Previous Page
వసుంధర కధలు -11 పేజి 62


    "సరే-నా స్వార్ధంకోసం నేను పెట్టుబడిదార్ల తొత్తునయ్యాను. నువ్వు చేస్తున్నదేమిటి? నీ స్వార్ధం కోసం దొంగతనాలు-అంతేగదా! లేక నువ్వేదయినా పరోపకార సంస్థ నడుపుతున్నావా? సినిమా హీరోలా పదిమంది గొప్పవాళ్ళను దోచి పేదవాళ్ళకు పంచిపెడుతున్నావా?" అన్నాడు రమణరావు.
    దొంగ మాట్లాడకుండా "ఈ విషయం నేను మరోసారి మీయింటి కొచ్చినపుడు చెబుతాన్లే - ప్రస్తుతం ఇక్కన్నించి బయటపడే దారి వెదుక్కోవాలి...." అన్నాడు.
    "నువ్వెంత త్వరగా పోతే-అంత త్వరగా నిద్రోవాలి నేను...." అన్నాడు రమణారావు.
    "నీకు నేనంటే చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్లుంది. నా చేతిలోని కత్తిసంగతి పదేపదే జ్ఞాపకం చేయాల్సొస్తోంది. ఇంకనోటి మాటలెందుకు? శాశ్వతమయిన గుర్తు నీవంటి మీద వేయనా?" అన్నాడు దొంగ.
    "పెద్ద కబుర్లెందుకు? నీ ప్రాణరక్షణకోసం యిక్కడ చేరావు. మా ప్రాణాలకు భయపడి మె మూరుకున్నాం. నువ్వేం పెద్ద హీరోవీ కాదు. నే నిక్కడ గాజులు తొడిగించుకునీ కూర్చోలేదు. ఎటొచ్చీ నీ చేతిలో కత్తివుంది. అది లేకుంటే ఈపాటికి నిన్నోచూపు చూసి వుండేవాణ్ణి" అన్నాడు రమణరావు.
    "నీలాంటి హీరోలుంటారని తెలుసు. అందుకే కూడా కత్తి తెచ్చుకొచ్చింది" అన్నాడు దొంగ "అసలైన హీరోలితే చేతిలో కత్తివున్నా భయపడరు."
    "నన్ను సవాల్ చేస్తున్నావా?" అన్నాడు రమణరావు కోపంగా.
    "అవును-నేనింట్లో వుండగా బైటకు వెళ్ళి నేను చెప్పిన మాటలు చెప్పమన్నట్లు చెప్పివచ్చిన మనిషి తన పౌరుషం గురించి మాట్లాడితే నాకు నవ్వొస్తోంది" అన్నాడు దొంగ.
    రమణరావు రక్తం మరిగినట్లయి "నీకు మూడింది అన్నాడు.
    "అది నాకో - నీకో" అన్నాడు దొంగ నవ్వుతూ.
    "ఏమండీ - ఊరుకోండీ - అతడితో మనకెందుకూ?" అంది అనసూయ.
    రమణరావు వినలేదు. అతను మెరుపులా దొంగమీద పడి కత్తివున్న చేతిమీద ఓ దెబ్బవేశాడు. దొంగ చేహిలోని కత్తి పడిపోయింది. రమణరావు అతఃన్ని గట్టిగా పట్టుకుని "అనూ కత్తితీయ్" అన్నాడు. అనసూయ వణుకుతున్న చేతుల్తో కత్తితీసింది. రమణారావు దొంగను ఎడాపెడా వాయించి "సవాల్ చేసి నన్ను రెచ్చగొట్టావు. ఒక విధంగా అదీ మంచిదే అయింది" అన్నాడు.
    దొంగ రమణరావు కంటే బలహీనంగా వున్నాడు- "నన్ను మన్నించి వదిలిపెట్టు-పారిపోతాను-" అన్నాడు.
    "అందితే జుట్టు అంధకపోతే కాళ్ళు-" అన్నాడు రమణరావు నిరసనగా.
    "ఎవరైనా అంతే!" అన్నాడు దొంగ.
    "ఇప్పుడు నిన్ను జనానికి అప్పగిస్తాను. అప్పుడు నీ బ్రతుకు చూద్దువుగాని...." అన్నాడు రమణరావు.
    రమణరావు ఓ ప్లాస్టిక్ తాడు తెచ్చి దొంగకు కాళ్ళూ, చేతులూ కట్టాడు. అనసూయతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి తను తలుపు తీసుకుని వీధిలోకి వెళ్ళాడు.

                                      3

    "నాకు నిన్ను చూస్తే జాలివేస్తోంది. జనం నిన్ను చూస్తే చంపేస్తారు. ఆ దృశ్యం నేను చూడలేను. నేను నీ కట్లు విపుతను. బుద్ధిగా పారిపోతావా!" అడిగింది అనసూయ.
    దొంగ ఆశ్చర్యపడ్డాడు. కానీ బుద్దిగా తలూపాడు.
    అనసూయ అతణ్ణి సమీపించింది. తనకు తానే కత్తితో కాళ్ళకీ, చేతులకీ వున్న తాళ్ళు కోసేసింది.
    "వెనక్కు తిరక్కుండా వంటింటిదారిని పరుగెత్తు-" అంది అనసూయ.
    దొంగ అప్రయత్నంగా వంగి ఆమె పాదాలకు నమస్కరించి-"ఏ జన్మలోనో నాకు నువ్వు తల్లివో, చెల్లివో అయుంటావు. నీ ఋణం ఈ జన్మలో తీరదు-" అన్నాడు.
    "త్వరగా వెళ్ళు-జనం వచ్చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు పట్టుబడకూడ దన్నది నా కోరిక-" అంది అనసూయ.
    దొంగ లేచి పరుగెత్తాడు. అతడు కనుమరుగయ్యేవరకూ అనసూయ గుండె లదుర్తూనే వున్నాయి. అప్పుడు అనసూయ కత్తినీ! అక్కడ పడివున్న ప్లాస్టిక్ తాళ్ళనీ తీసి బీరువాలో దాచి వీధిలోకి పరుగెత్తింది. మరుక్షణంలోనే వీధిలో ఒక వైపునుంచి వస్తూన్న జనం ఆమెకు కనబడ్డారు.
    "అయ్యో, అయ్యో....ఆలస్యమయిపోయింది. ఇల్లు దోచుకుని దొంగ పారిపోతున్నాడు..." అంటూ అరిచిందామె.
    అందరికంటే ముందుగా రమణారావున్నాడు. అతను కంగారుగా "ఏం జరిగింది" అనడిగాడు.
    "ప్రశ్నలు తర్వాత-వాడు చాలా తెలివైనవాడు. ప్రమాదకారి. క్షణంలో నాకు చావు తప్పింది. ఇలాగే వెళ్ళండి. ఈ దారినే పారిపోతున్నాడు...." అంది అనసూయ.
    జనం ఆలోచంచకుండ పరుగులెత్తారు. రమణరావు ఆగి యేద అడగబోయాడు- "ఆగకండి-పరుగులెత్తండి.....మన సొమ్ము కూడా పోయింది...." అంది అనసూయ పెద్దగా అరుస్తూ.
    రమణరావు పరుగెత్తాడు. అతను తిరిగి వచ్చేసరికి గంటన్నర పట్టింది. అనసూయపడుతూ వచ్చిన అతణ్ణి చూసి-"దొంగ దొరికాడా?" అనడిగింది అనసూయ.
    "లేదు-" అన్నాడు రమణరావు నీరసంగా.
    "అమ్మయ్య!" అంది అనసూయ.
    రమణరావు ఆమెవైపు అదోలా చూసి-"దొంగ దొరకలేదని మేం బాధపడుతూంటే-బాగా పారిపోయాడని నువ్వు సంతోషిస్తావేంటి? మనింట్లో ఏం పోయిందేమిటి?" అని-"అసలు దొంగెలా తప్పించుకున్నాడూ-నేను వాణ్ణి కట్టిపడేశాను గ్దా-" అన్నాడు రమణరావు.
    "మీరంత తెలివిగా కట్టారు వాణ్ణి. మీరలా వెళ్ళగానే వాడు కట్లు విడిపించుకుని ఉన్నపళంగా నామీద పడి కత్తి లాక్కున్నాడు. హడిలిపొయ్యాను-చంపేస్తాడేమోనని. వాడేం దోచుకున్నాడో కూడా నేను చూడలేదు-"
    "మరి.....మరి......వాడు దొరకలేదంటే అమ్మయ్య అంటావేం?" అన్నాడు రమణరావు.
    "మీరే చెప్పారుకదండీ. దొరికితే జనం వాణ్ణి చంపేస్తారు. ఆ దృశ్యం చూడ్డం ఎంత హృదయవిదారకంగా వుంటుంది? అది మీరు భరించగలరా?" అంది అనసూయ.
    "అయితే మాత్రం అహోరాతరాలు శ్రమించి కూడ బెట్టిన డబ్బు పోతే మనకెలా వుంటుంది? వాడా సంచీతో సహా పారిపోయినట్లున్నాడు-పాపం ఎందరికో యెంతో నష్టం. నేనా  సంచీని కూడా పట్టుకుపోయి ఉండాల్సింది.....చాలా పెద్ద పొరపాటు చేశాను.... ...." అన్నాడు రమణరావు.
    "మీ రా పని చేసుంటే ఆ కసితో వాడు నన్ను చంపి ఉండేవాడు-"అంది అనసూయ.
    "మనింట్లో యేం పోయాయో ఏమిటో-"అంటూ కంగారుగా రమణరావు బీరువా దగ్గరకు వెళ్ళి తెరిచి ఉలిక్కిపడ్డాడు. అందులో దొంగను కట్టిన తాళ్ళు, కత్తి ఉన్నాయి.
    "ఇవి వీటిలో యెందుకు పెట్టావు? అంటూ అతనింకా వులిక్కిపడ్డాడు- "వీటిని కత్తితో కోసినట్లుంది తప్పితే వాడు విడిపించుకున్నట్లు లేదు-"
    "అవును-నేనే వాణ్ణి విడిపించాను. వాన్నో దారిని పంపించి నేను మీకు తప్పుదారి కూడా చెప్పాను-" అంది అనసూయ.
    "అలా యెందుకు చేశావ్?" గద్దించాడు రమణరావు.
    "నా బాధ మీకేం తెలుసు? ఇలాంటి అవకాశం కోసం నేను చాలా కాలంగా యెదురుచూస్తున్నాను. మీకు పక్కింటి పద్మావతి తెలుసుగదా-ఆవిడస్తమానూ నాకు బొత్తిగా బంగారం లేదని అంటూంటుంది. దానికి నేను దొంగల భయంకొద్దీ దగ్గరుంచుకోవడంలేదు-ఈయనకు బ్యాంకులో లాకర్ దొరికాక మా అమ్మను పిలిచి తెప్పించు కుంటాను-అంటూ నాకున్న నగలది పెద్ద లిస్టే ఇచ్చాను. ఆవిడంతగా నమ్మినట్లు లేదు. ఈ రోజు మా అమ్మ వస్తోందనీ, నగలు తీసుకొస్తోందనీ కూడా చెప్పానావిడకు. అంత నమ్మకంగా చెప్పేసరికి ఆవిడ నమ్మేసింది. మా అమ్మొచ్చింది. అసలావిడ వెంటనే రావలసిందే కానీ-అదృష్టం కొద్దీ-రాత్రి పిక్చరుకెళ్ళారు వాళ్ళు.
    రాత్రంతాఅమ్మతో ఈ విషయం గురించే చర్చిస్తున్నాను. తను నగలు ఏ కారణాలవల్ల తెలేదో పద్మావతికి చెప్పి-నమ్మించడం అమ్మ బాధ్యత. అయితే ఈలోగా దొంగ పడ్డాడు. ఇప్పుడింక అమ్మకు శ్రమలేదు. తను నగలు తెచ్చాననే అంటుంది. ఇంకాసేపట్లో ఇద్దరం గుండెలు బాదుకుంటాం-అవన్నీ పోయాయని. పద్మావతి పీడ నాకు శాశ్వతంగా విరగడవుతుంది.......అందుకే ఆ దొంగ పారిపోయేలా చేశాను. ఎవరికీ పట్టుబడకూడదని కోరుకుంటున్నాను...." అంది అనసూయ.
    "నీ అసాధ్యం కూలా-నీ అబద్దాలకోసం-దొరికిన దొంగను వదిలిపెట్టేశావన్నమాట. అయినా మీరంతా ఒకటే జతిలే-.....అబద్ధాలకోరులూ, దొంగలూ పరస్పరం సాయం చేసుకోడంలో ఆశ్చర్యంలేదు-" అన్నాడు రమణరావు భార్య తీసుకు ఆశ్చర్యపోతూ.
    "ఉండండీ-చోద్యం చెబుతారు-ఒకటి కాదు......రెండు కాదు నలభై వేలు విలువచేసే నగలు పోయాయి...." అంటూ తల్లిని లేపడానికి వెళ్ళింది అనసూయ. ఆమె వెనుకే తనూ వెళ్ళాడు రమణరావు.
    ఇంత గొడవ జరుగుతున్న ఏమీ ఎరగనట్లు ఆమె-హాయిగా గుర్రుకొడుతూ-నిద్ర పోతోంది. అనసూయ ఆమెను కష్టపడి లేపింది. మరుక్షణంలో ఇంట్లో కలకలం ప్ర్రారంభమయిన్హ్ది-ఏడ్పులూ, అరుపులూ......
    మర్నాడు ఇంటా, ఆఫీసులోనూ కూడా ఓదార్పుకు వచ్చే మిత్రుల అలజడికి కష్టమే అయింది రమణ రావుకి.


                               -:అయిపోయింది:-


 Previous Page

WRITERS
PUBLICATIONS