Previous Page
వసుంధర కథలు-14 పేజి 62

 

    "అలా యెందుకు జరుగుతుందనుకున్తున్నారు?'
    "మన డిజైన్లో ఏదో లోపముందన్నారు అమెరికన్ నిపుణులు. వారి అభిప్రాయం మీద నాకెంతో గౌరవమున్నది . కానీ అ లోపమేమిటో వారు చెప్పలేదు. ఎంత శోధించినా నాకే లోపమూ కనబడలేదు...." అన్నాడు రమణమూర్తి.
    అతడి భయం వృధా పోలేదు.
    సరిగ్గా ఆరు రోజులకు ఉపగ్రహం టెలివిజన్ ప్రసారాలు చేయడం ఆపివేసింది. గ్రౌండ్ కంట్రోల్ స్టాఫ్ యెంత ప్రయత్నించినా ఆ లోపం సవరించబడలేదు. రమణమూర్తి తనూ వెళ్ళి కంట్రోల్ రూమ్ లోనే కూర్చున్నాడు.
    అప్పటికి ఆసియా క్రీడోత్సవాల హడావుడింకా అర్నేల్లున్నది.
    రమణమూర్తి ప్రపంచంతో నిమిత్తం లేకుండా అక్కడే గ్రౌండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చున్నాడు.
    పొరపాటు యెలా జరిగింది? యెక్కడ జరిగింది?
    అమెరికన్సు ముందే కనుక్కోగలిగిన ఆ లోపం తాను, తన వాళ్ళు -- యెందుకు కనుక్కోలేక పోయారు....
    ఎలాగయినా అది కనిపెట్టాలి. ఉపగ్రహం మళ్ళీ పని చేసేలా చేయాలి!
    రెండు రోజులు నిర్విరామంగా కృషి చేశాక ఏం జరిగిందో గ్రహించగలిగాడు రమణమూర్తి.
    జరిగినదిదా? అమెరికన్సు లోపాన్ని గ్రహించగలగడంలోని మర్మమిదా! ఈ విషయం తను ముందుగా ఎందుకూహించలేకపోయాడు?
    ముందు తనా లోపాన్ని సవరించాలి? ఆ తర్వాత తనే....
    కంట్రోల్ రూమ్ లో వారం రోజులు గడిపాడు రమణమూర్తి. అతడెంత ప్రయత్నించినా , అతడి స్టాఫ్ అతడి కెంతగా సహకరించినప్పటికీ -- ఆ లోపం సవరించబడలేదు.
    ఈ లోగా ప్రధానమంత్రి నుంచి అతడికి కబురు వచ్చింది.
    "ఇది చాలా అర్జంటు విషయం. మీ ఉపగ్రహాన్ని మేము నమ్ముకోవచ్చ్ఘంటారా? ఆసియా క్రీడోత్సవాల టెలివిజన్ ప్రసారం గురించి ఏం చేయాలి?" అన్నది ప్రధానమంత్రి ప్రశ్న.
    "శాయశక్తులా ప్రయత్నిస్తాను --" అన్నాడు రమణమూర్తి.
    "మీ శక్తి మీద మాకు నమ్మకముంది. కానీ ...." ప్రధానమంత్రి ఏదో చేప్పాలని చెప్పలేక ఆగిపోవడం జరిగింది.
    "నా శక్తి మీద నాకూ నమ్మకముంది. కానీ ...." అని ఆగిపోయాడు రమణమూర్తి. విషయం రూడి చేసుకోకుండా తను చెప్పదలచుకున్నది చెప్పడం సబబు కాదేమో నని అతడికి అనిపించింది.
    "ఇంటేలిసాట్ ను హైర్ చేస్తే?" ప్రధానమంత్రి సూచన.
    ఇంటెలిసాట్ అంతరిక్ష కక్ష్యలో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న అమెరికన్ ఉపగ్రహం. అమెరికన్సు కు భారత దేశానికి వచ్చిన ఆసియా క్రీడోత్సవాల టెలివిజన్ ప్రసారాల యిబ్బంది పై సానుభూతి వున్నది. తక్కువ ధరకు తమ ఉపగ్రహాన్ని అద్దె కిచ్చి ఆదుకొనడానికి వారు సిద్దంగా వున్నారు.
    "ఉంటారు . నాకు తెలుసు ?...." అన్నాడు రమణమూర్తి.
    "మనకేమయినా విషయాలు తెలిస్తే అవి మనసులోనే వుంచుకొనడం మంచిది --" ప్రధానమంత్రి మాటల్లో హెచ్చరిక వున్నది .
    రమణమూర్తి అక్కడ నుంచి బయటపడ్డాడు. అతడి మనసు కుతకుత లాడిపోతున్నది.
    ఈ వార్తా పత్రికలకు ఎక్కింది. భారత ఉపగ్రహం సరిగ్గా పని చేయని కారణంగా -- ఆసియా క్రీడోత్సవాల కోసం అమెరికన్ ఉపగ్రహాన్ని భారతదేశం ఒక సంవత్సరం పాటు తగు మూల్యాన్ని చెల్లించి వాడుకుంటుందని అన్ని పత్రికలూ మొదటి పేజీలో వ్రాశాయి.
    కొన్ని పత్రికలూ -- భారతీయ శాస్త్రజ్ఞుల మిడిమిడి జ్ఞానం ఫలితంగా -- దేశానికి అపార నష్టం వాటిల్లినట్లు వ్రాశాయి. అది కొంతవరకూ సమంజసంగానే వుంది. ఎందుకంటె ఉపగ్రహ నిర్మాణానికి చాలా వ్యయమయింది. అదంతా దేశమే భరిస్తుంది. చివరకది అసలు పనికి రాకుండా పోయింది.
    రెండు రోజుల్లోనే వార్తా పత్రిక లీ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అంతర్యామి సంస్థ దేశానికి నష్ట పరిహారం చెల్లించాలని కొందరూ, రమణమూర్తి కివ్వబడిన బహుమతి ని వెనక్కు తీసుకోవాలని మరి కొందరూ ....యిలా రకరకాలుగా పత్రికల్లో వ్రాయసాగారు.
    "ఏమండీ -- మీరనుకున్నట్లే జరిగింది ....' అంటూ  భర్త వద్దకు పోయింది సర్యవతి.
    "చెప్పానుగా -- ప్లస్ మైనస్సు అయింది ....' అన్నాడు రమణమూర్తి.
    "ఇప్పుడు మీరేం చేస్తారు?"
    "ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి వుంటాను --" అన్నాడతడు.
    "మీకు బహుమతిగా యివ్వబడిన మొత్తాన్ని వెనక్కు తిరిగి ఇచ్చేస్తే గౌరవంగా వుంటుందేమో ?" అన్నది సత్యవతి.    
    'అలా చేసే నేను నా తప్పొప్పు కున్నట్లవుతుంది. నిజానికి నా వల్ల ఏ తప్పూ జరుగలేదు -- " అన్నాడు రమణమూర్తి.
    "మీరు తప్పు చెయ్యకపోవచ్చు. కానీ మీకు బహుమతి ఎందుకిచ్చారో ఆ కార్యం ఫెయిలయింది. చెయ్యని తప్పును కూడా ఒప్పుకోవడం మహానుభావుల లక్షణం ..." సత్యవతి యింకా ఏదో చెప్పబోగా భర్త ఆమెను ఆపాడు.
    "ఒకే -- ఇట్సాల్ రైట్ , బహుమతి పొందే అర్హత నాకు లేదు. డబ్బు వెనక్కిచ్చేస్తాను. అయితే నా కారణంగా ప్రభుత్వానికి ఉపగ్రహ నిర్మాణానికై నూట యాభై లక్షలు అయింది. దానికీ నేను బాధ్యత వహించాలి....' అన్నాడు రమణమూర్తి తాపీగా.
    సత్యవతి గుండెలు బాదుకుని --"మిడి మిడి జ్ఞానంతో దేశాన్ని ముంచేశారు మీరు" అంది.
    "అదే మాట -- ప్రభుత్వం అనేదాకా వేచి ఉంటాను" అన్నాడు రమణమూర్తి సాలోచనగా.
    సరిగ్గా రెండు రోజుల్లో ప్రభుత్వం పత్రికల ప్రకటన లన్నీ ఖండించింది. అంతర్యామి నిర్వహించిన ఉపగ్రహంలో ఏ లోపమూ లేదనీ, దురదృష్టవశాత్తూ అది ఫెయిలయిందనీ,కేంద్ర మంత్రివర్యులు సెలవిస్తూ అలాంటిదే మరో ఉపగ్రహాన్ని నిర్నించవలసిందిగా తాము అంతర్యామిని కోరుతున్నట్లు ప్రకటించింది.
    ఈ వార్తా దేశంలో మరింత సంచలనాన్ని కలిగించింది.
    అంతర్యామి సంస్థకు ప్రధాన మంత్రితో లాలూచీ ఉన్నదా? ఇందులో రాజకీయ ప్రయోజనాలున్నవా?
    ఎన్నో దేశాలు కృత్రిమ ఉపగ్రహాలను జయప్రదంగా అంతరిక్షం లోకి ప్రవేశ పెడుతుంటే -- భారత ఉపగ్రహం విషయంలో దురదృష్టమేమిటి? ఆపైన అటువంటి ఉపగ్రహాన్ని మరొకటి నిర్మించాలనుకోవడం ఎంత హాస్యాస్పదం.
    చాలామందికి బాధగా వున్న విషయం రమణమూర్తి కి చెడ్డ పేరు రాలేదని . కొందరైతే ఈ విషయమై సుప్రీం కోర్టు కి వెళ్ళాలనుకున్నారు. ఆ విధంగా కొన్ని అప్పీల్సు కూడా వెళ్ళాయి.
    మరో వారం రోజుల్లో సుప్రీం కోర్టు నుంచి ఒక ప్రకటన వచ్చింది -- ఉపగ్రహం విషయమై ఎటువంటి ఫిర్యాదు లనూ దేశంలోని ఏ న్యాయస్తానమూ పరిశీలించదనీ అందుకు డిఫెన్సు కు సంబంధించిన కొన్ని అంతరంగిక వ్యవహారాలు కారణమనీ!
    ఈ వార్త ఇంకా సంచలనాన్ని కలిగించింది.

                                     3
    సత్యవతి భర్తను ఆశ్చర్యంగా అడిగింది -- "మీరు అధికార పక్షానికి లంచమిచ్చారా ?"
    "లేదు, నాలోనూ నా ఉపగ్రహం లోనూ తప్పులేదని ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలుసు ...."
    "మరైతే అదెందుకు పనిచేయడం లేదు ?"
    "అది పనిచేయడం లేదని ఎవరన్నారు? ఒక్క టెలివిజన్ ప్రసారాలు మినహాయిస్తే మిగతా అన్ని కార్యక్రమాలు అది సక్రమంగా నిర్వహిస్తోంది ...."
    "టెలివిజన్ ప్రసారాలు పనిచేయక పోవడం లోపం కాదా?"
    "లోపమే ! కానీ ...." ఒక్క క్షణం ఆగాడు రమణమూర్తి.
    "ఊ" అంది ఆత్రుతగా సత్యవతి.
    "అమెరికన్సు ఆ లోపాన్ని సృష్టించారు. భూమి చుట్టూ తిరిగే ఏ ఉపగ్రహన్నయినా అదుపు చేయగల శక్తి వారికి వున్నది. టెలివిజన్ ప్రసారాల విభాగాన్ని వాళ్ళు మూగాపోయేలా చేశారు."
    "ఎందుకు?"
    "ఎందుకో నాకు తెలియదు ."
    "వాళ్ళ ఉపగ్రహాన్ని అద్దెకు తీసుకుంటామనా?"
    "ఖచ్చితంగా కాదు. సానుభూతితో అది మనకు అద్దె కిచ్చారు తప్పితే వ్యాపార దృష్టితో కాదు."
    "మరి ....?"
    "అదే నాకు తెలియడం లేదు . వచ్చే వారం అమెరికా వెడుతున్నాను. అప్పుడు తప్పక తెలుస్తుంది."
    అమెరికాలో ప్రముఖ శాస్త్రజ్ఞుడు మార్ద్తిన్ రమణమూర్తి కి స్నేహితుడు. ఇద్దరూ పరస్పరం  అభిమానం, ఆరాధనాభావం కలవారు. మార్టిన్ రమణమూర్తి కి ఉత్తరం వ్రాశాడు.
    "నీ మొదటి ఉపగ్రహం ఫెయిలయినందుకు విచారంగా వుంది. అయితే రెండవ ఉపగ్రహాన్ని నిర్నించాలనుకుంటూ -- ఆ బాధ్యతను నీకే మీ ప్రభుత్వం అప్పగించడం నాకెంతో సంతోషంగా వున్నది. నిరభ్యంతరంగా ఆ బాధ్యత స్వీకరించు. మనమిక్కడ కలిసినప్పుడు నీకో గొప్ప రహస్యం చెబుతాను. అది నీ మేధస్సు కు అవగాహనను పెంచుతుంది. నీమీద నీకు నమ్మకాన్ని పునరుద్దిరించుతుంది."
    రమణమూర్తి అమెరికా వెళ్ళగానే అందరి కంటే ముందుగా మార్టిన్ నే కలుసుకున్నాడు.
    "కంగ్రాచ్యులేషన్స్ ! నూటయాభై లక్షల్లో ఉపగ్రహ నిర్మాణం -- ఊహకే అసాధ్యమైనది " అన్నాడు మార్టిన్ .
    "కానీ....." అన్నాడు రమణమూర్తి.
    "మా నిపుణులు నీకో వార్నింగిచ్చారు. ఆ వార్నింగ్ గురించి నువ్వు నీ ప్రభుత్వానికి చెప్పలేదు. లేకుంటే ఆ ఉపగ్రహం కూడా అన్ని విధాలా సక్రమంగా పనిచేసి వుండేది" అన్నాడు మార్టిన్.
    "ఏమిటా వార్నింగ్ !"
    'అయిదారు రోజుల తర్వాత ఉపగ్రహం పనిచేయదని వారు సూచించనే సూచించారు " అన్నాడు మార్టిన్.
    "మా ప్రభుత్వం పాకిస్తాన్ కి F-16 బాంబర్స్ ఇస్తున్నది. నీ ఉపగ్రహంలో వాటి గురించి పూర్తిగా తెలుసుకోనవచ్చునని మీ ప్రభుత్వం అనుకున్నది. పాకిస్తాన్ ఈ విషయమై మా దేశానికి మొర పెట్టుకున్నది. మా నిపుణుల బృందం వచ్చి పరిశీలించి పాకిస్తాన్ భయం అర్ధరహితం కాదని గ్రహించింది. మీ దేశానికి హెచ్చరిక పంపింది. నీకూ ఓ హెచ్చరిక ఇచ్చింది. నీకు అర్ధం కాలేదు. మీ దేశం లెక్క చేయలేదు. ఫలితంగా మా దేశం ఆ మేరకు ఉపగ్రహాన్ని సైలెన్స్ చేసింది. ఇప్పుడు భారతదేశం మాకు హామీ యిచ్చింది. మీ రెండవ ఉపగ్రహానికి మా నుంచి ఎటువంటి ఉపద్రవమూ వుండదు."
    "ఇవన్నీ నీకెలా తెలుసు ...."
    "డియర్ బ్రదర్ .....కొంచెం ప్రపంచం గురించి కూడా తెలుసుకుంటుండాలి. ప్రజల మనస్సులో సైంటిస్టు గా ప్రముఖ స్థానాన్ని సంపాదించేకా -- ఆ స్థానం అలాగే నిలబెట్టు కోవాలంటే కొంచెం రాజకీయాల గురించి కూడా తెలుసుకోవాలి. ఏమాత్రం శ్రద్ధ చూపించినా మీ దేశంలోనే నీకీ రహస్యం తెలిసి వుండేది....." అని మార్టిన్ నెమ్మదిగా -- "ఇది మరీ అంత పెద్ద రహస్యం కూడా కాదు" అన్నాడు.
    "నా దేశంలో నేనిప్పుడు మైనసును. నీ సలహాను పాటించి ఎప్పటికీ ప్లస్ స్థానంలో వుండడానికి ప్రయత్నిస్తాను" అన్నాడు రమణమూర్తి.

                                       ***


 Previous Page

WRITERS
PUBLICATIONS