Previous Page Next Page 
వసుంధర కధలు -12 పేజి 58

 

    శేఖరం జీవితం జీవితంలా కాక జైలులా తయారయింది. కానీ లాటరీ టికెట్టు అతన్ని లక్షాధికారిని చేసింది. బాగా అలోచించి భార్య భర్తలిద్దరూ ఎన్నో చర్చలు జరిపి చివరకుద్యోగానికి రాజీనామా యివ్వాలని నిశ్చయించుకున్నారు. ఆ నిర్ణయాన్నమల్లో పెడదామని శేఖరం బయల్దేరేసరికి మళ్ళీ మరోమనిషి తయారు.
    శేఖరం నిరభ్యంతరంగా ఆ వ్యక్తిని తనతో రానిచ్చాడు. అన్ని పనులూ సక్రమంగా పూర్తీ చేశాడు. అతని బాస్ ఆశ్చర్యపోయి "ఎందుకీ రాజీనామా? నీకేం కష్టం కలిగింది?" అన్నాడు.
    'అనుకోకుండా డబ్బు వచ్చింది. లైఫ్ ఎంజాయ్ చేద్దామనుకుంటున్నాను" అన్నాడు శేఖరం.
    "నీలాంటి యువకుడు, అందులోనూ మంచి టాలెంట్ ఉన్నవాడు డబ్బు సరదాలకు లొంగిపోయి -- దేశ సేవ మానివేయడం నాకు నచ్చలేదు --" అన్నాడు శేఖరం బాస్.
    "ఏం దేశ సేవలెండి. దేశంలో చాలామంది నిరుద్యోగులున్నారు. ఈ విధంగా మరో యువకుడి కవకశామిచ్చినట్లుంటుంది" అని అక్కణ్ణించి వచ్చేశాడు శేఖరం. అతన్ననుసరించి వచ్చినతను శేఖరాన్ని ఇంటి దగ్గర దిగబెట్టి మరీ వెళ్ళాడు.
    రాజీనామా ఇచ్చేక శేఖరానికి ఉత్సాహంగా లేదు. 'సావిత్రీ పరిశోధన చేయాలన్నది నా ఆసక్తి అది చంపుకున్నాను. డబ్బు బాగానే ఉందిప్పుడు మనకు. కానీ జైలు జీవితంలా మారిపోయింది. మన బ్రతుకు - ఎక్కడి కెళ్ళినా ఎవడో ఒకడు మన వెంట పడుతున్నాడు. వాడి బారి నుంచి తప్పించుకోవడమెలాగో తెలియడం లేదు. ఒక రహస్యం దాచడంకోసం జీవితంలోని అన్ని రహస్యాలూ బయట పెట్టుకు బ్రతకాల్సోచ్చింది.'
    సావిత్రి అతన్ని ఓదార్చి "ఎందుకు బాధపడతారు? మనకు డబ్బుంది హాయిగా జీవిద్దాం. వాళ్ళెవరో ఎన్నాళ్ళు ఓపిక గా మనవెంట పడతారో పరీక్షిద్దాం" అంది.
    "వాళ్ళ ఓపిక కంతుందో లేదో నాకు తెలియదు కానీ నాఓర్పు మాత్రం నశించింది. ఎలాగో అలా వీళ్ళ బారి నుండి తప్పించుకోవాలి" అన్నాడు శేఖరం.
    "ఎందుకండీ వాళ్ళు చెప్పినట్లు ఊరుకుంటే పోయేదానికి అనవసరం రభస చేస్తారు. పాత జీవితం గురించి మరిచిపోయి మామూలు జీవితం గడిపినన్నాళ్ళూ మనకే బాధ లేదు కదా" అంది సావిత్రి.
    శేఖరం వినలేదు. అతనికి చాలా బాధగా ఉంది. కొంతసేపు అలోచించి "ఒక్కటే ఉపాయం తోస్తోంది నాకు. ప్రస్తుతానికి నాకు మతి భ్రమించింధనుకో , సైకాలజిస్టు దగ్గరకు తీసుకువెళ్ళు" అన్నాడు.
    'ఈ విషయంలో మనం ఊరుకుంటేనే ఉత్తమం. అనవసరపు ప్లాన్స్ వేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం నాకిష్టం లేదు" అంది సావిత్రీ. శేఖరం ఏమీ మాట్లాడలేదు.

                                   5
    "కరుణా మీకెవరైనా మంచి సైకాలజిస్టు తెలుసా?" అనడిగింది సావిత్రి.
    "తెలుసు కానీ ఎందుకు?" అనడిగింది కరుణ.
    "అయన ఏమిటో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. నాకెందుకో భయం గా వుంది. మధ్యమధ్యలో తెలివిగానే మసలుతున్నారు. కాని ఉండుండి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మాకు లాటరీలో డబ్బోచ్చిందని నేను బలవంత పెట్టి అయన చేత ఉద్యోగం మానిపించాను. ఉద్యోగం మానడం ఆయనకంత యిష్టం కాని మాట అటుంచి పరిశోధన అయన ప్రాణం. అందువల్ల ఏమైనా మనసు చేదిరిందేమోనని భయంగా వుంది. ఎవరైనా మంచి సైకాలజిస్టు మీకు తెలిసిన వాళ్ళుంటే ....."
    "గోవిందరావని మాకు తెలిసినాయనే ఒకడున్నాడు. ఆయనకేవో ఫారిన్ డిగ్రీలు కూడా ఉన్నాయనుకుంటాను. వెళ్ళి మీ అదృష్టం పరిశీలించుకొండి" అంటూ అడ్రెస్ చెప్పి తన సానుభూతి కూడా ప్రకటించింది కరుణ.
    కరుణ యిచ్చిన అడ్రస్ తీసుకుని భర్త దగ్గర కెళ్ళింది సావిత్రి.
    "జాగ్రత్త కోటు సరిగ్గా వేసుకున్నావా బోత్తాలన్నీ పెట్టుకున్నావా అసలే రేడియేషన్ ఎక్స్ ఫర్ మెంట్స్" అన్నాడు శేఖరం.
    "సరేనండి నటన బాగానే వుంది కాని మనమింకా సైకలాజిస్టు దాకా వెళ్ళలేదు. ఇంట్లో నే వున్నాం" అంది సావిత్రి.
    "కొన్ని కొన్ని సమయాల్లో కాస్త ముందుగానే మొదలు పెడుతుండాలి సావిత్రీ ' అన్నాడు శేఖరం. 'అప్పుడే నీ ముఖంలో కూడా కాస్త ఆదుర్దాలూ అవీ కనపడతాయి"
    శేఖరం నటన ప్రారంభమైంది. సావిత్రి అతన్ని మంచి మాటలాడుతున్నట్లు నటిస్తూ బయటకు తీసుకు వచ్చి ఇంటి తలుపు వేసింది. వాళ్ళిద్దరూ రోడ్డు మీదకు వచ్చి నాలుగడుగులు వేశారో లేదో ఒక టాక్సీ వాళ్ళ పక్కగా పోతూ ఆగింది. సావిత్రీ రెండడుగులు ముందుకు వేసి గోవిందరావు అడ్రస్సు కాగితం అతనికి చూపించింది. టాక్సీ వాలా తలూపి "ఎక్కండి" అన్నాడు.
    సావిత్రి, శేఖరం ఇద్దరూ టాక్సీ వెనక సీట్లో ఎక్కారు. టాక్సీ శరవేగంతో బయల్దేరింది. ఒక పది నిమిషాలు గడిచేక టాక్సీ సరైన తోవలో వెళ్ళడం లేదని సావిత్రికి అనుమానం వచ్చింది. తన అనుమానాన్ని గట్టిగానే బయటపెట్టిందామె.
    "కంగారేం లేదమ్మా, ఆ గోవిందరావు గారు నాకు బాగా తెలుసు. ఆయనిప్పుడు ఇల్లు మారారు. వారింటికే మనం వెడుతున్నాం" అన్నాడు టాక్సీ వాలా తాపీగా.
    శేఖరం తాత్కాలికంగా నటన మానేశాడు. సావిత్రి , అతనూ కలిసి భయం భయంగా ఏవో గుసగుస లాడుకున్నారు. మరో అయిదు నిమిషాల్లో టాక్సీ ఒక ఇంటి ముందాగింది. "ఇదేనమ్మా గోవిందరావు గారిల్లు" అన్నాడు తాక్సీవాలా.
    ముందుగా సావిత్రి, తర్వాత శేఖరం టాక్సీ దిగారు. సావిత్రీ టాక్షీ ఫేర్ చెల్లించింది. సావిత్రి తర్వాత ఇంటి వైపు నడిచి తలుపు తట్టింది.
    సుమారు రెండు నిమిషాలకు తలుపు తెరుచుకుంది. ఒక ముసలాయన బయటకు తొంగి చూసి "ఇది సైకాలజిస్టు గోవిందరావు ఇల్లు. ఇల్లు మారేక ఇంకా నేమ్ ప్లేటు బయట పెట్టలేదు. మీరు వచ్చింది అయన కోసమే అయితే లోపలకు రావచ్చు" అన్నాడు.
    సావిత్రి, శేఖరం లోపల ప్రవేశించేక ఆయనే సైకాలజిస్టు గోవిందరావు అని అర్ధం చేసుకున్నారు.
    "పిచ్చి ఎవరికి?" అన్నాడు గోవిందరావు ఇద్దర్నీ పరిశీలించి చూస్తూ.
    "మా ఆవిడకండి" అన్నాడు శేఖరం తాపీగా . సావిత్రి కలగజేసుకుని తను కరుణకు చెప్పిన తను కరుణకు చెప్పిన విధంగానే గోవిందరావుకి చెప్పింది. గోవిందరావు సాలోచనగా తల పంకించి "నువ్వేం చెబుతావ్?" అన్నాడు శేఖరాన్ని పరీక్షించి చూస్తూ.
    శేఖరం వెకిలిగా నవ్వాడు.
    'సరేలే -- నువ్వింకేం చెప్పక్కర్లేదులే" అన్నాడు. గోవిందరావు అర్ధమైనట్లు. తర్వాత అయన సావిత్రి వైపు చూసి, "ఇలాంటి కేసులు నాకొకటి రెండు ఇదివరలో కూడా వచ్చాయి. ఇది కుదర్చడానికో సులభమైన పద్దతి ఉంది" అంటూ లోపలకు వెళ్ళి ఒక ఫోటో ఆల్బం తీసుకువచ్చాడు.
    "చూడు బాబూ! నీ పేరు శేఖరం అన్నావు కదూ! నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు . ఉద్యోగం మానేసి హాయిగా ఇంట్లో కూర్చోవడం వల్ల ఎన్నో సుఖాలున్నాయి. ఈ ఆల్బం చూడు, ఆఫీసుకు వెళ్ళే మగవాళ్ళ ఇళ్ళలో ఒంటరిగా ఉండే ఆడవాళ్ళ ఇబ్బందులు నీకు తెలుస్తాయి" అంటూ అయన శేఖరానికి అల్భం అందించాడు.
    శేఖరం అల్భం అందుకుని చూసి ఉలిక్కిపడ్డాడు. అందులో ఒక మానభంగం కేసుకు సంబంధించిన ఫోటోలు క్లోజప్ లో ఉన్నాయి. ఫోటోలో ఆమె ఎవరో అతనికి తెలియలేదు. కానీ అత్యాచారం మాత్రం దారుణంగా ఫోటోలో కి వచ్చింది.
    శేఖరం తలెత్తి గోవిందరావు వంక చూశాడు. గోవిందరావు కళ్ళలోంచి నిప్పులు కురుస్తున్నాయి. బాగా పరీక్షిస్తే ఆ కళ్ళు తనకు పరిచయమైనవేననీ రవీంద్ర కాలనీలో తనను బెదిరించి లాటరీ టికెట్ ఇచ్చిన వ్యక్తీ అతనేనని గ్రహించాడు శేఖరం.
    "మిస్టర్ శేఖరం! ఇది నీకు లాస్టు వార్నింగ్. ఈ ఫోటోలో ఆమె ఎవరో తెలుసా? నా లాస్ట్ వార్నింగు లక్ష్యపెట్టని ఒక తెలివి తక్కువ వాడి భార్య. నీ భార్య క్కూడా అదే గతి పట్టించకు...." అన్నాడు గోవిందరావు తీవ్రంగా.
    శేఖరం తల తిరిగిపోయి "ఏమిటి మీరనేది?" అన్నాడు.
    సావిత్రి మారు మాట్లాడకుండా "రండి పోదాం" అంది.
    ఇంటికి వెళ్ళేదాకా ఇద్దరూ మౌనంగా ఉన్నారు. ఇంటికి వెళ్ళేదాకా "వీడెవడో దివ్యదృష్టి ఉన్నవాడిలా వున్నాడు" అంది సావిత్రి.
    "ఏ దివ్యదృష్టి లేదు. మీ కరుణకీ ముఠాతో సంబంధ ముంది" అన్నాడు శేఖరం నమ్మకంగా.
    "ఎందుకలాగనుకుంటున్నారు? గోవిందరావు అడ్రసు ఆవిడే యిచ్చింది. కానీ మానని మోసం చేసింది. టాక్సీ వాడేమో? వాడే కదా తనకు తెలుసునని చెప్పి మరీ ఆ యింటికి తీసుకువెళ్ళాడు!" అంది సావిత్రి.
    "అది సరే ఆ టాక్సీ వాడికి ముందుగానే మనం గోవిందరావు దగ్గరికి వేడుతున్నామని తెలుసుండాలి. అవతల నకిలీ గోవిందరావు కూడా మనకోసం సిద్దంగా వున్నాడు. వీళ్ళిద్దరికీ ఎవరో సమాచారమందించి వుండాలి. మనం యిలా బయల్దేరుతున్న సంగతి తెలిసిన ఏకైక వ్యక్తీ కరుణ!" అన్నాడు శేఖరం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS