"నువ్వు నన్ను ఎన్నైనా తిట్టు . చంపవద్దు ."
ఆమె వికటంగా నవ్వింది -- "కానీ నిన్ను చంపుతాను నేను --"
"ఎందుకని ?"
"ఆ ప్రశ్న నీవే వేసుకో !"
అతను కళ్ళు మూసుకున్నాడు.
"దైవ ప్రార్ధన చేసుకుంటున్నావా?"
"లేదు -- నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను...."
"నీ ప్రశ్నలూ సమాధానాలూ నాకు వినబడేలా పైకి చెప్పు -- వాటిలో నాకు తేడా కనిపించిందా కత్తి సూటిగా నీ గుండెల్లోకి దిగుతుంది " అన్నదామె.
* * * *
"మన పెళ్లెప్పుడో చెప్పడం లేదు నువ్వు " అన్నదామె.
"మన పెళ్ళి అయిపొయింది " అన్నాడతను.
"ఎప్పుడు ?"
"చెప్పనా ?"
"అతడు చెప్పాడు. ఆమె సిగ్గుపడింది.
"చాలా అందంగా సిగ్గుపడతావు నువ్వు..."
"నాకు పొగడ్తలు వద్దు. పెళ్ళి కావాలి ."
"మన పెళ్ళి అయిపోయిందని చెప్పాను నీకు."
"మన పెళ్లి కాలేదు ."
'అయింది ."
"అయితే మీ యింటికి వెడదాం . నాకు అత్తమామల ఆశీర్వాదాలు కావాలి" అన్నదామె.
"నాకు ఎవ్వరూ లేరు. ఇదే నా యిల్లు."
'అయితే ఈరోజు నించీ నేనిక్కడే వుండిపోతాను ."
"పెళ్ళి కాగానే ఈ గది ఖాళీ చేయాలని ఇంటాయన షరతు పెట్టాడు ."
"పోనీ -- నువ్వు మా ఇంటికి కొచ్చేయి ...."
'అలాగే -- కానీ రేపు మంచిది కాదు."
"నీకు తిది వార నక్షత్రాలు కూడా తెలుసా ?'
'అన్నీ తెలియవు ! నా లక్కీ డే ఇరవై రెండు. ఈవేళ పన్నెండో తారీఖు. సరిగ్గా పది రోజుల అనంతరం నేను మీ యింటికి వచ్చేస్తాను" అన్నాడతను.
"కానీ నా లక్కీ డే పన్నెండు..."
"మన పెళ్ళయ్యాక నా లక్కీ డేయే నీ లక్కీ డే...."
'అది సరే -- ఈ పది రోజుల్లోనూ నీ భార్య నేం చేస్తావ్?" అన్నదామె.
"నా భార్య ఎవరు ?" నువ్వే కదా!"
"ఈ యింట్లో మనకు పెళ్ళయింది. కానీ నీకు ఇంకో యిల్లుందనీ - అందులో నీకో భార్య వుందనీ -- మీ ఇద్దర్నీ నీ తలిదండ్రు లశీర్వదించారనీ నాకు ఈరోజు ఉదయమే తెలిసింది" అన్నదామె.
అతడు ఒక్క క్షణం తడబడి 'అయితే అన్నీ నీకు తెలిసిపోయాయన్న మాట. ఇక దాచి లాభం లేదు -- మనం జరిగింది మర్చిపోయి -- స్నేహితుల్లా విడిపోదాం --" అన్నాడు.
"మరి నాకు రోజూ పూజ చేయాలి గదా -- ఎలాగ ?"
"వరాలవసరమైనప్పుడే పూజలు. నా కింద నీ నుంచి ఏ వరాలు అవసరం లేదు" అన్నాడతను.
ఆమె అతడి కాలరు పట్టుకుని "నన్నెదుంకిలా మోసం చేశావు చెప్పు?" అన్నది ఆవేశంగా.
"అనవసరంగా ఆవేశపడకు. మగవాడి బుద్ది చంచలం. అది కొత్త రుచులు కోరుతుంది. ఆడదాని వయసు చెడ్డది. అది మగవాడికి లోబడుతుంది. మగవాడి బుద్దికి ఆడదాని వయసు జటపడితే అదొక అందమైన అనుభవం. నిన్ననుభవించడం కోసం నేను ప్రేమను నటించాను. నీ వయసు అల్లరి చేస్తుంటే నువ్వు నన్ను నమ్మినట్లు నటించావు. నేను నిన్ను మోసం చేస్తున్నానని నాకు తెలుసు. మోసపోతున్నట్లు నీకూ తెలుసు. ఇద్దరం సరదాపడ్డం. ఇంత కాలం నీ సహకారానికి నా ధన్యవాదాలు . భర్తగా కాకుండా మగవాడిగా నా అవసరం వుందని పిస్తే భవిష్యత్తు లో కూడా నీకు నేను తప్పక సహకరిస్తాను" అన్నాడతను.
"ఇప్పుడు నేను నీ యింటికి వెడతాను . నీ కధంతా చెబుతాను ."
"ప్రస్తుతానికి నా భార్య ఊళ్ళో లేదు."
"ఆమె ఎక్కడుందో అక్కడికే వెడతాను."
"నీకో అక్కా, చెల్లి వున్నారు. నా కధ బయటపడితే నా కంటే నీ వాళ్ళే ఎక్కువ నష్టపోతారు. అందులోనూ నీ అక్క పెళ్లై కాపురం కూడా చేసుకుంటోంది."
"నీలాంటి వాడికి బుద్ది చెప్పడం కోసం నేను బందుత్వాలనీ మమకారాలనీ మరిచి పోదలిచాను'."
"సరే - ఎందుకైనా మంచిది. నాలుగు రోజులు అగు" అన్నాడతను.
* * * *
"నాలుగు రోజులు అవకాశ మిచ్చేసరికి నువ్వు పెట్రేగి పోయావు. నాకు బాగా గుర్తుంది. ఒక ఉత్తరం తీసుకుని వెళ్ళావు నువ్వు. నా అక్క, బావ సినిమా దగ్గరుండగా నా అక్కకు నమస్కరించావు. ఆమెకో ఉత్తరం ఇచ్చి -- దయుంచి నాకిలాంటి ఉత్తరాలు వ్రాయకండి. నేనలాంటి వాణ్ణి కాదు -- అని వెళ్ళిపోయావు. ఆ ఉత్తరం ఒక ప్రేమ లేఖ.
బావ అక్కను అనుమానించాడు. అక్క కాపురంలో కలతలు రేగాయి. ఈలోగా నేను నీ భార్యను కలుసుకున్నాను. అందరు భార్యల్లాగే ఆమె నన్ను తిట్టింది. నువ్వు అపర శ్రీరామచంద్రుడి వంది.
ఈలోగా నువ్వు నా చెల్లెలు వ్రాసినట్లు ఓ రౌడి వెధవకి ప్రేమలేఖ వ్రాసి అడ్రసు కూడా ఇచ్చావు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాడొచ్చి అత్యాచారం చేయబోయాడు. నలుగురూ వచ్చి వాణ్ణి తన్నబోయారు. వాడు నువ్వు వ్రాసిన ఉత్తరం చూపించి తన తప్పేమీ లేదన్నాడు. ఇంట్లో ఆ సమయంలో తానిక్కర్తీ వుంటుందని వ్రాసిన వివరాలు ఆ రౌడీ వెధవకు తెలిసే అవకాశం లేదు. అందుకని అందరూ నా చెల్లెల్ని తప్పు పట్టారు. అక్క, నేను, చెల్లి -- అందరూ చెడ్డ పేరు తెచ్చుకున్నాం -- నువ్వు మాత్రం అనుకున్నది సాధించావు ....అవునా?" అన్నదామె.
"ఇప్పుడాలోచిస్తుంటే అనిపిస్తున్నది. నేను వర్ణనకు అందనంత దుర్మార్గుడివి. నీ కారణంగా నా కళ్ళు తెరుచుకున్నాయి. నా తప్పులన్నీ సరిదిద్దుకుంటాను. నీ పేరు చెప్పుకుంటాను . నన్ను వదిలిపెట్టు."
"నిన్ను ఎలా వదుల్తాను ?" అన్నదామె. "నీ కారణంగా నా అక్క, ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ప్రాణాలతో తిరిగి రప్పించగలవా?" నా చెల్లికి పెళ్ళి కావడం లేదు. ఆమెకు వరుణ్ణి తెగలవా?"
నేను తప్పు చేశాను. నీకు తెలుసు. తప్పు చేసిన వాళ్ళకు సరిదిద్దు కునే అవకాశమిస్తే వాళ్ళు వాల్మీకి అంతటి గొప్ప వారౌతారు. నావల్లనే ప్రపంచానికి ఎక్కువ ప్రయోజనం వుంటుంది. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు."
"నీలో మార్పు వచ్చిందని నాకెలా తెలుస్తుంది ?"
"ఇప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టు . నాకో అవకాశమివ్వు ."
"అల్ రైట్ " అన్నదామె. అప్పుడామె తన చేతిలో వున్న కత్తిని తీసుకుని అలమారాలో వుంచింది. అతణ్ణి సమీపించి నట్లు విప్పింది.
"చాలా థాంక్స్ -- నీకు అంత మంచిదాన్ని నేనెక్కడా చూడలేదు ."
"నీలో మార్పు వచ్చిందని నాకెలా తెలియబరుస్తావు?" అన్నదామె.
"నువ్వు నన్ను బందించావు. చంపబోయావు. అయినా నా మనసు నిన్ను కోరుతున్నది. ఎందుకంటె నువ్వు నా దేవతవు. నేను నీ భక్తుణ్ణి " అన్నాడతను.
"మరి దేవతను ఎందుకు మోసం చేశావు?"
అతను మాట్లాడలేదు.
"చెప్పు నీకు ఎటువంటి శిక్ష విధించాలి."
"అంతా నీ యిష్టం " అన్నాడతను.
"అయితే అలమారా లోని కత్తి తీసుకునిరా" అన్నదామె.
"ఎందుకు?"
"నీ చిటికెన వ్రేలు తెగ్గోడతాను. అదే నీకు శిక్ష..."
అతను వెళ్ళి కత్తి తెచ్చి ఆమె ముందుంచాడు. ఆమె ఆశ్చర్యంగా "నేను అనుకున్న దొకటి అయినది ఒకటి" అన్నది.
