Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 61


    అనసూయ ఏదో చెప్పబోయింది. బైట మళ్ళీ అడుగుల చప్పుడయింది.
    "సందేహంలేదు-బైట దొంగ తిరుగుతున్నాడు. తెలివి తక్కువదానా దొంగాడికోసం వాకిటి తలుపులు తెరిచివుంచావు. వాడు రాకేం చేస్తాడు?" అంటూ రమణరావు గదితలుపుదాకా వెళ్ళాడు.
    "వద్దండీ-వెళ్ళొద్ధండీ-వాడిదగ్గర ఏ కత్తైనా ఉంటుందో ఏమో" అంది అనసూయ.
    "మీసమున్న మగవాణ్ణి. వాడి కత్తులకి భయపడను. ధైర్యంగా ఎదిరిస్తాను" అన్నాడు రమణరావు. అనసూయ అభ్యంతర పెట్టేలోగా అతను గదితలుపు గడియతీసి బైట లైటు వేశాడు.
    అప్పుడు చూశాడతను.....హాల్లో ఓ మనిషి వున్నాడు. అతఃడి చేతిలో కత్తివుంది.
    అనసూయ అరవాలనుకుంది. నోరు పెగలలేదు.

                                     2

    అతను వాళ్ళిద్దర్నీ సమీపించాడు "అరిస్తే చంపేస్తాను" అన్నాడు. అతనలా అన్నప్పుడు చేతిలోని కత్తిని ఓ సారి అటూ యిటూ తిప్పాడు.
    రమణరావు మాట్లాడలేదు. అతడివంకే చూస్తున్నాడు.
    అతను బక్కపలచగా, చామనచాయగా, సుమారైన పొడుగ్గా ఉన్నాడు. మనిషి కళ్ళు తెగించాడని తెలియజేస్తున్నాయి. భుజానికో సంచి వేలాడుతోంది. ఓ చేతిలో కత్తివుంది. అది పదునుగావుంది. మెరుస్తోంది.
    "ఎవర్నువ్వు?" అన్నాడు రమణరావు.
    "కనపడడంలా దొంగను" అన్నాడతను.
    "ఎందుకొచ్చావిక్కడికి?"
    "దొంగతనానిక్కాదు" అన్నాడు దొంగ.
    "మరెందుకు?" అన్నాడు రమణరావు ఆశ్చర్యంగా, అనుమానంగా.
    దొంగ అనసూయవంక చూశాడు "ఈమె నీ భార్య కదూ?" అన్నాడు.
    "అవును."
    "ఈమె అంటే నీ కిష్టమేనా?"
    "ఎందుకీ అడ్డుదిడ్డం ప్రశ్నలు" అన్నాడు రమణరావు చిరాగ్గా.
    "అలా చిరాకు పడకు. నేనామెను చంపేస్తే నీకు బాధ కలుగుతుందో, కలగదో తెలుసుకుందామని ఈ ప్రశ్న వేశాను."
    "భార్య సంగతి అటుంచి మనిషి మనిషిని చంపడాన్ని నేను సహించలేను."
    "చంపడం నాకూ సరదాకాదు-ఈ చుట్టుపక్కల యీ రాత్రి మూడిళ్లు దోచాను. మూడో ఇంట్లో నా ఉనికి పసిగట్టారు. నేను పారిపోతూ మీ యింట్లో జొరబడ్డాను. వీధిలో అన్వేషణ ప్రారంభమైంది. ఇంటింటికీ తలుపుతట్టి హెచ్చరిస్తున్నారు. మీ యింటికీ ఎవరైనా రావచ్చు. తెల్లారే లోగా నేనెలాగో పారిపోగలను. అంతవరకూ మీ యింట ఆశ్రయం కావాలి.  ఎవరైనా తలుపుతట్టి అడిగితే ఎవరూ లేరని చెప్పాలి. లోపల నీ భార్య ఉంటుంది. ఆమెను నేను కత్తితో పొడిచేదీ లేనిదీ నువ్వు బయటవారికిచ్చే సమాధానం మీద ఆధారపడి వుంటుంది. నువ్వు నన్ను పట్టివ్వడం చాలా సులభం. కానీ నీ భార్య ప్రాణాలను తిరిగి సంపాదించడం అసాధ్యం" అన్నాడు దొంగ.
    రమణరావు దొంగ కళ్ళలోకి చూశాడు. అతడిలో ఎక్కడా బెదురులేదు. తెగించిన మనిషి!
    "అయితే నేనిప్పుడేం చేయాలి?"
    "ముగ్గురం నీ గదిలో కూర్చుందాం. హాల్లో లైటు ఆర్పేద్దాం" అన్నాడు దొంగ తాపీగా.
    అలాగే జరిగింది.
    "నీ మూలంగా ఈ రాత్రి నిదురవుండదు" అన్నాడు రమణరావు.
    "శివరాత్రేమో క్యాలండర్ చూసుకో-జాగరణ ఫలితం దక్కుతుంది" అన్నాడు దొంగ.
    "శివరాత్రైతే నువ్వు చావడం మంచిది. సరాసరి కైలాసం వెళ్ళొచ్చు" అన్నాడు రమణరావు.
    "జాగ్రత్తగా మాట్లాడు. కత్తి నా చేతిలో వుంది. నీ చేతుల్లో కాదు" అన్నాడు దొంగ.
    "జాగ్రత్తగా మాట్లాడండీ" అంది అనసూయ భయంగా.
    రమణరావు కాసేపు మానం వహించాడు. ఇంతలో ఉన్నట్లుండి ఎవరో తలుపు తట్టారు.
    "వెంటనే వెళ్ళకు. కాసేపాగి వెళ్ళు" అన్నాడు దొంగ. అతను రమణరావుకి నిద్ర ఎలా నటించాలో అభినయించి కూడా చూపాడు.
    తలుపులు మళ్ళీ బాధారెవరో.
    "వెళ్ళు-వాళ్ళతో నువ్వు మాట్లాడేది గట్టిగావుందాలి. నువ్వేం మాట్లాడినా నాకు వినబడాలి. నెమ్మదిగా మాట్లాడావో-గదిలో నీ పెళ్ళాం చస్తుంది" అన్నాడు దొంగ.
    రమణరావు గదిలోంచి బయటకు వెళ్ళాడు. నెమ్మదిగా వీధి తలుపులు తీశాడు.
    "దొంగ - దొంగ-మీ యింట్లోకానీ దూరాడా?" అన్నాడు బయటనుంచి ఒకడు.
    రమణరావు ఆవులిస్తూ-"దొంగ మాయింటికి రావడమేమిటి?" అన్నాడు గట్టిగా.
    ఒకతను వీధిలో జరిగన దొంగతనం గురించి చెప్పాడు.
    "మా యింట్లో ఎవ్వరూ లేరు-" గట్టిగా అరిచాడు రమణరావు.
    "జాగ్రత్తగా వుండాలి. ఏ క్షణంలో ఎవరింట్లోనయినా దూరొచ్చు. మాతోపాటూ మీరూ రాకూడదూ?" అన్నాడతను.
    "నేను రాలేను. నాకు కాలునొప్పి. మా ఆవిడకు జలుబు..." అన్నాడు రమణరావు.
    "ఇలా అయితే దొంగ ఇంట్లో దూరితే మీరేం కాసుకోగలరు? ఎవర్నయినా మీ యింట్లో సాయం వదలమా?" అన్నాడింకొకతను.
    రమణారావు కంగారుగా "నా సంగతి నేను చూసుకోగలను. ఫరవాలేదు, భయంలేదు-మీరు వెళ్ళండి!" అన్నాడు.
    సరేనని జనం వెళ్ళిపోయారు. రమణరావు తలుపులు వేశాడు.
    అతను లోపలకు వచ్చేక - "థాంక్యూ వెరీమచ్!" అన్నాడు దొంగ.
    "ఐ హేట్ మైసెల్ఫ్ నౌ" అన్నాడు రమణరావు.
    దొంగ అతడివంక తీవ్రంగాచూసి-"నువ్వు యేదో పెద్ద అపరాధం చేసినట్లు బాధపడుతున్నావ్. అవునా!" అన్నాడు.
    "చేసినట్లు అనకు.....చేశాను...." అన్నాడు రమణరావు.
    "నీలాంటి తెలివితక్కువ వాళ్ళ కారణంగానే దేశం ఇలా ఏడుస్తోంది...." అన్నాడు దొంగ.
    "రమణరావు మాట్లాడలేదు.
    "సినిమా హాలుదగ్గర ఐదురూపాయల టికెట్ పాతిక రూపాయలు అమ్మేవాన్నిచూస్తూ వూరుకుంటావు నువ్వు. సంతకం కావాలంటే పదిరూపాయలడిగే ఆఫీసర్లో నీకు తప్పు కనబడదు. దొంగ దణ్ణాలుపెట్టి ఓట్లడిగి నిన్నే ఏలేవాడు నిన్నే మోసంచేసినా-మళ్ళీ మళ్ళీ వాడికే ఓటిచ్చి నేగ్గిస్తావు. వాళ్ళెవరూ నీ దృష్టికి దొంగల్లా ఆనరు. వాళ్ళ నుపేక్షించినందుకు నీకు బాధవుండదు. కానీ నేను దొంగను. నన్ను పట్టివ్వలేదని నీకు బాధ....."
    "ఇలాంటి కబుర్లు నీలాంటివాళ్ళు తమని తాము సమర్ధించుకుందుకు చెబుతారు. వాల్లుచేసే నేరాలేవో పబ్లిగ్గా చేస్తున్నారు. ఆ నేరాలకు సంఘం ఆమోదం లభించింది. కానీ నువ్వు......జనంనుంచి పారిపోయి కత్తితో బెదిరించి నాయింట ఆశ్రయం సంపాదించావు. నువ్వు బయటపడితే జనం నిన్ను గొడ్డును బాదినట్లు బాదుతారు. నీ జీవితానికీ వాళ్ళ జెవెఇథానికే సంబంధంలేదు. పోనీ నువ్వూ వాళ్ళలాగే పనే చేస్తున్నావనుకుంటే-ఇలా దొంగతనంచేసే బదులు వాళ్ళలాగే నువ్వూ బ్రతకవచ్చుకదా? అందు కవసరమయిన చాకచక్యం అందరికీ వుండదు. నీకూ వుండివుండదు. అందుకే అసూయతో వాళ్ళను దుయ్యపట్టడం. వల్లతో పోల్చుకుని నువ్వుచేసే పనిని సమర్ధించుకోవడం. అయినా తప్పుచేశాననుకునేవాడే తను చేసే పనిని సమర్ధించుకోవాలనుకుంటాడు....."
    దొంగ నవ్వి-"నువ్వు బాగానే చెప్పవులే. చదువు రాని వెధవ డబ్బిచ్చి డాక్టరుడిగ్రీ తెచ్చుకున్నా డనుకో. వాడి చేతిలో ఏ రోగి అయినా చస్తే అది హత్య అవదు. కానీ నాలాంటివాడు మనిషిని చంపితే అది హత్య అవుతుంది. చంపాలనివుంటే డాక్టర్ డిగ్రీ కొనుక్కుని వైద్యం చేసి చంపమని నువ్వంటావు. అలా డిగ్రీలు కొనే డబ్బు నా కెక్కడిది! సంఘం మెచ్చేలా దోపిడీలు చేయాలంటే అందుకు చాలా పెట్టుబడి కావాలి. నాకా పెట్టుబడి లేదు. నువ్వేమో ఆ పెట్టుబడిదారుల తొత్తువి. అందుకని వాళ్ళ తరఫునే మాట్లాడతావు కానీ నన్నర్ధం చేసుకోలేవు-" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS