Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 59

 

                               పిరికి వాళ్ళు

                                                                         జొన్నలగడ్డ రామలక్ష్మీ.

    రాము, సోము లిద్దరూ కవల పిల్లలు . వాళ్ళు పిట్టి నెల రోజులైనా తిరక్కుండానే వాళ్ళ తలిదండ్రుల మధ్య కలతలు రేగి ఇద్దరూ విడిపోయారు. తండ్రి తన కూడా సోమును తీసుకుని వెళ్ళాడు. రాము తల్లి దగ్గర వుండి పోయాడు.
    దంపతులు విడిపోయిన సంవత్సరానికి రాము తల్లి సీతమ్మకు వేలుపడిన మేనత్త ద్వారా అనుకోకుండా ఆస్తి కలిసి లక్షాధికారిణి అయింది. సీతమ్మ మళ్ళీ వివాహం చేసుకోకుండా రామును జాగ్రత్తగా పెంచసాగింది.
    సోము తండ్రి భద్రయ్యకు మాత్రం అదృష్టం కలిసి రాలేదు. అతనికి మొదట్నించీ దురలవాట్లు కాస్త ఎక్కువున్నాయి. అవి మరికాస్త ఎక్కువయ్యాయి. భార్యకు ఆస్తి కలిసొచ్చిందని తెలిసేక రాము చాలా అదృష్ట జాతకుడని అతననుకున్నాడు.
    రాము, సోము కవల పిల్లలు కాబట్టి -- ఇద్దరి జాతకాలూ ఒకేరకంగా ఉండవచ్చునని అతను భావించి, ఆశించి ఓ ఆరునెలల పాటు లాటరీ టికెట్లు కొన్నాడు. ఒక్కటీ తగలక పోగా తనకు మంచి పెళ్ళి సంబంధం వస్తుందేమోనని చూశాడు. అయితే సీతమ్మ, ఆమె బంధువులు -- అతడి గురించి చేసిన దుష్ప్రచారం ఇంతా అంతా కాదు. బంధు వర్గంలో అతనికి పిల్ల నివ్వడానికి  ఎవరూ సాహసించలేక పోతున్నారు.
    బాగా ఆలోచించేక భద్రయ్య కు ఓ ఆలోచన వచ్చింది. ఎంత విడిపోయినా భారతదేశంలో స్త్రీ భర్తని మరువలేదు. తన భార్య సీతమ్మ పేరుకు తగ్గ యిల్లాలు. తన ప్రవర్తన ఆమెకు నచ్చలేదు. కానీ తనంటే ఆమెకు యిష్టమే! అందుకే ఆమె తనకు  వేరే సంబంధాలు రాకుండా జాగ్రత్త పడుతోంది. అది తన మీద ద్వేషమని అంతా అనుకుంటున్నారు. కానీ అదంతా తన మీద ప్రేమేనని ఎవరికీ తెలియదు.
    తనూ, సీతమ్మ తిరిగి కలిసి జీవించడం ప్రారంభిస్తే ?
    సీతమ్మ లక్షాధికారి కాబట్టి ఆమెతో పాటు తనూ లక్షాధికారి అవుతాడు. అందుకని ఎలాగైనా సీతమ్మను మంచి చేసుకోవాలి. ఇలా అనుకుని భద్రయ్య కొన్నాళ్ళ పాటు సీతమ్మ చుట్టూ తిరిగాడు. అయితే ఆమె అతణ్ణి కుక్కను విదిలించినట్లు విదిలించింది తప్పితే ఏమాత్రమూ గౌరవమివ్వలేదు.
    సీతమ్మ తనను చేరనివ్వదని భద్రయ్యకు తెలిసి పోయింది. అప్పుడతను కొడుకు మీదే ఆశలు పెంచుకున్నాడు. ఏ తల్లయినా కొడుకును కాదనలేదు కదా! కొడుకు కోసం ఏదో ఒకరోజున ఆమె తననూ చేరదీయవచ్చు . ఈ ఉద్దేశ్యంతో అతను సర్వస్వమూ తనే అయి కొడుకును పెంచాడు. ఆ కారణంగా సోము క్షణం కూడా తండ్రిని వదిలి వుండలేని వాడుగా తయారయ్యాడు. అంతే కాదు , సోముకు తండ్రి దురవాలట్లన్నీ ఒకటొకటిగా వచ్చాయి. అందుకు భద్రయ్య పెద్దగా చింతించ లేదు.
    ఇప్పుడు సోముకు ఇరవై ఏళ్ళు. చదువు ఇంటర్మీడియట్ తో ఆగిపోయింది. సంపాదించే తెలివితేటలూ లేవు. ఖర్చు పెట్టె అలవాట్లు బాగా వున్నాయి.
    భద్రయ్య కుద్యోగం మీద వచ్చే డబ్బు ఖర్చులకే చాలడం లేదు. ధన సంపాదన కోసం అతను తొక్కిన అడ్డదార్లలో పేకాట ఒకటి. పేకాట సోముకూ వచ్చు. ఈ అట వాళ్ళ అప్పులు పెరగడానికే సహకరించింది.
    ఆ అప్పులు మరీ పీకేమీదకు వచ్చినపుడు భద్రయ్య దొంగతనాలు చేయాలనుకునే వాడు. అయితే అతడి దొక్కటే భయం. దొంగతనాలు చేసే తెగింపు, ధైర్యం అతడి కున్నాయి. కానీ సోము పిరికివాడు. బొత్తిగా పిరికివాడు. తండ్రి లేనిదే అతనికి మనుగడ లేదు. అలాంటి వాడి భవిష్యత్తు ఎలా తీర్చి దిద్దడమా అన్నది అతడి బెంగ. తను దొంగతనాలు చేసి పట్టుబడితే కొడుక్కు నిలువ నీడ లేకుండా పోతుందని అతడి భయం.
    భద్రయ్య భార్యను చూసి పదిహేనేళ్ళు దాటింది. అతడి ప్రతి ఆలోచననూ ఆమె త్రిప్పి కొట్టడంతో నిస్పృహ చెంది అతడామెను దూరంగా వుండిపోయాడు. ఇప్పుడతనికి కొత్త ఆలోచన వచ్చింది.
    రాము, సోము లిద్దరూ కవల పిల్లలు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒక్కలాగే వుంటారు. తను ఎలాగో పధకం వేసి రాము స్థానంలో సోమును పెట్టి కొన్నాళ్ళ పాటు రామును తనకు బందీగా వుంచుకోవాలి. ఆ కొద్ది రోజుల పరిచయంతో సోము సీతమ్మకు మానసికంగా ఒకరి కొకరు దగ్గరయితే ఆ తర్వాత రాము ఆ యింట ప్రవేశించినా అంతా కలిసే వుంటారు. సోము తనని వదిలి వుండలేడు కాబట్టి ఆ యింట తనకూ ఆశ్రయం లభించవచ్చు. తన అప్పులబాధ తీరే మార్గం అదొక్కటే.!

                                       2
    భార్యాభర్త లు విడిపోయి ఆస్తి కలిశాక సీతమ్మ ఆ ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోయింది. భద్రయ్య కొడుకును వెంట బెట్టుకుని ఆ ఊరే వెళ్ళాడు. సోమును తీసుకుని వెళ్ళకుండా తనొక్కడూ సీతమ్మ ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి సీతమ్మ యింట్లో లేదు. గుడికి వెళ్ళిందట. రాము ఒక్కడే ఇంట్లో వున్నాడు.
    రాముని చూస్తూనే భద్రయ్య హతాశుడై పోయాడు. చిన్నతనంలో అయితే అతడికీ సోముకూ చాలా పోలికలు కనిపించేవి. కానీ ఇప్పుడిద్దరికీ చాలా తేడాలు కనబడుతున్నాయి. సోము కంటే రాము అందంగా, ఆరోగ్యంగా వున్నాడు.
    రాముకు భద్రయ్య ఎవరో తెలియదు. కానీ అతడు మర్యాద బాగానే చేశాడు. భద్రయ్య అతణ్ణి ప్రశ్నించి కొన్ని వివరాలు రాబట్టాడు.
    రాము బియ్యే ప్యాసయ్యాడు. తల్లికి ఆ ఊళ్ళో మూడు దుకాణాలున్నాయి. ఒకటి బట్టలు, రెండు ఫ్యాన్సీ, మూడు కిరాణా ! అన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. వారి జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వుంది. ఉచ్చారణ లో రాము భాష కున్న స్వచ్చత సోముకు లేదు. అతడి సంస్కారం కూడా గొప్పదని పిస్తోంది.
    రామును చూస్తుంటే భద్రయ్య కు ఏడుపు వచ్చింది. అసలు సీతమ్మ ఇద్దరు కొడుకుల్నీ తన దగ్గర ఉంచుకుంటానంది. ఆమెను సాధించాలని తను ఒకణ్ణి తన కూడా తీసుకుని పోయాడు. సీతమ్మ ఆ కొడుకు కోసం అలమటిస్తుందనుకున్నాడు కానీ అలా జరుగలేదు. తన కూడా వచ్చిన కారణంగా సోము అటు తల్లి ప్రేమకూ, ఇటు డబ్బునూ కూడా పోగొట్టుకుని యెందుకూ పనికిరానివాడయ్యాడు.
    అతను కొంతసేపు కొడుకుతో మాట్లాడేడు. రామును చూస్తె అతడికి అసూయగా వుంది. సంభాషణ నడుస్తుండగానే అక్కడికి సీతమ్మ వచ్చింది.
    ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు భద్రయ్య. ఈ పది హేనేళ్ళలోనూ సీతమ్మ లో పెద్దగా మార్పేమీ లేదు. జుట్టు కూడా తెల్లబడలేదు. అనాడేలాగున్నదో ఇంచుమించు ఈనాడూ అలాగే ఉన్నది. ఇరవై ఏళ్ళ రాముకి ఆమె తల్లి అంటే నమ్మకం కష్టమే!
    అయితే సీతమ్మకు భద్రయ్య ను గుర్తుపట్టడం కాస్త కష్టమయింది. అతను కాస్త సడిలాడు. జుట్టు మూడొంతులు నెరిసి పోయింది. కళ్ళలో జీవం లేదు. మనిషి బాగా చిక్కాడు. అతికష్టం మీద ఆమె అతణ్ణి గుర్తుపట్టి "నువ్వా?" అంది.
    "ఈయన నీకు తెలుసా అమ్మా!" అన్నాడు రాము ఆశ్చర్యంగా.
    తన కారణంగా జన్మనేత్తిన కొడుకు తన భార్య సీతమ్మనలా అడిగితె భద్రయ్యకు గుండెలు పిండినట్లనిపించింది. ఎలాంటి జీవితానికి దూరమయ్యాడతను? వ్యసనాల పేరు చెప్పి బంగారం లాంటి భార్యను వదులుకుని , అద్భుతమైన భవిష్యత్తు ను నాశనం చేసుకున్నాడు. ఇది తిరిగి వెనక్కు తీసుకోలేని తప్పు.
    సీతమ్మ కొడుకు నక్కడి నుంచి పంపేసి "ఎందుకొచ్చావ్?" అనడిగింది భద్రయ్య వంక తీవ్రంగా చూస్తూ.
    "అవన్నీ ఇంక చెప్పను. నీ కొడుకును నువ్వు చక్కగా పెంచావు. కానీ నా వద్ద  పెరిగిన సోముకు ఏమీ లేవు. వాడు ఇంటర్మీడియట్ ఫెయిలయ్యాడు. సంపాదించే తెలివి తేటలా శూన్యం! భవిష్యత్తంతా అంధకారమయం - వాడికి నేనేమీ చెయ్యలేకపోయ్యాను. అన్ని విధాల అసమర్దుడ్ని ! నాకోసం నువ్వేమీ చెయ్యొద్దు. వాడిని నీ దగ్గరుంచుకో -- ఈ ఒక్క ఉపకారం చెయ్యి " అన్నాడు భద్రయ్య.
    సీతమ్మ నిట్టూర్చింది -- "నీ వెధవ పోలికలు ఎక్కడోస్తాయోనని రాముని నేనెంతో జాగ్రత్తగా పెంచాను. నీతికి, సన్మర్గానికి మరురూపంగా పెరుగుతున్నాడు. పరాయి ఆడదాని వంక కన్నెత్తి కూడా చూడదు. ఒక్క అబద్దం చెప్పాలంటే గజగజలాడి పోతాడు. నాతొ చెప్పకుండా సినిమాకు కూడా వెళ్ళడు. చెప్పి కూడా బార్లకు వెళ్ళడు. అంతా వాడి గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. నేరం పేరు చెబితేనే వాడు నిలువెల్లా వణికి పోతాడు. అలా నా దగ్గర పెరిగిన వాడి సమక్షంలో నీకు గానీ నీ కొడుక్కు గానీ ఉండే అర్హత ఉన్నదేమో నువ్వే అలోచించి చెప్పు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS