Previous Page Next Page 
వసుంధర కథలు-14 పేజి 56

 

    "నువ్వే మనుకున్నావు ?"
    "కత్తి తీసుకుని నా మీద తిరగబడతావనుకున్నాను."
    "అప్పుడు ?"
    "నేను చచ్చిపోతాను. నాకెలాగూ జీవితం మీద వాంఛ లేదు. నీ యింట్లో నా చావు -- పదిమందీ నిన్ను హంతకుడనడం జరుగుతుంది -- అదో తృప్తి నాకు."
    "నువ్వే నన్ను చంపవచ్చు గదా.'
    "చూస్తూ చూస్తూ ఓ ఆడది తన ప్రియుణ్ణి చంపలేదు"
    "నాకు తెలుసు - నువ్వు నన్ను చంపలేవని!" అన్నాడతను.
    "ఇంకా ఏం తెలుసు నీకు!"
    "నీకు జీవితం మీద వాంఛ లేకపోయినా నాకు నీ మీద వాంఛ వున్నది. అందుకు నీ అంగీకారం లభిస్తుందని కూడా నాకు తెలుసు" అన్నాడతడు.
    "ఎంత ధైర్యం నీకు?"
    "ధైర్యం కాదు -- నమ్మకం. నెలరోజుల పరిచయంలో ఔన్నత్యం అర్ధం చేసుకున్నాను. నీ వంటి ఉత్తమురాలిని మోసం చేస్తున్నందుకు బాధ కలిగింది. నా అసహయతకు కోపం వచ్చేది. నీ వంటి ఉత్తమరాలిని భార్యగా పొందకపోవడం నా దురదృష్ట మనిపించింది. ప్లీజ్ .... ఇప్పుడు ....నువ్వు నన్ను కాదనకు "
    ఆమె మాట్లాడలేదు.
    "నన్ను చంపాలని కత్తి తెచ్చావు. ఆ కత్తి నా చేతి లోకి వస్తే అది నేను నీ పాదాల ముందే వుంచుతాను. నన్నింతగా నమ్మిన నిన్ను ....ప్లీజ్ .....కాదనకు ...."
    "నువ్వు చాలా తెలివైనవాడివి" అన్నదామె.
    "నా తెలివి నాది కాదు. నేను నీ భక్తుణ్ణి.
    "నీ తెలివి ప్రమాదకరమైనది" అన్నదామె.
     "ఏం ?"
    "నీ భార్య పోయి ఇంకా మూడు వారాలు దాటలేదు. అప్పుడే నీ మనసు పరస్త్రీ సాంగత్యాన్ని  కోరుతున్నదా?"
    "ఆ తప్పు నాది కాదు. ప్రేమది!"
    "కట్టుకున్న భార్యను ప్రేమించలేనివాడివి -- నువ్వు నన్ను ప్రేమిస్తావా?"
    "నేను కట్టుకున్న భార్యను ప్రేమించలేదు. నిన్నే ప్రేమించాను ."
    "అబద్దం --"
    "అందుకు రుజువుంది."
    "ఏమిటది?"
    "చెబితే నువ్వు నమ్మవు ."
    'చెప్పకపోతే నువ్వు చస్తావు " అంటూ ఆమె మళ్ళీ కత్తి తన చేతిలోకి తీసుకుంది.
    "నువ్వు  చంపుతానన్న భయంతో కాదు. నాకు నీ మీద ఎంత ప్రేమ వున్నదో ఋజువు చేయడం కోసం నేను నీకు చెబుతాను."
    "చెప్పు " అన్నదామె.
    "నా భార్య చచ్చిపోలేదు. నేనే ఆమెను చంపేశాను. "
    ఆమె తెల్లబోయింది.
    "నీకోసం - కేవలం నీకోసం - ఆమెను నేనే చంపేశాను ."
    "నా కోసమా ?"
    "అవును-- నాకు నువ్వు కావాలి. నువ్వు లేనిదే  బ్రతకలేననిపించింది. కానీ అప్పటికే నాకు పెళ్ళయి పోయింది. మన పెళ్ళికి అంగీకరిచమని నా భర్యను వేడుకున్నాను. విషం తాగి చావనైనా చస్తాను కానీ మన పెళ్ళికి అంగీకరించనందామే. ఎలాగూ చస్తానంది కదా అని -- నేనే విషమిచ్చి ఆమెను చంపేశాను ."
    "మరి నిన్ను ఎవరూ అనుమానించరూ?"
    "భర్త భార్యను చంపితే అనుమానించడమా?" అని నవ్వడతడు.
    "అయితే పెళ్లి చేసుకుని నన్నూ చంపుదామనుకుంటున్నావా?

    "నిన్ను నేను చంపుతానా? నువ్వు దేవతవు. నేను భక్తుణ్ణి."
    "నన్ను చంపకపోతే శ్యామలని యెలా పెళ్ళి చేసుకుంటావు?" అన్నదామె.
    "శ్యామల ఎవరు?" అన్నాడతను కంగారుగా.
    'శ్యామల ఎవరో నీకు తెలుసునని నాకు తెలుసు."
    "నువ్వు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. కొత్త కొత్త విశేషాలు చెబుతున్నావు. శ్యామల యెవరో నాకు తెలియదు."
    "శ్యామల పేరిట రెండు లక్షల రూపాయల ఆస్తి ఉంది. ఆమె వయస్సు ఇరవై రెండేళ్ళు. ఆమెకు భర్త పోయి మూడేళ్ళ యింది. ఆమెను నువ్వు వలలో వేసుకున్నావు. ప్రేమించానని చెప్పావు. నీ భార్య జబ్బు మనిషనీ, త్వరలోనే చచ్చి పోతుందనీ ఆమెతో చెప్పావు. నీ భార్య చావగానే శ్యామలాని పెళ్ళి చేసుకుంటానని చెప్పావు" "అభూత కల్పన. ఏ అడదయినా అలా ఒప్పుకుంటుందా? భార్యను చంపి నిన్ను పెళ్ళి చేసుకుంటానంటే " అని ఏదో చెప్పబోయి ఆగి పోయాడతను.
    "ఏమో! అలాగే చెప్పి నన్ను ఒప్పించాలను కున్నావు."
    'అవును వ్యవహారం నీకెలా పీకల మీదకు వచ్చింది కాబట్టి అలా చెప్పాను. నిన్ను నమ్మించడానికి నిజం తప్ప వేరే మార్గం లేకపోయింది."
    "పాపం వెర్రి శ్యామల నీ భార్య నిజంగా రోగిష్టిదనీ చరమ కాలంలో ముత్తయిదవగా చనిపోవాలన్న ఆమె కోరికను తీర్చడం కోసం ఆమె మేడలో తాళి కట్టావని నువ్వు చెప్పిన అబద్దాలన్నీ నమ్మింది. నేను నిజం చెబితే తెల్లబోయింది."
    "శ్యామలకు నువ్వు అన్నీ చెప్పెశావా?" అన్నాడతను.
    "శ్యామల ఎవరు - నీకు తెలియదేమో!" వెటకారంగా అన్నదామె.
    "నువ్వు - నువ్వు ....." అంతకు మించి మాటలు రాలేదతడికి.
    "భద్రకాళిని" అన్నదామె.
    'అయితే నన్ను చంపేయ్. నీ చేతుల్లో చనిపోవడం నాకు ఆనందం" అన్నాడతను.
    'అసలు నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను కానీ చేసుకోలేదు. ఎందుకో తెలుసా ?"
    "తెలియదు ."
    "నీకు ఆనందం కలుగుతుందే మోనని!" అన్నదామె. నీకు ఆనందం కలగకుండా వుండడం కోసం నేను నా ఆనందాన్ని కూడా త్యాగం చేయగలను."
    'అంటే?"
    "నేను నిన్ను చంపను ."
    "అదీ నాకు ఆనందమే అయితే ?"
    "బ్రతికుండడం నీకు ఏ మాత్రమూ ఆనందం కలిగించని పరిస్థితి కలిగిస్తాను."
    అతను భయంగా ఆమె వంక చూసి "నువ్వు నన్ను ప్రేమించలేవా?" అన్నాడు.
    "నేను నిన్ను ప్ర్రేమించ గలనని ఎందుకనుకుంటున్నావు ?'
    "ఆడది ఒకసారి ప్రేమిస్తే తన కెంత అన్యాయం జరిగినా సరే ప్రేమను వదులుకోలేదంటారు " అన్నాడతను.
    "ఆడదాని గురించి నీకు తెలిసిన నిర్వచనమే అదైతే నేను ఆడదాన్ని కాదు" అన్నదామె.
    'ఒక్క నిముషం అగు" అని అతడు లోపలకు వెళ్ళి కొద్ది క్షణాల్లో చేతిలో మంగళ సూత్రాలతో వచ్చి "ఇప్పుడు నీ మెడలో తాళి కడతాను" అన్నాడు.
    "ఒక్క నిముషం " అన్నదామె.
    "ఎందుకు?"
    "నీ నిర్వచనం ప్రకారం నన్ను ఆడదిగా మార్చడం కోసం నువ్వు నాకు తాళి కట్టాలను క్న్తున్నావు . అంతకు ముందు నీకో విషయం చెప్పాలి?" అన్నాదామె.
    "ఏమిటది?"
    "నీ భార్య కో అన్న ఉన్నాడు తెలుసా ?"
    "తెలుసు ."
    "నీ భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని అతను నాకు చెప్పాడు. నీలాంటి వాడ్ని కట్టుకున్న ఆడదానికి అదే గతి అని నేను అన్నాను. అతని కా విషయం తెలియదు. నీ భార్య చనిపోతూ అతనికి ఓ చీటీ వ్రాసిందిట. అందులో తన చావుకు కారణం నేనని వ్రాసిందట. అతను నన్ను చంపాలని వచ్చాడు. నేను అతడికి నీ నిజస్వరూపం వెల్లడి చేశాను. మొత్తానికి నీ భార్య పతివ్రత అనిపించుకుంది."
    "నీ మాటలు ఎవరూ నమ్మరు" అన్నాడతను.
    "ఆ సంగతి నాకూ తెలుసు. అందుకే నిజం నీచేత చెప్పించాను."
    "అంటే ?"
    "నేను ఇంట్లో ప్రవేశించినపుడు వీధి తలుపులు దగ్గరగా మాత్రం వేశాను."
    'అంటే?"
    "అతను ఇంట్లోనే ఉన్నాడు. మన సంభాషణ అంతా విన్నాడు.
    'అబద్దం" అంటూ అరిచాడతను.
    "కాదు, నిజమే!" అంటూ అక్కడికో యువకుడు ప్రవేశించాడు.
    "బావా!" అన్నాడతను ఆశ్చర్యంగా.
    'అవును, అన్నీ విన్నాను నేను."
    "జరిగిందంతా నువ్వు నమ్ముతున్నావా?"
    అతడి బావ చటుక్కున ఆమె చేతిలోంచి కత్తి లాక్కుని "నేనిప్పుడు నీ ప్రాణాలు తీస్తానంటే నమ్ముతావా?" అన్నాడు .
    "నమ్మను" అన్నాడతను.
    "ఎందుకని?"
    "నాకు మానవత్వం మీద నమ్మకముంది ."
    అతను నవ్వి "స్త్రీకి పరిభిక్ష పెట్టడం" అన్నాడు.
    "ఏ స్త్రీకి ?"
    క్షణాల మీద అతను తన చేతిలోని తాళి బొట్టును ఆమె మెడలో వేసి "ఈ స్త్రీకి !" అన్నాడు.
    అతడి బావ , ఆమె ఊహించని ఈ పరిణామానికి తెల్లబోయారు.
    "ఏమిటిది?" అన్నడతడి బావ.
    "మా పెళ్ళికి నువ్వే సాక్షివి " అన్నాడతను.
    అతడి బావ, ఆమె వైపు తిరిగి 'అయితే ఇప్పుడు నువ్వు పతిభిక్ష పెట్టమంటావా ?" అన్నాడు.
    'అసలు నేనా విషయమే ఆలోచించడం లేదు" అన్నదామె.
    "ఎందుకని?"
    "నేను శ్యామల విషయం ఆలోచిస్తున్నాను. నేను చచ్చేక కదా ఆమెను వివాహ మయ్యేది ?" అన్నదామె.
    అతడి బావలో ఆవేశం పెల్లుబికింది. "వీడు నరరూప రాక్షసుడు. వీడ్ని బ్రతకనివ్వ కూడదు" అన్నాడు ఆవేశంగా.
    "పతిభిక్ష అడగడానికి బదులు నా బావ నింకా రెచ్చ గోడుతున్నావు? ఇది ఉత్తమ ఇల్లాలి లక్షణం కాదు" అన్నాడతను.
    ఆమెకు ఆవేశం కలిగింది. అతడి బావ చేతిలో కత్తి వుంది. అయినా అతడికి ఎంత ధైర్యం! సెంటి మెంట్లతో ప్రపంచాన్నే జయించాగలనని అతడి నమ్మకం. ఈ నమ్మకము చాలా ప్రమాదకరమైనది. ఈ నమ్మకంతో ఆతడు ఆడపిల్లల్ని వల్లో వేసుకుంటున్నాడు. సమాజంలో పెద్ద మనిషిననే భావిస్తున్నాడు.
    "నువ్వు పతివనీ అంగీకరిస్తున్నాను. పతి వ్రతాధర్మాన్నీ పాటిస్తున్నాను" అన్నదామె.
    "నువ్వు పరిభిక్ష అడుగుతావా?" అన్నదతడి బావ ఆశ్చర్యంగా.
    "లేదు" అన్నదామె. "ఇతడు నా మెడలో మంగళ సూత్రాలు వేశాడు. పతివ్రతా ధర్మాన్ని పాటించి అతడు పోయినప్పుడే వాటిని మెడలోంచి తీస్తాను."
    'అవి నీకు కొంత కాలం పాటు వుంచుకోవాలని వున్నదా?"
    అతడు, అతడి బావ ఆమె వంక జవాబు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
    "నా మెడలో సర్పాహారం కదలాడుతున్న భ్రాంతి కలుగుతున్నది. ఏ క్షణం లోనైనా నా ప్రాణాలు పోవచ్చు నన్న భీతి నాలో రేగుతున్నది" అన్నదామె.
    "ఇదా నీ పతివ్రతా ధర్మం" అన్నాడతను కోపంగా.
    "నువ్వింక మాట్లాడకు" అన్నదతడి బావ.
    అతడి బావ ఆదేశం పై ఆమె అతడిని తిరిగి తాళ్ళతో బంధించింది.
    "కళ్ళు మూసుకో, దైవ ప్రార్ధన చేసుకో !" అన్నాడతను.
    -- ఇది చదివి ఎవరయినా కధ మొదటికి వచ్చిందనుకుంటే పోరాబడ్డారనే అనాలి. ఎందుకంటె కధ యిక్కడే ముగిసిపోయింది.

                                   ***   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS