సరిగ్గా పావుగంటలో ఆ గదిలోకి సర్దార్జీలిద్దరు వచ్చారు. విక్టరీ రాజానూ చూస్తూనే సంతోషంగా పలకరించి తమ పెట్టుడు గెడ్డాలూ, మీసాలూ తీసేశారు. క్షణాలమీద వాళ్ళలో ఒకడు రాజాకులా తయారయ్యాడు. రెండోవాడు స్త్రీవేషం వేశాడు. కాసేపు రూపురేఖలు తీర్చిదిద్దేసరికి వాళ్ళు అచ్చం ఇందాకా రాజా, విక్టర్ లున్నట్లే ఉన్నారు.
రాజా, విక్టర్-ఇద్దరూ వాళ్ళను అభినందించారు. అప్పుడా జంట బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లో రాజా, విక్టర్లిద్దరూ సర్దార్జీ వేషాల్లో బయటకు వచ్చారు.
"ఇంక బ్రహ్మదేవుడు గూడా మనని పట్టలేడు"- అన్నాడు విక్టర్.
"వెంకన్న ఆ జంట ననుసరించి పోయుంటాడు"-అన్నాడు రాజా.
"అది సరేలే-మనమిప్పుడు సర్దార్జీలంగదా-ఏ హోటలుకో పోయి కాస్త చాయ్ తాగుదాం-" అన్నాడు విక్టర్.
దగ్గర్లోనే ఓ చిన్న టీ దుకాణం ఉంది. ఇద్దరూ ఆ దుకాణంలో దూరి ఓ టేబిల్ దగ్గర కూర్చున్నారు.
సర్వరు వచ్చి-"ఏంకావాలి సార్!" అన్నాడు.
"చాయ్-దో..."
సర్వరు లోపలికి వెళ్ళాడు. అతడు టీ తేవడానికి ఆలస్యమైంది.
"టీ తేడానికింత అలస్యమా?" అన్నాడు రాజాకోపంగా.
"ఆలస్యం టీ గురించి కాదుసాబ్!" అన్నాడు సర్వరు.
"మరి? అన్నాడు విక్టర్.
"మీ రార్డరు చెప్పిన సర్వరు లోపలకు వచ్చేక నేనతడి వేషం మార్చుకుందు కింతసేపు పట్టింది!" అన్నాడు సర్వరు.
"వేషం మార్చడమెందుకూ?" అని గతుక్కుమన్నాడు విక్టర్. అంటే ఈ సర్వర్ కొంపతీసి వెంకన్న కాదుగదా! కాదుగదా ఏమిటి.....అతడు వెంకన్నే!
"మీరు వేషాలు మార్చారుగదా-అందుకని నాకూ సరదా పుట్టింది. నా వేషం బాగుందా?" అన్నాడు వెంకన్న.
"మమ్మల్నెలా గుర్తుపట్టావ్?" అన్నాడు రాజా ఆశ్చర్యంగా.
"అది ట్రేడ్ సీక్రెట్ లొంగిపోతానంటే చెబుతాను.."
"ఇంకా ఇరవైనాలుగ్గంటలు టైముంది మాకు..." అన్నాడు విక్టర్.
"సుఖాన వున్న ప్రాణాన్ని దుఃఖపెట్టుకోవడమంటే యిదే ననుకుంటాను. పూర్ ఫెలోస్ నాకు మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది. అసాధ్యమని తెలిసీ అనవసరంగా శ్రమపడుతున్నారు......."అన్నాడు వెంకన్న.
"ఇట్సాల్రైట్- మా ప్రయత్నం మేం చేస్తాం!" అన్నాడు రాజా.
4
రాజా, విక్టర్ ఇద్దరూ కూడా అక్కణ్ణించి తిన్నగా థియేటర్ కుసుమకు వెళ్ళారు. ముందు టికెట్సు కొనుక్కుని హాల్లోపలికే వెళ్ళారు. తర్వాత మేనేజర్ని కలుసుకుని తామెవరో చెప్పుకున్నారు.
"మీకేం సాయం కావాలో చెప్పండి-" అన్నాడు మేనేజర్.
"సినిమాహాల్లో మొత్తం అయిదు జంటలుండాలి. భర్తది ముస్లిం వేషం. భార్యకు బురఖా వుంటుంది. మనుషులందరూ మాకులాగే భారీగా వుండాలి. సినిమా అయిపోయాక అన్ని జంటలూ తలోవైపు వెళ్ళిపోవాలి.." అన్నాడు రాజా.
మేనేజరు సరేనన్నాడు.
"ఈసారి తప్పించుకోగల మంటావా?" అన్నాడు విక్టర్ అనుమానంగా.
"తప్పించుకోలేకపోవడానికి ఆ వెంకన్నే మయినా దేవుడంటావా-ఒకటి కాదు రెండుకాదు-మొత్తం ఆరుజంటలు, వాటిలో ఏ జంట ననుమానిస్తాడు? అసలు సినిమా హాల్నించి బయటకు వచ్చే వాళ్ళలో మనని గుర్తించడమే అసాధ్యం. అటుపైన బురఖా యువతిని గుర్తించడం మరింత కష్టం. అలాంటి జంటలు ఆరుంటే యింక చెప్పనక్కరలేదు...." అన్నాడు రాజా.
"అవుననుకో-కానీ యింతవరకూ జరిగింది చూస్తూంటే ఆ వెంకన్న మనిషేనా అని కూడా అనుమానం కల్గుతోంది" అన్నాడు విక్టర్.
"అతడు మన నెలా కనిపెడుతున్నాడో నాకూ మిస్టరీగానే వుంది. కానీ ఈసారి అతడు మనని కనుక్కోలేడనే నా నమ్మకం...."
"కనుక్కుంటే ఏం చేద్దాం-లొంగిపోదామా?"
"లొంగిపోవద్దు. లొంగిపోయామని అబద్ధం చెబుదాం అతడు మనుషుల మంచితనాన్ని నమ్ముతాడు. ఇంకెప్పుడూ నేరాల జోలికి వెళ్ళమని అతడికి మాట యిచ్చేస్తే - ఆ తర్వాత మనిష్టం...." అన్నాడు రాజా.
"అంత సులభమని నే ననుకోను. ఆ వెంకన్న అసాధ్యుడు ఏదో ట్రిక్ చేస్తాడు...." అన్నాడు విక్టర్.
"అలాగని ఎందుకనుకుంటున్నావు?"
"లేకపోతే మనమీద మనకెంత నమ్మక ముండేది! ఇప్పుడేమో పట్టుబడిపోతే ఏం చేయాలీ అని చర్చించుకుంటున్నాం."
వాళ్ళిద్దరూ మేనేజరు ప్రయివేటు గదిలో ఉండగా లోపలకు ఓ ముస్లిం జంట వచ్చింది. ఆ తర్వాత మరో జంట వచ్చింది. అటుపైన మరో జంట వచ్చింది. అలా మొత్తం ఆరు జంటలు వచ్చాయి. అప్పుడక్కడ ఓ జంట రాజా, విక్టర్లతో వేషాలు మార్చుకుంది. అనగా రాజా, విక్టర్లు ముస్లిం జంటగా మారిపోయారు. ఆ ముస్లిం జంట సర్దార్జీ లుగా మారింది.
కొంతసేపట్లో ఆ గదిలోంచి ఆరు ముస్లిం జంటలూ ఇద్దరు సర్దార్జీలూ, మేనేజరూ బయటకు వచ్చారు. మేనేజారు వారందరికీ హాల్లో సగౌరవంగా జంటలు జంటలుగా సీట్లు చూపించాడు.
రాజా, విక్టర్ ఎక్కువ మాట్లాడకుండా మొత్తం సినిమా అంతా చూశారు. ట్రెయిన్ లో తను ముస్లిం వేషంలో వుండగా వెంకన్న కళ్ళ బడ్డానని అతడికి గుర్తుంది. అప్పుడతడు మీసం లేకుండా గెడ్డంతో వున్నాడు. బట్టతల విగ్గులో వున్నాడు. ఇప్పుడందుకు భిన్నంగా పూర్తి వుంగరాల జుత్తు ఆ పైన కుచ్చు టోపీ వుంచుకున్నాడు. ఈసారి గెడ్డం లేదు కానీ పెద్ద పెద్ద బుర్రమీసాలు తగిలించుకున్నాడు. అతడెలా వేషం మార్చుకునప్పటికీ మనసులో వెంకన్న గురించి భయపడుతూనే ఉన్నాడు.
సినిమా అయిపోయింది. రాజా, విక్టర్ ఏ హడావిడీ లేకుండా తాపీగా హాల్లోంచి కదిలారు.
మొత్తం ఆరు ముస్లిం జంటలూ సినిమా హాల్లోంచి బయటపడి రోడ్డుమీద కొచ్చాయి. ఆ తర్వాత అందరూ తలోవయిపు ప్రయాణం కొనసాగించారు.
