"మా కస్టమర్స్ ఇష్టపడని వాళ్ళను వాళ్ళ గదికి వెళ్ళడానికి మేము అనుమతించం."
"విషయం చాలా సీరియస్ అవుతుంది. మీ కస్టమర్ పెద్ద నేరస్థుడు" అన్నాడతను.
"అయితే అవనీండి" అన్నాడు రిసెప్షనిస్ట్ నిర్లక్ష్యంగా.
అతను అసహనంగా "వాడు వాడు....ఆ కృష్ణయ్య గాడితో వున్నది నా భార్య. నాచేత స్వయంగా పుస్తె కట్టుకున్న పెళ్ళాం. వాడి దగ్గరకు నన్ను వెళ్ళ వద్దంటే ఎలా?' అంటూ అరిచాడు.
రిసెప్షనిస్టు ఉలిక్కిపడి అతని వంక చూశాడు. "చూడండి రమణయ్యగారు, మీరు చెప్పేది నిజమేనా?"
"నిజం కాకపొతే నాకూ బాగానే వుండేది. అయినా యిలాంటి అబద్దాన్ని ఎవ్వడైనా చెప్పుకుంటారా?" అన్నాడు రమణయ్య.
రిసెప్షనిస్టు మళ్ళీ రిసీవర్ ఎత్తి "హలో కృష్ణయ్య గారూ, మీరోసారి క్రిందకు రాక తప్పదు. వచ్చేటప్పుడు మీ భార్యను కూడా తీసుకురండి "అన్నాడు. తర్వాత రమణయ్య వంక చూసి "వాళ్ళిద్దరూ వస్తున్నారు. ఏం మాట్లాడుకుంటారో నెమ్మదిగా మాట్లాడుకోండి" అనవసరంగా కేకలు వేసి రభస చేయకండి" అన్నాడు.
'అలాగే థాంక్స్ " అన్నాడు రమణయ్య. అయితే కృష్ణయ్య నూ, అతని పక్కన స్త్రీని చూసేసరికి రమణయ్య లో ఆవేశం కట్టలు తెంచుకుంది. కృష్ణయ్య మాత్రం రమణయ్య ను గమనించకుండా తిన్నగా రిసెప్షనిస్టు దగ్గరకు వెళ్ళి "ఎవరో నా కోసం వచ్చారన్నారు?" అని అడిగాడు.
"ఇదిగో ఈయనే రమణయ్య గారూ" అన్నాడు రిసెప్షనిస్టు.
"నమస్కారమండీ -- మీకు నాతొ ఏం పని?" అని అడిగాడు కృష్ణయ్య మర్యాదగా.
"ఓరి వెధవా -- నన్నీ ప్రశ్న అడగడానికి నోరెలా వచ్చిందిరా?" అన్నాడు రమణయ్య.
"ఎవరు మీరు? మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం కూడా తెలీదా?" అన్నాడు కృష్ణయ్య.
"నీకు మర్యాద యిచ్చే కదా యీ పరిస్థితి తెచ్చుకున్నాను. ఇంకా అలాంటి తెలివి తక్కువ పని చేయను" అంటూ రమణయ్య అతని వెనుకగా వున్న స్త్రీని వుద్దేశించి "ఏమే, ఇద్దరు పిల్లల తల్లివి. ఇప్పుడు నీకు రంకు మొగుడు కావాల్సి వచ్చిందేంటే- అవతల పిల్లలెలాగున్నారన్న ఏడుపైనా లేదు నీకు. అయిందేదో అయింది. ఇప్పుడైనా నాతొ వస్తావా?" అని అడిగాడు.
"మీరెవరో నాకు తెలియదు " అందా స్త్రీ.
"ఎంతకు బరి తెగించి పోయావే దొంగముండా! నీ కొడుకక్కడ నీ కోసం బెంగ పెట్టుకుని మూసిన కన్నెరక్కుండా పడున్నాడే. కన్నకడుపైనా అక్రోశించడం లేదా?" అన్నాడు రమణయ్య.
"నిజంగానా?' అందా స్త్రీ గాభరాగా.
"నమ్మకు మీనాక్షీ! వీడివన్నీ అబద్దాలు. నిన్ను మళ్ళీ మాయలో పడేయాలని చూస్తున్నాడు" అన్నాడు కృష్ణయ్య.
రమణయ్య కు ఆవేశం కట్టలు తెంచుకుంది. బూతులు కూడా లంకించు కున్నాడు. అతడిని అదుపులో పెట్టడం కష్టమైంది. అతని కేకలకు అప్పటి కి అక్కడ కొందరు జనం చేరారు. వారందరికీ కృష్ణయ్య నెమ్మదిగా యిలా చెప్పుకున్నాడు.
"చూడండీ బాబూ - ఈమె పేరు మీనాక్షీ. ఈమె నా భార్య కాదు. ఈమెను భార్యగా చేసుకునే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. నేను యీ రమణయ్య యింట్లో అద్దె కుంటున్నాను. యీ రమణయ్య తాగుబోతు' పెళ్ళాన్ని అష్టకష్టాలు పెడుతున్నాడు. రాక్షసుడిలా హింసిస్తున్నాడు. ఈయన పెట్టె బాధలు భరించలేక ఈమె ఆత్మహత్య చేసుకోబోగా నేను రక్షిస్తే మా ఇద్దరికీ సంబంధం పెట్టాడు. అక్కా తమ్ముళ్ళలా మసలుతున్న మా యిద్దరికీ సంబంధం అంటగట్టిన ఈయన నోటికి అదుపు లేదు. ఆఖరికి యింకోదారి కనిపించక ఈమెను ఆ ఇంటి నుంచి తీసుకు వచ్చేశాను.
ఈమె దగ్గర నగలు లేవు. డబ్బు లేదు. ఈమె వయసులో నాకంటే మూడేళ్ళు పెద్దది. నా మంచితనాన్ని నిరూపించడానికివి చాలు. ఒక ఆడా, మగ హోటల్ గదిలో అక్కా తమ్ముళ్ళ పేరిట గది తీసుకుంటే హాస్యాస్పదంగా వుంటుందని భార్య భర్త లమని చెప్పుకుని ఇందులో దిగాము. ఎంత విసిగిపోతే ఒక ఆడది అందులోనూ భారత దేశపు స్త్రే కన్న బిడ్డలనూ, కట్టుకున్న మొగుడ్ని వదులుకుని వెళ్ళిపోతుంది? ఇప్పుడీయన మా జాడ పసిగట్టి ఇక్కడకు వచ్చేసి మమ్మల్ని అల్లరి పెట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడీమేని వదిలిపెడితే ఈమెను చంపేస్తాడు" అంటూ అందరికీ హృదయం కరిగేలా కృష్ణయ్య కధను చెప్పాడు.
అతను చెబుతుంటే మీనాక్షీ అతనికి బలాన్నిచ్చింది. రమణయ్య మధ్యలో కలుగ జేసుకోబోయాడు కానీ జనం అతన్ని మాట్లాడ నివ్వలేదు. కృష్ణయ్య కధ చెప్పడం పూర్తయ్యాక అక్కడున్న అందరికీ మీనాక్షి మీద అంతులేని జాలి కలిగింది. కృష్ణయ్య పై గౌరవం కలిగింది. అందరూ ఏకగ్రీవంగా రమణయ్య ను అక్కణ్ణించి పొమ్మన్నారు.
రమణయ్య నిస్సహాయంగా అక్కణ్ణించి కదుల్తూ "మీ ఇద్దరికీ మూడింది. నా చేతుల్లో మీ చావు రాసి పెట్టి వుంది. ఈ వేళ కాకపోతే రేపు" అన్నాడు.
11
"నీ పేరేనా రమణయ్య?" అన్నాడతను.
"నా పెరేమైతే నీకెందుకు?' అన్నాడు రమణయ్య చిరాగ్గా.
"పెళ్ళాం లేచిపోయి హోటల్లో మరొకడితో కులుకుతుంటే ఏమీ చేయలేక ఆ హోటల్ ముందు కాపలా వాడిలా పచార్లు చేసే నువ్వు నామీద చిరాకు పడతావెం?" అన్నాడతను కోపంగా.
రమణయ్య కు పిడికిళ్ళు బిగిశాయి. పళ్ళు కొరికాడు.
'అనవసరంగా ఆవేశ పడకు. నేను నీ మిత్రుణ్ణి" అన్నాడతను.
"ఎలా?" అన్నాడు రమణయ్య.
"నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నేనూ నీ చేత అదే చేయించాలనుకుంటున్నాననుకో అప్పుడు మన మిద్దరం స్నేహితులం కాక ఏమవుతాం?" అన్నాడతను .
"నీ పేరు?"
"పిలవడానికి ఏదో ఒక పేరు అవసరం కాబట్టి చెబుతాను వీర్రాజు " అన్నాడతను.
"వీర్రాజు గారూ- అయితే నేనేం చేయాలను కుంటున్నానో, మీరేం చేయించాలనుకుంటున్నారో చెప్పండి."
"మర్డర్- కృష్ణయ్య నూ, మీనాక్షి ని!" అన్నాడు వీర్రాజు.
రమణయ్య పిడికిళ్ళు మళ్ళీ బిగిశాయి -- 'అవును" అన్నాడు.
"హత్యలోనూ మామూలు హత్య కాదు భయంకరమైన హత్య. నీ కసి తీరే విధంగా వాళ్ళిద్దర్నీ హింసించి చంపవచ్చు. హత్య జరిగేక నీ మీద ఎవరికీ అనుమానముండదు.'
"అలా సాధ్యపడుతుందా?" అన్నాడు రమణయ్య అనుమానంగా.
"నీకు దృడ సంకల్ప ముండాలి కానీ తప్పక సాధ్యపడుతుంది."
"నేను రెడీ .....ఏం చేయాలో చెప్పండి."
"తెలుసుకోవాలంటే హోటల్ శివశంకర్ లో పదిహేడో నంబరు గదికి వెళ్ళు" అన్నాడు వీర్రాజు.
రమణయ్య వెంటనే అక్కణ్ణించి బయల్దేరాడు. కొంతదూరం నడిచి ఒక అటో ఎక్కి "శివశంకర్ హోటల్ కు పోనీ" అన్నాడు. అటో కదిలింది.
అటో ఏవేవో సందులు, గొందులు తిరిగి ఒక పెంకుటింటి ముందు ఆగింది.
"ఇదేమిటి, ఇక్కడ అపావ్?" అన్నాడు రమణయ్య.
"మీరు శివశంకర్ హోటల్ అన్నారు కదా" అన్నాడు అటో వాలా.
రమణయ్య ఆశ్చర్యంగా ఇంటి వైపు చూశాడు. వీధి గుమ్మానికి "శివశంకర్ హోటల్ ' అన్న బోర్డు తగిలించి వుంది.
"ఇదా హోటల్?" అన్నాడు రమణయ్య.
"నాకు తెలిసిన శివశంకర్ హోటల్ ఇదే!" అన్నాడు ఆటోవాలా.
"ఇందులో పదిహేడు గదులుంటాయా?"
"పాతిక్కు పైనే వున్నాయను కుంటాను. ఎన్నుంటే మీకేం -- మీ ఒక్కరికే దొరికితే చాలు గదా" అన్నాడు ఆటోవాలా.
రమణయ్య ఆటోవాలా కు డబ్బిచ్చి పెంకుటింటి తలుపు తట్టాడు. బాగా ఎత్తుగా పళ్ళున్న ఓ భయంకరాకారుడు తలుపు తీశాడు. రమణయ్య ఆ వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డాడు.
"రూమ్ నెంబరు పదిహేడు కావాలి" అన్నాడు రమణయ్య.
'అలాగే.... లోపలకు రా ...."అన్నాడు ఎత్తు పళ్ళ వ్యక్తీ.
రమణయ్య లోపలకు ప్రవేశించాడు. ఆటోవాలా వెళ్ళిపోయాడు -- ఎత్తుపళ్ళ వ్యక్తీ కనుసైగ లందుకుని .
"ఇదేం హోటలు ?" అన్నాడు రమణయ్య.
"నిజమే ఇది హోటలు కాదు. ఇప్పుడు నువ్వు వెళ్ళబోయే చోటు నీకు తెలియకూడదు." అన్నాడు ఎత్తు పళ్ళ వ్యక్తీ. అతని మాటలు పూర్తయ్యేసరికి రమణయ్య స్పృహ కోల్పోయాడు.
12
రమణయ్య కళ్ళు తెరిచేసరికి ఓ గదిలో ఉన్నాడు. అక్కడ అతనికి ఒక మనిషి కనిపించాడు.
"నాపేరు వీర్రాజు కాదు. కానీ మరి కాసేపట్లో నీ భార్యా, ఆమె రంకు మొగుడూ ఇక్కడకు వస్తారు. వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉంటారు. నీకు తోచిన రీతిని వాళ్ళను హింసించి చంపేయ్. నిన్నెవ్వరూ అడ్డలేరు."అన్నాడతను.
