భద్రయ్య ఆమె చెప్పిందంతా విన్నాడు. అతను దిగులుగా భార్య వంక చూసి "సోమును గొప్పగా పెంచానని నేననను. కానీ వాడు చెడ్డవాడు మాత్రం కాదు. మనిషి మహా పిరికివాడు. చెడ్డపని చేయలేడు. నీ దగ్గర తల్లి ప్రేమ రుచి చూస్తె వాడు రాము అంత గొప్పవాడు కావచ్చు" అన్నాడు.
"ఓ తెలివైన పిల్లను చూసి రాముకు పెళ్ళి చేసి వ్యాపార మంతా ఆ అమ్మాయికి అప్ప జెప్పాలను కుంటున్నాను. రాముకు ప్యాపార దక్షత లేదు. అయినా అడ పెత్తనంలో ఒక సుఖముంది. మగాడు తప్పుదార్లు పట్టడు. ఈ ఇంట్లో రాముకు తప్ప వేరెవ్వరికీ స్థానం లేదు" అని కచ్చితంగా చెప్పేసింది సీతమ్మ.
భద్రయ్య కాళ్ళా వెళ్ళా పడ్డాడు. ఆఖరికి "వాడికి నువ్వు తల్లివని కూడా చెప్పను. నీ యింట్లో ఏ నౌకరు గానో ఉంచుకో" అన్నాడు.
ఏమనుకుందో సీతమ్మ అందుకు అంగీకరించింది. అదే మహా ప్రసాదంగా భావించాడు భద్రయ్య. ఒక పర్యాయం కొడుకు తనింట్లో చేరాక తల్లి ప్రేమ పనిచేయక తప్పదు.
భద్రయ్య భార్యను ఎంతగానో మెచ్చుకుని అక్కణ్ణించి వెళ్ళి సోమును కలుసుకుని "నీ రొట్టె విరిగి నేతిలో పడింది" అన్నాడు.
"ఏం జరిగింది?" అన్నాడు సోము.
"నీ జీవితం సాఫీగా నడిచిపోయే ఏర్పాటు చేశాను. సీతమ్మ అని ఓ చల్లని తల్లి వుంది. ఆమె నిన్ను కడుపులో పెట్టి చూసుకుంటుంది. నువ్వు బుద్దిగా వుంటే ఆమె నిన్ను కన్నకోడుకుగా కూడా స్వీకరిస్తుంది" అన్నాడు భద్రయ్య.
సోము తండ్రి చెప్పిందంతా విని "నేను నిన్ను విడిచి ఉండలేను. నా జీవితం ఎలా నడిచినా ఫరవాలేదు" అన్నాడు.
'అలాగనకు. నేను పుట్టెడు అప్పుల్లో వున్నాను. వాటి నుంచి బైటపడటం కోసమైనా కొన్నాళ్ళు నిన్ను వేరే ఉంచదలిచాను. నీ కోసం కాకపోయినా నా కోసమైనా వెళ్ళి సీతమ్మ దగ్గర కొన్నాళ్ళు ఉండు" అన్నాడు భద్రయ్య.
ఆఖరికి సోము ఒప్పుకున్నాడు. అతణ్ణి తీసుకుని భద్రయ్య సీతమ్మ దగ్గరకు వెళ్ళాడు. సీతమ్మ తన కొడుకును ఎగాదిగా చూసింది. ఏమీ మాట్లాడలేదు. భద్రయ్య కొడుకు నామెకు అప్పగించి తను వెళ్ళిపోయాడు.
సీతమ్మఅతడిని స్నానం చేసి రమ్మంది. మంచి బట్టలు వేసుకోమంది. మంచి భోజనం పెట్టింది. ఆత్రంగా అతడు భోం చేస్తుంటే జాలిగా చూసింది. ఆరోజు అతడికి పనులేమీ చెప్పలేదు. తర్వాత రోజు నుంచి మాత్రం అతడికి బజారు పనులు చెప్పడం మొదలు పెట్టింది.
3
సోముకు సిగరెట్లు కావాలి. రెండు మూడు రోజులకో సారి కనీసం బీరు కోసమయినా గొంతు తడవాలి. ప్రతీ రాత్రి ఒక్కాటయినా పేక వేయాలి. సినిమాలు చూడాలి. అతడి జేబులో ఇందుకై బొత్తిగా డబ్బు లేదు.
బజారు పనుల్లో డబ్బు మిగుల్చుకుని వాడు తన కోరికలు తీర్చుకొనేవాడు. డబ్బు లెక్క సరిపోవడం కోసం ధరలు పెంచి చెప్పేవాడు.
సీతమ్మ కు బజారులో వస్తువుల ధరలన్నీ కంఠతా వచ్చును.ఆమె సోము చేస్తున్న పని గమనించింది. వాడు కమిషన్ తీసుకుంటున్నాడని గ్రహించింది. ఆ డబ్బు ఏం చేస్తున్నాడో తెలుసుకునేందు కామే వాడి మీద గూడచారి తనం చేసి అసలు సంగతి తెలుసుకుంది. వారం రోజుల్లో ఆమెకు వాడి అవలక్షణాలన్నీ తెలిసిపోయాయి.
అప్పుడు సీతమ్మ మాతృ హృదయం మూలిగింది. తండ్రి సంరక్షణ లో ఇలా తయారయ్యడన్నమాట వీడు. వీడి - నెలాగో అలాగ మార్చాలి. తన దగ్గర పెరక్క పోయినా తన కడుపున పుట్టిన బిడ్డ కాబట్టి మారడం అంత కష్టం కాక పోవచ్చు. అయితే వాడిని ఎలా మార్చాలి?
బాగా అలోచించి అందుకు రామునే వినియోగించాలని నిర్ణయించుకుందామే. ఒకరోజున కొడుకును పిలిచి - "బాబూ రామూ! సోము నీ వయసు వాడు. నీ తమ్ముడి లాంటి వాడు. సరయిన పెంపకం లేక అన్నీ చెడ్డ అలవాట్లే చేసుకున్నాడు. కొన్నాళ్ళు నీ స్నేహంలో వుంటే మనిషి బాగుపడతాడు. మనం మంచి అలవాట్లు కలిగి వుంటే సరిపోదు. పదిమందిని సంస్కరించడం లోనే గొప్పతన ముంది...." అంటూ కొడుక్కు ఏం చేయాలో చెప్పింది.
రాముకు తల్లి మాట వేదవాక్కు. అందుకని అతను మర్నాటి నుంచీ తల్లి చెప్పిన కార్యక్రమం అమలు జరిపాడు.
ఒకవారం రోజులు రాము, సోము లు కలిసే తిరిగారు. సోము ఏం చేయాలన్నా రాము వారించేవాడు. అదెందుకు చెత్త పనో వివరించి చెప్పేవాడు. వారం రోజుల్లో సోము రాముతో బాగా విసిగిపోయాడు. రాము చెప్పిన ప్రతిదానికి సోము సమాధానం చెప్పేవాడు.
సిగరెట్లు కాలుస్తూ ఆరోగ్యంగా ఉన్న ముసవాళ్ళెందరో ఉన్నారు. బార్స్ లోకి గొప్పవాళ్ళందరూ వెడుతూనే వున్నారు. విదేశాల్లో అందరూ ఎనభై ఏళ్ళకు పైగా బ్రతుకుతారు. అక్కడ అంతా సిగరెట్లు , ఆల్కహాలు పుచ్చుకుంటారు. ఎదిగిన మగపిల్లవాడు మాటిమాటికి అన్నింటికీ తల్లి సలహా తీసుకోవడం కూడా వ్యసనం లాంటిదే! జీవితంలో స్వతంత్ర భావాలుండాలి.
రాము ఈ పద్దతిలో ఎన్నడూ ఆలోచించలేదు. అందువల్ల అతను కాస్త ఆశ్చర్యపడి సోముకు సమాధానం చెప్పలేక -- ఇదే ప్రశ్నలను తల్లిని అడిగాడు.
"నువ్వీ ప్రశ్నలను సమాధానాలు తెలుసుకోవడం కోసం అడిగేవా, లేక నీకూ సోమూలా వుండాలని వుందా?" అంది సీతమ్మ.
"ఏమో - నాకు తెలియదు " అన్నాడు రాము.
పుణ్యానికి పొతే పాపమేదురావుతుదంటారు . సీతమ్మకు భయం వేసింది. ఆమె రాము, సోముల స్నేహానికి అంతటితో స్వస్తి చెప్పింది. అయితే సోమును సంస్కరించే అభిప్రాయం మాత్రం ఆమెకింకా పోలేదు. అందుకోసం ఆమె రామును కాక రామానుజాచారిని నియమించాలనుకుంది.
రామానుజాచారి ఉపన్యాసాలు చెప్పి బోరు కొట్టించడంలో సిద్దహస్తుడు. అయన ఉపన్యాసాలు భరించలేక చాలామంది అయన చెప్పింది వెంటనే ఒప్పేసుకుంటారు.
సోము ఇరవయి నాలుగు గంటలూ ఇంటిలోనే వుంటున్నాడు. అందులో పది గంటలు నిద్రకూ, ఇతర కాలకృత్యాలకూ సరిపోతే ఎనిమిది గంటలు రామానుజాచారి ఉపన్యాసాలు వినడానికి సరిపోయేది. మిగతా ఆరుగంటలు ఆ ఉపన్యాసాలు దాటికి మనసు, శరీరం అడ్జస్టు కావడానికి సరిపోయేది.
రెండు రోజుల్లోనే సోము హడలిపోయి -- "అమ్మా -- నాకు వేరే పనులేమైనా చెప్పండి . ఆ రామానుజం గారి ఉపన్యాసాలు వినలేను" అన్నాడు సీతమ్మ దగ్గరకు వెళ్ళి.
సీతమ్మ తాపీగా -- "ఒక్కటే పనిచేయాలి నువ్వు. నీ కున్న మొత్తం దురలవాట్లన్నీ వదిలిపెట్టి మా రాము అంత బుద్ది మంతుడిగా మారాలి. అప్పుడు నేను నిన్ను మా రాముతో సమంగా చూసుకొంటాను" అంది.
సోముకు ఏడుపు వచ్చింది. అతను ఎవరూ లేని వో మూలకు పోయి చంటి పిల్లాడిలా కాసేపు ఏడ్చాడు. ఈ యింట్లో తానుండలేనని అతనికి అనిపించింది. అదీకాక వాడికి తండ్రి మీద గాలి మళ్ళింది. ఆ యింట్లోంచి వెళ్ళి పోవాలని నిశ్చయించు కున్నాడు. అయితే తండ్రి తననిక్కడ దిగ బెట్టడానికి కారణమేమిటి ? అప్పులు....
ఆ అప్పులు తీరేదాకా తను తండ్రి దగ్గరకు వెళ్ళకూడదు.
అప్పుడే అతడి బుర్రలోకి కొత్త ఆలోచన వచ్చింది.
ఈ యింట్లో తనకు స్వతంత్రంగానే ఉంది. తన నెవరూ దొంగగా అనుమానించడం లేదు. ఇలాంటి చోట దొంగతనం చేయడం చాలా సులభం. ఇనప్పెట్టె ఒకటి రాము గదిలోనే వుంటుంది. రాము తనకంటే పిరికి వాడు. అతణ్ణి బెదిరించి అతడి గదిలోని ఇనప్పెట్టె తెరిచి కొంత డబ్బు తీసుకుని పారిపోతే.
తన తండ్రి అప్పులూ తీరి పోతాయి. తనకీ ఇంటి చెర నుంచీ విముక్తి అవుతుంది.
ఈ ఆలోచన బుర్రలోకి వచ్చినప్పట్నించీ అతడికి స్థిమితం లేదు. అతడు అనుపానులన్నీ బాగా చూసుకున్నాడు. ఇనప్పెట్టె తాళం చెవులు రాము దగ్గిరే వుంటాయి. అతడి నుంచి అవి లక్కొనడం పెద్ద కష్టం కాదు.
ఒక రాత్రికి సోము దొంగతనానికి ముహూర్తం పెట్టుకున్నాడు.
4
ఆరాత్రి ఇంట్లో అంతా పడుకున్నాక సోమూ ఒక్కడూ లేచి రాము గదిలోకి దారి తీశాడు. ఎప్పుడూ దొంగతనం అలవాటు లేదు. అందువల్ల గుండె పీచు పీచు మంటోంది. అతను రాము గదిలో ప్రవేశించాడు.
మంచం మీద రాము ఆదమరిచి నిద్రపోతున్నాడు. గదిలో బెడ్ లైటు వెలుగుతోంది. సోము తన దృష్టిని రాము మీంచి ఇనప్పెట్టె మీదకు తరలించాడు. అతడి అదృష్టం బాగున్నది. రాము ఆ పూట తాళాలను ఇనప్పెట్టె కే తగిలించి మరిచిపోయాడు. అంతేకాదు ఇనప్పెట్టె తలుపు ఓర వాకిలిగా వుంది.
సోము ఇనప్పెట్టె తలుపు తెరిచి చూశాడు. అతడి కళ్ళు జిగేలుమన్నాయి. పెట్టె నిండా నోట్ల కట్టలు. అతడు గబగబా కొన్ని నోట్ల కట్టలు తీశాడు. అయితే అతడి శరీరం వణుకుతోంది. ఆ వణుకులో ఇనప్పెట్టె మీద వున్న ఇత్తడి ప్లవర్ వాజ్ ఒకటి క్రిందపడి ధభేల్ మని చప్పుడైంది.
"ఎవరది?" అంటూ లేచాడు రాము. ఇనప్పెట్టె దగ్గర ఎవరో వుండడం గమనించి అతను తన తలగడ క్రింద నుంచి పిస్తోలు తీశాడు.
సోము పారిపోవాలనుకున్నాడు. అతడికి కాళ్ళూ, చేతులూ ఆడలేదు. చేతిలోని నోట్ల కట్టలు జారి కింద పడ్డాయి. ఎదురుగా, కాస్త దూరంగా -- చేతిలో పిస్తోలుతో నిలబడ్డ రాము అతడికి యమదూతలా కనబడ్డాడు.
సోము పారిపోవాలని ప్రయత్నం చేసేలోగా రాము చేతి లోని పిస్తోలు పేలింది. పిస్తోలు గుండు సరాసరి సోము గుండెలకు తగిలిందేమో, అక్కడి నుంచి రక్తం చిమ్మింది. సోము పెద్ద గావు కేక పెట్టి పడిపోయాడు.
కేక వింటూనే ఇంట్లోని నౌకరొకడు పరుగున వచ్చాడు. ఆ గదిలోకి. అతను అక్కడ పడి వున్న సోమును చూసి సమీపించి -- "అరే -- దొంగ!" అన్నాడు. కానీ సోము కదలడం లేదు. వేలు ముక్కు దగ్గరుంచి చూసి -- 'అరే శ్వాస ఆడుతున్నట్లు లేదు. చచ్చిపోయాదేమో!" అన్నాడు.
"చచ్చిపోయాడా ?" అన్నాడు రాము. అతడి చేతిలోని రివాల్వర్ జారిపడింది. కళ్ళ ముందు కోర్టు -- ఉరిస్తంభం కనబడుతున్నాయతడికి. ఉన్నట్లుండి కుప్పలా కూలి పోయాడతను.
ఈలోగా గదిలోకి సీతమ్మ వచ్చింది -- "ఏం జరిగింది?" అంటూ అరిచిందామే కొడుకు దగ్గరకు పరుగున వెళ్ళి చూసింది. శ్వాస ఆడుతున్నట్లు లేదు. అప్పటికప్పుడు ఫోన్ చేసి డాక్టర్ని రప్పించిందామె.
డాక్టరు వచ్చి పరీక్ష చేసి రాము, సోము -- ఇద్దరూ మరణించినట్లు చెప్పాడు. అసలేం జరిగిందో నౌకరు వివరించాడు.
రాము మనసు గురించి డాక్టర్ కు బాగా తెలుసు. అతడు నేరం చేశానన్న భావాన్ని సహించలేడు. తన కారణంగా సోము చచ్చిపోయాడని నౌకరు చెప్పగానే ఆ షాక్ కు తట్టుకోలేక అతను మరణించాడు.
'అమ్మగారూ -- బాబుగారి మనసు సున్నితమని తెలిసుండీ -- అయన దగ్గర మీరు పిస్తోలు ఉంచకుండా ఉండాల్సింది "-- అన్నాడు నౌకరు కళ్ళు తుడుచుకుంటూ.
"వాడి మనసు సున్నితమని నాకు తెలుసు. అందుకే వాడి దగ్గర బొమ్మ పిస్తోలు ఉంచాను...." అంది సీతమ్మ వచ్చే ఏడ్పును ఆపుకుంటూ.
'అంటే దొంగ వంటిని రక్తమేమిటి?" అన్నాడు నౌకరు.
'అది రక్తం కాదు. బొమ్మ పిస్తోలు కలిగించిన భ్రమ. దొంగ కూడా హటాత్తుగా గుండె ఆగడం వల్లనే మరణించాడు" అన్నాడు డాక్టరు.
రాము, సోము -- ఇద్దరూ పిరికీవాళ్ళే ! ఆ పిరికితనం కారణంగా ఇద్దరూ అర్ధాంతరపు చావు చచ్చారు. అయితే వాళ్ళలో ఇంత పిరికితనం ఎలా పెరిగింది?
సీతమ్మ, భద్రయ్య మళ్ళీ కలుసుకుని ఈ విషయం చర్చించారో లేదో తెలియదు. వారి చర్చలు రాము, సోము లకు ప్రాణాలను పోయ్యలేవని మాత్రం తెలుసు .
***
