Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 57

 

                          పీనాసికి ఖర్చెక్కువ

                                                           జొన్నలగడ్డ రామలక్ష్మీ.

    "హలో - రామానాధంగారండీ "
    'అవును- రామానాధాన్నే మాట్లాడుతున్నాను ."'
    "నమస్కారం సార్!"
    "ఎవరు మీరు!"
    "నేనెవరో చెబుతాను. ఇంట్లో క్యాషు రెడీగా ఉంచా సార్!"
    రామనాధం వులిక్కిపడి -- "క్యాషు సంగతి మీ కెందుకు !" అన్నాడు చిరాగ్గా.
    "క్యాషు అక్కర్లేక పొతే మీ కెందుకు ఫోన్ చేస్తాను సార్...."
    "ఎవరు మీరు ?"
    'అర్జంటుగా నాకు పాతిక వేలు కావాలి సార్...."
    "ఎవరు మీరు?"
    "మీరు పాతిక వేలు తీసుకుని ఒంటరిగా బయల్దేరండి. సూర్య ప్రకాశరావు వీధిలో రమణా ఎంపోరియం పక్కనున్న సందులోనికి తిరిగి మనిషి ఎదురయ్యే వరకూ ప్రోసీడవండి. నేనే మీకు ఎదురుగా వచ్చి డబ్బు తీసుకుంటాను. కూడా ఎవర్నీ తీసుకుని రావద్దు. ఎవరికీ ఈ విషయం చెప్పొద్దు. నేను మిమ్మల్ని వెయ్యి కళ్ళతో కనిపెడుతూనే ఉంటాను. పొరపాట్లు చేస్తే ప్రమాదం...."
    "ప్రమాదం ఎవరికీ?"
    "మీ అమ్మాయికి ."
    "ఏ అమ్మాయికి ?" అన్నాడు రామనాధం. అయన కిద్దరు కూతుళ్ళు.
    "పెద్దమ్మాయి ప్రమీల ...."
    రామనాధం వులిక్కిపడి "ప్రమీలకు నీవల్ల ప్రమాదమెందుకు ?" అన్నాడు.
    ఫోన్ లో నవ్వు వినబడింది. 'ఆమె నా వద్ద బందీగా ఉంది కాబట్టి.
    "హలో - ఎవరు నువ్వు?"
    "డబ్బు తీసుకుని రమణా ఎంపోరియమ్ ...."
    "నా వద్ద డబ్బు రెడీగా లేదు ."
    "అయితే రేపటి దాకా టయమిస్తున్నాను. రేపు బ్యాంకు తీయగానే బ్యాంకుకు వెళ్ళండి. డబ్బు విత్ డ్రా చేయండి. బ్యాంకులో మీకు కవరోకటి అందుతుంది. మీరు నన్నెక్కడ కలుసుకోవాలో అందులో వుంటుంది. ఆ కవర్ని మీరు రోడ్ మీదకు వచ్చేక అక్కడ చించి చదవాలి. భిన్నంగా ప్రవర్తించారా మీ అమ్మాయికి ప్రమాదం. నేను దగ్గరే వుండి మిమ్మల్ని వెయ్యి కళ్ళతో కనిపెడుతూ వుంటాను."    
    "హలో - ఎవరు నువ్వు ?"
    "ఈవ్వాల్టికి ఇంతే ..." అవతల క్లిక్ మంది.
    రామనాధం కంగారుగా వెంటనే ఇంటికి ఫోన్ చేసి "ప్రమీల ఇంట్లో ఉందా?" అనడిగాడు.
    "ప్రమీల తన స్నేహితురాలితో పిక్నిక్ వెళ్ళింది" అని సమాధానం వచ్చింది.
    "ఎక్కడికి ?"
    "అరకులోయ --"
    "ఎప్పుడు?"
    "ఈరోజు వుదయం ."
    "నాకెందుకు చెప్పలేదు?"
    "ఈ యింట్లో మీకు చెప్పి చేయాలంటే  సంక్రాంతి పండుగ దీపావళి నాడు చేసుకోవాల్సి వుంటుంది...."
    "నాతొ చెప్పకుండా పనులు చేస్తే అసలు పండుగ జరుపుకునే యోగమే వుండకపోవచ్చు " చాలా కోపంగా అన్నాడు రామనాధం.
    "ఏం జరిగిందండి ?" అంది రామనాధం భార్య అరుణ.
    "ముందు అరుకులోయ పిక్నిక్ కు తీసుకుని వెళ్ళిన దాని స్నేహితురాలి వివరాలు చెప్పు "
    "ఆమె పేరు లలితకుమారి , క్రిస్టియన్ ."
    "అడ్రసు...."
    చెప్పింది అరుణ.
    కొద్ది క్షణాల్లో రామనాధం కార్లో లలితకుమారి ఇంటికి వెళ్ళాడు. అతడు వెళ్ళగానే ఓ యువతి వచ్చి ఇంటి తలుపు తీసింది.
    "లలితకుమారిల్లు ఇదేనామ్మా?" అన్నాడు రామనాధం.
    'ఇదేనండి . నేనే లలితకుమారి ని...." అన్నదామె.
    "ఇంట్లో ఇంకెవరూ లేరా ?"
    "అమ్మా , నాన్నా ఊళ్ళో లేరండి. మీరెవరు ?" అన్నదామె.
    "నేను ప్రమీల తండ్రిని...." అన్నాడు రామనాధం.
    "నమస్కారమండి. లోపలకు రండి -- కూర్చోండి." మర్యాదగా ఆహ్వానించిందామె. రామనాధం లోపలకు వెళ్ళి కూర్చున్నాడు. గదిని పరిశీలనగా చూశాడు. మధ్యతరగతి ఇల్లు.
    "పిక్నిక్ కి వెళ్ళలేదా ?' అడిగాడు రామనాధం.
    "లేదండి ."
    "ఎందుకని ?"
    ఒక్క క్షణం తటపటాయించింది లలితకుమారి.
    ప్రమీల , లలితకుమారి కలపి అరుకులోయ వెడదామనుకున్నారు. ప్రమీల చిత్రాకరిణి, లలితకుమారి కవయిత్రి. అందుకని ఇద్దరూ కలసి వెడితే ప్రోగ్రాం బాగుంటుందనుకున్నారు.
    ప్రమీల తనకు ఇంట్లో ఒప్పుకొని ప్రమాద మున్నదని అంది. లలితకుమారి కలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఈ రోజు వుదయంఎనిమిది గంటలకు బస్ స్టాండు లో కలిస్తే ప్రయాణం ఉన్నట్లు లేకపోతె లేనట్లు ! తమ ప్రయాణం గురించి ఎవరికి ఎక్కువగా చెప్పవద్దని ప్రమీల అంది. తన ఇంటికి కూడా రావద్దని అంది.
    "ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది వరకూ బస్ స్టాండు లో తన కోసం ఎదురు చూశాను. తను రాలేదు."
    "మా యింట్లో ఏడున్నరకు బయలుదేరిందిట. ఇంత వరకూ దాని ఆచూకి తెలియదు. నువ్వేమయినా చెప్పగలవేమోనని వచ్చాను."
    లలితకుమారి కంగారుగా -- 'ఇంట్లో ఒప్పుకోలేదేమో ననుకున్నాను. అంటే ఇంట్లో బయల్దేరిందన్న మాట...." అంది.
    "అవును....' అంటూ రామనాధం లేచాడు.
    "అయ్యో - కాఫీ కలుపుతానండీ --" అంది లలితకుమారి.
    'ఇప్పుడలాంటివేమీ వద్దు. ప్రమీల గురించి నీకేమైనా ఆచూకీ తెలిస్తే ఫోన్ చేసి చెప్పు. నీకై నువ్వు ఎలాంటి ఆచూకీ తియ్యడానికి మాత్రం ప్రయత్నించకు" అన్నాడు రామనాధం.
    తిరిగి కార్లో కూర్చున్నాక ఏం చేయాలో ఆయనకు తోచలేదు. ఇప్పుడెక్కడికి వెళ్ళాలి ?
    ఆ కిడ్నాపర్ కీరోజే డబ్బిచ్చేసి వుంటే బాగుండేది. అమ్మాయి రాత్రికే యింటికి చేరేది. ఇప్పుడు ప్రమీల ఎక్కడుందో , ఏమయిందో తెలియదు. డిటెక్టివ్ ల కేవరి కయిన తెలియపరిస్తే ?
    ఏమో - ఆ కిడ్నాపర్ తనని అనుసరించే ఉంటున్నాడెమో!
    ప్రమీల లలితకుమారి ని కలుసుకొనడం కోసం ఇల్లు వదిలింది. ఆమె స్నేహితురాలిని కలుసుకునే లోగా కిడ్నాప్ అయిపొయింది.
    రామనాధం తిన్నగా ఇంటికి వెళ్ళాడు. భార్యను పలకరించాడు. జరిగింది చెప్పాడు.
    అరుణ శోకాలు ప్రారంభించింది.
    "ఏడ్చి లాభం లేదు. ఈ విధంగా ఇంకెవరికీ చెప్పవద్దు. రేపు గుట్టు చప్పుడు కాకుండా పాతిక వేలూ యిచ్చి దాన్ని విడిపించుకుని వస్తాను." అన్నాడు రామనాధం.
    విషయం పోలీసులకు గానీ వేరెవ్వరికీ గానీ చెప్పకూడదని నిర్ణయమయింది .

                                   2
    రామనాధం బ్యాంకులో అందర్నీ గమనిస్తున్నాడు. ఇంతలో ఫ్యూన్ వచ్చి అయన చేతిలో కవరిచ్చి -- "మీ పేరు రామనాధం కదండీ" అన్నాడు.
    రామనాధం కవరు అందుకుంటూ -- "ఎవరిచ్చారు నీ కిది?" అన్నాడు.
    "మా బ్యాంకు స్టాపు కి పెళ్ళి శుభలేఖలు. ఇచ్చినాయన దూరాన్నుంచి మిమ్మల్ని చూపించి మీకూ ఒకటిమ్మన్నాడు...." అన్నాడు ఫ్యూన్. అతడి చేతిలో ఇంకా చాలా కార్లు లున్నాయి.
    బ్లాక్ మెయిలర్ చాలా తెలివయినవాడు. ఈ కార్డు లిచ్చే వ్యవహారాన్ని పసిగట్టి వాటిలో తన వుత్తరం కూడా పెట్టేశాడు. ఎవడో బ్యాంకి కస్టమర్ పెళ్ళి అయుంటుంది. అరా తీస్తే వాడెవరో తెలియొచ్చు. కానీ కొండను త్రవ్వి ఎలకను పట్టడం సాధ్యపడుతుందా!
    ఇప్పుడీ పెళ్ళి వారింటికి వెడితే -- కార్డు లిచ్చి బ్యాంకు కేవర్ని పంపించారో వారు అరా చెప్పగలరా! వాళ్ళ హడావుడిలో వాళ్ళీ శుభలేఖ లెవరి కిచ్చారో చెప్పగలరా? ఒక వేళ చెప్పగలిగినా దానివల్ల పెద్దగా ప్రయోజన ముండక పోవచ్చు. బ్లాక్ మెయిలరూ , అతడూ ఒకరు కాకపోవచ్చు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS