Previous Page
వసుంధర కధలు-10 పేజి 59

 

    "ఎవరు మీరు ?" అన్నాడతను.
    "నేనవరో రమణయ్య నడిగితే చెబుతాడు...." అంటూ నవ్వాడా కొత్త వ్యక్తీ.
    'ఇన్ స్పెక్టర్ రాఘవరావుగారా...." అన్నాడు రమణయ్య.
    "అవును మాప్టీలో వచ్చాను" అన్నాడు రాఘవరావు .
    అతను కంగారు పడుతూ -- "మీకిక్కడ ఏం పని ?" అన్నాడు.
    "నిజానికి మాకిక్కడ ఏం పని లేదు. నువ్వు నాకు పని కల్పించావు. ఒక విధమైన క్రూర పైశాచిక మనస్తత్వం నిన్నావహించగా-- ఏదో బలహీన క్షణంలో నేరం చేయాలని అనుకున్న కొందరు దౌర్భాగ్యులను చేరదీసి, ప్రోత్సహించి - వాళ్ళ చేత నేరం చేయించి- నీ కళ్ళ ముందే జరిగిన ఆ నేరాన్ని చూసి ఆనందిస్తున్నావు. నేరాలకు సాక్ష్యాధారాలు నీవద్దనే ఉంచుకుని ఆ నేరస్థులను బెదిరిస్తూన్నావు. కావాలనుకున్నప్పుడల్లా వాళ్ళ చేత నేరాలు చేయించడం కోసం ఈ ఆధారాలు నుపయోగించుకుంటున్నావు" అన్నాడు రాఘవరావు.
    "ఇదంతా మీ ఊహ. ఇలాంటి ఊహ మీకెందుకు వచ్చిందో నాకు తెలియడం లేదు" అన్నాడతను.
    "ఇది ఊహ కాదు, వాస్తవం. అందుకు ఈ రమణయ్యే సాక్షి. రమణయ్య, కృష్ణయ్య, మీనాక్షి - మేము నియోగించిన మనుషులు. నిన్ను అనుమానిచి బయట పెట్టడం కోసం మేమాడిన నాటకం ఫలించింది" అన్నాడు రాఘవరావు.
    అతని మాటలు పూర్తీ కాగానే అక్కడున్న మనిషి అదేపనిగా నవ్వసాగాడు. "రాఘవరావుగారూ -- మీ ఊహ పెడత్రోవ పట్టింది. మీరు మమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకున్నారు. నిజానికి మేమొక సినిమా తీస్తున్నాం. సినిమా పేరు చంపక పొతే చస్తావ్! ఈ సినిమా టైటిల్స్ కు ముందు ఒక వాస్తవిక సన్నివేశాన్ని ప్రవేశ పెట్టాలను కున్నాం. పేపర్లో రమణయ్య, కృష్ణయ్య ల గురించి చదివి ఆ సన్నివేశం వీరి చేత నటింపజేయాలనుకున్నాం. ఈ సన్నివేశంలో తన భార్య మరొకడితో చనువుగా ఉండడం చూసి ఒకడు ఆవేశపడి హత్య చేశాడు. రమణయ్య కృష్ణయ్య, మీనాక్షి లకు ముందు ఈ విషయం చెప్పక పోవడం ద్వారా సన్నివేశం సహజంగా తయారవుతుందనుకున్నాం. అయితే కధ తప్పుదారిలో వెళ్ళింది.
    అతను తన కధను నిజమని నిరూపించదానికి ఆ గదిలో ఉన్న ఏర్పాట్లు చూపించాడు. అక్కడా, ఆ పక్క గదిలొనూ ఉన్నవి బొమ్మ తుపాకులు, బొమ్మ పిస్తోళ్ళు గదిలో మూవీ కెమెరా ఉంది.
    "నేను నమ్మలేను" అన్నాడు రాఘవరావు.
    "మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ విషయాలు బయటి ప్రపంచానికి చెప్పవద్దు. మా సినిమా ఎలా తయరవుతున్నదీ ఎవరికీ తెలియకూడదు" అన్నాడతను.
    "ఏమైనా మిమ్మల్ని అరెస్టు చేయక తప్పదు. ముగ్గురు మనుషుల్ని ఎత్తుకుని వచ్చారు మీరు." అన్నాడు రాఘవరావు.
    "విషయాలన్నీ రహస్యంగా ఉంచితే మీరనుకునే నేరస్థుల్ని బయట పెట్టడానికి కృష్ణయ్య, మీనాక్షి రమణయ్య ఇంకా పని కోస్తారు. అందువల్ల మీకే ప్రయోజనం?" అన్నాడతను.

                                      16

    సుబ్బారావుకు ముచ్చెమటలు పోశాయి.
    కరుణాకరం , సుబ్బరావు వంక చూసి , 'అయినా నాకు మీపైన కోపం లేదు. ఎందుకంటె అడ్వాన్సుగా మీ సంభాషణ అంతా విన్నాను. కాబట్టి అడ్వాన్సు గా మా వాళ్ళకు సంకేతాలు గూడా ఇచ్చేశాను. అవసరమైన జాగ్రత్తలు వాళ్ళు పడుతున్నారు. పోలీసుల వల్ల వాళ్ళకే ఇబ్బందీ ఉండదు. ఎటొచ్చీ ఇంక నేను మీ గురించి తెలుసుకోవలసి ఉంది. ఎవరు మీరు, పోలీసు అఫీసరా?' అన్నాడు.
    "కాదు, కానీ బాధ్యత గల సామాన్య పౌరుణ్ణి." అన్నాడు సుబ్బారావు.
    "మీకు కుక్క, గాడిద కధ తెలియదను కుంటాను. యజమాని ఇంట్లో దొంగ పడుతుంటే కుక్క చూస్తూ ఊరుకుందిట. గాడిద గుర్తు చేసినా అది తన బాధ్యత ను నిర్వహించనని మొండి కేసి కూర్చుందిట. అప్పుడు కుక్క బాధ్యతను కూడా తనే నిర్వహిద్దామని గాడిద ఒండ్ర పెడితే- యజమాని కోపంగా నిద్రలేచి గాడిదను చావబాదాడట. ఈకధలోని నీతి ఏంటంటే ఇతరుల బాధ్యతను మనం స్వీకరించకూడదని. అర్ధమయిందా ?"
    సుబ్బారావు ముఖం మాడిపోయింది. అయినా అతడు నెమ్మదిగా -- "ఇందులో నా స్వంత బాధ్యత కూడా ఉంది" అన్నాడు.
    "ఏమిటది?"
    "చెప్పను."
    కరుణాకరం నవ్వి - "అది నువ్వు చెప్పుకోలేవని నాకు తెలుసు. నాతొ కూడా వస్తే -- నువ్వెంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నావో నీకే తెలుస్తుంది." అన్నాడు.
    సుబ్బారావు ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. అతను కరుణాకరాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు.
    ఇద్దరూ కలిసి సుబ్బారావు స్కూటర్ మీదే కరుణాకరం ఇంటికి వెళ్ళారు.
    కరుణాకరం సుబ్బరావు ను తన ఇంటి పడక గదిలోనికి తీసుకు వెళ్ళి "ఇది గోడలా కనబడుతోంది కాని ఇందులో తలుపుంది. అక్కడొక రహస్యపు గది ఉంది. అందులోని వింతలు చూద్దురు గాని పదండి!"అన్నాడు.
    కరుణాకరం ఆ గది తలుపు ఎలా తెరిచాడో సుబ్బారావుకు తెలియలేదు, కానీ అతని వెనుకనే ఆ గదిలో మాత్రం ప్రవేశించాడు.
    ఆ గది చాలా విశాలంగా ఉంది. చూడ్డానికి ఒక చిన్న సైజు మ్యూజియం లా ఉంది . గది గోడల నానుకుని చుట్టూ ఉడెన్ టేబుల్స్ న్నాయి. టేబుల్స్ పైన చిన్న చిన్న అద్దాల షో కేసులున్నాయి. ప్రతి టేబులు కూ సోరుగులున్నాయి.
    కరుణాకరం సుబ్బారావును ఒక షో కేస్ దగ్గర తీసుకుని వెళ్ళి "మీ పేరు సుబ్బారావ్ ని మీరు చెప్పక పూర్వమే నాకు తెలుసు. ఎందుకంటె మీరు లీలకు బాబాయి గనుక -' అన్నాడు.
    సుబ్బారావు ఉలిక్కిపడి "అంటే?" అన్నాడు.
    "లీల మీదకు రామాన్ని ప్రోత్సహించిన వాడిని నేనే! ఆ సన్నివేశానికి ఫోటోలు తీసి ఉంచుకున్నాను. ఆ సన్నివేశానికి గుర్తుగా అప్పుడు నలిగి చిరిగిన ఆమె బట్టలు నావద్ద ఉన్నాయి." కరుణాకరం ఒక్క క్షణం ఆగి "లీల గురించి ఆమె కుటుంబ సభ్యుల గురించీ నా దగ్గర ఫోటో లతో వివరాలున్నాయి. ఆమెకూ రామానికి సంబంధించిన వోవరాలున్నాయి. ఏ పరిస్థితుల్లో నేరం జరిగిందో ఎలా జరిగిందో వివరాలున్నాయి. మానభంగం కావించబడిన యువతి ప్రతిఘటన చిహ్న మైన ఆమె బట్టల అవస్థ యధాతధంగా నావద్ద భద్రపర్చబడి ఉంది." అన్నాడు.
    "ఇదంతా ఎందుకు, బ్లాక్ మెయిల్ చేయడానికా?" అన్నాడు సుబ్బారావావేశాన్ని అణచుకుని.
    "ఎంత మాత్రమూ కాదు. తపాలా బిళ్ళలు సేకరించే హాబీ కొందరి కున్నట్లే , నేరానికి సంబంధించిన వస్తువులను సేకరించడం నా హాబీ. వీలైనంత వరకూ ఆ వస్తువుల చరిత్రను కూడా సేకరిస్తుంటాను. నా హాబీని నాతొ పాటు పంచుకునే వారు బహుకొద్ది మంది. అందరిలోనూ నావద్దనే ఎక్కువ కలెక్షన్ ఉండేది. ఇటీవల నా స్నేహితుడు కలెక్షన్లో నన్ను మించి పోయాడు. వాడిని అధిగమించడం కోసం నాకు నేనై నేరస్థులను ప్రోత్సహించి నేరాలకు దోహదం చేసి వస్తు సేకరణ చేయడం ఇటీవలే ఆరంభించాను."
    సుబ్బారావు నోరు తెరిచి కరుణాకరం వంక చూస్తున్నాడు.
    "ఇదేదో పిచ్చితనం లా కనబడుతోంది కదూ నీకు.' కానీవీటి విలువ నీకు తేలియదు. ఒక ఫారినర్ ఒక వస్తువుకు యాభై వేల డాలర్లు దాకా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాడు. ఎందుకంటె ఇలాంటి వస్తు సేకరణ సులభ సాధ్యం కాదు ." అన్నాడు కరుణాకరం.
    'అయితే ఇదంతా నాకెందుకు చూపిస్తున్నారు? అందువల్ల నీ రహస్యం బయట పడిపోయినట్లే కదా!" అన్నాడు సుబ్బారావు.
    "ఇంకా అర్ధం కాలేదా? నా రహస్యం బయటపడితే నీ కుటుంబానికి ఎంత అవమానం? నేను నేరస్థుడిగా కోర్టులో నిలబడ్డానంటే లీల వంటి ఎందరో అభాగ్యురాండ్రా బ్రతుకులు వీధి కేక్కుతాయి. వాళ్ళ బ్రతుకులు వీధి కేక్కించే ఉద్దేశ్యం నాకు ఏమాత్రము లేదు. అంతా నీలో ఉంది.' అన్నాడు కరుణాకరం.
    సుబ్బారావుకు నోట మాట రాలేదు. కరుణాకరం ఉద్దేశ్యం అతనికి అర్ధమయింది. అతను బయటపడితే లీల బ్రతుకు కుక్క చింపిన విస్తరి అవుతుంది. చూస్తూ చూస్తూ తను అందుకు ఎలా పూనుకోగలడు?
    "మిస్టర్ సుబ్బారావ్! ఇది నా హాబీ. ప్రమాదకరమైనదే అయినా నాకు చాలా సరదాగా వుంది. నువ్వు బహుశా లీల ద్వారా జరిగింది తెలుసుకుని పోలీసులకు సాయపడాలనుకుని ఉంటావు. ఆ ఆలోచన మానుకో. లీలకు ఏ ప్రమాదమూ ఉండదు. లీల క్కూడా చెప్పాను. రామం కనుక ఆమెను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే వాణ్ణి హత్య చేసే ఉపాయం కూడా చెబుతానని కండీషన్ మాత్రం హత్యాయుధాన్ని నాకిచ్చేయాలని! ఈ ప్రపంచంలో ఎన్నో మ్యూజియాలున్నాయి. వాటిలో యుద్దాల్లో, ఉపయోగించ బడ్డ ఆయుధాలున్నాయి. సమకాలిన హత్యాయుధాలనూ, నేర చిహ్నాలను సేకరించిన ఘనత మాత్రం నాకే దక్కుతుంది. నువ్వు నా జోలికి రావనీ, రాలేవనీ, ఆశిస్తున్నాను" అన్నాడు కరుణాకరం.
    సుబ్బారావు నిస్పృహగా అక్కణ్ణించి కదిలాడు.
    మర్నాడు రాఘవరావు అతన్ని కలిసి -- "దొంగలు దొరికినట్లే, దొరికి తప్పిపోయారు. ఇందుక్కరణమేమిటో మీ అద్భుత ఊహాశక్తి తో చెప్పగలరా?' అనడిగాడు.
    "కుక్కకు బదులు గాడిద అరిస్తే - దానికి మిగిలేది చావు దెబ్బలే. నామానాన నన్ను బ్రతక నిద్దువు-' అన్నాడు సుబ్బారావు.
    రాఘవరావు ఆశ్చర్యంగా అతని వంక చూశాడు. తర్వాత వారిద్దరి మధ్యా మరెన్నడూ పరిశోధనల గురించిన సంభాషణలు నడవలేదు.

                       ----అయిపొయింది ----  
    


 Previous Page

WRITERS
PUBLICATIONS