శేఖరాన్ని పలకరించిన తను అట ఆపేసి "ఫ్రెండ్స్ ఈవేళ కి అట లేదు. మీరు వెళ్ళవచ్చు" అన్నాడు అతను. అందరికీ తలో వంద రూపాయలు ఇచ్చాడు. పచ్చ రుమాలు వ్యక్తికీ కూడా వంద రూపాయలు అందింది. అందరూ బయటకు వెళ్ళిపోయారు. శేఖరమూ, అతనూ ఇద్దరే మిగిలారు. అతను గుమ్మం దాకా వెళ్ళి తలుపులు వేసి వచ్చి "నన్ను మీ శ్రేయోభిలాషి గా గుర్తుంచుకోండి" అన్నాడు.
'అలాగే కానీ మీరెవరో నన్నెందుకు పిలిపించారో నా భార్య ఏమయిందో తెలుసుకోగోరుతున్నాను--" అన్నాడు శేఖరం.
"నేనెవరో మీకు చెప్పనవసరం లేదు. తెలుసుకుందుక్కూడా ప్రయత్నించకండి. ఈ ఇంటి వారు ఈ వీధి గదిని సుందరం అనే కుర్రాడికి అద్దె కిచ్చారు. నెలకి యాభై రూపాయలు అద్దె యిస్తున్నాడతను. ఒక్క రోజుకు వందరూపాయలు అద్దె యిచ్చాను నేను. ఈరోజుకిది నాస్వంతమయింది. ఇందాకా నా దగ్గరున్న వారెవ్వరూ నాకు పరిచయస్థులు కారు. వందరూపాయలు చొప్పున యిచ్చి తాత్కాలికంగా వారి వారి పరిచయాన్నికొనుక్కున్నాను. . నేనసలు ఈ ఊరి వాడ్ని కాదు.-ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఉనికి యితరులకు తెలియకుండా నేను చాలా జాగ్రత్తపడుతున్నానని మీకు తెలియడం కోసం" అని అగేడతను. "ఇది మీ మొదటి సందేహానికి జవాబు -- మీ మూడవ సందేహం మీ భార్య గురించి. ఆమె చాలా క్షేమంగా వుంది. ఏమీ దిగులు పడనవసరం లేదు. మీరామె గురించి -- ఇకపోతే మీ రెండవ సందేహం ...." అని అగడతను.
శేఖరం అతని వంకే పరీక్షగా చూస్తున్నాడు. బాగా పరీక్షగా చూస్తె అతను మేకప్ లో వున్నాడని అనుమానంగా ఉంది. అతనేవరై ఉంటాడా -- ఏం చెప్పదల్చుకుని వుంటాడా అని శేఖరం ఆలోచిస్తున్నాడు.
"మీకో సామెత తెలుసుననుకుంటాను. ఊరుకున్నంత ఉత్తమం లేదు-- బోడిగుండంత సుఖం లేదు ....అని. అది మీపట్ల నిజం కాబోతుంది. వాతావరణం లో మార్పులు తేగల ప్రయోగాలు చేయడం మీరు మానేయాలి. ఇంత వరకూ చేసిన ప్రయోగాల సంగతి కూడా ఎవరికీ చెప్పకూడదు...." అన్నాడతను.
శేఖరం ఆశ్చర్యంగా అతని వంక చూసి "ఈ ప్రయోగామింకా నిన్ననే చేశాను. అప్పుడే మీదాకా ఎలాగ వచ్చింది?" అన్నాడు.
"దాన్ని బట్టయినా నా సామర్ధ్యం అర్ధం చేసుకోవాలి . నాక్కావలసిన సమాచారం క్షణాల మీద తెలుసుకోగలను."
"బాగానే ఉందికాని, ఈ ప్రయోగాలు నేను మానేయడమెందుకూ? దీనివల్ల పదిమందికి కూడు దొరుకుతుంది దేశం సుభిక్షమవుతుంది " శేఖరం ఏదో అనబోతుండగా అతను ఆపి --
"ఎందుకు అన్న ప్రశ్న నేను సహించను. నా అజ్ఞా కు ఎదురుండకూడదు. చెప్పినట్లు వింటే అందుకు మంచి ప్రతిఫలం కూడా వుంటుంది" అన్నాడతను.
"వినకపోతే ...."
"ముందుగా సావిత్రి మరణిస్తుంది. అది మామూలు చావు కాదు. అమానుషంగా చేరచబడి -- హత్య చేయబడుతుంది" అతడు చాలా తాపీగా అన్నాడు కానీ శేఖరం మాత్రం వణికిపోయాడు. ఇంతవరకూ లేని కొత్త భయం అతనిలో ప్రవేశించగా 'అయితే యిప్పుడు నేనేం చేయాలి?" అన్నాడు.
అతను శేఖరాన్ని చూసి నవ్వి "వయసులో వున్న యువకులు మీరు. అందమైన భార్యను పొందగలిగిన అదృష్ట వంతులు, హాయిగా జీవిత మాధుర్యం చవిచూడక ఎందుకు పరిశోధనలతో సమయాన్ని వృధా చేసుకుంటారు? వెంటనే ఉద్యోగానికి రాజీనామా యివ్వండి. మీ పరిశోధనల గురించీ సైంటిస్టు జీవితం గురించి మర్చిపోండి. ప్రతిఫలంగా మానుంచి ఐదు లక్షల రూపాయలు పొందండి" అన్నాడు.
అతను చెప్పేదంతా అర్ధం చేసుకునేందుకు శేఖరానికి కాస్త టైం పట్టింది. అర్ధమయ్యాక "మీరు చెప్పిందే వింటాను కానీ నేను సామాన్యుడిని. హటాత్తుగా ఐదు లక్షల రూపాయలు నా దగ్గర చేరితే అంతా అనుమానిస్తారు గదా" అన్నాడు.
అతను నవ్వి "నేను మీ శ్రేయోభిలాషిని. మీకే యిబ్బంది రానివ్వను. బహుమతి పొందిన లాటరీ టికెట్ మా దగ్గర సిద్దంగా వుంది. అది మీకిస్తాను. అది మార్చుకుని డబ్బు తెచ్చుకున్నాకనే మీరు ఉద్యోగానికి రాజీనామా ఈయవచ్చును. బహుమతి మొత్తం ఎనిమిది లక్షలు, టాక్స్ పోగా ఐదు లక్షలు పైగానే వస్తుంది" అంటూ జేబులోంచి ఓ కాగితం తీసి అతనిచ్చాడు. అది లాటరీ టికెట్టని శేఖరం గుర్తించాడు.
"ఇక మీరు వెళ్ళవచ్చు. ఇదిగో మీ ఇంటి తాళం దీనితో తలుపు తెరుచుకుని ఏ సంకోచమూ లేకుండా ప్రవేశించండి. మీ భార్య క్షేమంగా వున్నట్లు కొద్ది సేపట్లోనే తెలుసుకోగలరు" ఇంటి తాళాన్నందుకున్నాడు శేఖరం. అతని మాటలకు జవాబివ్వకుండా అది జేబులో వేసుకుని అక్కణ్ణించి కదిలాడు.
"వెళ్ళేముందో విషయాన్ని గుర్తుంచుకోండి. నన్ను మళ్ళీ కలుసుకోవటం మీకు సాధ్యం కాదు. ఇక్కడికి వచ్చి మాత్రం ప్రయత్నించి భంగపడకండి. నేను చెప్పినవన్నీ గుర్తుంచుకుని చెప్పినట్లు చేయండి. పొరపాటున కూడా మీరు చేసిన ప్రయోగ రహస్యం ఎవరికీ చెప్పడానికి ప్రయత్నించకండి. ఆ విషయంలో పూర్తిగా మౌనం వహించకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. మిమ్మల్ని మామనుషులు వెయ్యి కళ్ళతో కనిపెడుతుంటారని గుర్తుంచుకోండి" అన్నాడు అతడు.
శేఖరం అక్కణ్ణించి కదిలి బస్ స్టాప్ కి వచ్చి బస్సెక్కి తన ప్రాంతం చేరాడు. అతను వెళ్ళేసరికి కింకా వీధి తలుపు తాళం వేసే వుంది. నిరుత్సాహంగా నిట్టూర్చి తలుపు తాళం తీసి లోపల ప్రవెశించాడతను. జరిగినదంతా నిజమే నని అతనింకా నమ్మలేకపోతున్నాడు.
లైటు వేసి వీధి తలుపులు వేశాడు. అతనికి నీరసంగా వుంది. సావిత్రి ఏమయిందో ఎప్పుడొస్తుందో అనుకుంటూ పడకగదిలోకి వెళ్ళాడు. అక్కడ గదిలో మంచం మీద పడుకుని వున్న సావిత్రిని చూసి అతనాశ్చర్యపోయాడు. ఆమెకు కాళ్ళూ, చేతులు కట్టాబడి వున్నాయి. నోట్లో గుడ్డలు కుక్కబడ్డాయి.
శేఖరం వెంటనే ఆమెకు కట్లువిప్పి నోట్లో గుడ్డలు తీసేసి జరిగినదామె నోట విని తెలుసుకున్నాడు.
మధ్యాహ్నం ఎవరో వచ్చి ఇంటి తలుపులు తట్టారుట. తను తలుపులు తీయగానే లోపలకు ప్రవేశించి ఒక కవరు నామెకిచ్చి దొడ్డి తలుపు దగ్గరగా వేసి వుంచి బయటకు రమ్మన్నాడట. ఇంటి తాళం సావిత్రే స్వయంగా వేసిందట. కవరు కరుణకు ఆమె ఇచ్చి వచ్చిందట. ఆ తర్వాత యిద్దరూ కలిసి ఒక సందు తిరిగి మళ్ళీ దొడ్డి దారిన ఇంట్లో ప్రవెశించారుట. వాడు సావిత్రినిలా బంధించి వెళ్ళిపోయాడట. చెప్పినట్లు వినకపోతే శేఖరం ప్రాణాలకు ప్రమాదమని వాడు బాగా నొక్కి చెప్పడం వల్ల సావిత్రి వాడు చెప్పినట్లు విన్నదట.
శేఖరం సావిత్రిని ఓదార్చి తనకు జరిగినది కూడా చెప్పి "సావిత్రీ నా పరిశోధనలకు సంబంధించిన వార్త నీమూలంగానే బయటకు వెళ్ళి వుండాలి. నువ్వు గాని ఎవరికైనా చేప్పేవా" అనడిగేడు.
"నేను కరుణకు మాత్రం చెప్పాను. కానీ మీరా ప్రయోగాలు చేస్తున్నప్పుడింకెవరూ మీ దగ్గర లేరా?" అంది సావిత్రి.
"అదీ నిజమే-- కానీ వాళ్ళు బొత్తిగా అటెండెంట్స్ , నా ప్రయోగాలనర్దం చేసుకునే తెలివి తేటలున్నాయని అనుకోను" అన్నాడు శేఖరం.
"మీ ప్రయోగాలంటే కరుణకి బాగా ఆసక్తి వుంది. నిన్న మీరు మొదలు పెట్టబోతున్న ప్రయోగ ఫలితం తెలుసుకునేందుకీ రోజు ఉదయం మీరు వెళ్ళగానే వచ్చేసింది" అంది సావిత్రి.
శేఖరం సాలోచనగా "కరుణ ఎలాంటి మనిషి?" అన్నాడు.
"చాలా సరదా మనిషి. మంచి మనిషి ...." అంది సావిత్రి.
4
"ఎవరు మీరు!" అన్నాడు శేఖరం.
"నేనెవరైతే మీకెందుకు లెండి -- మీకిప్పుడుద్యోగం రాజీనామా చేయడానికి కదా వెడుతుంట. ఆ సమయంలో మీరు ఆఫీసులో ఇంకే విధమైన విషయాలూ చెప్పలేదని దృవపరచుకోడానికి మీకూడా వస్తున్నాను. మీరు మాట తప్పిన మరుక్షణం ఇంటి వద్ద మీ భార్య .....' అతను ఆగి "మీకు తెలిసినదే కదా!" నన్నేమైనా చేయడానికి ప్రయత్నిస్తే -- నా గురించి ఏమీ తెలుసుకోలేరు కానీ మీ జీవితాన్ని నాశనం చేసుకున్నవారవుతారు" అన్నాడు.
శేఖరం ఆశ్చర్యపోయాడు, ఏదో ముఠా తన వెంట పడింది. అనుక్షణం తనను వెన్నాడుతోంది. తన ప్రతి చర్యను కూలంకుషంగా పరిశీలిస్తోంది.
రవీంద్రకాలనీ నుంచి తిరిగి వచ్చేక తను సెలవు పెట్టాలనుకుని మర్నాడాఫీసు దగ్గర్లో నున్న టెలిఫోన్ బూత్ దగ్గరకు వెడితే అక్కడ ఒకతను పలకరించి తను ఫోన్ చేయనవసరం లేదనీ అతనే ఫోన్ చేసి విషయం చేబుతననీ అన్నాడు. ఆతర్వాత సావిత్రి పుట్టింటికి ఉత్తరం రాస్తే అది తను పోస్టు చేయబోగా ఒకతను వచ్చి అందులో యితర విషయాలేమీ లేవని దృవపర్చుకున్నాకనే అది పోస్టయింది.
తన యింటికి ఏ సమయంలో ఎరిగున్న వాళ్ళోచ్చినా ఏదో వంకతో ఒక అపరిచిత వ్యక్తీ తన యింట్లోకి ప్రవేశిస్తున్నాడు. అతన్ని తను వారించలేడు.
