శంకరం మాటిచ్చాడు.
"నాన్న చెల్లెలికోసం ఇల్లు తాకట్టుపెట్టి ఇరవయి వేలు తెచ్చాడు. నేను ముత్యాల్రావును బ్రతిమాలి ఆ యింటి మీదే యింకో ఇరవయి వేలడిగాను. మరికాస్త హెచ్చువడ్డీ యిస్తానంటే ఒప్పుకున్నాడు. ఈ రహస్యం నాన్న క్కూడా తెలియకూడదు...."
శంకరం నన్ను మెచ్చుకున్నాడు.
మా వ్యాపారం ప్రారంభమయింది.
శంకరం నన్ను నెలజీతం మీద తీసుకున్నాడని నాన్నకు చెప్పాను. ఆయన నమ్మాడు.
సెంటర్ లో ఫ్యాన్సీ దుకాణం.
ఆరంభంలో అనుభవం తక్కువై మరీ అంత బాగానడవలేదు.
కానీ రెండునెలల్లోనే నాకు చాలా విషయాలు తెలిశాయి.
మార్కెట్ లో డిమాండ్లో ఉన్న వస్తువులేమిటీ కస్టమర్స్ వెతికి ఆకర్షించబడతారూ అన్న విశేషాలతో పాటు - డిమాండ్ లేని కొన్ని వస్తువుల్ని కూడా ఉంచుకోవాలని అర్ధమయింది నాకు.
తక్కువ డిమాండున్న సరుకులన్ని దుకాణాల్లోనూ ఉండవు. కొందరు వాటి గురించి అడిగి - అవి ఉన్న చోటనే మిగతా సరుకులు కూడా కొంటారు. డిమాండ్లో లేని ఒక రూపాయ సరుకువల్ల - పాతిక రూపాయల బేరం పోకుండా చూసుకోవాలి.
సరుకుల్ని తక్కువ ధరకు కొనడంలో శంకరం సిద్దహస్తుడు.
మా కాంబినేషన్ - అయిదారు నెలల్లోనే - మా షాపు రోజుకు నాలుగయిదు వందలకు తక్కువ కాకుండా లాభాలు తెచ్చిపెట్టే స్థాయికి తీసుకొచ్చింది.
ఇప్పుడు మేము నెలకు పదివేలు తక్కువ కాకుండా లాభాలార్జిస్తున్నాం.
మా లాభాలమీద మేమెక్కువ ఆశ పెట్టుకోవడంలేదు.
ఇంట్లో నేను నెలకు అయిదువందల రూపాయలిస్తున్నాను. వెయ్యి రూపాయలు వేరే అట్టే పెడుతున్నాను. మరో అయిదు వందలు నా బయటి ఖర్చులకి.
ఇదంతా పోగా ఇంకా మూడు వేలకుపైగా వుంటుంది.
అదంతా వ్యాపారంలో పెడుతున్నాను.
వ్యాపారాన్ని బాగాపెంచాలని మా యిరువురి ఉద్దేశ్యం.
మార్కెట్ స్టడీ బాగా చేశాక - మరో బ్రాంచిని మరో సెంటర్లో ఓపెన్ చేయాలనిపించింది.
అప్పటికి మేము వ్యాపారం ప్ర్రారంభించి రెండేళ్ళయింది.
నేను వేరేగా పెడుతున్న వెయ్యిరూపాయలూ ఇరవై వేలయింది.
ఆ డబ్బు నాలా వేరే పెట్టడానికి కారణముంది.
నేను వ్యాపారంలో దిగడం కోసం దొంగ నయ్యాను.
బలహీనత కొద్దీ మనిషి వ్యభిచారం చేస్తాడు. అందువల్ల రోగాలంటుకోవచ్చు. డాక్టరు వాటిని నయం చేస్తాడు.
వచ్చిన జబ్బు నయమైతే చేసిన తప్పు దిద్దుకున్నట్లే!
నేను చేసిన తప్పును దిద్దుకోవాలనుకుంటున్నాను.
అంటే నేను దొంగిలించిన ఇరవై వేలూ తిరిగి ఇచ్చేస్తాను. ఆ డబ్బెలా తిరిగివ్వాలీ అన్నది నా సమస్య.
రహస్యంగా ఆ డబ్బివ్వాలని ముందనుకున్నాను.
కానీ నా మనసందు కంగీకరించలేదు.
వయసులో మా నాన్నకంటే కూడా పెద్ధవాడా ముసలాయన.
ఆయన్ను అమానుషంగా నేలమీదకు తోసేసి డబ్బు కాజేశాను.
తలుచుకుంటే జరిగినదానికి నాకెంతో బాధకలుగుతుంది.
నేను స్వయంగా ఆ ముసలాయన్ను క్షమార్పణ కోరుకోవాలి.
ఆయన నన్ను దొంగ అని పోలీసులకు పట్టివ్వాలనుకుంటే అందుకు సాక్ష్యముండదు.
నా మంచితనాన్ని ఆయన దుర్వినియోగం చేసుకుంటాడనుకోను....
వ్యాపారంలో స్థిరపడ్డాక నేనా ముసలాయన గురించి ఆచూకీ తీసి వివరాలు కొన్ని తెలుసుకున్నాను.
ఆయనపేరు లక్ష్మీకాంతం.
నా కారణంగా ఆ కుటుంబం కష్టాలపాలయినట్లు కనబడదు. వారి జీవితం సాఫీగానే నడిచిపోతోంది. ఆయన నా షాపుకి రెండు మూడుసార్లు వచ్చాడు. నన్ను గుర్తుపట్టలేదు.
అందుకే ధైర్యంగా ఆయనింటికి వెళ్ళాలనుకుంటున్నాను.
ధైర్యానికి కాంత కాలం అవసరమయింది.
4
తలుపు తీసిందో అమ్మాయి.
"లక్ష్మీకాంతంగా రున్నారా?" అన్నాను.
ఆమె లోపలకు రమ్మనమంది.
నేను కుర్చీలో కూర్చున్నాను.
లక్ష్మీకాంతంగారు వచ్చారు.
"నమస్కారమండి?" అన్నాను.
"నమస్తే?" అన్నాడాయన.
"హోటల్ ఆశాలతకు పక్కన-సెంటర్లో ఇంటర్నేషనల్ ఫ్యాన్సీ సెంటర్ - మీకు తెలిసే ఉంటుంది - దాని ప్రొప్రయిటర్ నేను...."
"అలాగా!" అన్నాడాయన.
"సర్వే చేస్తున్నాను - ఎవరెవరి కెటువంటి సరుకు లిష్టమోనని. ఈ సర్వే ఆధారంగా మరో ఫ్యాన్సీస్టోరు స్థాపించాలనుకుంటున్నాం...."
"అంటే?"
"మీ యింట్లో ఏయే బ్రాండ్స్ ఫ్యాన్సీ సరుకులు వాడతారు? సబ్బులు.....టూత్ పేస్టు.....కొబ్బరినూనె....."
"ఉండండి-మావల్ల నడిగి చెబుతాను...." అంటూ ఆయన లేచాడు.
"ఒక్కసారి ఆగండి...." అన్నాను
ఆయన ఆశ్చర్యంగా నా వంక చూస్తున్నాడు.
నేనాయన పాదాలకు వంగి నమస్కారం చేశాను.
"ఏమిటిది?" అన్నాడాయన తెల్లబోయి.
"ఇది కూడా తీసుకోండి" అంటూ ఆయనకు రెండువంద రూపాయలకట్ట లందించాను.
"నాకేమీ అర్ధం కావడం లేదు...."
"నా ఫ్యాన్సీ స్టోరు మీరు పెట్టిన భిక్ష.....నేను మీకు బాకీ పడ్డాను. ప్రస్తుతానికి అసలు తీరుస్తున్నాను. వడ్డీ మీరెంతంటే అంతా యిస్తాను...." అన్నాను.
ఆయన తెల్లబోయి ఏదో అనబోయి ఊరుకున్నాడు.
"అయ్యా - నేను దొంగను. వ్యాపారంలో పెట్టుబడి కోసం ఎక్కడా దారిలేక- పలకసర్లు అమ్ముకుని మీరు సంపాదించిన ఇరవయివేలూ కాజేశాను. ఆ తప్పుకు మిమ్మల్ని క్షమార్పణ అడిగేవరకూ నాకు మనస్థిమితం లేదు...." అన్నాను.
ఆయన తెల్లబోయి అలాగే నా వంక చూస్తూ- "కూర్చో బాబూ!" అన్నాడు.
"నన్ను మీరు క్షమించాలి. అప్పుడే నేను కూర్చుంటాను...."
"నిన్ను క్షమించవలసింది నేను కాదు. నీవల్ల ఎఫెక్టయినవాడు మా అబ్బాయి - భీమారావు. వాడిని పిలుస్తానుండు...." అంటూ లోపలకు వెళ్ళాడు.
"ఇప్పుడేం జరుగుతుంది?" అంది నా మనసు.
ముసలాయన కొద్దిక్షణాల్లో కొడుకును వెంటబెట్టుకుని వచ్చాడు. అతడించుమించు నా యీడువాడే!
భీమారావు నన్ను చూస్తూనే - "మీరు ఇరవై వేల రూపాయలు తిరిగి తెచ్చారా? నిజమేనా?" అన్నాడు.
"ఊ...." అన్నాను.
అతడు వెంటనే నా పాదాలకు వంగి నమస్కరించి లేచి నిలబడ్డాడు.
"ఇదేమిటి?" అన్నాను.
"మీరు నాకు మహోపకారం చేశారు. ఇది ఈ జన్మకు మరిచిపోలేను...." అన్నాడతడు.
నాకేమీ అర్ధం కాలేదు.
ముసలాయన వివరించి చెప్పాడు.
భీమారావు కెక్కడా ఉద్యోగం దొరకడం లేదు. అతడు బియ్యే పాసయ్యాడు కానీ వచ్చినవి అత్తెసరు మార్కులు. ఎవడో ఒక ఏజెంట్ దుబాయిలో ఉద్యోగ మిప్పిస్తానని అతణ్ణి నమ్మించాడు. ఇరవైవేలు కావాలన్నాడు. వేరే దారిలేక లక్ష్మీకాంతం పలకసర్లు అమ్మి డబ్బు తెచ్చాడు.
దుబాయి వెళ్ళి నాలుగేళ్ళలోపల లక్షలు తేవచ్చునని భీమారావు కలలు.....
నా మూలంగా అతడి కలలు ఫలించలేదు.
డబ్బు పోవడంతో లక్ష్మీకాంతం దుబాయి ఏజెంటు కేమీ ఇవ్వలేకపోయాడు.
ఏజంటుకు డబ్బిచ్చుకున్నవారందరూ మోసపోయినట్లు మరో పది రోజులకు ఋజువయింది.
"ఆ డబ్బు దొమ్గాలకే రాసిపెట్టి వుంది. ఈ దొంగ బదులు ఆ దొంగ కాజేశాడు...." అన్నాడు లక్ష్మీకాంతం.
కానీ ఆ డబ్బిప్పుడు తిరిగి వచ్చింది.
"నిన్ను వడ్డీ కూడా ఏమడుగుతాం బాబూ- నువ్వు మా డబ్బుకు దొంగవు కాదు...."రక్షకుడివి...." అన్నాడు లక్ష్మీకాంతం.
నే నాశ్చర్యంగా జరిగింది వింటున్నాను.
ఇంట్లోవారందరూ నాకు సకల మర్యాదలూ చేస్తున్నారు. నేను దొంగనన్న విషయం వారెవ్వరూ మాటమాత్రంగా కూడా గుర్తించడం లేదు.
నేను దొంగనే......అందుకు సందేహం లేదు.
కానీ మరో దొంగ కారణంగా నేను వారి దృష్టిలో మనిషి నయ్యాను.
ఉష్ణం ఉష్ణేన శీతలం అంటారు.
దొంగ దొంగను మనిషిగా చేయగలడా?
లక్ష్మీకాంతం ఇరవై వేలూ నాకే తిరిగిచ్చేసి - "ఈ డబ్బు మా భీమారావుది. వాడిది వెనక్కు తీసుకోనంటున్నాడు" అన్నాడు.
"ఎందుకు?" అన్నాను.
"ఇంతవరకు నా కింకా ఉద్యోగం లేదు. ఉద్యోగాన్వేషణ ఎంత తెలివితక్కువో నా కిప్పుడే అర్ధమవుతోంది మీరు క్రొత్తగా ప్రారంభించబోయే ఫ్యాన్సీ షాపులో నా వాటాగా యిది తీసుకుని నాకూ ఓ దారి చూపించండి" అన్నాడు భీమారావు.
అతడి డబ్బు నాకు దారి చూపించింది.
అతడికి నేను దారి చూపించాలి.
అది నా బాధ్యత..... ......
నేను చేసిన దొంగతనం-ఆ కుటుంబానికి గొప్ప మేలు చేయడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
చేసిన ఒక్క నేరమూ నన్ను నేరస్తుణ్ణి చేయలేదు కాబట్టి ఇక ముందు ఒక్క నేరం కూడా చేయకూడదనుకున్నాను.
:-అయిపోయింది:-
