ఈ నా నిర్ణయాన్ని ఫామిలీ డాక్టర్ కి ఎలా చెప్పాలో నా కర్ధం కావడం లేదు.
నన్ను చూసి చాటుగా కన్నీళ్లు పెట్టుకునే ఫామిలీ డాక్టర్ లాంటి మిత్రుడు ఎప్పుడైనా ఎవరికైనా దొరుకుతాడా?
మరికొన్ని పేజీల తర్వాత-
ఇప్పుడిప్పుడే విమల్ చిన్న, చిన్నగా మాట్లాడుతున్నాడు. అమ్మ అని పిలుస్తున్నాడు. వాడిని చూస్తుంటే , నన్ను నేనే చూసుకుంటున్నట్లుంటుంది.
నేను నవ్వినట్టే నవ్వుతాడు.
నా కళ్ళే వాడివి.
వినమ్ర మాత్రం జయేంద్ర లా ఉంటుంది. ఆ ఇద్దరూ నాకు రెండు కళ్ళు.
వినమ్ర డాక్టర్ని చేస్తాను.
నేను ఏ వ్యాధితో సతమతమవుతున్నానో , ఆ వ్యాధితో సతమతమయ్యే ఏంతొ మంది అభాగ్యులు ప్రపంచంలో ఉన్నారు. దాన్ని మంచి కేన్సర్ స్పెషలిస్ట్ ని చెయ్యాలి. నా పేరిట ఓక హాస్పిటల్ కట్టించి, పేద వారికీ ఉచితంగా వైద్యం చేయిస్తాను.
విమల్ -------
నాకూ, జయేంద్రకూ నటనలో వారసుడు కావాలి. మంచి ఆర్టిస్టు కావాలి. నేను చనిపోయే లోపల వాడిని వెండి తెరమీద హీరోగా చూడాలి.నా కళత్మక స్పందనకు వాడూ నిదర్శనంలా నిలవాలి. నటనలో నాకు కాదు నా కొడుక్కి, నా చిన్నారికి దాదా పాల్కే అవార్డు రావాలి. నా నటనా వంశం పది కాలపాటు నిలబడాలి.
ఆ డైరీలో ఎక్కువ పేజీలు తన గురించి, పిల్లల అభివృద్ధి గురించే రాసి, ఎక్కడో తప్ప తన అనారోగ్యం గురించి రాసుకోలేదు రుక్మిణి.
రుక్మిణికి తనపట్ల ఉన్న ప్రేమకు ప్రతి అక్షరం ఒక వాత్సల్య స్పర్శలా ఉంది జయేంద్రకు.
ఒక అరగంట సేపు మనిషి కాలేక పోయాడు జయేంద్ర.
సరియైన సమయంలో ఆ డైరీని తండ్రికిచ్చినందుకు తనలో తనే ఆనందించాడు విమల్.
------కొడుకు వేపోకసారి చూసాడు జయేంద్ర.
బాధపడుతూ కూర్చోవడం కంటే, తనమీద రుక్మిణి ఉంచిన ఆశలకు న్యాయం చెయ్యడం తన ధర్మం.
"డైరెక్టర్, నారాయణబాబుకి ఫోన్ చెయ్యి ......అలాగే ప్రొడక్షన్ మేనేజర్ కి కూడా."
"చెప్పాడు జయేంద్ర.
"డైరెక్టర్ గారు, ప్రొడక్షన్ మేనేజర్ కిందనున్నారు డాడీ.....రోజూ వాళ్ళు మీతో మాట్లాడాలని వస్తున్నారు ......వెళ్ళిపోతున్నారు"
"చెప్పేవు కావేం!"
లేచి, గబగబా రిప్రేష్ అయి కింద కొచ్చాడు జయేంద్ర.
* * * *
మరో పదిరోజుల్లో ఆంధ్రరాష్రంమంతా విమల్ పిక్చర్ రిలీజు కోసం అన్నీ ఏర్పాట్లు చేసాడు జయేంద్ర\
.
* * * *
విమల్ సినిమా రాష్ట్రమంతటా రిలీజైంది.
ఆ సినిమాని మహానటి రుక్మిణి మీద సానుభూతి తో చాలామంది చూసారు తప్ప - విమల్ హీరోగా ఆడియన్స్ ని కేప్సర్ చెయ్యలేదు.
దానిక్కారణం విమల్ కి అది మొదటి సినిమా . అంతకు పూర్వం నటనలో అనుభవం లేకపోవడం- ఆపైన హడావుడిగా పిక్చరైజ్ చేయటం.
విమల్ సినిమా ద్వారా డైరక్టర్ నారాయణ బాబు , ఎస్టాబ్లిష్ అయాడు.
సినిమా ఏవరేజ్ గా పోయిందన్న మాట వినగానే , జయేంద్ర ,మనసు కాకలవికలమైపోయింది.
ఆ రోజు రాత్రి , తనలో తను చాలా మధనపడ్డాడు జయేంద్ర.
రుక్మిణి డైరీలో రాసిన రాతలే -------
అతని మదిలో మెదులుతున్నాయి.
* * * *
విమల్ నాకూ, జయేంద్రకూ నటనలో వారసుడు కావాలి. మంచి ఆర్టిస్టు కావాలి. నా కళాత్మక స్పందనకు వాడు నిదర్శనంలా నిలవాలి. నా కొడుక్కి 'దాడాపాల్కే అవార్డు ' రావాలి.
* * * *
ఆ రోజు రాత్రి, చాలాసేపు ఆలోచించిన మీదట జయేంద్ర, తన సినిమాల్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
విమల్ ని హీరోని చెయ్యాలి, ఆంధ్రదేశానికి -\
విమల్ ద్వారా ఒక సెన్సేషనల్ హిట్ ఇవ్వాలి.
అందుకు తన శక్తి నంతా కేంద్రీకరించాలి. అప్పుడు మాత్రమే జయేంద్ర మనసు కుదుటపడింది.
* * * *
డైరెక్టర్ నారాయణబాబు కధ చెప్తున్నాడు.
"కధంతా పాండిచ్చేరి బేక్ డ్రాప్ లో ఉంటుంది సార్. ఇద్దరు హీరియిన్లు, ఒక హీరో ......ఫ్రెంచి అమ్మాయి, తెలుగమ్మాయి - హీరో. మ్యూజియం లో ఉద్యోగి. అతనిపై బాస్ ఫ్రెంచి వ్యక్తీ. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా కుటుంబాలు పాండిచ్చేరి నుంచి ఫ్రాన్స్ వెళ్ళిపోయాయి. కానీ రెండు తరాలుగా, ఇక్కడి వాతావరణానికి , అలవాట్లకు , పద్ధతులకు అలవాటు పడిపోయిన ఒక కుటుంబం మాత్రం పాండిచ్చేరిలోనే ఉండిపోయింది. ఆ కుటుంబానికి చెందినవాడు - డిసౌజా , అతని ఏకైక కుమార్తె రోమాని. మ్యూజియంలో ఉద్యోగి అయిన హీరో ఆనంద్ ని ప్రేమిస్తుంది . ఆనంద్ కూడా రోమానీ\ని ప్రేమిస్తాడు. ఆనంద్ మేనమామ తన కూతురు కళ్యాణిని, ఆనంద్ కిచ్చి చేయాలను కుంటాడు. తల్లి తండ్రి లేని ఆనంద్ ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినవాడు మేనమామ. కళ్యాణికి ఆనంద్ అంటే చిన్నప్పటి నుంచి అంతులేని అభిమానం, ప్రేమ. ఎక్కడో ఆంధ్ర దేశంలో రాజమహేంద్రవరంలో ఉంటారు వాళ్ళు. సంవత్సరాల తరబడి కలుసుకోక పోయినా కళ్యాణి కలలనిండా ఆనందే. ఆనంద్ నుంచి ఏ ఉత్తరమూ రాకపోయేసరికి , అతని యోగక్షేమాలు చూడటం కోసం, కళ్యాణితో పెళ్ళి నిశ్చయం చెయ్యడం కోసం మేనమామ పాండిచ్చేరి వెళ్తాడు.
