Previous Page Next Page 
డాళింగ్ పేజి 60

 

    "పెళ్ళయ్యాక కదా డాడీ......విమల్ న్యూయార్క్ వెళ్ళి పోదామంటే నేనూ రెడీ డాడీ......" విమల్ తో పెళ్ళికి తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు కృష్ణవందన హేపీగా ఉంది.
    -----ఆ తర్వాత తండ్రితో కల్సి డిన్నర్ తీసుకుంది.
    బిజినెస్ సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని కలిసి తండ్రి మరో మూడు గంటల తర్వాత బొంబాయి వెళ్ళిపోతాడు.
    "మీకు విమల్ ని పరిచయం చేస్తాను డాడీ"
    "ఇప్పుడు కాదమ్మా......మరో పదిరోజుల్లో వస్తాను. అతన్తో మాట్లాడతాను ......ఓకె."
    మరేం మాట్లాడలేక పోయింది కృష్ణ వందన.
    కృష్ణ వందన వెళ్ళిపోయాక, వంటరి ఏ.సి డీలక్స్ రూంలో ఆలోచనల్లో పడ్డాడు జె. ఆర్. రావు.
    ప్రేమ పేరుతొ వందన......ఏదైనా తప్పటడుగు వేస్తె....విమల్ అనే వ్యక్తీ చేతిలో మోసపోతే? వందన తనకు దక్కకుండా పోతుంది వందనది సున్నితమైన మనసని తండ్రిగా జె. ఆర్. రావుకి తెలుసు. గెలుపుని తప్ప, ఓటమిని ఒప్పుకోలేని మనసు.
    ఓడిపోతే ----ఆ ఆలోచన రావడంతో ఏం చెయ్యాలో తోచలేదు జె. ఆర్. రావు కి.
    అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు.
    కదిలే ప్రతి కదలికనూ డబ్బు కోసం మాత్రమే వినియోగించే వ్యక్తీ జె.ఆర్. రావు, క్షణాల్ని, నిమిశాల్ని, సద్వినియోగం చేసుకుంటూ, వాటి విలువను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా డబ్బుతో కాలాన్ని శాసించగలిగే స్థితికి వెళ్ళినవాడు జె. ఆర్. రావు.
    అలాంటి జె. ఆర్. రావు తన న్యూయార్క్ ప్రయాణాన్ని ఆరుగంటల సేపు వాయిదా వేసుకున్నాడు.
    ప్రాణం కన్నా ప్రేమించే కూతురు కోసం. అయన తీసుకున్న నిర్ణయం అది.
    ఇప్పుడాయన ఏం చేయబోతున్నాడు?
    వెంటనే పి.ఏ. ని పిలిచాడు. తన ప్రోగ్రాములన్నిటినీ కేన్సిల్ చేసుకున్నాడు.
    సిటిలోని కొంతమంది వ్యక్తులకు ఫోన్లు చేసాడు. తనకు కావలసిన విషయాన్నీ రాబట్టుకున్నాడు. ఒక గంట తర్వాత తన సూట్ లోంచి బయటకొచ్చి కారెక్కాడు.
    
                                                   *    *    *    *

    అకస్మాత్తుగా తన ఎదురుగా ప్రత్యక్షమైన కృష్ణవందనను చూసి ఆశ్చర్యపోయాడు విమల్. దాదాపు ఉబ్బితబ్బియి పోయాడు.
    సినిమాల్లో కొత్తగా వాస్యపాత్రలు వేసే ఒక సహనటుడి బర్త్ డే పార్టీ కెళ్ళి వస్తున్నాడు ఒంటరిగా విమల్.
    బీచ్ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది.
    "హలో......"
    ఆ సమయంలో అక్కడ, అలా....
    "ఈ సమయంలో ఇక్కడ, ఎలా .......ఎక్కడ్నుంచి రాక."
    "నీ కోసమే మహానుభావా!" కారాపి , నవ్వుతూ దిగింది కృష్ణ వందన.
    తెల్లటి మబ్బులాంటి చీర. పొడవాటి ముక్కు, కాంక్షలు నిండిన నీలి కళ్ళు, పెదల లిప్ స్టిక్ ఎరుపులో మెరిసే వయసు మెరుపు.
    ఆ సమయంలో , కృష్ణవందన ఎంత అందంగా ఉందంటే , అ లావణ్యానికి, సౌదర్యానికి విమల్ ముగ్ధుడయిపోయాడు. సముద్రంలో స్నానం చేసి , వెన్నెల్లో సేద తీరుతున్నట్టుగా మనోహరంగా ఉంది కృష్ణవందన.
    "ఏంటి. ఇలా ....." ఆ మాటకు చిలిపిగా చూసి, అతని కుడిచేతిని తన చేతిలోకి తీసికొని , ముద్దు పెట్టుకుని.
    "ఎంత పడుకోడానికి, ప్రయత్నించినా, నిద్ర రావటంలేదు...నువ్వే జ్ఞాపకానికి వస్తున్నావ్....పోన్లో మీ ఇంటికి ట్రై చేసాను పార్టీ కెళ్ళారని చెప్పారు . అంతే....."
    "ఆ తర్వాత .....జేమ్స్ బాండ్ లెవల్లో హంటింగ్ మెదలెట్టావన్నమాట."
    ఆ మాటకు గలగలా నవ్వేసింది కృష్ణ వందన.
    ఇద్దరూ కాసేపు బీచ్ లో కూర్చున్నారు.
    "సముద్రం ఎప్పుడు పుట్టిందో చెప్పు." ఆ ప్రశ్న అడిగిన కృష్ణవందన ముఖంలోకి , అ ముఖంలో కనపడ్డ , అంతటి సంతోషానికి కారణాన్ని ఊహించుకుంటూ ----
    "తెలీదు."
    'పోనీ .....సముద్రంలోని అల."
    "సముద్రం పుట్టగానే , పుట్టి వుంటుంది అవునా!"
    "కాదమ్మా ! అలలన్నీ కలిస్తేనే సముద్రం కదా....." తుళ్ళుతూ నవ్వుతూ అంది.
    "ఇంకో ప్రశ్న వేస్తాను, జవాబు చెప్తావా?" మళ్ళీ అడిగింది .
    "అడుగు."
    "వెన్నెలెప్పుడు పుట్టింది."
    ఆ ప్రశ్నకు కూడా జవాబు తెలీదు విమల్ కు.
    "ఈ ప్రశ్నలడగడానికే ఇంతదూరం వచ్చావా?"
    "నీకు తెలీదని చెప్పు.....దబాయించకు."\
    తెలీదు. నీకు తెలిస్తే చెప్పు."
    "చెప్పనా....అయితే ఇటు తిరుగు."
    తలతిప్పాడు విమల్.
    కృష్ణవందన అతని మీదకు వంగి, అతని పెదిమల మీద గట్టిగా ముద్దు పెట్టుకుని, గలగలా నవ్వింది.
    ఆ కాలంలో ముత్యాల తుంపరల, ఆ పెదాల స్పర్శకు చలించి పోయాడు.
    "సముద్రమూ, వెన్నెల ఎక్కడ పుట్టాయో తెలుసా? ఇక్కడే ఈ నాలుగు పెదాల మధ్యే....తెలుసా!"
    "పెదాల మధ్య పుట్టాయా.....నువ్వు ఏ కాన్వెంట్ లో చదువు కున్నావ్ చిట్టి తల్లీ."
    మళ్ళీ గలగలా నవ్వేసింది కృష్ణ వందన. అతని పక్కనే ఆమె వెన్నెల్లో ఎగురుతున్న పొడవాటి కురులు. వెండి పువ్వులా తెల్లటి ఆకారంలో మెరుస్తున్న ఆమె నడుమ్మీద చెయ్యి వేసి, ఆమెను తనవేపు తీప్పుకున్నాడు విమల్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS