"మీరంటుంటే నాకూ నిజంలాగే వుంది, ఇప్పుడెం చేస్తాం?" అంది సావిత్రి.
"వెధవ దేశం మనది, మనుషుల కీ మాత్రం రక్షణ లేని ఈ దేశ మెందుకు? దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నా మని చెప్పుకునే నాయకు లెందుకు?" అన్నాడు శేఖరం కసిగా.
6
శేఖరం తలుపు తీశాడు. ఎదురుగా శాస్త్రి నవ్వుతూ నిలబడి వున్నాడు. శాస్త్రి లేబరేటరీలో అతని కొలీగ్, ఉద్యోగం మానేశాక అతను వీళ్ళింటికీ రావడం యిదే ప్రధమం.
"రండి రండి" అన్నాడు . శాస్త్రి లోపలకు వచ్చాడో లేదో ఒక మనిషి లోపలకు వచ్చాడు. "గ్యాస్ స్టవ్ రిపేరు చేయడానికి వచ్చానండి" అన్నాడు. అతనెవరో తెలుసు కాబట్టి శేఖరం మాట్లాడలేదు. ఇటీవల యిది నిత్యానుభవమే కదా!
లాబరేటరీ కి ప్రధానమంత్రి వస్తున్నాడట. ఆయనతో పాటు యిద్దరు విదేశీయ శాస్త్రజ్ఞులు వస్తున్నారుట. లాబరేటరీకి సంబంధించిన కొన్ని ముఖ్య విశేషాలను వాళ్ళకు చూపిస్తారుట. ఆ సమయంలో శేఖరం అక్కడుంటే బాగుంటుందని లాబరేటరీ డైరక్టర్ అభిప్రాయ పడ్డాడట.
శేఖరం క్షణం అలోచించి "తప్పకుండా వస్తాను కానీ ప్రధానమంత్రి ని చూసే అవకాశం అందులోనూ దగ్గర్నుంచి చూసే అవకాశం ఏ ఒక్కరికో కాని రాదు. ఆహ్వానితుల్లో నా భార్య కూడా ఉండేలా చూడండి" అన్నాడు.
"తప్పకుండా" అన్నాడు శాస్త్రి. వాళ్ళిచ్చిన కాఫీ సత్కారాన్నందుకుని అతడు వెళ్ళిపోయాక గ్యాస్ స్టవ్ రిపేరతను వచ్చి "తప్పకుండా వెళ్ళండి. అక్కడికి నేనూ వస్తాను" అన్నాడు.
"ఎవరూ నాతో రానవసరం లేదు. ఇన్ని పర్యాయాలు చెప్పించుకునే మనస్తత్వం కాదు నాది --" అన్నాడు శేఖరం.
"మా జాగ్రత్తలో మేముండాలి కదా" అని వెళ్ళిపోయాడతను.
శేఖరం ఆలోచనలో పడిపోయాడు. ప్రధానమంత్రి సందర్శనమంటే మాటలు కాదు. సెక్యురిటీ ఏర్పాట్లు కట్టుదిట్టంగా వుంటాయి. కూడా ఆయుధం తీసుకువెళ్ళే అవకాశం కూడా వుండదు. అందరికీ అక్కడికి వెళ్ళే అవకాశం కూడా లభించదు. అటువంటప్పుడు ఈ ముఠా వాళ్ళు అక్కడి కేలా వస్తారు? వచ్చినా తన హద్దుల్లో తన కేలాగుంచుతారు? తన భార్య నేదైనా చేస్తారేమోనని ఆమెను కూడా తీసుకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు.
'సరే -- ఏం జరుగుతుందో చూద్దాం!" అనుకున్నాడతను.
ఒక రోజు ముందుగా శేఖరానికి ప్రధానమంత్రి సందర్శన సందర్భంలో లాబరేటరీ కి రావడానికి అవసరమైన బాడ్జేస్ , ఐడెంటిఫికేషన్ కార్డ్స్ వగైరాలు అందాయి. ఆరోజు రాత్రే శేఖరం దంపతుల నొక వ్యక్తీ కలుసుకుని బెదిరించి కొన్ని కాగితాలు వ్రాయించేడు దేశ ద్రోహాన్ని తల పెడుతూ ఏదో ముఠాకు శేఖరం వ్రాసిన ఉత్తరాలవి.
ఆ పనయ్యేక ఆ వ్యక్తీ పోతూ "రేపు మీరు ఇల్లు వదిలేక లక్ష రూపాయలు అన్నీ దొంగనోట్లు పట్టుబడతాయి. ఈ ఉత్తరాలకు మా జవాబులు కూడా మీఇంట్లో వుంటాయి. ఈ ఉత్తరాలూ, ఒక ఫోన్ కాలూ పోలీసులకు అందుతాయి. దంపతులిద్దరూ చక్కగా ప్రధానమంత్రి ని సందర్శించుకుని వస్తే ఏ ఇబ్బంది లేదు, లేకపోతే మాత్రం ....జీవితాంతం జైల్లో పడి మ్రాగ్గాలి " అన్నాడు.
అతను వెళ్ళిపోయేక శేఖరానికి కళ్ళ నీళ్ళు వచ్చేశాయి. సావిత్రి ఒడిలో తలపెట్టుకుని "ఎలాంటి జీవితం గడపాల్సోచ్చింది !" అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు.
7
"మన గురించి ప్రధానమంత్రి తమ అమూల్యమైన కాలాన్ని వినియోగించడానికి రావడం మనందరకూ ఎన్నో రకాలుగా లాభిస్తుంది. ఆయన్ని దగ్గర్నుంచి చూసిన ఆనందం, అయన మాటలు దగ్గర్నుంచి వింటూ అయన సందేశాన్ని పొంద గలిగిన అదృష్టం, అయన సమక్షం కలిగించిన ప్రోత్సాహం - ఇలా ఎన్నో వున్నాయి" డైరక్టరు గారు ప్రధానమంత్రిని పొగడుతూ ఉపన్యసించడమయ్యేక ప్రధానమంత్రి లేచారు.
దేశాభ్యున్నతికి తనెలా పాటుపడింది , తన పార్టీ దేశానికి ఎలా సేవ చేస్తున్నది క్లుప్తంగా వివరించి ఈ చిన్న లాబరేటరీ లోని పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాటి ఫలితాలు తననెలా కదిలించినది చెబుతున్నాడాయన.
శేఖరం ప్రధానమంత్రి మాటలు వినడం లేదు. అతను చుట్టూ చూస్తున్నాడు. ప్రదానమంత్ర్రి గురించి చాలా దిట్టమైన ఏర్పాట్లు జరిగాయి. తమ మధ్య కూర్చున్న వారిలో కొందరు సివిల్ డ్రస్ లో వున్న పోలీసు వారు.
శేఖరం తన ప్రక్కనే కూర్చున్న సావిత్రి చేయి గిల్లాడు. ఆమె శరీరం వణికింది. తాము చేయబోయే పని తలచుకుంటే ఆమె హృదయం దడదడలాడింది. బహుశా జీవితంలో ఇవి ఆఖరి క్షణాలయుండవచ్చుననుకుందామే.
శేఖరం మళ్ళీ సావిత్రిచేయి గిల్లాడు. ఇద్దరూ మెరుపు వేగంతో తమ కుర్చీల్లోంచి లేచి డయాస్ మీదకు వెళ్ళారు.
"అసమర్ధులు బ్రతక్కూడదు . ప్రధాన మంత్రిని చంపేస్తాం" అన్నారిద్దరూ ఏక కంఠంతో. వారిద్దరూ ప్రధానమంత్రిని సమీపించకుండానే యిద్దరు సేక్యురిటీ గార్డ్స్ వాళ్ళని పట్టుకున్నారు. శేఖరం, సావిత్రి ఇద్దరూ ప్రధానమంత్రిని యిష్టం వచ్చినట్లు తిడుతున్నారు.
హటాత్తుగా అక్కడ వాతావరణం మారిపోయింది. ఊహించని ఈ పరిణామానికి అంతా తెల్లబోయారు. మీటింగ్ అర్ధాంతరంగా ముగిసింది. శేఖరం, సావిత్రి లను స్పెషల్ కస్టడీ లోకి తీస్కోవడం జరిగింది.
లేబరేటరీ డైరక్టర్ "ఛా -- కొరివితో తల గోక్కున్నట్లయింది. సదభిప్రాయంతో లాబరేటరీ ఉద్యోగి కాకపోయినా ప్రత్యేకంగా ఆహ్వానించాము. ఈ విధంగా మనమూ చిక్కుల్లో పడ్డాం--" అన్నాడు. డిప్యూటీ డైరక్టర్ తో.
క్షణాల మీద పోలీసులు శేఖరం యింటి మీద దాడి చేశారు. అక్కడ వారికీ దొంగనోట్లు, శేఖరం దేశ ద్రోహి అని రుజువు చేసే కాగితాలూ దొరికాయి. ఒక రోజులో ఈ వార్త అన్ని వార్తాపత్రికల్లో ప్రకటించబడింది.
శేఖరం, సావిత్రీల ఫోటోలు వాళ్ళ జీవిత వివరాలు చాలా పేపర్లలో వచ్చేశాయి. ఈ విధంగా దేశం మొత్తం ఈ అనామకుల గురించి తెలుసుకుంది. తన ప్రయోగంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవలసిన శేఖరం ఈ విధంగా అవి సంపాదించాడు.
ప్రస్తుతం శేఖరం, సావిత్రిల మీద రహస్య విచారణ జరుగుతోంది. వాళ్ళెక్కడున్నారో , ఏమి చేస్తున్నారో వివరాలేవ్వరికీ తెలియవు.
8
డాక్టర్ స్వామి అదే లాబరేటరీ లో శేఖరం స్థానంలో ఉద్యోగంలో చేరాడు. అతనింకా బ్రహ్మచారిగానే వున్నాడు. వయస్సు పాతిక దాటి వుండవచ్చు. అతనికి శేఖరం ఉండే ఇల్లు అద్దెకు దొరకడం మరో విశేషం.
ఒకరోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఎవరో ఇంటి తలుపు తట్టగా స్వామి తలుపు తీశాడు. అందమైన అమ్మాయిక్కడుండడం చూసి ఆశ్చర్యపడ్డాడు.
'నా పేరు కరుణ " అందామె.
"నా పేరు స్వామి" అన్నాడు స్వామి.
"మీ గురించి నాకన్నీ తెలుసు" అంది కరుణ , "లోపలకు రావొచ్చా"
"రండి రండి ' అన్నాడు స్వామి కంగారుగా.
కరుణ లోపలకు వచ్చి కూర్చుని తన గురించిన వివరాలు చెప్పి "మావారేప్పుడూ ఇంటి పట్టున వుండరు. ఇదివరకు శేఖరం దంపతులు వుండేవారు. నా కాలక్షేపం రోజల్లా ఆవిడతో జరిగేది" అంది.
'అలాగా" అన్నాడు స్వామి ఏ విధమైన కుతూహలం చూపకుండా.
'నాకు శాస్త్రజ్ఞులన్నా వారి పరిశోదనలన్నా చచ్చేటంతా యిష్టం. అందుకే శేఖరం దంపతులతో స్నేహం చేసేదాన్ని" అంది కరుణ.
స్వామి మాట్లాడలేదు. అతనిది కాస్త రిజర్వుడ్ నేచర్ అని గ్రహించిన కరుణ టాపిక్ మార్చింది.
"బ్రహ్మచారులయినా మీరింటి పట్టునే వున్నారు. పెళ్లై వయసులో వున్న పెళ్ళాముండీ అయన బయట కాలక్షేపం చేస్తున్నారు. చూడండి తేడా" అంది కరుణ.
స్వామి క్షణ కాలం ఆమె కళ్ళలోకి చూసి తలదించుకుని "చూడండి మీరేమీ అనుకోనంటే ఒక విషయం చెబుతాను. సెక్సు నా బలహీనత, ఒంటరిగానే కాదు పదిమందిలో వున్నప్పుడు కూడా ఆడది కనిపిస్తే నేను నిగ్రహించుకోలేను. అందుకే నేను సాధ్యమైనంతవరకూ ఆడవాళ్ళకు దూరంగా -- వాళ్ళను తప్పించుకుంటూ మసలుతాను. స్నేహంగా పలకరించటానికి వచ్చినా ఈ సమయంలో రావడం వల్ల నన్ను గురించి నేను చెప్పుకోవాల్సొంది" అన్నాడు.
కరుణ కళ్ళు మెరిసాయి. "మీరు బలహీనత అనుకుంటున్నది నాకు అవసరం. ఈ సమయంలో మీ ఇంటికి రావడంలో నా ఉద్దేశ్యాన్ని పాటికి గ్రహించే వుండాలి మీరు" అంది.
