"నీస్తావరానికి తీసుకు వెడితే...." అని ఊరుకుంది ఆమె.
"నా స్థావరం తెలుసుకుని ఏం చేస్తావ్?"
"మిడతలదండు నాయకుడ్ని అంచనా వేస్తాను."
"వేసి?"
"పోలీసులకు అప్పగిస్తాను."
"నువ్వు పోలీసు మనిషివి కాదు...."
"మీరలాగనుకోవడమే నాకు శ్రేయస్కరం."
అతను అదోలా ఆమె వంక చూసి "నువ్వు అసాధ్యురాలిలాగున్నావ్. నువ్వు మాతో కనుక చేతులు కలిపితే" అన్నాడు.
"అది అంచనా వేసుకునేందుకైనా స్థావరం చూడాలి గదా...."
"నేను చూపిస్తే గానీ స్థావరం తెలుసుకోలేవా?"
"నన్ను అసాధ్యురాలని నువ్వే అన్నావు."
'అయితే నీకై నువ్వు నా స్థావరం ఎందుకు తెలుసుకోవడం లేదు?"
"ఆ అవసరం నాకు లేదు. మిడతలదండు రహస్యాలు నేను తెలుసుకోగలను."
"ఎలా?"
"ఎలాగేమిటి? నా అనుచరుల్నందర్నీ నేను విశ్వసిస్తాను. కానీ మిడతల దండు సభ్యుల్లో ఒకరంటే ఒకరికి నమ్మకం లేదు. నాయకుడికి తన అనుచరుల మీద నమ్మకం లేదు. అటువంటి వాళ్ళ నుంచి సమాచారం లాగడం నా అనుచరులకు చాలా సులభం."
"మిడతలదండు రహస్యాలు తెలుసుకోవలసిన అవసరం నీకేమిటి?"
"అదినీ కెందుకు చెప్పాలి?"
"నేను నీకు సరివాడిని. మిడతలదండు నాయకుణ్ణి."
"నన్ను నీ స్థావరానికి తీసుకువెళ్ళే ధైర్యం లేనివాడివి. మిడతలదండు నాయకుడని ఎలా విశ్వసించేది?"
"ఒకవేళ నా స్థావరమని ఏదో చోటుకు నిన్ను తీసుకు పొతే ...."
"ఆ భయం నాకు లేదు."
"స్థావరం చూపగానే మాకంటే ముందుగా నువ్వు కాజేసిన ఆ వస్తువులు నా కందజేయాలి!"
లత నవ్వి "చాలా బాగుంది . నీ స్థావరం చూపించిన వెంటనే నన్ను వదిలి పెడతావంటే నేను నమ్ముతానా? కొంతకాలం పాటు ఎలాగూ నన్నక్కడ వుంచేస్తావు?"అంది.
"ఉంచక పొతే...?"
"అది నీ స్థావరం కాదన్న మాట!"
"సేహభాష్!" అన్నాడతను. "నీ సహాయం మాక్కావాలి. ఒక ముఖ్యమైన విషయంలో నువ్వు తప్ప ఇంకెవరూ మాకు సాయపడలేరు. నిన్ను మా స్థావరానికి తీసుకెళ్ళడానికి నిశ్చయించుకున్నాను."
లత ఏదో మాట్లాడబోయింది కానీ హటాత్తుగా అతనామేకు బలంగా ఏదో వాసన చూపించాడు. ఆమెకు క్షణాల మీద స్పృహ తప్పింది.
8
"డియర్ కామ్రేడ్స్! నన్ను మీరు మన్నించాలి. అన్నింటికీ తెగించి నేనీమేను మన స్థావరానికి తీసుకొచ్చాను. ప్రస్తుతం ఈమెకు స్పృహ లేదు. ఈమెకు స్పృహ వచ్చేలోగా మీ అందరకూ కొన్ని విశేషాలు చెప్పాలి.
ఇంతకాలం మనం ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా పని చేశాము. అసలింతకాలమూ మనకు స్థావరమంటూ ఏదీ లేదు. ఆ విషయం చెప్పి ఈ లతను నమ్మించడం కష్టం. అందుకని అప్పటికప్పుడు ఒక స్థావరాన్ని సృష్టించాను. నా ముఖ్యానుచరులైన మీ పదిమందినీ ఇక్కడ సమావేశ పరిచాను.
ఈ లతను గురించిన వివరాలు మనకు తెలియడం లేదు. తను పోలీసుల మనిషినని చెబుతూ చాలామందిని బోల్తా కొట్టించింది. గుండెలు తీసిన బంటు అని నా అనుమానం. కొంత కాలం పాటు ఈమె మన స్థావరం లో వుంటుంది. వెయ్యి కళ్ళతో కనిపెట్టుకు కాపాడాలి మనం. కళ్ళల్లోకారం జల్లి పారిపోగల శక్తి యుక్తు లీమెకున్నాయి. మనకుపయోగ పడుతుందను కుంటే మనలో జేర్చుకుందాం. కాదనుకుంటే చంపి అవతల పారేద్దాం...." అని అగేడతను.
అక్కడున్న పది మందిలోంచి ప్రసాద్ ముందుకు వచ్చి "ఏదిఏమైనా ఈమెను అభినందించాలి. మిడతలదండు పేరుతొ దేశాన్నో వూపు వూపుతున్న మనం ఈరోజు ఈమె కారణంగా ఒకరి నోకరం తెలుసుకోగలిగాం. మనమందరమూ పరస్పరం పరిచయం చేసుకుని మన అసలు ఆశయామేమిటో తెలుసుకుందాం...." అన్నాడు.
"నా పేరు వెంకట్రావు. దేశంలోని అవినీతికీ, అన్యాయానికీ నా కుటుంబం బలికాగా ఏకాకిగా మిగిలిన నేను, అవినీతి, అన్యాయం ధనవంతులతో ముడి పడి వున్నాయి. ప్రజలకు జరిగే అన్యాయం ప్రభుత్వం వల్ల కావచ్చు, ప్రభుత్యోదుగి వల్ల కావచ్చు. కాని దాని వెనుక నున్న అసలు కారణం డబ్బు.
అందుకే నేనో నిర్ణయానికి వచ్చాను. దేశంలోని రాజకీయ వాతావరణం మార్చాలి. దేశాన్ని న గుప్పిట్లోకి తీసుకోవాలి. నేనంటే నేనొక్కడినీ కాదు. నాలా అలోచించి నాతొ ఏకీభవించే ప్రతి ఒక్కడూ నాతొ కలవ్వచ్చు. ఇదే అభిప్రాయంతో మిడతలదండు ప్రచారం చేశాను. ఒకసారి నా ఆశయాలు బయటపడే సరికి ఎందరో నాకు సాయం చేయసాగారు.
అందర్నీ సభ్యులుగా స్వీకరించాను గానీ నాకు నాయకత్వం వహించడానికి భయం వేసింది. అప్పట్నించీ సభ్యులందర్నీ ఎంతో రహస్యంగా గమనించసాగాను. అలా గమనించి నాకు అండగా నిలవడానికి మీ పదిమంది పనికి వస్తారని నిశ్చయించుకున్నాను.
ఇంతకాలమూ మీరు నాకు చేసిన సహాయం అనన్య సామాన్యమైంది. ఇప్పుడు మన అసలు కార్యక్రమం వివరిస్తాను. మనం అతిత్వరలో మిడతలదండు పేరిట ఒక రాజకీయ పక్షాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. పీడిత ప్రజలకు ఆర్ధికంగా సహాయపడబోతున్నాం.
ఇంతకాలమూ మనకీ ఉద్దేశ్యమున్నట్లు ప్రభుత్వానికి తెలియదు. తెలియకుండా నేను చాలా జాగ్రత్త పడ్డాను. ధనికులకు మనం సింహస్వప్నం కాబోతున్నాం. పేద ప్రజలకు దగ్గర చుట్టాలం. వారి అభిప్రాయంతో అతి త్వరలోనే దేశంలో విప్లవం తీసుకు వచ్చి అన్ని రాజకీయ పక్షాలనూ సర్వనాశనం చేసి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంటాం...." ఆతను ఆగాడు.
పదిమందిలో ఒకతను ముందుకు వచ్చి -- "నా పేరు మురళి. నాకో చిన్న అనుమానముంది. మన పదిమంది వల్లనూ ఈ పని సాధ్యపడుతుందా అని నాకు సందేహంగా ఉంది!" అన్నాడు.
"అటువంటి సందేహం అవసరం లేదు. డబ్బుంటే ఏదైనా జరుగవచ్చు. అందుకే మనమిప్పుడు ధనాన్ని సేకరిస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు.... వేలు కాదు, లక్షలు కాదు.....కోట్లు ...కోట్ల కొద్ది రిఇపాయలు పోగు చేసి మనం సుఖంగా జీవిస్తూనే పదిమందికీ సుఖ జీవనాన్ని ప్రసాదించాలి....ఇలా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించు కుంటే...."
"మన ప్రజలు మూర్ఖులు. మంచి చేసిన వారిని గౌరవించడం వారికీ చేత కాదు సరిగదా వాళ్ళేమనని ప్రభుత్వానికి అప్పగించగలరు...." అన్నాడు జగన్నాధం పేరు గల వ్యక్తీ.
వెంకట్రావు అతని వంక చురుగ్గా చూశాడు. "మన ప్రజలు మూర్ఖులన్న సంగతి నాకూ తెలుసు. అయితే వారి మూర్ఖత్వాన్ని మనమింకో విధంగా ఉపయోగించు కోవాలి. ఇప్పుడు ప్రభుత్వంలో వున్న రాజాకీయ పక్షం అదే చేసింది. కొంతకాలం తర్వాత మనమూ అదే చేయబోతున్నాం ఒకసారి మన చేతికి ప్రభుత్వం చిక్కితే -- ఈ దేశంలో ఎన్నికల నేవీ లేకుండా చేసేద్దాం...."అంటూ వెంకట్రావు తన నిర్ణయాలను వివరించి చెప్పాడు.
అతను చెప్పిన ప్రకారం భారతదేశానికి నియంతృత్వ కావాలి అతననుకుంటున్నాడు. అతను మాట్లాడే పద్దతిని బట్టి అది సాధించగల శక్తి యుక్తులతని కున్నాయని అనిపిస్తోంది.
సుందరం అనే ఒకతను ముందుకు వచ్చి -- "మీరు అన్యదా భావించవద్దు. మిడతలదండు ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసిన మీ ఆలోచనలు దేశాన్ని స్వాధీనం చేసుకోవడం విషయంలో మాత్రం సమగ్రంగా లేవు. మీది పసిబాలుడి ఆలోచనలాగున్నది" అన్నాడు.
వెంకట్రావు నవ్వి "మిడతలదండు పేరుతొ సంచలనం కలిగించ గలనని అనుకున్నప్పుడు కూడా కొందరు నన్ను అదేవిధంగా నిరుత్సాహ పరిచారు. కానీ నిరుత్సాహనికి నాకూ అవడ దూరం. మీరే చూస్తుండండి. మనం ఎంత త్వరగా ముందుకు వెళ్ళబోతున్నామో...." అన్నాడు.
అతనింకా ఏదో అనబోతుండగా లత కదిలింది. ఆమె నెమ్మదిగా కాళ్ళూ, చేతులు ఆడించి, కళ్ళు తెరిచి పరిసరాలు గమనించి ఉలిక్కి పడి లేచి కూర్చుంది.
"మిస్ లతా! మెలకువ వచ్చిందా?" అన్నాడు వెంకట్రావు.
"మెలకువ రావడానికి స్పృహ పోయిన దెప్పుడు? నువ్వు మత్తు ఇవ్వడానికి ప్రయత్నించి నప్పుడే నేనూపిరి బంధించాను..." అంది లత.
వెంకట్రావు ముఖం వివర్ణమయింది. "అయితే అంతా విన్నావన్న మాట!" అన్నాడు.
"అంతా విన్నాను కాబట్టి మనకు పరస్పర పరిచయాలనవసరం . నానుంచి నువ్వేం సహాయం కోరుతున్నావో చెప్పు" అంది లత.
