Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 58

 

    "ఎవరు మీరు?' అన్నాడు రమణయ్య.
    "నేరస్థులకు సాయపడ్డం నా హాబీ ." అని నవ్వాడతను.
    "నేనిప్పుడెక్కడున్నాను."
    "నీకోరిక తీరే చోట."
    "నాకోరిక ఏమిటి?"
    "పగ సాధించడం ."
    "నాకు ఎవ్వరి మీద పగ లేదు. నేను ఎవర్నీ చంపలేను.
    "రమణయ్య అనవసరంగా చల్లారి పోకు. నీ గుండెల్ని మండించే దృశ్యం చూద్దువు గానీ , అప్పుడు నీలో ఎటువంటి బావాలు రేగుతాయో చూడు . మనిషి మనసును అన్ని సమయాల్లోనూ అదుపు చేసుకోనవసరం లేదు." అన్నాడతను. అతని మాటలు పూర్తయ్యేసరికి మళ్ళీ రమణయ్యకు స్పృహ తప్పింది.
    అతను అక్కణ్ణించి పక్క గదిలోకి వెళ్ళి వాచీ వైపు చూసుకుంటూ కూర్చున్నాడు. సరిగ్గా నలభై అయిదు నిముషాలలో అక్కడకు కృష్ణయ్య, మీనాక్షి ప్రేవేశ పెట్టబడ్డారు. వాళ్ళను చూస్తూనే అతను "నేను చెప్పినట్లు వినకపోతే మీరిద్దరూ ఒకే క్షణంలో చచ్చి పోతారు"అన్నాడు.
    "ఏమిటి నువ్వు చెప్పేది?' అన్నాడు కృష్ణయ్య.
    "ఈ గదిలో ఎవ్వరూ ఉండరు. మీరిద్దరే ఉంటారు. హాయిగా భార్య భర్త ల్లా విహరించండి. అదే మీరు చేయవలసిన పని.'
    "ఏమిటి మీరనేది? ఈ మీనాక్షి నాకు అక్క వంటిది," అన్నాడు కృష్ణయ్య.
    "యూ ఫూల్ -- నేను వరుసల గురించి అడగలేదు. చెప్పినట్లు విను. నేను గదిలోంచి బయటకు వెళ్ళగానే మీరు ఒకరి నొకరు కౌగలించు కొండి. లేదా ఇద్దరి గుండెల్లోంచీ తుపాకీ గుళ్ళు దూసుకు పోతాయి." అన్నాడతను.
    అతను వేళాకోళ మాడడం లేదని కృష్ణయ్య కూ, మీనాక్షి కూడా అర్ధమయింది.

                                  13
    మీనాక్షి కౌగలిలో ఉన్న కృష్ణయ్య ను రమణయ్య ఇవతలి గదిలోంచి చూస్తున్నాడు.
    "నువ్వు తమను గమనిస్తున్నట్లు వాళ్ళకు తెలియదు. వాళ్ళను మాయామాటలు చెప్పి ఇక్కడకు తీసుకు వచ్చాను. క్షణం వ్యవధి వచ్చేసరికి వాళ్ళ ప్రవర్తన ఎలాగుందో చూడు."
    రమణయ్య గుటకలు మింగుతూ -- "నా భార్య నాతొ అంత ఆదరణగా ఎన్నడూ ప్రవర్తించలేదు. వాటం చూస్తె అది నిజంగానే వాణ్ని ప్రేమిస్తున్నట్లుంది. అంతగా ప్రేమించుకున్న వాళ్ళను కలిసే ఉండనివ్వండి. నాకింకో పెళ్ళాం దొరక్క పోదు" అన్నాడు.
    అతను అసహనంగా రమణయ్య వంక చూసి, "నువ్వు తాళికట్టిన భార్య ఇంకోడి చేతుల్లో నలుగుతుంటే నీలో రక్తం మరగాడం లేదు. వాళ్ళిద్దరూ ఇప్పుడు అసహాయులు. నువ్వేం చేసినా ఎదుర్కోలేరు. వాళ్ళను ఏదైనా చేయాలనిపించడం లేదూ?" అన్నాడు.
    "లేదు. వాళ్ళ మానాన వాళ్ళను బ్రతక నివ్వాలనిపిస్తోంది." అన్నాడు రమణయ్య.
    అతను ఆశ్చర్యంగా రమణయ్య వంక చూసి "నువ్వు నువ్వు....నిజంగా మీనాక్షి భర్త వేనా?" అన్నాడు.
    'అవును, అదంటే నాకు వల్లమాలిన ప్రేమ. ఎప్పుడైనా ఆవేశంలో దాన్ని కోప్పడినా దాని ప్రాణాలు తియ్యలేను. అది సుఖంగా ఉండడమే నాక్కావలసింది." అన్నాడు రమణయ్య.
    "నువ్వు అలా అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళను చంపాలి.
    రమణయ్య ఆశ్చర్యంగా అతని వంక చూసి "నాకు లేని ఆవేశం మీకెందుకు బాబూ -- మీనాక్షి వల్ల అన్యాయం జరిగితే అదినాకు జరిగింది. నేను సహిస్తాను....." అన్నాడు.
    "కానీ నేను సహించను. నువ్వు వాళ్ళను చంపి తీరాలి ." ఆతను అరిచాడు.
    "చంపలేను బాబూ -- నాకు చేతులు రావు."
    "వాళ్ళను చంపని పక్షంలో నువ్వే చస్తావు!" అన్నాడతను.
    రమణయ్య ఉలిక్కిపడ్డాడు- "ఇదెక్కడి విచిత్రం బాబూ - నన్ను హత్య చేయమని బలవంత పెడతారు?"
    "నీ ఆవేశం చూసి మోసపోయి అన్ని ఏర్పాట్లు చేశాను. కానీ నువ్వు వట్టి చచ్చు రకంలా వున్నావు. నా అనుభవంలో ఇలా జరగడం ఇదే ప్రధమం. అనుకున్న ప్రకారం నువ్వు నీవాళ్ళను చంపితే ఇక్కడ్నుంచి బయట పడతావు. లేకపోతె ఇక్కడే నీ బ్రతుకు అంతమవుతుంది ."
    "వాళ్ళను చంపడం వల్ల మీకేమిటి లాభం?"
    "దానికి జవాబు అతనివ్వలేదు . రమణయ్య నేను చెబుతాను" అంటూ ఒక వ్యక్తీ లోపలకు వచ్చాడు.
    లోపలున్న ఇద్దరూ ఆ వ్యక్తీ కేసి ఆశ్చర్యంగా చూశారు.

                                   14

    సుబ్బారావు ఎవరికీ తెలియకుండా రమణయ్య మీద పూర్తీ నిఘా వేసి ఉంచాడు. వీర్రాజు మాట్లాడిన విషయాలన్నీ అతను విన్నాడు. వీర్రాజు ను పోలీసులు అనుసరిస్తారని అతనికి తెలుసు. అందుకే అతను రమణయ్య అనుభవాలు తెలుసుకో దలిచాడు.
    రమణయ్య అటో ఎక్కగానే తన స్కూటరు పై అతను దాన్ని అనుసరించాడు. అటో ఇరుకు వీధులమ్మట వెళ్ళడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించినా ఎవరికీ అనుమానం రాని విధంగా దాన్ననుసరించాడతను. ఒక సామాన్యమైన ఇంటిలోకి రమణయ్య ప్రవేశించడం సుబ్బారావుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అతనా ఇంటికి ప్రదక్షణం చేసి ఆ ఇంటి నుంచి బయట పడడానికి ముఖ ద్వారం కాక మరోకటున్నదని గ్రహించాడు. అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎన్నుకుని అక్కణ్ణించి రెండు ద్వారాలానూ పరిశీలించసాగాడు.
    కాసేపటికి ఆ రెండవ ద్వారం నుంచి ఒక మనిషి బయటకు వచ్చాడు. అవతల ఒకకారు సిద్దంగా వుంది. ఆ మనిషి కారు డ్రైవర్ తో ఏమేమో మాట్లాడాడు. డ్రైవర్ కారు దిగి ఆ మనిషిని అనుసరించాడు. ఇద్దరూ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కొద్ది నిముషాల్లోనే మూడో మనిషితో తిరిగి వచ్చారు. ఆ మనిషికి స్పృహ వున్నట్లు లేదు. స్పృహ లేని ఆ మనిషి రమణయ్య అయి ఉండొచ్చని సుబ్బారావు ఊహించాడు.
    వాళ్ళిద్దరూ రమణయ్యను కారు వెనక సీట్లో పడుకోబెట్టారు. ఇద్దరూ ముందు సీట్లో కూర్చున్నారు. కారు కదిలింది. సుబ్బారావు స్కూటర్ కూడా కదిలింది. అనుభవం లేకపోయినా సుబ్బారావు కారును బాగానే అనుసరించగలిగాడు. ఆ కార్లో వాళ్ళు తమ నెవరో అనుసరిస్తున్నట్లు అనుమానించలేదు. కారు నెమ్మదిగా , సాఫీగా సాగింది. సుబ్బారావు సావకాశంగా దానిననుసరించాడు.
    ఆఖరికి కారు ఒక బంగాళా ముందు ఆగింది. కారులోని వ్యక్తులిద్దరూ దిగి రమణయ్య ను బంగాళా లోకి మోసుకుని వెళ్ళారు. కాసేపు ఆగి ఆ బంగాళా ముందుకు వెళ్ళాడు సుబ్బారావు. అది ఒక ప్రైవేట్ నర్శింగ్ హోమ్ - పేరు శాంతి. డాక్టర్ పేరు కరుణాకరం.
    కారులోని వ్యక్తులు రమణయ్యను మోసుకుంటూ నిర్భయంగా ఎలా వెళ్ళగలిగారో సుబ్బారావుకు అర్ధమైంది. అతను కాసేపు అటూ ఇటూ తచ్చాడాడు. ఏమేమో ఆలోచించాడు. ఈ నర్శింగ్ హోమ్ కూ కొన్ని నేరాలకూ సంబంధ ముండి తీరాలని అతనికి అనిపించింది.
    ఓ పావుగంట గడిచేక సుబ్బారావు సమీపంలో వున్న ఓ కాఫీ హోటల్ కు వెళ్ళి - శాంతి నర్సింగ్ హోం గురించి వాకబు చేశాడు. ఆ నర్శింగ్ హోం అక్కడ అయిదారు సంవత్సరాలుగా ఉంటున్నదని పేషెంట్లను జేర్చుకోవడం అరుదుగా జరుగుతుంటుందని అతనికి తెలిసింది. రోజూ సాయంత్రం నాలుగు నుంచి అయిదు వరకు మాత్రం ఔట్ పేషెంట్స్ వచ్చి వెడతారు. అవే కన్సల్టింగ్ అవర్స్.
    "కొన్ని ప్రైవేట్ విషయాలు ఫోన్లో మాట్లాడాలి. ఇక్కడ వీలవుతుందా?" అనడిగాడు సుబ్బారావు. "మీ ఇష్టం యజమాని పక్కనే వున్న గది చూపించి "మీ ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడండి. కాల్ కు అర్ధరూపాయి చొప్పున ఫోన్ కు ఏర్పాటు చేసిన హోల్లో వేయాలి. అదికాక స్పెషల్ రూం చార్జెస్ పావుగంటకు రెండు రూపాయలు అదనం" అన్నాడు.
    ఈ సదుపాయం బాగున్నదని తోచింది సుబ్బారావుకు. అతను ఆ గదిలోకి వెళ్ళి ఇన్ స్పెక్టర్ రాఘవ కు ఫోన్ చేసి తన అనుభవం చెప్పి శాంతి నర్సింగ్ హోం సోదా చేస్తే కొన్ని నేరాలు బయట పడవచ్చునని చెప్పాడు. పోలీసులు మాప్టీ లో వస్తే చుట్టూ పక్కల వారికి ఏవిధమైన అనుమానమూ ఉండదని ప్రస్తుతానికి అది అవసరమని తన ఊహ శక్తికి తోస్తున్నదని చెప్పాడు. రాఘవరావు ఫోన్ లో అతనికి ధన్యవాదాలు చెప్పాడు.
    సుబ్బారావు అక్కణ్ణించి బయటపడి హోటల్ అతనికి డబ్బు పేచేసి మళ్ళీ వీధిలో కి వచ్చాడు. ఇప్పుడు తను ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఎవరో అతన్ని పలకరించారు.
    "మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్!"
    సుబ్బారావు అతని వంక ఆశ్చర్యంగా చూసి - "నా పేరు సుబ్బారావు. మీకు తెలుగువచ్చా!" అన్నాడు.
    "నాకు తెలుగు బాగా వచ్చు. నా పేరు కరుణాకరం." అన్నాడతను.
    "కరుణాకరం అంటే?'
    "డాక్టర్ కరుణాకరం . శాంతి నర్శింగ్ హోం నాదే...."
    'అయ్ సి ...." అని ఆగి - "నాతో మీకు పని ఉందా?" అన్నాడు సుబ్బారావు.
    "ఉంది . ఇందాకా మీరు హోటల్ రూం లో ప్రైవేట్ గా టెలిఫోన్ చేశారే. ఆ సంభాషణ అంతా నేను విన్నాను....' అని నవ్వాడతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS