Previous Page Next Page 
డాళింగ్ పేజి 57

 

    కళ్లిప్పి చూసాడు.
    తెల తెలవారుతోంది.
    రకరకాల రంగుల ముసుగేసుకున్న బెంగాలీ అమ్మాయి ముఖంలా అందంగా ఉన్నాడు ఉదయిస్తున్న సూర్యుడు.
    దూరంగా నాటు పడవలతో , నీళ్ళలోకి దిగుతున్న జాలరి యువకులు ఆ చివర నుంచి, ఈ చివరి వరకూ ......
    సముద్రపు ఒడ్డు, మసక మసక చీకటి వెలుగుల్లో , జీవితంలా ఉంది.
    అంతెత్తున అలలతో ఎగిరే సముద్రం ఎదుట -
    తానొక్కడే !
    తల వెనక రెండు చేతులూ పెట్టుకుని, ఆకాశం వేపు చూస్తున్నాడు విమల్.
    లేత శీతాకొకచిలుక రెక్కల మీద, ఒక్కటోక్కటిగా పేరుకుంటున్న రక, రకాల రంగుల ముద్రల్లా-
    జ్ఞాపకాలు......
    స్వగతమైన జ్ఞాపకాలు .......
    తల్లీ, తండ్రీ , తర్వాత అతనికిష్ట,మైన ఏకైక వ్యక్తీ కృష్ణ వందన.
    అతని అనుభూతుల్ని, లాలించిన వ్యక్తీ కృష్ణ వందన.
    మొన్నటి తరం ప్రేక్షకులకు రుక్మిణి, జయేంద్ర ఎంత పాపులరో, నిన్నటితరం ప్రేక్షకులకు విమల్, కృష్ణ వందన అంతటి పాపులర్.
    సినిమా వాళ్ళకు సెంటి మెంట్లేక్కువ.
    ఒక సినిమాలో ఒక డైరెక్టర్ 'స్మశానంలో హీరో, హీరోయిన్ల పాట పెడితే ఆ సినిమా 'హిట్ 'అయితే -
    అక్కణ్ణింఛి , ప్రతి సినిమాలోనూ స్మశానంలో హీరో, హీరోయిన్ల పాట తప్పనిసరి, స్మశానంలో ప్రేమ పాటే విటని ఎవరైనా అడిగితె- అంతే .........వాడివేపు అనుమానంగా  చూస్తుంది.
    పాండిచ్చేరి బ్యాక్ డ్రాప్ తో తీసిన "కనుపాపల్లో కాటుక" సూపర్ హిట్ అవడంతో ఆ వరుసలో ఓ నాలుగు సినిమాలు , అక్కడే షూటింగ్ చేసుకున్నాయి.
    అందులో ఒకటి .....
    అనంత గీతం.
    అది లేడీ ఓరియెంటడ్ సబ్జెక్టు. మెయిన్ కేరక్టర్ కృష్ణ వందనది. ఆ సినిమాకు డైరెక్టర్ నారాయణబాబు. డైరెక్టర్ కోరిక మీద, సినిమా మలుపుకి అతి ప్రధానమైన ఒకే సీన్లో నటించడానికి ఒప్పుకున్నాడు విమల్.
    సెంటిమెంట్ ప్రకారం ------
    ఆ సీన్ పాండిచ్చేరిలో తీయడానికి డైరెక్టర్ నిర్ణయించాడు.
    పాండిచ్చేరికి వందకిలో మీటర్ల దూరంలో ఉన్న------
    పూమ్ పుహల్ పట్టణంలో షూటింగ్.
    పల్లవరాజుల కాలంలో ఈ పట్టణం ప్రఖ్యాత మైన రేపు పట్టణం. అద్బుతమైన భవనాలు, కట్టడాలు ఇక్కడి ప్రత్యేకత.
    తమిళ బాషకు చెందిన ప్రఖ్యాత ఇతిహాసం శిలస్పదికారం కధ ఈ ప్రాంతంలోనే జరిగిందని పూరాతత్వ శాస్త్రవేత్తలు చెప్తారు.
    సముద్రం ఒడ్డునున్న -----
    ఓ పాత భవనం దగ్గర షూటింగ్ !
    'సముద్రంలోకి దూకి చనిపోదామని నిర్ణయించుకున్న హిరోయిన్ శిల్పను (సినిమాలో కృష్ణవందన పేరు) హీరో అవినాష్ రక్షించబోతాడు.
    ప్రమాదవశాత్తు తను సముద్రంలో పడి కొట్టుకు పోతాడు. హీరోయిన్ తో పాటు అందరూ హీరో చనిపోయాడని అనుకుంటారు. కానీ చివరికి హీరో బ్రతికి వస్తాడు (అది ఫ్లాష్ బేక్ కధ)
    డైరెక్టర్, ప్రొడ్యుసర్ తో సహా , సిబ్బంది పాండిచ్చేరి ప్రయాణమై పోయారు.
    కృష్ణవందన , విమల్ ఒక కారులో ఉన్నారు.
    కారుని విమల్ డ్రైవ్ చేస్తున్నాడు.
    పూమ్ పుహాల్ , తరంగం బాడీ రోడ్ లో కారు వెళ్తోంది. రోడ్డుకి కుడివేపు సముద్రం.
    చీకట్లో అలలు కన్పించడం లేదు, అలల శబ్దం మాత్రం భూమి తీసే ఉచ్చ్వాస, నిష్వాసల్లా ఉన్నాయి.
    "అర్జెంటుగా పాండిచ్చేరి వెళ్ళిపోవాలా.....ఎక్కడైనా కాసేపు కూర్చుందాం....." సీరియస్ గా డ్రైవ్ చేస్తున్న విమల్, ఆ మాటకు తల తిప్పి చూసాడు.
    తను కూడా ఆ ఉద్దేశ్యంతోనే ఉన్నాడు.
    మాట్లాడకుండా, రోడ్ పక్కనున్న నైట్ కాఫీ షాపు ముందు కారపాడు.
    ఫ్రాన్ మసాలా అక్కడి వెరైటీ డిష్.
    కృష్ణవందనకి చాలా ఇష్టం. కృష్ణవందన తింటుంటే, తను కోల్డ్ కాఫీ తాగుతూ కూర్చున్నాడు విమల్.
    ఆ తర్వాత ఇద్దరూ ఎదురుగా ఉన్న బీచ్ వేపు నడిచారు. బీచ్ కుడివేపున ఓ రాతి రధం శిధిలావస్థలో ఉంది. ఆ రధం, చక్రం మీద కూర్చున్నాడు విమల్, కింద ఇసకలో కూర్చుంది కృష్ణ వందన.
    కృష్ణ వందనతో ఏవేవో మాట్లాడాలని ఉంది విమల్ కి. అరకు లోయలో ఆప్యాయంగా మాట్లాడుకున్న తర్వాత ---
    అంతటి ఏకాంతం మరి దొరకలేదు.
    పాపులారిటీ , జీవితంలో ఏకాంతమానేదాన్ని లేకుండా చేస్తోంది.
    బిజీ, బిజీ షూటింగులు, లైట్లు, హడావుడి, కలబోల్లి కబుర్లు, పొగడ్తలూ, సన్మానాలు, సంబరాలు, సినిమాలు హిట్టయితేనే నటులు లేకపోతే వాళ్ళేమయ్యారో ఎవరికీ తెలీదు.
    ఆకాశానికీ అందలాలు వేయడం, అధఃపాతాళంలోకి నేట్టేయ్యడం రెండు అరక్షణంలోనే...
    మాయాలోకం ,
    "ఏం ఆలోచిస్తున్నావ్ విమల్ ....ఏదైనా మాట్లాడు ." తనే అంది కృష్ణ వందన.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS