Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 56


    "బాబూ రిక్షాకావాలా?" అన్నాడో రిక్షావాలా.
    రాజా విక్టర్ ఆ రిక్షావాడిని అనుమానంగా చూశారు. వాడే వెంకన్న కాదు కదా అని వాళ్ళు భయపడుతూ వద్దని చెప్పి ముందడుగు వేశారు. గమ్యం వారి మనసులో వుండనే వుంది.
    సదానంద్ యిల్లు అక్కడికే తాము చేరుకోవాలి. వెంకన్న విషయం చెప్పాలి. తమను పట్టుకోలేకపోతే వెంకన్న మత్తుపదార్ధాలను తమకు తిరిగి అప్పగిస్తానని మాటిచ్చాడు. అతడు మాటమీద నిలబడతాడు. అందువల్ల సదానంద్ కీ విషయం తెలియబరిస్తే అతడు వెంకన్న మీద దాడి చేసి ఆ మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకోగల్గుతాడు.
    తాము సదానంద్ ను కలుసుకోవాలంటే మామూలుగా సదానందుడే యిల్లు కాక-జనతా కాలనీలో ఉన్న రాజ్యలక్ష్మీ నివాస్ కు వెళ్ళాలి. అక్కడ సదానంద్ యింటికి రహస్యంగా ఫోన్ చేయడానికి సదుపాయముంది. రాజ్య లక్ష్మీ నివాస్ కూ సదానంద్ కూ సంబంధ ముందని ఎవ్వరూ వూహించలేరు. ఆ యింటిలో మామూలు మధ్య తరగతి కుటుంబ మొకటి ఉంటోంది. వారిని సదానంద్ ఏజంట్లని ఎవ్వరూ అనుకోలేరు.
    రాజా, విక్టర్ కొంత దూరం కాలి నడకన వెళ్ళాక రిక్షా ఎక్కి జనతా కాలనీకి వెళ్ళారు. రాజ్యలక్ష్మి నివాస్ కు చేరుకున్నారు. ఆ యిల్లు తాళం పెట్టి ఉంది.
    "ఇప్పుడేం చేయాలి?" అన్నాడు విక్టర్.
    "తాళం పక్కింట్లో యిచ్చారేమో అడగాలి" అన్నాడు రాజా.
    ఇద్దరూ పక్కింటికి వెళ్ళారు. ఓ ముసలాయన వచ్చి తలుపు తీశాడు. విషయం తెలుసుకుని "వాళ్ళంతా చుట్టాలింట్లో పార్టీకి వెళ్ళారు అయిన వాళ్ళెవరయినా వస్తే తాళం ఇవ్వన్నారు...." అన్నాడు.
    "మేము శంకర్రావు ఆఫీసు చుట్టాలం-" అన్నాడు రాజా.
    ముసలాయన మారు మాట్లాడకుండా వాళ్ళకు తాళం చెవి యిచ్చాడు.
    ఇద్దరూ తాళంచెవి తీసుకుని రాజ్యలక్ష్మీనివాస్ తలుపులు తెరిచి లోపల చొరబడ్డారు.
    వాళ్ళిద్దరికీ అది తెలియనిచోటేమీకాదు. ఓ గదిలోకి వెళ్ళి గోడకున్న శ్రీనివాసుడి పటం తొలగించారు. అక్కడో చిన్నగూడు, ఆ గూట్లో టెలిఫోను వున్నాయి.
    రాజా హడావుడిగా ఓ నెంబరు తిప్పి-"హలో-సదానంద్ గారున్నారా-?" అన్నాడు.
    "ఏ సదానంద్?" అని అవతలనుంచి ప్రశ్నవినబడింది.
    "ప్రముఖ పారిశ్రామికవేత్త...." అన్నాడు రాజా.
    "ఊఁ ఏం చెబుతావో చెప్పు..."
    రాజా క్లుప్తంగా-"మాదగ్గరున్న మత్తుపదార్ధాలు డిటెక్టివ్ వెంకన్న చేతుల్లోపడ్డాయి. అతడిమీద దాడిచేస్తే అవి మనకు దక్కుతాయి...." అన్నాడు.
    "ఊఁ సరే-లైన్లో వుండండి...." అంది అవతలిగొంతు.
    రాజా తేలికగా నిట్టూర్చాడు. తాననుకున్నది సాధించానని అతడికెంతో సంతోషంగా వుంది.
    అప్పుడు లైన్లోకి సదానందం వచ్చాడు. సరుకెలా పోయిందీ అడిగి తెలుసుకున్నాడు వెంకన్నచేతిలో దొరికిపోనందుకు మెచ్చుకుని మిగతా విషయం తను చూసుకుంటానన్నాడు.
    డిటెక్టివ్ వెంకన్న తమను దయతలచి వదిలిపెట్టాడనీ-తమ మధ్య సవాలు నడుస్తున్నదనీ మాత్రం వాళ్ళుసదానంద్ కు చెప్పలేదు.
    "మొత్తంమీద అనుకున్న కార్యం సాధించాం-" అన్నాడు విక్టర్.
    "ఇప్పుడేం చేద్దాం-ఇక్కడేవుండి విశ్రాంతి తీసుకుందామా-లేక ట్రెయినెక్కేద్దామా?" అన్నాడు రాజా.
    "ఈవేల్టికి ఏ ట్రయిన్ గురించీ ఆలోచించవద్దు. ఆ వెంకన్న ఏ రైల్వేస్టేషన్లో కలిసినా ఆశ్చర్యంలేదు...." అన్నాడు విక్టర్.
    "అవును-ఇరవైనాలుగ్గంటలు-అతణ్ణి తప్పించుకుని తిరగాలి-" అన్నాడు రాజా.
    "అంత సమయం అవసరముంటుందనుకోను. సదానంద్ మనుషులు వెంకన్నను వేటాడ్డానికి బయల్దేరి వుంటారు...." అన్నాడు విక్టర్.
    "మూడొంతులు వెంకన్న పని ఫినిష్...." అన్నాడు రాజా.
    ఇద్దరూ ఉత్సాహంగా యింట్లోంచి బయటకువచ్చి తలుపుకు తాళంవేసి పక్కింట్లో తాళం'చెవి యిచ్చి వచ్చారు.
    "ఏదైనా హోటలుకు పోయిపడుకుందాం-"అన్నాడు రాజా.
    ఇద్దరూ రాజ్యలక్ష్మి నివాస్ వున్న సంధులోంచీ మెయిన్రోడ్డుమీదకు వచ్చారు. సరిగ్గా అక్కడ వెంకన్న నిలబడి వున్నాడు.
    "సో-బాయ్స్.....ఇంకా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా?" అన్నాడతడు.
    రాజా తెల్లబోయి-"ఎవర్నువ్వు?" అన్నాడు.
    "ఇంకెవరు?" అన్నాడు వెంకన్న-"మిమ్మల్ని నీడలా వెంటాడుతున్న వెంకన్నను...."
    "మమ్మల్నెలా కనిపెట్టావ్?" అన్నాడు బురఖాలోవున్న విక్టర్.
    "లొంగిపోయామని ఒప్పుకోండి రహస్యం చెప్పేస్తాను..."
    "లొంగిపోతే ఏం జరుగుతుంది?"
    "మీరు సదానంద్ కు చెప్పిన అబద్ధం అబద్ధంలాగే వుండిపోతుంది. ఒకవేళ మీరు నాకిచ్చిన మాటతప్పి మళ్ళీ నేరాలకు దిగారంటే మీ అంతట మీరే నాకు బ్రీఫ్ కేసులు అప్పజెప్పి-సదానంద్ కి సంబంధించిన రహస్యాలన్నీ చెప్పేశారని సదానంద్ కు వార్త చేరవేస్తాను..."
    "ఆయన నీ మాట నమ్మడు!"
    "ఎందుకని?"
    "మామీద ఆయనకున్న నమ్మకమలాంటిది...."
    "అలాగా-అయితే నేనొకవేళ సదానంద్ తో మీ స్మగ్లింగ్ కార్యకలాపాలకు త్రిభువన్ హోటల్. ఖాన్ టైలరింగ్ షాప్. థియేటర్ కుసుమ, జనతాకాలనీలోని రాజ్యలక్ష్మినివాస్ అని నాకు తెలిసిపోయిందని చెప్పాననుకోండి. అప్పుడాయన ఎవర్ననుమానిస్తాడు?" అన్నాడు వెంకన్న.
    "ఇవన్నీ మీ కెలా తెలిశాయ్?" అన్నాడు రాజా. వెంకన్ననుంచి తప్పించుకునేందుకు తమకున్న సదుపాయాలన్నీ తాముపయోగిస్తే జరిగిందేమిటి?
    "స్మగ్లింగులో మీకున్న సదుపాయాలన్నీ తెలుసుకుందుకే మిమ్మల్ని తప్పుకు పోనిచ్చాను..." అన్నాడు వెంకన్న.
    రాజా, విక్టర్ ఇద్దరూ వెంకన్నకు రెండు చేతులూ జోడించి నమస్కరించి-"హేట్సాఫ్ టూ యూ!" అన్నారు. అప్పుడు రాజా-"మాలో మార్పురావాలన్న మీ ఆశయం తప్పక నెరవేరుతుంది. కానీ మీరు మమల్నెలా కనుక్కోగలిగారో చెప్పండి...." అన్నాడు.
    "మీ రిద్దరూ ఒకరినొకరు వదిలి వుండలేరు. మారువేషాలు కూడా జంటగావేసిన కారణంగా నా పని చాలా సులభమైంది.....అది మొదటి పాయింటు-" అన్నాడు వెంకన్న.
    "మరి రెండోపాయింటు?" అన్నాడు విక్టర్.
    "దూరాన్నుంఛే నేను ఎత్తులు అంగుళాలతో సహా అంచనా వేయగలను. అటుపైన ఏ మారువేషం వేసినా మీ యిద్దరి ఎత్తూ నా దగ్గరున్న బైనాక్యులర్స్ సాయంతో చూసేవాణ్ణి. మీ యిద్దరికీ భుజాలదగ్గర సరిగ్గా అయిదంగుళాల తేడావుంది. మొత్తం ఎత్తులో నాలుగంగుళాలతేడా వుంది. ఇద్దరూ ఎప్పుడూ ఇంచుమించు ఒకేరకం ఎత్తున్న జోళ్ళు ధరించారు. అందువల్ల మీకున్న ఆ  తేడాయే మిమ్మల్ని నాకు సులభంగా పట్టిచ్చింది. ఇది రెండో పాయింటు-" అన్నాడు వెంకన్న.
    "మరి మూడోపాయింటు?" అన్నాడు రాజా.
    "అది ట్రేడ్ సీక్రెట్ చెప్పకూడదు. టాటా!" అన్నాడు వెంకన్న.
    వెళ్ళిపోతున్న వెంకన్నను చూస్తూ-"ఇలాంటి డిటెక్టివ్ లుండగా-మనం మన పద్ధతులు మార్చుకోవడమే మంచిదనిపిస్తోంది-" అన్నాడు రాజా.
    విక్టర్ తలూపాడు.


                                             :-అయిపోయింది:-


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS