సావిత్రి కూడా నవ్వి అన్ని విషయాలలో లాగే అదీ తనకు తెలిసిన సబ్జక్టు కాబట్టి భర్తకు సలహాలనిస్తున్నా నని చెప్పి భర్త ఆరోజు చేస్తానన్న ప్రయోగం గురించి చెప్పింది. "ఎందుకో ఈ విషయంలో నా భర్త గొప్ప డిస్కవరీ చేస్తారని నాకు చాలా నమ్మకంగా ఉంది" అని కూడా అంది.
కరుణ నవ్వి, "మీవారదృష్టవంతులు, నాకు మావారి మీద అంత నమ్మకం లేదు" అంది.
"మీకు లేకపోతెం లెండి- మీరు కాదన్నా మీ వారి సామర్ధ్యం చూసేవాళ్ళకు కనిపిస్తూనే ఉందిగా" అంది సావిత్రి.
కరుణ భర్తకు కారుంది. వాళ్ళ ఇల్లు సావిత్రి ఇంటికి పక్కనే ఉన్నా - చూడగానే గొప్ప వాళ్ళ ఇల్లని తెలిసిపోయేలాగుంటుంది. వాళ్ళింట్లో ఫర్నిచర్ ఖరీదైనది మాత్రమే కాక ఎంతో అందమైనది, అద్భుతమైనది . ఇంట్లో ఎప్పుడూ ఇద్దరూ ముగ్గురు పని వాళ్ళుంటారు. కరుణకు అంతస్తు ఉన్నా గర్వం లేదు. ఆమె చాలా సింపుల్ గా ఉంటుంది. ఆమె స్నేహం సావిత్రి లాంటి వాళ్ళతోనే!
కరుణ వెళ్ళిన అరగంటకు శేఖరం ఇంటికి వచ్చాడు. వస్తూనే అతను సావిత్రి మీద తన ఉత్సాహాన్ని ప్రదర్శించాడు.
"ఏదో జరిగింది , లేకపోతె ....." అంది సావిత్రి ఉత్సాహంగా.
'అవునోయ్, ఈరోజు నేను చేసిన దోకటైతే సాధించింది మరొకటి" అంటూ సింపుల్ గా టూకీగా తన ప్రయోగం వివరాలామెకు చెప్పాడు. సావిత్రి అంతా విని ఆశ్చర్యంగా 'అంతా బాగానే ఉంది కానీ ఆ రేడియేషన్ కు మగవారి మీద కూడా ఏదైనా ప్రభావం చూపించగల శక్తి ఉందేమో చూడండి, లేకపోతె ఈ మధ్య కాలంలో మిమ్మల్నింత ఆవేశంగా చూడలేదు" అంది.
'ఈ రేడియేషన్ వేరు. అది నీ కళ్ళలోంచి వస్తుంది. అంతే కారణం" అన్నాడు శేఖరం. అతను ఉత్సాహంగా ఉన్నాడు.
శేఖరం దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసేటంత దేశ భక్తుడు ఔనో కాదో తెలియదు కానీ దేశానికి ఉపకారం జరిగే పని తన వల్ల నవుతుందంటే ఆనందం పొందేటంత భక్తీ మాత్రం అతనికుంది. తన ఈ ప్రయోగం ఫలిస్తే దేశం సస్యశ్యామలమై పోతుంది. పేదరికం మాడిపోతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ ఎంత కావాలంటే అంత ఎప్పుడు కావాలంటే అప్పుడు వాన కురుస్తుంది. అతివృష్టిని నివారించ లేకపోయినా అనావృష్టిని నివారించడానికి తన ప్రయోగం పనికి వస్తుంది.
శేఖరానికా రాత్రి నిద్రపట్టలేదు. మర్నాడు తను చేయదలచుకున్న ప్రయోగాల గురించి ఆలోచిస్తుంటే అతడికి నిద్ర రావడం లేదు. సావిత్రి మాత్రం మధ్య మధ్యలో మెలకువ వచ్చినప్పుడల్లా "ఇంకా మీకు నిద్ర పట్టలేదా ...." అంటుండేది. ఒక దేశపు భవిష్యత్తునే మార్చివేయగల ప్రయోగం గురించి ఆలోచిస్తున్న శేఖరానికి నిద్రపట్టక పోవడంలో ఆశ్చర్యం లేదు.
మర్నాడు సావిత్రి నిద్ర లేస్తూనే "రాత్రి మీకు నిద్ర పట్టినట్లు లేదు. మీకు నిద్రపట్టనప్పుడు నన్ను నిద్ర పోనీవ్వడం ఇదే మొదటి సారి. ఆ రేడియేషన్లో ఏదో ఉంది బాబూ" అంది.
'అదే తేలుస్తాను" అన్నాడతను. అతడు త్వరత్వరగా కాలకృత్యాలు తీర్చుకుని టిఫిన్ తిని ఆఫీసుకు బయలుదేరి వెళ్ళాడు. ఆఫీసులో శేఖరాన్ని బాస్ పిలిచి, "ఈరోజు ఫీల్డు లోకి వెళ్ళవద్దు. కొంత పేపర్ వర్క్ చేయాలి" అన్నాడు.
తను నిన్న కనుగొన్న ప్రయోగ ఫలితాల గురించి చెప్పాలా కూడదో అనుకున్నాడు శేఖరం. వాటిని దృవపర్చుకునే వరకూ బాస్ కు చెప్పడం మంచిది మంచిది కాదనిపించి ఊరుకున్నాడు శేఖరం. ఆరోజు ఫీల్డు లోకి వెళ్ళడానికి వీలుకానందుకు శేఖరానికి నిరుత్సాహం కలిగింది. కానీ ఏం చేసేది ఇండియాలో రీసెర్చి ఇంతే, సగానికి పైగా పేపర్ వర్కే!
మధ్యాహ్నం మూడున్నరకు శేఖరానికి ఫోన్ వచ్చింది. బహుశా ఇంటి దగ్గర్నుంచే అయుంటుందనుకున్నాడు శేఖరం. కానీ ఫోన్ లో ఎవరిదో పురుష వ్యక్తీ కంఠం వినిపించింది.
"మాట్లాడేది శేఖరం గారేనా?"
"అవును- శేఖరాన్నే మాట్లాడుతున్నాను ."
"కంగ్రాచ్యులేషన్స్ శేఖరం గారు. మీరింక ఉద్యోగం చేయనవసరం లేదు. అయినా లక్షాదికారయ్యేక ఉద్యోగం మీరెందుకు మాత్రం చేస్తార్లెండి?' అన్నాడు అవతల వ్యక్తీ.
"హలో! మీరే శేఖరంతో మాట్లాడుతున్నారో తెలుసా?"
"తెలుసండీ? మీ లాబరేటరీ లోశేఖరం పేరుగల సైంటిస్టు ఒక్కరే కదా ఉంది" అన్నాడు అవతలి వ్యక్తీ" ఇంకా మేము పొరబడుతున్నామని మీ కనుమానంగా ఉంటె మరికొన్ని వివరాలివ్వగలను. మీ భార్య పేరు సావిత్రి , చాలా?"
శేఖరానికి కొద్దిగా భయం వేసింది. 'ఇంతకీ మీరు నాకెందుకు ఫోన్ చేశారో చెప్పగలరా?" అన్నాడు.
"నిన్నమీరు సాధించిన అద్భుత ఫలితముంది చూడండి. అదే వాతావరణంలోని మార్పు గురించి, ఆ సందర్భంలో మీతో మాట్లాడాలి."
"ఏం మాట్లాడతారు?"
"ఇప్పుడు చెప్పను. ఇంటికి వెళ్ళండి. మీ భార్య చెబుతుంది !"
" నా భార్య మీకెలా తెలుసు?" అడిగాడు శేఖరం. సమాధానంగా అవతల క్లిక్ మంది.
3
శేఖరానికి మనసు మనసులో లేదు. ఆతనాఫీసులో ఏ పని మీద దృష్టి నిలపలేకపోయాడు. తనకు ఫోన్ చేసినదెవరు? నిన్న తను చేసిన ప్రయోగం గురించి అతనికేలా తెలిసింది?"
ఎవరో తనింటి కొచ్చి ఉండాలి. మాటల సందర్భంలో సావిత్రి అతనికి తన ప్రయోగం గురించి చెప్పి ఉండాలి. అతనికీ విషయం మీద బాగా ఆసక్తి ఉండి వుండాలి. అందుకే వెంటనే తనకు ఫోన్ చేశాడు. అయితే ఫోన్ చేయడమెందుకు?
శేఖరం మనసులో ఇంకా ఒకటి రెండు ప్రశ్నలున్నాయి. తన భార్య దగ్గర చనువుగా మాట్లాడగలిగిన ఆ మగాడేవరు? అతనికి ఈ పరిశోధన మీద కుతూహలం మెందుకు? కుతూహలమున్న వాడు ----తిన్నగా లాబరేటరీ కి రావచ్చు. లేదా సాయంత్రం తనింటికి వచ్చేవరకు ఎదురు చూడవచ్చు. ఈ రెండు కాకుండా ఫోన్ చేశాడంటే ఏదో రహస్యముండి ఉండాలి .
ఓ పావుగంట ముందుగానే శేఖరం ఇల్లు చేరాడు. అతను చేరే సమయానికిల్లు తాళం వేసి ఉంది. శేఖరం ఆశ్చర్య పడ్డాడు. అతనికి కొద్దిగా భయం కూడా వేసింది.
అతనింకా ఆలోచనలో ఉండగానే ఎవరో అతన్ని పిలిచారు. శేఖరం వెనక్కి తిరిగాడు.
"నా పేరు రాజయ్యండి. పక్కింట్లో నౌకర్నండి. కరుణమ్మ గారు మీకీ ఉత్తరమిమ్మన్నారండి. ఇది సావిత్రమ్మ బయటకు వెడుతూ మీకిమ్మని చెప్పి ఇచ్చారుటండి" అని ఓ కవరు శేఖరం చేతికిచ్చి వెళ్ళిపోయాడు.
శేఖరం కవరు చించి అందులోంచి ఉత్తరం పైకి తీశాడు.
'డియర్ శేఖరం ....
ఈ కవరు నీచేతి కండగానే జాప్యం చేయకుండా రవీంద్ర కాలనీకి బయల్దేరు. అక్కడ సిటీబస్ స్టాపు దగ్గర చేతిలో ఆకుపచ్చ రుమాలు పట్టుకున్న మనిషి దగ్గిరకు వెళ్లి నీ పేరు చెప్పు. అతను తీసుకు వెళ్ళిన చోటికి వెళ్ళు. శుభమవుతుంది.
వెళ్ళకపోతే నీ భార్య ఏమవుతుంది. చెప్పడం అనవసరం. కానీ ప్రస్తుతం ఇంట్లో ఆమె లేదనీ -- అందుక్కారణం మేమనీ గుర్తుంచుకో.
ఇందులో నీకు గానీ నీ భార్య కు గానీ ప్రమాదమేమీ లేదు. మా దగ్గరకు రాగానే ఇంత చిన్న విషయానికింత హడావుడి చేశామేమిటని ఆశ్చర్యపోతావు. నీకేమాత్రమూ కష్టం కాకుండా -- అనుకోని ఆర్ధిక లాభం కలిగించే శ్రేయోభిలషులను నువ్వు కలుసుకోబోతున్నావని గుర్తుంచుకుంటే చాలు మాకు.
ఉంటాను మరి -- వస్తావు కదూ!
నీ శ్రేయోభిలాషి ."
శేఖరం ఉత్తరాన్ని జేబులో పెట్టుకుని వెనక్కు తిరిగాడు. ఏం జరిగిందో , ఏం జరుగబోతోందో అతనికి అర్ధం కాక అయోమయంగా ఉంది. కానీ తన భార్య ఇంట్లో లేదనీ ఆమె ఎవరో పరాయి వారి చేతుల్లో పడిందని అతనికి తెలుస్తోంది.
అతను సిటీబస్ ఎక్కి రవీంద్ర కాలనీ వద్ద దిగాడు. అక్కడున్న ఒకతని చేతిలో పచ్చ జేబురుమాలుండడం గమనించి తిన్నగా అతని వద్దకు వెళ్ళి "నా పేరు శేఖరం" అన్నాడు. అతను నవ్వి "నాతో రండి" అన్నాడు.
శేఖరం కదిలాడు. ఇద్దరూ కలిసి సుమారు ఒక కిలోమీటరు దూరం నడిచి ఒక ఇంటి దగ్గరకు వెళ్ళి ఆగారు.
'ఈ ఇంట్లోకే మనం వెళ్ళాలి" అన్నాడు పచ్చరుమాలతను. శేఖరం అతన్ననుసరించాడు.
ఇంటికి వీధరుగులున్నాయి. ఒక అరుగు మీద చిన్న గది ఉంది. ఆ గది తలుపులు తీసి ఉన్నాయి. శేఖరం ఆ గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో మొత్తం నలుగురు కూర్చుని పేకాడుతున్నారు, వారిలో ఒకడు శేఖరాన్ని చూసి నవ్వి "వచ్చేరా రండి కూర్చోండి" అన్నాడు.
అక్కడ ఒకే ఒక కుర్చీ వుంది. అది ఖాళీగా వుంది. పెకాడుకునే వారంతా క్రింద కూర్చుని ఆడుతున్నారు. శేఖరం సందేహిస్తూనే ఆ కుర్చీలో కూర్చున్నాడు.
