ఉష్ణం ఉష్ణేన శీతలం
ఉద్యోగం లేదు నాకు.
రోజంతా కాళ్ళరిగేలా ఊరంతా తిరిగి రాత్రి కిలలు చేరుకుంటాను.
బియ్యే ప్యాసయ్యాను. అప్లికేషన్సు పెడుతున్నాను వచ్చిన ఇంటర్వ్యూలకు వెడుతున్నాను. రాని ఆర్డరు కోసం ఎదురుచూస్తున్నాను.
నన్ను నిస్పృహ అవరిస్తోంది.
పరిస్థితులు నన్ను చెడిపో చెడిపో అంటున్నాయి.
చెడిపోతే బ్రతకడం కొంత సులువవుతుంది.
కానీ నేను చదివిన చదువు నన్ను చెడిపోవడానికి క్కూడా పనికిరాకుండా చేసింది.
ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు.....
చెల్లి, తమ్ముడు ఇంకా చదువుకుతున్నారు. అందుచేత వాళ్ళు కలలు కంటున్నారు.
నా పెద్ధచెల్లికి పెళ్ళయింది. దానికి ఇరవై వేలు కట్నం డబ్బు బాకీ ఉన్నాడు నాన్న. అదెలా యివ్వాలీ అన్న సమస్యతో నాన్న సతమతమవుతున్నాడు.
నా పెళ్ళిచేసి ఆ కట్నం డబ్బుతో బాకీ తీర్చాలని అమ్మ ఆశ.
నాకు ఆదర్శాలు లేవు. నన్నీలోకంలోకి తెచ్చిన అమ్మ నాన్నలకోసం ఎవరికైనా అమ్ముడు పోడానికి సిద్దంగా ఉన్నాను.
పిల్ల హంసలా ఉండక్కర్లేదు. గేదెలాఉన్నా ఫరవాలేదు.
కానీ-ఆఫ్టరాల్ బియ్యేనైన నన్ను-ఉద్యోగంకోసం నడిబజార్లో అరిగిపోయిన చెప్పులతో తిరిగే నన్ను- ఇరవై వేలుపోసి ఏ ఆడపిల్ల కొనుక్కుంటుంది?
రోజూ నేనింటికి రాగానే అమ్మ ఆశగా ఎదురు చూస్తుంది-ఎక్కడైనా నాకు చిన్న ఉద్యోగమైనా దొరికిందేమోనని.
నేనూ ఆశగా చూస్తాను-ఏదైనా పెళ్ళిసంబంధం వచ్చిందేమోనని.
నా అంతట నేనుగా ఉద్యోగం సంపాదించుకోగల నన్న ధైర్యం నాలో నశించిపోయిందిప్పుడు.
నేను బాగానే ఉంటాను. బుద్దిమంతున్ని.
నాలుగు డబ్బులున్న ఏమహారాజైనా నన్నుచూసి ముచ్చటపడి బోలెడు కట్నమిచ్చి నాకు తన కూతుర్నీ, ఓ మంచి ఉద్యోగాన్నీ ఇవ్వకపోతాడా అన్న ఆశ మనసులో ఉంది. పై కెవరికీ చెప్పుకోలేని ఆశ అది.
రోజూలాగే ఆరోజూ రోడ్లమీద తిరుగుతూంటే శంకరం కనిపించదు.
వాడు నా చిన్ననాటి స్నేహితుడు. తనూ బియ్యే ప్యాసై నాకులాగే రోడ్లుపట్టి తిరుగుతున్నాడు. ఎటొచ్చీ వాడి ఆర్ధిక పరిస్థితి నాకంటే కాస్త మెరుగు.
నేను శంకరాన్ని చూసి నవ్వాను.
వాడూ నవ్వాడు.
ఆ నవ్వు ఎప్పటికిలా లేదు.
చాలా ఉత్సాహంగా ఉన్నాడు.
"ఏంటి కథ?" అన్నాను.
"ఇక ఉద్యోగం గురించి అన్వేషించను. గట్టి నిర్ణయమే తీసుకున్నాను. ఫ్యాన్సీ షాపు పెట్టాలనుకుంటున్నాను. నాన్న ఇరవై వెలిస్తానన్నాడు. ఇంకో ఇరవై వేలు కావాలి....."
"బ్యాంకు లోన్ తీస్తావా?"
"అబ్బే నాకు బ్యాంక్ లోన్ దొరకలేదు. నాన్నిచ్చేది అయిదువేలే-పదిహేనువే లాయన బ్యాంకు లోన్ తీస్తున్నాడు...."
"అయితే ఏం చేస్తున్నావు?"
"మంచి స్నేహితుడినిపట్టి౦-వాడిదగ్గర అప్పుతీసుకుందామనుకుంటున్నాను ప్రతిఫలంగా వాడికీ వ్యాపారంలో నా వాటా యిస్తాను...."
వాడికి నా సంగతి బాగా తెలుసు. అందుకే మాటవరస క్కూడా నువ్విస్తావా-అని అడగలేదు. నేను డబ్బివ్వ గల మంచి స్నేహితుణ్ణికాను.
నేను శంకరం వ్యాపారం గురించి అడిగాను.
సెంటర్లో దొరికింది-కొట్టు!
అలాంటిచోట ఫ్యాన్సీ దుకాణానికి తిరుగుండదు. అసలీ రోజుల్లో ఫ్యాన్సీ దుకాణాలకు నష్టం రావడం అరుదు. జాగ్రత్తగా ఉండాలంతే!
శంకరం నా దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు.
వాడి హడావుడి వాడిది.
"నాకే ఆ డబ్బుంటే - నేనూ వాడితో వాటాదారు నయ్యేవాణ్ణికదా" అనిపించింది. కానీ నా కంత అదృష్టమా?"
2
ఇంటికి వెళ్ళేసరికి అమ్మ డబ్బు లెక్కపెడుతోంది.
నేనాశ్చర్యపడ్డాను.
ఎక్కడిదో అంత డబ్బు....?
ఒకటి కాదు......రెండు కాదు.....ఇరవై వేలు.....
"అమ్మా - ఈ డబ్బెక్కడిది?" అన్నాను.
"నువ్వు కూడా లెక్కపెట్టు...." అంది అమ్మ.
ఉత్సాహంగా లెక్కపెట్టాను. ఆ డబ్బు నా కోసమే సిద్దమయిందా అనిపించింది. సరిగ్గా ఇరవై వేలుంది.
"ఇల్లు తాకట్టుపెట్టి తెచ్చారు నాన్న - ఈరోజే చెల్లినించి ఉత్తరం వచ్చింది. కట్నం డబ్బివ్వకపోతే దాన్ని పుట్టింటికి పంపించేస్తామంటున్నారు...."
"అంటే అన్నారు. వాళ్ళ నీ ఉత్తరంతో కోర్టుల చుట్టూ తిప్పుదాం.....కట్నం డబ్బడగడం చట్టరీత్యా నేరం...."
"ఎవరి అవసరాన్ని బట్టి - ఎవరిశక్తికొద్ది వారు నేరాలు చేస్తూనే ఉంటారు. విరిగిన మనసులు అతకవు. మా అవస్తేదో మేం పడతాం. నువ్వు కలగజేసుకోకు."
అమ్మ ఆ డబ్బు నా కివ్వదని నాకు తెలుసు.
ఎందుకంటే చెల్లి కాపురం కష్టాల్లో పడింది. ఈ ఇరవయి వేలతో అది ఆ కష్టాల కడలి నుంచి గట్టెక్కుతుంది.
అమ్మకు ముందుగా కావలసింది-అక్క గట్టెక్కడం!
"మనిల్లు లక్షరూపాయలు విలువ చేస్తుంది. ఇరవయి వేలే ఎందుకు తెచ్చాడు నాన్న. నలభయివేలు తేవలసింది...."
"తెస్తే బాకీ తీర్చద్దూ-వడ్డీ కట్టొద్దూ?"
"నేను కడతాను....."
అమ్మ నవ్వి ఊరుకుంది. అలాంటప్పుడే నేను బాగా దెబ్బతింటాను.
అమ్మ నన్ను చిన్నబుచ్చితే రెచ్చిపోయి మాట్లాడగలను.
అలా నవ్వినప్పుడు మాత్రం ఏమీ అనలేను.
ఆమె నవ్వులో నన్ను చిన్నబుచ్చే మాటలుంటాయి. వాటికి నేనిచ్చే బదులుంటుంది. ఆ బదులుకి బదులూ వుంటుంది.
నేను నాన్నదగ్గరకు వెళ్ళాను.
అప్పుడు నాన్న అకౌంట్ వేస్తున్నాడు.
ఏ రోజు ఖర్చులారోజు పైసలతో షా పద్దురాస్తాడు నాన్న.
తన చిన్నప్పట్నించీ అంతేనట.
అందువల్ల ఆయన కూడబెట్టిందేమిటో నాకు తెలియదు.
అమ్మమాత్రం-ఆయనలా పద్దురాయడంవల్లనే ఇప్పుడీ మాత్రంగానైనా వున్నామంటుంది.
నాన్న అడుగుల చప్పుడు విని తలెత్తి ప్రశ్నార్ధకంగా నావంక చూశాడు.
నాన్నెప్పుడూ నాతో మాట్లాడడు. అలాగే చూస్తాడు.
ఆ చూపులు నాకు భయాన్ని కలిగిస్తాయి.
ఆ చూపుల్లో సంసారాన్ని మోస్తున్న బరువంతా కనబడుతుంది నాకు. ఆ బరువులో నాదీ కొంత కలిసిందని నాకు తెలుసు.
"ఇల్లు తాకట్టుపెడితే-ఇరవై వేలు కాకుండా నలభైవేలివ్వరా?"
నాన్న ముక్తసరిగా-"వెళ్ళి ముత్యాల్రావుని అడుగు" అన్నాడు.
నాన్న అలాగే మాట్లాడతాడు. దేనికీ తిన్నగా బదులుచెప్పడు.
ఆర్ధిక సమస్య లాయన్నలా తయారుచేశా యంటుందమ్మ.
ఆర్ధిక సమస్యలు మనిషిని దిగజారుస్తాయని నాకూ తెలుసు.
నేనూ నాన్నలాగే వుంటున్నానిటీవల ఇది నా స్నేహితుల అభిప్రాయం.
ముత్యాల్రావుది వడ్డీవ్యాపారం.
