Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 60


                               ఒకే జాతివాళ్ళు

    రమణరావు మంచం మీద అటూ యిటూ దొర్లుతున్నాడు. భార్య అనసూయ ఎప్పటికీ గదిలోకి రావడంలేదు. అప్పుడే టైము రాత్రి పదకొండయింది.
    "ఈవిడగారింతే-వాళ్ళమ్మవస్తే వళ్ళూపై తెలియదు" అనుకున్నాడతను అసహనంగా.
    ఆ రోజు రాత్రి ఏడుగంటలకు రమణారావు అత్తగారు సత్యభామగారు వచ్చింది. వచ్చినప్పట్నించీ తల్లీ కూతుళ్ళు ఒకటే గుసగుసలు. వాళ్ళ మాటల కంతుండడంలేదు. ఇంట్లో రేడియో పెట్టినట్లుగా ఆగకుండా మాటలు వినబడుతూనే వున్నాయి.
    మాట్లాడుతూనే ఆవిడ స్నానం చేసింది. మాట్లాడుతూనే కూతురు వంటచేసింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వుండగా తొమ్మిదింటికల్లా భోజనాలు సిద్దమయ్యాయి. మౌనంగా భోంచేసి వెళ్ళిపోయాడు రమణారావు. మధ్యలో సత్యభామ ఓసారి అల్లుడు చిక్కిపోయాడని జాలిపడి కూతురుతో కబుర్లు మొదలెట్టింది.
    ఆ తల్లీ కూతుళ్ళ మధ్య అన్నిమాటలెలా మిగిలిపోయాయో-వాటికీ అంతు ఎందుకుండదో రమణరావుకు ఎప్పటికీ అర్ధంకాని విషయం.
    టైము పదకొండు దాటేసరికి అతడు అసహనంగా వారి మధ్యకు వెళ్ళి-"అనూ-ఆవిడ రైలుప్రయాణం చేసి వచ్చారుగదా-పడుకోనియ్యవా?" అన్నాడు.
    "అయ్యో-రైలు ప్రయాణం చేసివచ్చింది నిద్రపోడానికానాయనా-అసలే నేనుండేదో పదిరోజులు. కన్నకూతురితో ఎంత మాట్లాడుకుంటే మాత్రం తనివి తీరేను...." అని నిట్టూర్చింది సత్యభామ.
    "అయ్య బాబోయ్ - పదిరోజులు - అంటే రెండు వందల నలభై గంటలపాటు వీళ్ళు ఆగకుండా కబుర్లు చెప్పేసుకుంటారా - ఇలా అయితే నేను చావాలి-" అని మనసులో అనుకుని "మీరలాగే అంటారు అత్తయ్యా - దాని కబుర్లకేం - అవలా వుంటూనే వుంటాయి. మీరింక పడుకుని తీరాల్సిందే - లేకపోతే ఇక్కడికొచ్చి ఆరోగ్యం పాడుచేసుకున్నారని మామయ్య దగ్గర మాటొస్తుంది" అన్నాడు రమణరావు.
    "నా ఆరోగ్యానికేం ఢోకాలేదు. కాస్త నిద్ర తక్కువైతే వళ్ళేనా తగ్గుతుంది. అది నా వంటికి మంచిదికూడా" అంది సత్యభామ.
    "మీకు వళ్ళా? అలాగని ఎవరన్నారత్తయ్యా-మా అత్తయ్యెంతో నాజూకని - మీ వయసుకు ఇంత నాజూగ్గా వుండడానికి మీరేం చేశారో అడిగ తెలుసుకోమని దానికి చెప్పానుకూడా అడిగిందో లేదో కానీ...." అని మళ్ళీ తడబడి "అడగమన్నానుకదా అని ఇప్పుడింకోగంట ఆవిడకు నిద్రలేకుండా చేసేవు గనుక" అంటూ భార్యను మందలించాడు.
    అల్లుడి పొగడ్తలు సత్యభామమీద బాగా పని చేశాయన డానికి సాక్ష్యంగా ఆవిడ కళ్ళలోంచి అభిమానం వర్షంగా కురిసింది. "మరేం ఫరవాలేదు బాబూ మా కక్కడ పన్నెండుదాకా అలవాటే-ఇంకో గంట మాట్లాడుకుంటాం. నేనే దాన్ని బలవంతపెడుతున్నాను. అది నన్నిబ్బంది పెట్టడంలేదు" అందావిడ.
    "మీరు వెంటనే పడుకోకపోతే నామీద ఒట్టే అనేశాడు రమణరావు అసహనంగా.
    ఇంక అత్తగారేమీ మాట్లాడలేదు. అతను దగ్గరుండి ఆవిడ పక్కకు మంచి పరుపు, దుప్పటి, తలగడాలు ఏర్పాటు చేసి ఆవిడ నిద్రకు పడ్డ దృశ్యాన్ని స్వయంగా తిలకించి, గదిలో బెడ్ లైట్ వేసి మరీ తన గదికి వెళ్ళాడు. అనసూయ అతణ్ణి అనుసరించింది.
    "ఏమిటీరోజు అమ్మమీద ఎక్కడలేని పేమ వచ్చేసింది" అంది అనసూయ ఆశ్చర్యంగా.
    "ప్రేమాలేదు గీమాలేదు. పక్కలో నువ్వు లేనిదే నిద్రపట్టదు నాకు. ఎన్ని సైగలు చేసినా నా బాధ పట్టించుకోవు నువ్వు.....ఆఖరికి నేనే వచ్చి ఆవిణ్ణి పడుకోబెట్టేశాను" అన్నాడు రమణరావు.
    "అదా సంగతి" అంటూ అనసూయ కాసేపు పడిపడి నవ్వింది "మా అమ్మ ఇంకా అదంతా తనమీద అభిమనమే ననుకుంటోంది."
    "అదే నాకూ కావలసింది. మనిషి తన స్వార్ధం చూసుకోవడంలో తప్పులేదు. అలా చూసుకుంటూ అతను ఎదుటి వాళ్ళను సంతోషపెట్టాలి. ఇందులో మోసమేమీ లేదు. ఉన్నా తప్పులేదు" అన్నాడు రమణరావు.
    "సరే - అక్కడ మా అమ్మయింది. ఇంక మీరు మొదలెట్టారా సంభాషణ!" అంది అనసూయ.
    "మీ అమ్మనుకూడా ఇలాగే ఒక్కసారి.....ఒక్కసారంటే విసుక్కుని వుంటే మీ ఆడాళ్ళ మధ్యకు నేను రావాల్సి ఉండేది కాదుగదా" అన్నాడు రమణరావు.
    "అయిందేదో అయిపోయింది. నాకు నిద్ర వస్తోంది" అంటూ నిద్రకుపక్రమించింది అనసూయ.
    "ఈ రాత్రికి నిన్ను నిద్రపోనివ్వను. పోనిచ్చానంటే మళ్ళీ రేపు పన్నెండింటిదాకా ఇద్దరూ కూర్చుంటారు."
    "బాగుందండి-అలాగని రాత్రిళ్ళు నిద్రపోనియ్యరా ఏమిటి?"
    రమణారావు ఆమెను దగ్గరగా లాక్కుని "నాకు నిద్రపట్టేవరకూ నిన్ను నిద్రపోనివ్వను" అన్నాడు.
    "టైమెంతయిందండీ?" అడిగింది అనసూయ.
    "పన్నెండున్నర...."
    "బాబోయ్-నేనింక పడుకోవాలి. మీకేం మీరు ఆఫీసుకేనా పోయి నిద్రోతారు. నాకింక మళ్ళీ నిద్రుండదు" అంది అనసూయ దిగులుగా.
    "ఆ మాటే అనొద్దన్నాను. గవర్నమెంటు నాకంతలేసి జీతాలిచ్చేది నిద్రపోడానికనుకున్నావా?"
    "ఏమో - అవన్నీ నాకు తెలియవు. ఇది దొంగాళ్ళు తిరిగే వేళకూడా-ఆ అడుగుల చప్పుళ్ళు అవీ వింటూంటే నా కసలే నిద్ర పట్టదు" అంది అనసూయ బద్దకంగా.
    "నిద్ర నాకు వస్తోంది-కానీ దొంగల అడుగుల చప్పుళ్ళు మనింట్లో ఎందుకు వినిపిస్తాయీ?" అన్నాడు రమణరావు నవ్వుతూ.
    "ఏమోనండీ - కానీ మనింట్లో దొంగ పడితే బాగుండునని వుంది నాకు..." అంది అనసూయ.
    "ఎందుకూ?" అన్నాడు రమణరావు.
    "చెప్పనా?" స్వరం బాగా తగ్గించింది అనసూయ.
    "ఊఁ" అన్నాడు రమణరావు. అప్పుడు చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దంగా వుంది.
    ఆ నిశ్శబ్ధాన్ని చీల్చుకుంటూ ఏవో అడుగుల చప్పుళ్ళు భార్యా భర్త లిద్దరికీ గది బైటనుంచి వినిపించాయి.
    "దొంగ!" అంది అనసూయ భయంగా.
    "కాదు-మీ అమ్మాయి వుంటుంది" అన్నాడు రమణరావు.
    "ఓసారి నిద్రకు పడ్డదంటే మా అమ్మింక లేవదండీ" అంది అనసూయ.
    "ఆవిడకు నీతో కబుర్లు చెప్పే సరదా ఇంకా తీరివుండదు. నువ్వు పొరపాటున లేచి బైటకు వస్తే పట్టేద్దామని బైట పచార్లు చేస్తోందేమో" అన్నాడు రమణరావు.
    "బాగుందండీ మీ చోద్యం మరీను" అని "అన్నట్లు వంటింటి తలుపు వేయడం మర్చిపోయానండీ ఓ సారి వెళ్ళి వేసొచ్చేద్దాం" అంది అనసూయ.
    "అదేమిటి అలా, ఎలా మర్చిపోయావు?" అన్నాడు రమణరావు కంగారుగా.
    "కబుర్లు చెప్పుకుంటూ బద్ధకం చేశాం. ఈ లోగా మీరొచ్చి పడుకోమని ఆవిణ్ణి కమారు పెట్టేశారు. ఆ హడావుడిలో తలుపువేయడం మరిచిపోయాం?" అంది అనసూయ.
    "అయితే ఒకవేళ నిజంగానే దొంగపడ్డాడో ఏమిటో?" అన్నాడు రమణరావు కంగారుగా.
    "నిజంగా మనింట్లో దొంగ పడతాడంటారా? మన కంత అదృష్టమా?" అంది అనసూయ.
    "అనూ- నీకు మతిపోయిందా - దొంగపడితే అదృష్టమేమిటి?" అన్నాడు రమణరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS