Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 5


    
    దీనికి ప్రొఫెసర్ అంగీకరించాడు.
    సాయంత్రం ఆరింటికి రమాకాంతం, కర్మ కలిసి ఇల్లు చేరారు. ప్రొఫెసర్ గుమ్మం దగ్గరకు వచ్చి కుడికాలు పైకెత్తి ఆగిపోయాడు. రమాకాంతం వెంటనే ఆయనకు ఓ యాభై రూపాయల నోట్లకట్ట అందించాడు. ప్రొఫెసర్ తృప్తిగా అది జేబులో వేసుకొని ఇంట్లో పాదం పెట్టి-"ఆహా-చక్కటి పరిమళం - మీ యింట్లోని దెయ్యం ఎంతో అందమైనదయుండాలి-" అన్నాడు. ఆయన ముఖంలో పరవశం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
    రమాకాంతం ఏమీ మాట్లాడలేదు.
    ప్రొఫెసర్ కర్మ అందరితోటీ కలిసి భోంచేశాడు. పడుకొనేందుకు ఆయనకు మాధవరావు గది కేటాయించబడింది.
    ఆయన పక్కవాటాలోకి వెళ్ళి తలుపులు బిగించు కోగానే అంతా అక్కడే కూర్చుండిపోయారు. ఆ రాత్రింకెవ్వరూ నిద్రపోరాదనీ ఏం చిత్రం జరుగుతుందో చూడాలనీ అంతా నిశ్చయించుకొన్నారు.
    సరిగ్గా రాత్రి పన్నెండుపావుకి పక్కవాటా తలుపులు తెరుచుకొన్నాయి. అందరూ ఆత్రుతగా గుమ్మంవైపే దృష్టిసారించారు.
    అందరికీ గుమ్మందగ్గర ప్రొఫెసర్ కర్మ కనిపించాడు.
    "వీధి తలుపులు తియ్యండి. మేము వెళ్ళిపోతాం-" అన్నాడు కర్మ.
    రఘు పరుగున వెళ్ళి వీధి తలుపులు తీశాడు.
    అప్పుడు ప్రొఫెసర్ కర్మ హాల్లో అడుగుపెట్టాడు. తనక్కూడా హెచ్చరిక అని గ్రహించడంవల్ల ఆయన శరీరంలో సన్నని వణుకు ప్రారంభమయింది.
    గుండు వ్యక్తి లేచి నిలబడ్డాడు. లాంగ్ కోట్ విప్పాడు. పక్కనేవున్నా కుర్చీమీద వేశాడు. ఇన్ షర్టును లాగి విప్పి దాన్ని లాంగ్ కోట్ మీద వేశాడు. వళ్ళంతా కండలే ఆ మనిషికి. అది ఉక్కు శరీరంలాగుంది. అతడొకసారి వ్యాయామం చేసేవాడిలాగానూ, మరోసారి కండల్ని ప్రదర్శించేవాడిలాగానూ వళ్ళు కదిపాడు.
    పొడుగైన ఆ గుండుమనిషి అలా చేస్తున్నప్పుడు మనిషిలా గాక రాక్షసుడిలాగున్నాడు. రమాకాంతం పై ప్రాణాలు పైనే పోయాయి.
    గుండు మనిషి మళ్ళీ చొక్కా వేసుకొని ఆపైన లాంగ్ కోట్ కూడా వేసుకొని మళ్ళీ కుర్చీలో కూర్చుని-"ఆ బ్రీఫ్ కేస్ గురించి ఏమన్నారూ?" అన్నాడు తాపీగా.
    రమాకాంతానికి ఏం జవాబు చెప్పాలో తెలియదు. గ్రుడ్లు మిటకరించి ఆ మనిషివైపే చూస్తూ వుండిపోయాడు.
    "తొందరగా ఆ బ్రీఫ్ కేసు తెచ్చి యిస్తే నేను వెళ్ళిపోతాను-"
    అతడు వెళ్ళిపోవాలని రమకాంతానికీ వున్నది కానీ బ్రీఫ్ కేసు ఎక్కణ్ణించి తెచ్చి యిచ్చేది?
    "ఆ బ్రీఫ్ కేసు ఏ రంగుదో, అందులో ఏముందో చెప్పగలరా?"
    "బ్రీఫ్ కేసు ఏ రంగైతే నాకెందుకూ? అందులో ఇరవైవేలు క్యాషుండాలి-"
    "ఇరవై వేలా?" రమాకాంతం నోరు తెరిచాడు.
    "తీసుకొన్నప్పుడది చాలా చిన్న మొత్తంగా అనిపిస్తుంది. తిరిగివ్వాల్సొస్తే చాలా పెద్ద మొత్తం అనిపిస్తుంది. మాధవరావు వెళ్ళిపోయాడుగదా అని నేరం అతడిమీదకు తోసేస్తే నమ్మేరకంకాదు. నా యిరవై వేలూ నాకు అందకపోతే మీ యింట్లో రోజుకొకరు చొప్పున గల్లంతవుతారు-" అన్నాడు శతమానం.
    "కానీ ఇరవై వేలు నేనెక్కన్నించి తెచ్చి ఇచ్చేది?" రమాకాంతం ప్రపంచంలోని దుఃఖానికంతకూ ప్రతినిధిగా వున్న గొంతుతో అన్నాడు.
    "మాధవరావిచ్చిన డబ్బు మీరెక్కడ పెట్టారో నాకేం తెలుసు? ఎక్కడ పెట్టారో అక్కణ్ణించి తెచ్చి ఇవ్వండి!" అన్నాడు శతమానం.
    రమాకాంతం ఏదో అనబోయి ఊరుకొన్నాడు. ఇది మాధవరావు చేసిన పనే అయుంటుంది. ఏ కారణం వల్లనో అతడీ మనిషికి ఇరవైవేలు బాకీపడ్డాడు. బాకీ తీర్చే సమయానికిక్కన్నించి చల్లగా జారుకొన్నాడు. ఈ శతమానం మూర్ఖుడు. అన్నంత పనీ చేస్తాడు. తనేం చెప్పినా నమ్మడు.
    "నాకు కొంత వ్యవధి కావాలి!" అన్నాడు రమాకాంతం.
    "ఎల్లుండి మధ్యాహ్నం రెండింటివరకూ మీకు వ్యవధి. ఆ సమయంలోగా మీరు నెహ్రూనగర్ పోస్టాఫీసులో మీ పేరునే అయినప్పటికీ నాకే చేరుతుంది. మీరేమీ కంగారుపడనవసరంలేదు-" అన్నాడు శతమానం.
    రమాకాంతం ఆలోచిస్తున్నాడు. ఈలోగా తను పోలీసు రక్షణ పొందితే ఎలాగుంటుందీ అన్న భావం కూడా ఆయనకు కలిగింది. ఆ భావాన్ని చదివినట్లుగా "పోలీసుల గురించి ఆలోచించవద్దు. నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఆఖరికి నా అంతట నేను చావాలనుకొంటే తప్ప ఆ మృత్యుదేవత కూడా నన్ను సమీపించలేదు..." అన్నాడు శతమానం.
    అప్రయత్నంగా తలూపాడు రమాకాంతం.
    "సరే-అయితే ఒకసారి మీ ఆఖరబ్బాయి శ్యామల రావునిలా పిలవండి-" అన్నాడు శతమానం.
    "ఎందుకూ?" అన్నాడు రమాకాంతం కంగారుగా.
    తన లాంగ్ కోట్ లోంచి ఉల్లిపాయంత బంతిలాంటి పదార్ధాన్ని బైటకుతీసి రమాకాంతానికి చూపించాడు శతమానం-"ఇది బాంబు. మీ యింటిని ఒక్కక్షణంలో కూల్చేయగలదు. అయితే యిలాంటివి నేను మీవంటి వాళ్ళకోసం ఉపయోగించను. అవసరపడితే ఎలాంటి వాళ్ళ'మీద ఉపయోగించడనికీ సందేహించను. నేను చెప్పినట్లు వినకపోతే ఈ బాంబు పేల్చవలసిన అగత్యం పడుతుంది. మీరు ఇక్కడే కూర్చుని మీ అఖరబ్బాయి శ్యామలరావుని పిలవండి-" అన్నాడతను.
    తఃదబడుతూ ఆఖరి కొడుకును పిలిచాడు రమాకాంతం.
    శ్యామలరావు వచ్చేలోగా టోపీ పెట్టుకొన్నాడు శతమానం. అతడు రాగానే అభిమానంగా పలకరించి-"బాబూ-మీ నాన్నగారు నిన్ను నాతో తీసుకువెళ్ళమన్నారు. చిన్న పని వుంది. రేపుగానీ, ఎల్లుండిగానీ మనం వెనక్కు వచ్చేస్తాం-" అన్నాడు.
    విషయం రమాకాంతానికి అర్ధమయింది. శ్యామల రావు తండ్రి వంక చూస్తే ఆయన అసహాయంగా తలాడించాడు. శతమానం కొడుకుని తీసుకొని వెళ్ళిపోతూంటే ఆయన కుర్చీలోంచి వెనక్కు కూడా లేవలేదు.

                                        7

    జరిగింది విని శాంతమ్మ శోకాలు ప్రారంభించింది-"పసిపిల్లవాడిని ఆ రాక్షసుడు తీసుకుపోతూంటే అలా చూస్తూ ఎలా ఊరుకొన్నారండీ-" అని.
    "నాన్నా - ఈ వ్యవహారమేం బాగోలేదు. ఈ లెక్కన రోజుకొక్కడొచ్చి ఏదో బాంబు చూపించి అడిగితే ఓ మనిషినిచ్చి పంపించేస్తూండాలా?" అన్నాడు రఘు.
    రమాకాంతం నెమ్మదిగా ఇలా అన్నాడు- "అలా ఎన్నటికీ జరుగదు. ఇదంతా మన దౌర్భాగ్యం. మనకు చెడ్డరోజులు వచ్చాయి. అందుకే ఉన్న డబ్బంతా పోతోంది. ఆ మాధవరావు మూలంగా ఇదంతా జరిగింది. ఉన్న పళంగా వాడు ఇల్లు కాళీచేస్తానంటే నేను అందులో ఇంత మోసమున్నదని అనుకోలేదు. ఇక్కన్నించి ఎవరికి పడితే వాళ్ళకు ఇల్లివ్వకూడదు. బాగా తెలుసున్న వాళ్ళకో, తెలిసున్నవాళ్ళు చెప్పినవాళ్ళకో యివ్వాలి. ఆ శతమానం మనం డబ్బు కాజేశామని అనుమానపడ్డాడు. లేకపోతే అతడు మనలాంటివాళ్ళ జోలికి రాడు-"
    "అయితే ఇప్పుడంత డబ్బు ఎలా తెస్తాం?" అంది శాంతమ్మ.
    "వడ్డాణాలు తాకట్టు పెడదాం!" అన్నాడు రమాకాంతం. ఆ మాట వింటూనే రమాదేవి చటుక్కున అక్కణ్ణించి కదిలి వెళ్ళిపోయింది. తన వడ్డాణం కూడా తాకట్టు పెడతారని ఆమె భయపడినట్లుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS