2
రాజా, విక్టర్ ఇద్దరూ ఆటో ఎక్కారు. వెంకన్న అతి సులభంగా మత్తుపదార్ధాలను వశపర్చుకొనడం వారికెంతో బాధనిపించింది కానీ ఏంచేయగలరు? అంతా కన్నుమూసి తెరిచేలోగా జరిగిపోయింది. వెంకన్న తమను వదిలిపెట్టడం అదృష్టం. ఈ విధంగా తమ ప్రాణాలకు రక్షణ లభించింది. ఇప్పుడొక్కరోజు సమయంలో వెంకన్నకు దొరక్కపోతే అతడినుంచి మత్తుపదార్ధాలు తిరిగి పొందగల అవకాశముంది. అది తాముపయోగించుకోవాలి. వెంకన్న అన్నమాట తప్పడంటారు.
ఇద్దరూ త్రిభువన్ హోటలుకు వెళ్ళారు. ఆ హోటల్లో పన్నెండో నంబరు గదివారికోసం ప్రత్యేకించబడింది. రిసెప్షనిస్టుకు చెప్పుకుని వాళ్ళు తాళం తీసుకుని తమ గదికి వెళ్ళారు. గదిలో కూర్చున్నాక ఇద్దరూ ఆలోచనల్లో పడ్డారు.
"మనం బాగా ఫూలయ్యాం? వెంకన్న మనని కనిపెట్టలేకపోయాడనుకో! అప్పుడు బ్రీఫ్ కేసులకోసం వెడతాం గదా-అంటే పట్టుబడినట్లేకదా-" అన్నాడు రాజా.
"ఇలాంటి ఆలోచనలవల్ల మనకేమీ ప్రయోజనంలేదు. నా మాట విను మనమిక్కడెక్కువసేపుండడం మంచిది కాదు. వెంకన్న మనని ఫాలో అవుతూనే వుండివుంటాడు. మనం వేషాలు మార్చుకుని ఈ ఊర్నించి చేక్క్యాలి.....అన్నాడు" విక్టర్.
ఆ గదిలో వారికి వేషాలు మార్చుకునేందుకు అన్ని సదుపాయలూ ఉన్నాయి. ఇద్దరూ కాసేపు ఏ వేషాలు మార్చాలా అని ఆలోచించారు.
"మనలో ఒకరు స్త్రీగా మారాలి...." అన్నాడు రాజా.
"అంటే నేనే మరలి! అన్నాడు విక్టర్."
ఇద్దరిలోకీ విక్టర్ కాస్తపొట్టి బయట ఒక ఆడా మగా నడుస్తున్నప్పుడిద్ధరిలో పురుషుడు పొట్టిగానూ, స్త్రీ పొడుగ్గానూ వుంటే చూపరులనాజంట ఆకర్షిస్తుంది. అది తమ కంత మంచిదికాదు.
విక్టర్ చీరకట్టుకున్నాడు. అందు కనుగుణంగా తన రూపు రేఖలు దిద్దుకున్నాడు.
"ఆడపిల్లకంటే బాగున్నావు...." అన్నాడు రాజా.
రాజా ఫుల్ సూటు వేసుకున్నాడు. ఇప్పుడీద్దరూ చక్కని జంటలాగున్నారు. నిలువుటద్దం ముందు పక్కపక్కన నిలబడ చూసుకుని ఆశ్చర్యపోయారు.
"ఈ వేషాల్లో మననింకెవ్వరూ గుర్తుపట్టలేదు. నువ్వేమో పెద్ద అయ్యే యస్సాఫిసర్లాగున్నావు నేను నీ జంటకు తగ్గట్లే వున్నాను...." అన్నాడు విక్టర్.
"సహజంగా అందమైనవాళ్ళంగదా...." అని-"నువు ఎత్తుమడమల జోళ్ళు వేసుకో-మోడ్రన్ గా వుంటుంది." అన్నాడు రాజా.
విక్టర్ పాదాలసైజు పెద్దది. అక్కడ అతడికి సూటయ్యే ఎత్తుమడమల జోడులేదు.
"మనం జోళ్ళు మార్చక తప్పదు. వెంకన్న అసాధ్యుడు. కాలిజోళ్ళను చూసైనా మనని గుర్తించగలడు...." అన్నాడు రాజా మళ్ళీ.
ఇద్దరూ కాసేపు కష్టపడ్డారు. రాజా వచ్చేటప్పుడు నల్లబూట్లు వేసుకున్నాడు. అతడు వాటికి బదులిక్కడ బ్రౌన్ కలర్ బూట్లు వేసుకొన్నాడు. విక్టర్ తన ఆకు చెప్పులకు పైన కొంత రంగు పులిమాడు. అందువల్ల కొంతపని జరిగింది.
"నడిచేటప్పుడు కాస్త జాగ్రత్తగా వుంటే చెప్పుల్ని చీరమాటున దాచుకోవచ్చు. వాటిగురించి కంగారుపడకు-" అన్నాడు రాజా.
ఆ తర్వాత ఇద్దరూ అక్కడ కాసేపు కలిసి నటన ప్రాక్టీసు చేశారు. అచ్చం భార్యాభర్తల్లా ప్రవర్తించగలగడానికి వారికి కాసేప్పట్టింది. అప్పుడిద్దరూ హోటల్లోంచి బయటకు వచ్చారు. ఎవ్వరూ వారిని ప్రత్యేకంగా చూడలేదు. రిసెప్షనిస్టు మాత్రం "జంట చాలా బాగుంది-" అనుకుంది.
రాజా అయిదడుగుల ఏడంగుళాలుంటాడు. విక్టర్ అయిదూ ఆరుంటారు. నిజానికి వారు చక్కని జంటలాగే వున్నారు.
రోడ్డుమీదకు వచ్చేక ఏ టాక్సీనీ పిలవకుండా ఫుట్ పాత్ మీద నడవసాగారు.
"నడవడం నాకు కష్టమనిపిస్తోంది దరిదాపుల్లో వెంకన్న వున్నాడంటే అనుమానించవచ్చు టాక్సీ పిలుద్దాం- అన్నాడు విక్టర్. అలవాటులేని వాళ్ళకు చీరతో నడవడం కష్టమైనపనే!
"టాక్సీలో ఎక్కడికి వెడదాం?" అన్నాడు రాజా.
"స్టేషనుకు పోదాం. ఈ వూరు వదిలిపెట్టేద్దాం-"
సరేనని రాజా రోడ్డుకేసి తిరిగాడు. సరిగ్గా అప్పుడే ఓ టాక్సీ వచ్చి వారిపక్కన ఆగింది.
ఇద్దరూ టాక్సీ ఎక్కి కూర్చున్నారు.
"రైల్వేస్టేషన్!" అన్నాడు రాజా.
"మిమ్మల్నప్పుడే ఎలా పారిపోనిస్తాను మిస్టర్ రాజా! మీ పద్ధతి మార్చుకుంటానని నాకింకా మాటివ్వలేదుకదా!" అన్నాడు డ్రైవర్.
రాజా, విక్టర్ వులిక్కిపడ్డారు. ఆ డ్రైవర్ డిటెక్టివ్ వెంకన్నని వారికి అర్ధమైపోయింది.
"మీ వేషాలు చాలా బాగున్నాయి. ఏ లోపమూ లేదని నేనే ఒప్పుకుంటాను. కానీ ఈ వెంకన్న కళ్ళు కప్పడం మీ వల్లకాదని ఈపాటికి అర్ధమైవుండాలి మీకు. మర్యాదగా మీ అశక్తత ఒప్పేసుకోండి-" అన్నాడు వెంకన్న.
"మమ్మల్నెలా గుర్తుపట్టావు?" అన్నాడు విక్టర్ ఆశ్చర్యంగా.
"చాలా సింపుల్! మిమ్మల్ననుసరించి మీతో ఈ హోటలు కొచ్చాను. ఆ తర్వాత ఇక్కడే మాటువేశాను. మీరు బయటకు రాగానే గుర్తుపట్టాను...." అన్నాడు వెంకన్న తమాషాగా నవ్వుతూ.
"ఎలా?"
"మీరు నాకు లొంగిపోతానని మాటివ్వండి. నేను మిమ్మల్నెలాగుర్తుపట్టానో ఇప్పుడే చెప్పేస్తాను-" అన్నాడు వెంకన్న.
"నువ్వు మాకు రేపటిదాకా గడువిచ్చావు. ఆ తర్వాతే మేము నీకు లొంగేది...." అన్నాడు రాజా.
"అయితే ఇంకా మీలో ఆశ చావలేదన్నమాట అంతా మీ భ్రమ. సరే మిమ్మల్ని పెద్దబజార్లో దిగబెడతాను. మీ ప్రయత్నం మీరు చేయండి..." అన్నాడు వెంకన్న.
3
పెద్దబజార్లో వెంకన్న టాక్సీలోంచి దిగేక రాజా, విక్టర్-యిద్దరూ కూడా తిన్నగా ఖాన్ టైలరింగ్ దుకాణానికి వెళ్ళారు ఆ వూళ్ళోకే చెప్పుకోదగ్గ పెద్ద దుకాణమది. అందులోనే పురుషులకీ స్త్రీలకీ వేర్వేరు విభాగాలున్నాయి. ట్రయల్ గదులే డజనుదాకా వున్నాయి. ఆ షాపెప్పుడూ కోలాహలంగానూ, సందడిగానూ వుంటుంది.
రాజా ఖాన్ తో ఏదో మాట్లాడాడు. ఖాన్ వెంటనే అతణ్ణి ఓ ట్రయల్ గదిలోకి తీసుకునివెళ్ళి-ఏమిటి సంగతి?" అనడిగాడు.
విక్టర్ బయటనే వుండిపోయాడు.
"మమల్నో డిటెక్టివ్ వెంటాడుతున్నాడు. అతడు దుకాణం బయటే మాటువేశాడు. మేము వేషాలు మార్చుకుని తప్పించుకుపోవాలి-" అన్నాడు రాజ.
ఖాన్ ముక్తసరిగా-"నేనేం చేయాలోచెప్పు!" అన్నాడు.
రాజా వివరించాడు.
వెంకన్న చాలా తెలివైనవాడు. త్రిభువన్ హోటలుకు వెళ్ళినవారందర్నీ గమనించి బయటకు వచ్చేవాళ్ళలో కొత్తగా కనపడ్డ తమ జంటననుమానించి వుంటాడు. ఇప్పుడతన్ని తప్పుదారి పట్టించాలంటే మంచి మార్గముంది.
ముందుగా ఇద్దరు సర్దార్జీలను షాపులోకి రప్పించాలి. వాళ్ళను తమ వేషాలతో బయటకు పంపించాలి. ఆ తర్వాత తామిద్దరూ సర్దార్జీ వేషాల్లో బయటకుపోతారు.
"అయితే మనవాళ్ళకు ఫోన్ చేయనా?" అన్నాడు ఖాన్.
"ఊఁ.....త్వరగా...." అన్నాడు రాజా.
తర్వాత ఖాన్ ట్రయల్ గదిలోంచి బయటకు వచ్చి గెస్ట్ రూంలోకి విక్టరీ, రాజానూ పంపాడు అక్కడ వాళ్ళిద్దరూ తమ పాత వేషాలు మార్చేసుకొని శుభ్రంగా ముఖాలు కడిగేసుకున్నారు.
