్యామి గురించి దేశానికి తెలిసింది. అంతర్యామి తో పాటే రమణమూర్తి గురించి తెలిసింది. ఇంక ఇంటర్వ్యూలు ప్రారంభమైనాయి.
రమణమూర్తి గురించీ, అంతర్యామి గురించీ , ఉపగ్రహం గురించీ సామాన్య ప్రజలందరూ తెలుసుకున్నారు. యెక్కడా చూసినా వాటికి సంబంధించిన ఫోటోలు....
ఈ వార్త దేశంలో ఒక రకం సంచలనాన్ని కలిగిస్తే విదేశాల్లో మరొక రకమైన సంచలనాన్ని కలిగించింది. ఒక భారతీయుడు -- పూర్తీ భారతీయ సాంకేతిక నైపుణ్యంతో కారు చౌకగా ఒక ఉపగ్రహాన్ని నిర్నించడం - ముఖ్యంగా సంపన్న పాశ్చాత్య దేశాలకు నచ్చలేదు.
ఈ పాశ్చాత్య దేశాల ప్రత్యేకత యేమిటంటే వారు ఎపప్తికప్పుడు విజ్ఞాన శాస్త్రం లో ప్రగతిని సాధిస్తుంటారు. మన దేశానికి సహాయ సహకారాలు పేరిట వారందజేసేది మాత్రం పది పదిహేను సంవత్సరాలు వెనుకబడిన విజ్ఞానం. అడుగు దేశాలుగానే వుంచడానికి వారు పన్నే యెన్నో మాయోపాయాల్లో యిది ఒకటి.
ఇప్పుడు రమణమూర్తి సాధించిన ప్రగతి వారి ప్రగతికి సామీప్యంలో వున్నది. అందువల్ల వారతడి ఉపగ్రహాన్ని ముందుగా పరీక్షించి కొన్ని వివరాలు తెలుసుకుంటామని అడిగారు. అందుకు రమణమూర్తి అభ్యంతరం చెప్పలేదు. అతడికి తానూ రూపొందించిన ఆ ఉపగ్రహం పై అంతులేని నమ్మక మున్నది.
ఎన్నో విదేశీ శాస్త్రజ్ఞుల బృందాలు వచ్చి ఉపగ్రహం విషయమై వివరాలు తెలుసుకుని వెళ్ళాయి. అవన్నీ పేపర్లో వచ్చాయి. అంతా రమణమూర్తి ని అభినందించారు. కానీ అమెరికన్ శాస్త్రజ్ఞులు మాత్రం --
"ఈ డిజైన్లో చిన్న లోపమున్నది. ఆ కారణంగా భూమి చుట్టూ అయిదారు రోజులు పరిభ్రమించినాక -- టెలివిజన్ ప్రసారాలకు యిది పనికి రాక పోవచ్చును...." అన్నారు.
ఈ వార్తకు కూడా దేశంలో ప్రాచుర్యం లభించింది.
రమణమూర్తి అమెరికన్ శాస్త్రజ్ఞులను అడిగాడు -- ఆ లోపం గురించిన వివరాలు చెప్పమని.
లోపం చెప్పడం వారి కిష్టం లేదా- లేక ఈ ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్ళడం వారి కిష్టం లేదా -- అన్న విషయం రమణమూర్తికి బోధపడలేదు. అందుకని-- "ఇందులో ఏ లోపమూ లేదు. ఆ విషయం యెలాగూ ఋజువవుతుంది --" అన్నాడు.
ప్రభుత్వం మాత్రం అమెరికన్ నిపుణుల అభిప్రాయాన్ని లెక్క చేయలేదు. రమణమూర్తికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేసింది.
ఒక శుభ ముహూర్తాన ఉపగ్రహం అంతరిక్షం లోకి వదలబడింది. అంతవరకూ అన్నీ సక్రమంగానే జరిగాయి.
ఉపగ్రహం భూమి చుట్టూ పరిభ్రమించడం ప్రారంభించిన కొద్ది సేపట్లోనే తన కార్యక్రమాలనూ ప్రారంభించింది. గ్రౌండ్ కంట్రోల్ లాబరేటరీ చెప్పినట్లు బుద్దిగా వింటూ అన్ని పనులనూ సక్రమంగా చేసుకుని పోతోంది.
రమణమూర్తి కి ప్రభుత్వం పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేసింది. రమణమూర్తి కోసం దేశంలో అంతవరకూ లేని కొత్త బహుమతిని నెలకొల్పింది. దేశంలో సైన్సు వర్ధిల్లాలని కాంక్షించి అందుకు అవసరమైన వాతావరణం నెలకొల్పి -- దేశంలోని పరిశోధనా సంస్థలను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించిన జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఒక కొత్త బహుమతిని సైన్సు కోసం నెలకొల్పారు. బహుమతి విలువ పది లక్షల రూపాయలు ప్రారంభ సంవత్సరానికి రమణమూర్తి కి ఆ బహుమతి యివ్వాలని నిర్ణయమయింది.
ఒక సైంటిస్టును -- ఒక దేశం -- అలా గౌరవించడం అపూర్వం -- అనిపించే విధంగా అద్భుతంగా ఆ వేడుక జరిగిపోయింది.
దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లోనూ -- అన్ని రకాల పత్రికలూ రమణమూర్తి ఫోటోలు వేశాయి. ఒక్కరోజులో అతడు సినిమా స్టార్స్ కు మించి పాపులర్ అయిపోయాడు.
ఇటువంటి ఉపగ్రహాల నిర్మాణం లో తమకు సాయపడవలసిందిగా ఎన్నో బడుగు దేశాలు భారతదేశాన్ని కోరాయి. కొన్ని సంపన్న అరబ్ దేశాలు కూడా తమ కోరికను రహస్యంగా వేలిబుచ్చాయి.
భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం సంపాదించడానికి ఓ కొత్తమార్గం లభించింది.
2
రమణమూర్తి ఈ సన్మానాలనూ, ప్రచారానికీ, తట్టుకోనలేకపోతున్నాడు. అతడు ఉపగ్రహానికి సంబంధించిన వ్యవహారాన్ని గ్రౌండ్ కంట్రోలింగ్ స్టాఫ్ కు పూర్తిగా వదిలిపెట్టి తన యేకాంత సమయాన్ని భార్యతో గడుపుతున్నాడు.
అతడి భార్య సత్యవతి -- భర్తకు లభించిన యీ గౌరవానికి పొంగిపోతోంది. అతడి కారణంగా ఆమె పేరు కూడా పదిమందికీ తెలిసింది. ఆమె ఫోటోలు పత్రికలలో వచ్చాయి.
"ఇంత పేరు భరించడం కష్టం సత్యా!" అన్నాడు రమణమూర్తి.
"ఏం?" అన్నదామె.
"ఈ పేరు నా పరిశోధనలనే దెబ్బతీస్తుందనే భయం కలుగుతున్నది -'
"ఎందుకని ?"
"నా చుట్టూ తిరిగే జనం ఎక్కువయ్యారు. రోజూ ఎందరో ప్రతికల వాళ్ళు వస్తున్నారు. ఒక ప్రముఖ సినీనిర్మాత నా వద్దకు వచ్చి నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నట్లు చెప్పాడు. జనాల కింత వేలం వెర్రి ఏమిటో నాకు అర్ధం కాకుండా వుంది -" అన్నాడు రమణ మూర్తి.
"ఇన్ని కోట్ల సామాన్యుల్లో గొప్పవాళ్ళు యెందరో లేరు కదండీ -- అందుకే వాళ్ళకు ఆ వెర్రి....." అంది సత్యవతి.
"నా భయం అది కాదు. అభిమానం ఎక్కువగా వున్న చోట ....."ఆగిపోయాడు రమణమూర్తి.
"ఏమిటండీ ...." అంది సత్యవతి.
"గ్రాపులో ఒక గీతను గీసి ఎక్స్ యాక్సిస్ అంటాము. అందులో ఓ పాయింటు ను గుర్తించి అది ఆరంభం అంటాము. ఆరంభంలో సున్నాయే గదా వుండేది. ఆ తర్వాత మాకు తోచిన విధంగా సున్నాకు కుడి పక్కగా ప్రతి సెంటి మీటరు కూ ఓ నంబరు ఇస్తాం. మొదటి సెంటిమీటరుకూ అయిదు నెంబరు యిచ్చామనుకో రెండో సెంటి మీటరు పది అవుతుంది. మూడవ సెంటి మీటరు పదిహేను అవుతుంది. సున్నాకు కుడి వైపు యే విధంగా నంబర్లిచ్చామో ఎడమ వైపూ అలాగే యివ్వాలి. అంటే సున్నాకు కుడి వైపు, ఎడమ వైపు కూడా ఒకే సెంటి మీటరు దూరంలో చూసుకుంటే అయిదు అంకె వుంటుంది. కానీ రెండు అంకెలకూ ఓ పెద్ద తేడా వుంది...."
"ఏమిటిది ?" అంది సత్యవతి ఆత్రుతగా.
"ఒకటి ప్లస్సు , యింకొకటి మైనస్సు....అంతే తేడా! ఇప్పుడు ప్రజలు నాపై చూపుతున్న అభిమానం ద్వేషంగా అసహ్యంగా మారిపోతే నేనేమై పోతానా అని భయపడుతున్నాను..." అన్నాడు రమణమూర్తి.
