"మానకపోతే...."
"మీ శృంగార లీలలు ఫోటోలుగా ముఖ్యమైన స్థలాల్లో పంచి పెట్టబడతాయి."
"ఓస్ -- ఇంతే కదా! పంచి పెట్టండి. నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక చిన్న సలహా. ఆ ఫోటోలు పంచి పెట్టడం బదులు ఖరీదుకు అమ్మండి. మీకు బోలెడు లాభం కూడా వస్తుంది" అన్నాడు స్వామి.
అతడాశ్చర్యంగా స్వామి వంక చూసి "నేను వేళాకోళమాడ్డం లేదు. నిజంగానే ఫోటోలున్నాయి నా దగ్గర" అన్నాడు.
"లేవని నేననడం లేదు. శృంగార లీలలు నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. నేనెవర్నీ బలవంతంగా అనుభవించడం లేదు. ఇష్టం మీదనే అనుభవిస్తున్నాను. నన్నొక సచ్చరిత్రుడిగా పదిమంది భావించాలని నేనాశించడం లేదు . నా ప్రవర్తఃన మంచిది కాదని ఉద్యోగం పోయిందను కొండి. అయినా నేను విచారించను. నేను సాధించిన అద్భుత ఫలితాలతో నేను కోటీశ్వరిడిని కాగలను. అందువల్ల ఒకళ్ళ డబ్బు కాశపడి నా వ్యక్తిత్వాన్ని చంపుకునే వాణ్ణి కాదు నేను...." అన్నాడు స్వామి.
"మిస్టర్ స్వామీ!" అన్నాడతను.
'డాక్టర్ స్వామి ప్లీజ్ ...." స్వామి చిరాగ్గా సవరించాడు.
అతను కోపంగా "ఊ డాక్టర్ స్వామీ.... డబ్బు మీద ఆశ లేకపోయినా కనీసం ప్రాణాల మీదనైనా మీ కాశ ఉందనుకుంటాను" అన్నాడు.
"బాగుంది , ఎందుకుండదు?" అన్నాడు స్వామి.
'అయితే ప్రయోగాలు మానేసి ఉద్యోగానికి రాజీనామా ఇవ్వండి....' అన్నాడతను.
"ప్రాణాల ప్రసక్తి తీసుకొచ్చారు కాబట్టి కాస్త ఆలోచించాలి....' అన్నాడు స్వామీ.
10
"కంగ్రాచ్యులేషన్స్ డాక్టర్ స్వామి" అన్నాడు చంద్రశేఖర్.
"డాక్టర్ కాదు మిస్టర్ ....' సవరించాడు స్వామి.
లాబరేతరీలో జరుగుతున్న అసమావేశంలో సంస్థ డైరక్టరు తో పాటు పోలీసు శాఖకు చెందిన పలువురు ప్రముఖులున్నారు. చంద్రశేఖర్ చెప్పడం ప్రారంభించాడు.
"మన దేశం వైజ్ఞానికంగా సాధించే ప్రగతిని అభివృద్ధి చెందిన దేశాలన్నీ చాలా తక్కువ అంచనా వేశాయి. న్యూక్లియర్ ఎక్స్ ప్లోజేస్ , శాటిలైట్ -- ఈ రెండూ వారికి కనువిప్పు కలిగించగా మూడు సంపన్న దేశాలు మనదేశంలో జరుగుతున్న పరిశోధనల గురించి తెలుసుకుందుకు రహస్యచారుల్ని నియమించాయి.
వారి నివేదికను గమనించేక వైజ్ఞానికంగా, సాంకేతికంగా భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందనున్న దని ఆ మూడు సంపన్న దేశాలూ గుర్తించాయి. వెంటనే ఆ మూడు దేశాలూ కలిసి ఒక బృందాన్ని పంపించాయి. ఆ బృందం పనేమిటంటే దేశపు భవిష్యత్తు నే మార్చివేయగల పరిశోధనలను అపు చేయించడం. శాస్త్రజ్ఞులను బెదిరించి గాని, ప్రలోభ పెట్టి గాని ఆయా ప్రయోగాలను మానిపించటం.
అటువంటి సందర్భంలోనే శేఖరం చిక్కుకున్నాడు. అతను చేసిన ప్రయోగం విజయవంతమైతే వాతావరణంలో కోరినప్పుడు కోరినంత వర్షం కురిపించవచ్చు. ఇది భారత దేశపు ఆర్ధిక స్వరూపాన్నే మార్చివేస్తుంది. ఎప్పటి కప్పుడు తమ ఏజెంట్ల ద్వారా ఈ విశేషాలు తెలుసుకుంటున్న ఆ ముఠా శేఖరాన్ని బెదిరించి ఉద్యోగానికి రాజీనామా ఇప్పించింది...." చంద్ర శేఖరం ఆగాడు ---ఎవరో ప్రశ్న వేయబోతున్నారని చూసి.
సంస్థ డైరక్టరు "శేఖరం రాజీనామాకు కారణమది అని నాకు తెలియదు. అయితే దేశంలోని ప్రతి సైంటిస్టు ఈ విధంగా కార్నర్ చేయబడుతున్నాడా?" అన్నాడు.
"లేదు. దేశపు ఆర్ధిక స్వరూపాన్ని మార్చివేయగల పరిశోధనలు చేసే సైంటిస్టు లనే వారు కార్నర్ చేస్తున్నారు. శేఖరం అణుకిరణాలను వ్యవసాయాని కుపయోగించే ప్రయోగాలు చేస్తున్న వ్యక్తీ. అందువల్లనే అతను వారి దృష్టిలో పడ్డాడు. వారి నుంచి తప్పించుకునే దారి తోచక చివరకతను ప్రాణాలు తెగించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ప్రధానమంత్రి పైన చేయిచేసుకునేటందుకు అతనూ, అతని భార్య సిద్దపడ్డారు. ఆవిధంగా ఆ భార్య భర్తలిద్దరికీ తిరుగులేని పోలీసు కస్టడీ లభించింది.
ప్రధానమంత్రి మీద చేయి చేసుకోబోయిన వారు కాబట్టి వీరికి ప్రత్యెక గుర్తింపు, ప్రత్యెక రక్షణా యేర్పాటయ్యాయి. అక్కడ భార్యాభర్తలు చెప్పిన మాటలు ముందుగా పోలీసులు నమ్మలేదు. దానికి తోడుశేఖరం ఇంట్లో దొరికిన ఉత్తరాలూ, దొంగానోట్లూ అతన్ని దేశ ద్రోహిగా నిరూపించాయి.
దేశ ద్రోహినని ఒప్పుకోడానికి తనకభ్యంతరం లేదనీ కానీ తన మాటల్లో నిజం గ్రహించవలసిందనీ పోలీసుల్నీ అతను కోరాడు. అతని మాటలే నిజమైతే అతన్ని వెంటాడిన ముఠాను పట్టుకోవలసిన బాధ్యత పోలీసులకుంది. అప్పుడే ప్రభుత్వం రికమెండేషన్ మీద స్వామీ - శేఖరం స్థానంలో నియమించబడ్డాడు సైంటిస్టుగా. అతనితో మాట్లాడిన ప్రతి అనుమానాస్పద వ్యక్తీ మీదా పోలీసు నిఘా ఏర్పాటయింది. స్వామి తన ప్రవర్తనలో ఎవరికీ అనుమానం కలగకుండా మసలగలిగాడు.
సుమారు నెలరోజుల్లో పోలీసులకు ముఠాకు సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా తేలిపోయాయి. ఇప్పుడు ఆ ముఠా పట్టుబడింది" అన్నాడు ఐ.జి. చంద్ర శేఖర్.
* * * *
శేఖరం మళ్ళీ ఉద్యోగంలో చేరేక - ఆ దంపతులిద్దరూ మళ్ళీ పూర్వపు ఇంట్లోనే అద్దెకు ప్రవేశించారు.
వారి పక్కనున్న అందమైన బంగాళా లో ఇప్పుడు కరుణ లేదు. ఎవరో ధనవంతుడా ఇల్లు కొనుక్కున్నాడు. అయన భార్య అరుణ కూడా కరుణలాగే అందమైనది. వయసులో ఉన్నది. ఆమె భర్త కూడా ఎప్పుడూ వ్యాపారం పేరు మీద బయట కాలం గడుపుతుంటాడు. అందువల్ల ఆమెకు ఇరుగుపొరుగు తో కాలక్షేపం చేయడం సరదా.
ఆ సరదా కొద్దీ ఆమె మొట్టమొదటగా సావిత్రి స్నేహన్నభిలషించింది. కాని సావిత్రి ఆమెను దరిదాపులకు కూడా రానివ్వలేదు సరిగదా -- ఆమెతో తగువు కూడా పెట్టుకుంది.
అందరూ చాలా మంచిదనే సావిత్రి, చూడ్డానికి సంస్కారవంతురాలిలా కనిపించే సావిత్రి , తననెందుకు దగ్గరకు రానివ్వదో అరుణకు తెలియదు. తెలుసుకోడానికి ప్రయత్నించాలనుకుని "అయినా మనకెందుకు లెద్దూ, ఆవిడ స్నేహం లేకపోతే నాకేమైనా లోటోచ్చిందా?" ఇలాంటి విషయాల్లో ఊరుకోవడమే ఉత్తమం" అనుకుని మానేసింది అరుణ.
---: అయిపొయింది :---
