Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 58


    నాన్న ఇంటినతడిదగ్గరే తాకట్టుపెడతాడు.
    నేను ముత్యాల్రావు దగ్గరకు వెళ్ళాను.
    "మీ ఇల్లు లక్షరూపాయలు చేసేమాట నిజమే-కానీ దానిమీద అప్పుగా నలభై వేలకు మించి ఎవరూ ఇవ్వరు. అప్పు తీర్చకపోతే వడ్డీ చాలా త్వరగా పెరుగుతుంది. అప్పు, వడ్డీ కలిసి - లక్షరూపాయలు కావడానికి ఎంతో కాలం పట్టదు" అన్నాడు ముత్యాల్రావు.
    "నలభై వేలు" - అన్నమాట అమృతోపమానంగా తోచింది నాకు.
    "అదిచాలు-ఇంకో ఇరవైవేలు అప్పుకావాలి-ఇవ్వగలరా!" అన్నాను.
    ముత్యాల్రావు నవ్వి "గతంలో మీ నాన్న చేసిన అప్పు వడ్డీతో కలిపి ఇరవై వేలుంది. ఇప్పటి ఇరవైతో కలిసి నలభై అయింది" అన్నాడు.
    నా గుండె ఆగినట్లయింది.
    నాన్నకు నలభై వేలు అప్పు..... .....
    ఎలా తీరుస్తాడాయన?
    జీతం చేతికివచ్చేది నెలకు వెయ్యిరూపాయలు.
    అమ, నేను, తమ్ముడు, చెల్లాయి.....
    అప్పుడప్పు డింటికి వచ్చే అక్క, బావ.....
    పల్లెటూళ్ళో మాకు కాస్త పొలముంది ఏటా ఓ పాతిక బస్తాల ధాన్యం, వెయ్యి రూపాయలూ ఇస్తాడు రైతు.
    నాన్న పొలం అమ్మాలనుకోడు. కానీ పొలం అమ్మితే వచ్చే డబ్బుతో అప్పులు తీర్చగలనన్న ధైర్యమే ఆయన చేత అప్పులు చేయిస్తోంది.
    ఏదో ఒకరోజున పొలం అమ్మక తప్పదు.
    ముత్యాల్రావు నవ్వుతున్నాడు.
    నన్ను చూసి అనుకున్నాను. కాదు.....
    అప్పుడే ఓ కొత్త కస్టమర్ వచ్చాడు.
    ఆయన పంచె, లాల్చీ ధరించాడు. ముసలాయన గోల్డ్ ఫ్రేం కళ్ళద్దాలు.
    అయితే మధ్యతరగతి మనిషవడంలో సందేహంలేదు. ఆయన చేతిలో ఓ లెదర్బ్యాగుంది.
    "బంగారం ధర ఎంతలో ఉంది?" అన్నాడాయన.
    చెప్పాడు ముత్యాల్రావు.
    "పలకసర్లున్నాయి-పది తులాలకు పైగా ఉండవచ్చు...."
    "తాకట్టా?"
    "కాదు అమ్మకానికి...."
    ముత్యాల్రావు కళ్ళు మెరిశాయి.
    నేనింకా అక్కడే ఉన్నాను.
    ముసలాయన లెదర్ బ్యాగ్ లోంచీ తీశాడు పలకసరులు.
    ముత్యాల్రావది అందుకున్నాడు. గీటురాయితో పరీక్షించాడు.
    "బంగారం మంచిదే!" అన్నాడు.
    తర్వాత తూకంవేసి - "పదిహేను వేలిస్తాను...." అన్నాడు.
    ఆయన వెంటనే - "చాలా అన్యాయం - పాతికవేలుకు తక్కువరాదు" అన్నాడు.
    "అవుననుకోండి-కానీ ఇందులో బాగా మట్టి చేరుకుంది. శుభ్రంచేసి కరిగించుకోవాలి. చాలా పోతుంది.." అన్నాడు ముత్యాల్రావు.
    ముసలాయన పలకసర్లు వెనక్కు తీసుకున్నాడు.
    "పదహారువేలిస్తాను" అన్నాడు ముత్యాల్రావు.
    ముసలాయన ఒప్పుకోలేదు. బేరం ఇరవైవేలకు సెటిలయింది.
    ఇరవై వేలనగానే నాలో సంచలనం కలిగింది.
    సరిగ్గా నా క్కావలసిన మొత్తం అది.
    అప్పుడే నాకంటబడడం ఇది రెండోసారి.
    భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు.
    నాలో ఆశలు రేపుతున్నాడు.
    నాలో అలజడి కలిగిస్తున్నాడు.
    ఆ యిరవై వేలూ నా స్వంతం చేసుకోగలిగితే....
    ఫ్యాన్సీ షాపులో నాకూ వాటా లభిస్తుంది.
    ఉద్యోగం గురించి తడుముకోనవసరంలేదు.
    నాన్న అప్పులన్నీ తీరిపోతాయి.
    ఇరవై వేలు...
    నాలో ఇప్పుడు మంచి, చెడు-విచక్షణ ఉండరాదు.
    నేను మనిషిగా బ్రతకడంకోసం తాత్కాలికంగా దొంగను కావాలి.
    వెంటనే ముత్యాల్రావు దగ్గర సెలవు తీసుకున్నాను. కానీ దుకాణం దగ్గర్లో నే కాశాను. ముసలాయన బయట కెప్పుడు వస్తాడా అని చూస్తున్నాను.
    కాసేపటికాయన బయటకు వచ్చాడు.
    ఆయన లెదర్ బ్యాగును ప్రాణం కన్న భద్రంగా గుండెకు హత్తుకున్నాడు. బయటకు వచ్చినా రిక్షాకూడా ఎక్కలేదు.
    ఆయన నడుస్తున్నాడు.
    కాస్త దూరంలో నేనాయన్ననుసరిస్తున్నాను.
    అదృష్టం కొద్దీ నాకు తెలిసిన దారిలోనే వెడుతున్నాడాయన.
    నా మనసు పరిపరివిధాల పోతోంది.
    నేను దొంగను కాబోతున్నాను.
    వ్యాపారంలో దిగడానికి నేను దొంగతనం చేయబోతున్నాను.
    వ్యాపారస్థులందరూ దొంగలేనని నా స్నేహితులంటారు. కానీ వ్యాపారస్థులు ఘరానాదొంగలు. వారు చెప్పి మరీ దోపిడీ చేస్తారు. ఇష్టమైతేనే దోపిడీకి గురికమ్మంటారు వారు. ఇష్టపడీ దోపిడీకి గురవుతాం మనం.
    ఇప్పుడు నేను పట్టుబడితే....?
    నాన్న అవమానంతో కుమిలిపోతాడు.
    అమ్మ ఏడుస్తుంది.
    నా చెల్లి, తమ్ముడు.....దొంగకు బంధువులవుతారు.
    నన్నందరూ దొంగ అంటారు.
    అయితే అ క్షణంలో నేను పట్టుబడతానన్న భయం తప్ప-తప్పుచేస్తున్నానన్న భావంలేదు.
    అందువల్ల నా మనసు నన్ను భయపెడుతూనే పట్టుబడకుండా వుండే ఉపాయాల నన్వేషిస్తోంది.
    ముసల్య్న ఓ ఇరుకుసందులోకి తిరిగాడు.
    అది నిజంగా నా అదృష్టం.
    ఆ సందులో జనసంచారమట్టే ఉండదు.
    ఆయనకు వెనుకగా నేనుతప్ప ఎవ్వరూలేరు.
    నన్నాయన పట్టించుకోకుండా అంతవరకూ జాగ్రత్త పడ్డాను.
    అయనకూడా వెనక్కు తిరిగి చూడడంలేదు. తన సొత్తు చేతిలోంచి జారిపోతుందన్న భయం తప్ప-దొంగతనానికి గురవుతుందని ఆయన భావిస్తున్నట్లు లేదు.
    ఒక్కసారి నా మనసులో ఎన్నో భావాలు కదిలాయి.
    ఇరవై వేలు.....
    నిజానికవి నా యింట్లోనే ఉన్నాయి. కావాలంటే అతి సులభంగా నేనవి తీసుకోగలను. కానీ తీసుకోలేదు.
    అందువల్ల చెల్లికాపురం చెడిపోతుందని నా భయం.....పాపం ఈ ముసలాయనకు డబ్బెందుకు అవసరపడిందో?
    కూతురుకు కట్నమివ్వాలేమో....!
    నేనెక్కువ ఆలోచించదల్చుకోలేదు. ఆలోచిస్తే నా మనసు బలహీనమవుతుంది. నాలోని దొంగ పారిపోతాడు.
    ఆ ఇరుకుసందు చాలా చిన్నది.
    నేను నడకలో వేగం పెంచాను.
    ఒక్క ఉదుటున సందులో ప్రవేశించాను.
    వెనకా, ముందూ-ఎవ్వరూ నన్ను చూడ్డంలేదు.
    సంధు మద్యలో ముసలాయన్నందుకున్నాను.
    అప్పుడా సందులో ఎవ్వరూలేరు.
    అదృష్టదేవత నన్ను పూర్తిగా కరుణించింది.
    సమయానికి అన్నీ కలిసిరావడమంటే యిదే!
    నేను ముసలాయన డబ్బు పట్టుకున్నాను.
    ఆయన ఉలిక్కిపడి వెనక్కు తిరిగాడు.
    అప్పటికే ఆయన నన్నుచూసి గుర్తుపట్టకుండా రుమాలును ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాను.
    ఆయన తెల్లబోయాడు.
    ఏదో అనబోయాడు కానీ మాటరాలేదనుకుంటాను.
    ఆయన్నో తోపు తోశాను.
    పడిపోయాడు నేలమీద.
    నేను పరుగెత్తాను.
    అక్కడ దారి నాకు బాగా తెలుసు.
    మొత్తం నాలుగుసందులు తిరిగాను.
    మొదటి సంధు తిరుగుతూండగానే-దొంగ-అన్న కేక వినిపించింది. అదా ముసలాయనదే....
    నేను తిరిగిన నాలుగు సందుల్లోనూ నాకు జనసంచారం ఎదురుకాలేదు.
    తర్వాత పరుగు మానేశాను. నెమ్మదిగా నడవడం ప్రారంభించాను.
    నా గుండె లెగిసిపడుతున్నాయి.
    మనసు బెదిరిపోతోంది.
    మరో సందులోకి మళ్ళాను. చుట్టూ చూశాను.
    జనసంచారముండే సందులు కావవి.
    ముసలాయన ఆ దారి ఎన్నుకోవడం నా అదృష్టం.
    లెదర్ బ్యాగు తెరిచాను. అందులోని నోట్లకట్టలు తీసి జేబుల్లో కుక్కుకున్నాను. లెదర్ బ్యాగుని ఓ పక్కగా విసిరేశాను.
    అప్పుడు నా మనసు కాస్త తేలికపడింది.
    నన్నిక ఎవరూ అనుమానించలేరు.

                                     3

    ఆశ్చర్యపోయాడు శంకరం.
    "నువ్వు నా వాటాదారువయితే నాకు చాలా సంతోషం. కానీ అబద్ధ మెందుకూ-నువ్వు డబ్బు తేగలవని నేననుకోలేదు...." అన్నాడు శంకరం.
    నేను నవ్వాను.
    "ఎక్కడిదిరా నీ కింత డబ్బు?" అన్నాడు శంకరం మళ్ళీ.
    "ఎవరికీ చెప్పనని మాటిస్తే చెబుతాను...." అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS