Previous Page Next Page 
డాళింగ్ పేజి 54

 

    బావురమన్నాడు జయేంద్ర.
    తండ్రి ఫీలింగ్స్ అర్ధం కాకపోయినా, తండ్రి దుఃఖాన్ని అర్ధం చేసుకోగలడు విమల్.
    అప్పుడు చటుక్కున విమల్ కో విషయం జ్ఞాపకం వచ్చింది కొన్ని నెలల క్రితం -----
    ఆపుడు ఓ రోజు విమల్ ని పిల్చి తల్లి తను చనిపోయాక తండ్రికి ఓక పుస్తకం ఇవ్వమని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. వెంటనే గబగబా మెట్లు దిగి తన గదిలో కెళ్ళి అందంగా పేక్ చేసిన ఓ బుక్ ని తెచ్చి......
    తండ్రి జయేంద్ర చేతిలో పెట్టాడు విమల్.
    "మీరపుడు సినిమా షూటింగ్ కోసం ఫారిన్ వెళ్ళారు. అమ్మ మీ కిమ్మని ఇచ్చింది. డాడీ వచ్చాక నువ్వే ఇవ్వొచ్చు కదా అన్నాను --- ఏం మాట్లాడలేదు అమ్మ, అప్పటినుంచి నా బీరువాలో ఆలాగే వుంది."
    కొడుకు వేపు ఆశ్చర్యంగా చూసాడు జయేంద్ర.
    ఆ పాకెట్ ను విప్పాడు.
    అదొక పాత డైరీ.
    గబగబా తిరగేసాడు. పేజీల్లో అక్కడక్కడా రుక్మిణి రాసిన రాతలు, తనకిమ్మని రుక్మిణి ఇచ్చిందా?
    రుక్మిణి డైరీ రాయడం ఎప్పుడూ చూడలేదు జయేంద్ర.
    అతనికి ఆశ్చర్యంగా ఉంది.
    రుక్మిణి మనస్తత్వానికి, ఆ డైరీ అద్దంలా ఉంది.
    రెండు పేజీలు  తిరగేసాడు.

                                               జనవరి 5 ; 1964

    నేనెప్పుడూ అనుకోలేదు - నా జీవితంలో ఒక అద్బుతమైన మార్పు జరుగుతుందని.
    మోడుల బతికి, మోడుల జీవించి, మోడులా మిగిలిపోతానెమో అనుకున్నాను.
    కానీ న జీవితాన్ని చిగురింపజేయడానికి , మెరుపులా,నా వంటరి గదిలో కొచ్చి నిలుచున్నాడు జయేంద్ర.
    ఈ రోజే జయేంద్ర , నేను ఒకటయ్యాం. ఈ రోజుని నేను మర్చిపోగలనా!
    - మళ్ళీ రెండు, మూడు పీజీలు తిప్పాడు జయేంద్ర.
    జీవితం చాలా గాడమైంది , చాలా విచిత్రమైంది. చాలా నిగూడమైంది. చిన్న విషయాల్లోనే ఎంతో ఆనందాన్నిస్తుంది. నిష్కారణంగా బాధ కూడా పెడుతుంది.
    జయేంద్ర, గొప్ప నటుడయ్యాడు. దేశం గర్వించే గొప్ప నటుడయ్యాడు. అందుకే అతనికి అవార్డు కూడా వచ్చింది. నా కివాళ చాలా ఆనందంగా ఉంది. నా ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలి? జయేంద్ర సినిమా షూటింగ్ కోసం, గుజరాత్ వెళ్ళాడు.
    మళ్ళీ, మరికొన్ని పేజీల తర్వాత ------
    జయేంద్ర నాకు ప్రేమించడం నేర్పాడు. అసలైన ప్రేమకు హృదయపూర్వకమైన ప్రేమకు నిజమైన అర్ధం తెల్సింది జయేంద్ర దగ్గరే. సినిమాల్లో ప్రేమకు నటించడం వల్ల ఇన్నాళ్ళూ నాకు ప్రేమ గురించి సరిగా తెలియనే తెలియదు ప్రేమంటే జీవితం కంటే గొప్పదని.
    ప్రేమంటే గొప్ప కాంతి అని మొట్టమొదటిసారి మనసారా తెల్సుకుని ఏడ్చాను.
    ఏడుపంటే మొన్నటి వరకూ నాకు గ్లిజరిన్ కన్నీళ్ళే.
    పెళ్ళంటే సినిమా పెళ్ళి.
    ఉత్తుత్తి అనుబంధాలే అనుకొన్న ఆ రెండిటి వెనక ఎంత గొప్ప అర్ధముందో, అనుభవం ద్వారా తెల్సుకున్నాను.
    ప్రేమ, పెళ్ళి , జీవితం, పిల్లలు......
    ఇవన్నీ సంపదకన్నా గొప్ప సంతోషాన్ని ఇస్తాయి కదూ.......
    గబగబా పేజీలు  తిప్పాడు జయేంద్ర.
    మరికొన్ని పేజీల తర్వాత .
    జయేంద్ర నా జీవితంలో ప్రవేశించాక ఎంత తృప్తి! ఎంత ఆనందం! ఎంత వంటరి తనం మాయమై పోయింది.
    "My dans and nights are for thoughts of jayendra, My love."
    జయేంద్ర దగ్గర ఎంత ప్రేముందో, అంత కఠినత్వమూ ఉంది- అంతటి దాక్షిణ్యమూ ఉంది. అతనిలో ఎంతటి ఆకర్షణ ఉందొ!
    ఆ ఆకర్షణని అతను ఒక్క సినిమా రంగానికే పరిమితం చెయ్యకుండా ఉండాలి.
    అతనిలో గొప్ప నాయకుడు అయ్యే లక్షణాలున్నాయి. అతన్ని గొప్ప లీడర్ని చెయ్యాలి. ఉత్తమస్థాయి రాజకీయ నాయకుడుగా, పరిపలన దక్షడుగా జయేంద్రను చూడాలి.
    నేను బతికినా, చనిపోయినా జయేంద్ర పరిపాలనా దక్షుడు కావాలి.
    అతని పేరు ప్రపంచ వ్యాప్తం కావాలి. అదే నా కోరిక.
    జయేంద్ర ఒక రాజకీయనాయకుడుగా మారాలన్న కోరిక, తన జీవితంలో ఎప్పుడూ రుక్మిణి, జయేంద్ర తో చెప్పలేదు. అదే చాలా ఆశ్చర్యంగా ఉంది జయేంద్రకు.
    తన జీవితం ఎలా ఎదగాలో , ఎలా ప్రకశించాలో , ఎలా మార్పు చెందాలో , అంచెలంచెలుగా ఊహించుకుని, ఆ విధంగా తనని మలిచిన వ్యక్తీ రుక్మిణి.
    గబగబా మరికొన్ని పేజీలు  తిప్పాడు జయేంద్ర.
    కాన్సర్ వ్యాధి ముదిరిపోతోందని గగ్గోలు పెడుతున్నాడు ఫామిలీ డాక్టర్. ఆపరేషన్ చేయించుకోమని శతపోరుతున్నాడు. నా మంచికే, కానీ జయేంద్రకు, పిల్లలకు ఆపరేషన్ పేరిట దూరంగా ఉండగలనా?
    ఆపరేషన్ నుంచి తిరిగి రాకపోతే?
    అందుకే ఆపరేషన్ వద్దనుకుంటున్నాను.
    బతికినంత కాలం పిల్లల మధ్య, జయేంద్ర మధ్య బతికి, అకస్మాత్తుగా ఒక్కసారి వాళ్ళ మధ్యనే కూలబడిపోయి , నా ఇంట్లోనే చచ్చిపోవాలని ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS