"నీకోపం ఇలా వుంటే -- భవిష్యత్తుయే నాకు భయంగా ఉంది -" అన్నాను నేను. నా మాటలకు వసంత ముఖంలో కొద్దిగా నవ్వు కనిపించేక -- 'అయినా నిన్ను కలుసుకోడానికి స్టేషన్ కు వస్తే, మధ్యలో హాస్టల్ దగ్గర దిగబెడతాననుకున్నావేమిటి? తిన్నగా ఇంటికి తీసుకెళ్ళి పోతాను. అటువంటిది సాధ్యమైనప్పుడే స్టేషన్ కు రాదల్చుకున్నాను-" అన్నాను.
వసంత ముఖం ఎర్రబడింది- "సెలవుల్లో ఇక్కడే ఉండిపోయావెం?"
"పెళ్ళయ్యాక మన హనీమూన్ యాత్ర కోసం ఇప్పట్నించీ డబ్బు పోగు చేస్తున్నాను... ఎలా అని అడగొద్దు....."
'అంతా వేళాకోళం -"
'అది సరేలే కాని కోపం పోయింది గదా , ఒక్కసారి పార్కుకి ..."
మాకు నచ్చిన పార్కు ఒకటుంది అందులో మేము మెచ్చిన స్థలమోకటుంది. అక్కడ మాకు సాధారణంగా ఏకాంతం లభిస్తుంటుంది. తరచుగా మేమిద్దరం అక్కడ కలుసుకుని అవి ఇవీ మట్లాడుకుంటాం.
'ఈరోజు కుదరదు. తప్పనిసరి ప్రోగ్రాములున్నాయి. తప్పకుండా రేపు వస్తా" అంది వసంత.
"థాంక్యూ వస్తా!" అన్నాను.చిన్నప్పట్నించి ఆమెను నేనలాగే అని ఉడికిస్తున్నాను. అతిగా వాగే అలవాటున్న ఆమె ఆ పేరుకి ఉడుక్కున్నా వసంతని అలా పిలువడానికి పెద్దల అభ్యంతరం లేకపోయింది.
మర్నాడు సాయంత్రం నేను పార్కుకి వెళ్ళేసరికి అనుకోకుండా కొంచెం ఆలశ్యమైంది. మేము]
మెచ్చిన స్థలాన్ని నేను చేరేలోగా "యూబ్రూట్ , గెటౌట్ " అన్న వసంత కంఠం వినిపించింది.
"వెడతాను వెళ్ళేముందు నీ గుండెల మీదున్న నీలం రంగు మచ్చను నిన్నరాత్రి ముద్దు పెట్టుకున్నప్పుడు నీవు పొందిన ఆనందపుటానుభూతిని మరోసారి గుర్తు చేసుకోమంతున్నాను."
నేను ఉలిక్కిపడ్డాను అది రంగారావు కంఠం. చటుక్కున నేను వెళ్ళి వాళ్ళిద్దర్నీ సమీపించాను. "వసంతా! అన్నాను. అక్కడ నన్ను చూసి రంగారావు ఆశ్చర్య పడ్డాడు. "ఈమె నీకు తెలుసా?" అన్నాడు ఆశ్చర్యంగా.
"తెలియడమేమిటి? ఆమె నా మరదలు. కాబోయే భార్య"
రంగారావు ఒక్కక్షణం తటపటాయించి " ఆయామ్ సారీ! ఇక మీదట ఈమెతో ఏవిధమైన సంపర్కమూ పెట్టుకోను" అని గబగబా అక్కణ్నుంచి వెళ్ళిపోయాడు.
"ఎవరితను బావా?" అంది వసంత.
"తర్వాత చెబుతాను కానీ నీతో ప్రైవేట్ గా మాట్లాడాలి నా రూముకి వెడదాం వస్తావా?" అన్నాను.
"ఊ" అంది వసంత.
ఇద్దరం రిక్షాలో రూమ్ చేరాం. దారిపొడవునా వసంత రంగారావుని తిట్టి పోసింది. కానీ నేను మాటలేవీ సరిగ్గా వినలేదు ఒక్కటే నా అనుమానం వసంత చంటి పిల్లప్పట్నుంచి నాకు తెలుసు. ఆమె గుండెల మీద మచ్చ ఉండటానికి వీల్లేదు. కానీ రంగారావు అలా చెప్పాడు మచ్చల విషయంలో అతడెన్నడూ పోరబడలేదు.
గదిలోపల వసంత అడుగు పెట్టగానే తలుపులు వేసేశాను. ఏం జరిగిందో వసంత తెలుసుకునే లోగా మెరుపు వేగంతో ఆమె జాకెట్ చింపేశాను. ఆవేశంలో ఉన్న నన్ను ఆ క్షణంలో వసంత యవ్వనం ఆకర్షించలేదు. బ్రా చింపనవసరం లేకుండానే సన్నగా పొడుగ్గా మెరుస్తూ నీలపురంగు మచ్చ కనిపించి నా కళ్ళు చెదరగోట్టింది.
"వాడు చెప్పింది నిజం వసంతా! అంటూ కళ్ళు మూసుకుని వెళ్ళి కుర్చీలో కూలాబడ్డాను.
అప్పటికి నా ఉద్దేశ్యం వసంత గుర్తించినట్లుంది. ఆమె తొందరగా బట్టలు సవరించుకుని నా దగ్గరకు వచ్చింది. "బావా అది మచ్చకాదు" అంది.
నేను వెంటనే జవాబివ్వలేదు. రెండు నిమిషాలాగి "మరి...." అన్నాను. అరనిముషంలో చెట్టు వెనక రంగారావు శారద కే మంత్రం వేశాడో, అటువంటిదే వసంతకూ వేసి ఉంటె కానీ, అతను చెప్పిన ప్రకారం మచ్చ ప్రసక్తి అక్కడే కేవలం వంక మాత్రమే....
"జాకెట్లో పెన్ను పెట్టుకున్నాను. అది కొద్దిగా లీకయినట్లుంది.'
"ఎప్పుడు?" కొంచెం కఠినంగా ప్రశ్నించాను.
నాలో ఏదో అనుమానం మొలకెత్తింది. అంతకరెక్టుగా రంగారావు ఎలా చెప్పగలిగాడు? సిరా మచ్చ ఒకటి రెండు రోజులకు మించి వుండదు. దాని గురించి వివరాలు సేకరించడం ఇంచుమించు అసంభవం. ఒకవేళ రంగారావు నిజంగానే నిన్న వసంతను కలుసుకున్నాడా? నిన్న వసంత చెప్పిన వేరే ప్రోగ్రాం ఇదేనా?
ఒక్క నిముషం ఆగి అంది వసంత "నీలాంటి వాడి ప్రశ్న అడగడం నాకు చాలా అవమానంగా ఉంది. ఉదయం స్నానం చేసేటప్పుడీ మచ్చ లేదు. ఆ తర్వాత ఎప్పుడేర్పడిందో తెలియదు. పెన్ను లీకవుతున్నట్లు మధ్యాహ్నం గుర్తించాను"
'అబద్దం " అన్నాను. నేను. 'నిజం చెప్పు! రంగారావా మచ్చ నిన్నరాత్రి చూశానంటున్నాడు. బాగా ఆలోచించు. ఆ మచ్చ నిన్ననే ఏర్పడి వుంటే ఎవరైనా నీ స్నేహితురాళ్ళు చూసి రంగారావుకి వివరం అందించి ఉండవచ్చు . మచ్చల వివరాలు సేకరించడమే అతని ఉద్యోగం . అతనికి రకరకాల ఏజెంట్లు ఉండి ఉంటారు. అందువల్ల నిజం చెబితే నేను సంతోషిస్తాను."
"నీమీద ఒట్టు బావా. ఈ మచ్చ ఈరోజే ఏర్పడింది" అంది వసంత ఆమె కంఠం రుద్దమయింది" ఇప్పుడు చూసుకునే దాకా నాకే అయిడియా లేదు. మచ్చ ఉండి ఉంటుందని "
"నీమాటేలా నమ్మేది? నీక్కూడా తెలియని మచ్చ మరో మగవాడి కంట ఎలా పడింది? అతగాడి కేమన్నా దివ్య దృష్టి ఉందా?"
"ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది" అంది వసంత.
"నువ్వేదో దాస్తున్నావని నాకు అనుమానంగా ఉంది" అన్నాను నేను.
* * * *
మర్నాడు రంగమ్మని నా రూమ్ కి పిలిచెను. పోలీసుల పేరు చెప్పి బెదిరించి రంగారావుకు సమాచారం ఎలా అందచేసేది అడిగాను. ముందు రంగమ్మ ఏమీ చెప్పలేదు. తన వాగ్ధాటి ఉపయోగించడానికే కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ రంగారావు నేరస్తుడని చెప్పేసరికి కొంచెం భయపడింది. వ్యవహారం పోలీసుల దాకా పోతుందనే సరికి ఇంకా భయపడింది. దానికి తోడూ నేను ఉగ్రావతారంలో ఉన్నాను.
"బాబూ , నాకేమీ తెలియదు. ఆ చీటీలో ఏముందో కూడా నాకు తెలియదు. ఆ రంగారావు బాబే నాకా చీటీ ఇచ్చి- మీరుండగా పట్టుకొచ్చి తనకిమ్మన్నాడు. చీటీ ఇచ్చి నప్పుడు కొంచెం భయం నటించమన్నాడు. ఇది నిజం . నా పిల్లల తోడు, నా మొగుడి తోడు...."
ఇంతకూ మించి రంగమ్మ మరేమీ చెప్పలేకపోయింది. రంగమ్మ సమాధానం విని నేను నివ్వెరపోయాను. రంగమ్మ వెళ్ళిపోయాక నా మెదడు మరింత తీవ్రంగా పనిచేయసాగింది. ఏమిటీ మిస్టరీ? తనకు తెలిసిన సమాచారాన్ని రంగమ్మ ద్వారా మళ్ళీ ఎందుకు తెప్పించుకున్నాడు. ఇది ఆలోచనలకు తప్పు దోవ పట్టించడానికా? అదే నిజమైతే అటువంటి అవసరమెందుకు కలిగింది? అందువల్ల ప్రయోజనమేమిటి?
అప్పుడే మొదటిసారిగా నాకు అనిపించింది. రంగారావుకి నిజంగానే చాలామంది ఆడవాళ్ళతో అక్రమ సంబంధమున్నదేమోనని. శారద ప్రవర్తన కొంతవరకూ అందుకు ఋజువుగా పనిచేస్తుంది. అందుకే వసంత....?
నాతల తిరిగిపోయింది. వసంత గురించి తప్పుగా ఆలోచించ లేకపోతున్నాను. అలా అని మనసును సరిపెట్టు కోవడమూ కష్టంగానే ఉంది.
అలా నాలుగైదు రోజులు భారంగా గడిచేక ఒక రోజు నేను కాలేజీలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది. అదీ ఒక పోలీస్ స్టేషన్ నించి అర్జంటుగా నేనక్కడకు వెళ్ళవలసి వచ్చింది.
అక్కడ నాకు పోలీసుల మధ్య రంగారావు కనపడ్డాడు. నన్ను చూడగానే రంగారావు కళ్ళు ఆనందంతో మెరిశాయ్. 'అమ్మయ్య! ఇతగాడు మీ సందేహాలను క్లియర్ చేస్తాడు " అన్నాడు.
"నువ్వేం మాట్లాడకు - 'అంటూ పోలీస్ ఇన్ స్పెక్టర్ నావైపు తిరిగి "ఇతడు మీ రూమ్ లో కొంతకాలం పాటు ఉండేవాడనంటున్నాడు....నిజమేనా ?"
"ఆ మేమిద్దరం కొద్ది నెలల పాటు ఒక రూమ్ లో ఉన్నాం -"
"ఇతను ఏం చేసేవాడు?"
ఒక్క క్షణం తటాపటాయించి -- అతని గురించి నాకు తెలిసినవన్నీ చెప్పేశాను. ఆఖరికి రోజు ఉదయం ఆ రంగమ్మ చెప్పిన విషయం కూడా చెప్పాను.
'చూశారా - ఇప్పుడైనా నా మాటలు నమ్మండి. ఇతగాడికి ఆ కళ్ళజోడు విషయం తెలియకూడదని - చాలా జాగ్రత్త తీసుకునేవాడిని శారద ఆరోజు కల్పించుకున్న కృత్రిమపు మచ్చను తక్షణం గమనించినా -- ఇతని ఆలోచనలకు పదును పెట్టడం కోసమని -- ఒక్కసారి చెట్టు చాటుకు రమ్మన్నాను-"
"కళ్ళజోడేమిటి?"
"తన దగ్గర కళ్ళజోడోకటున్నదనీ- దాని లెన్స్ స్ ప్రభావం వల్ల తను మనుషులను నగ్నంగా చూడగలిగే వాడిననీ ఇతనంటున్నాడు. ఆ కళ్ళజోడు లేన్సెస్ లక్నో లో ప్రొఫెసర్ జగదీష్ తయారు చేశాడు. ఇతగాడాయన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవాడట. ఆ ప్రొఫెసర్ ఎంతో కష్టపడి ఒక ఫార్ములా తయారు చేసి - బజార్లో కొన్నిమాములు లేన్సెస్ కు స్పెషల్ ట్రీట్ మెంట్ ఇచ్చి- టెస్ట్ చేసేలోగా గుండె ఆగి చచ్చాడట. ఇతగాడా లేన్సెస్ తెచ్చుకుని- ఓ కళ్ళజోడు తయారు చేసుకుని బ్లాక్ మెయిలింగ్ వ్యాపారం మొదలెట్టాడట. ఇదంతా నమ్మడానికి వీల్లేకుండా ఉంది- "
"ఇతని దగ్గర అటువంటిదేదో ఉండే ఉండాలి - లేకపోతె అలా చేయలేడు -" అని "ఇంతకూ నువ్వు పోలీసుల కెలా చిక్కావ్?" అనడిగాను.
"ఏముంది ? మామూలు పద్దతిలోనే నిన్న ఒక యువతిని బెదిరించబోయాను. నేను చెప్పిన మచ్చ ఆ యువతి కృత్రిమంగా ఓ గంట క్రితం ఏర్పరచుకున్నదట. నన్ను మెల్లిగా మభ్యపెట్టి పోలీస్ స్టేషన్ కు తీసుకు రాబోయింది. నేను పారిపోవడానికి విఫల ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కాను. ఆ యువతి ప్రభుత్వ గూడచారి అట నేనా మచ్చనేలా తెలుసుకోగలిగానో ఆమెకు అర్ధం కాలేదు. నన్నొక విదేశ గూడచారిగా వీళ్ళు భావించసాగారు. దాంతో గతిలేక నా గురించి నిజాలన్నీ బయట పెట్టాను. కానీ వీళ్ళు నమ్మడం లేదు. అందుకే మిమ్మల్ని పిలిచాను...."
"నేనెందుకు ? ఆ కళ్ళజోడే ఉందిగా -"
'అదుంటే ఈ బాధలన్నీ ఎందుకు? పోలీసుల నుంచి పారిపోయే ప్రయత్నంలో ఉండగా అది జారి క్రింద పడింది. లేన్సెస్ ముక్కలై పోయాయి. అప్పుడే దాని మీంచి ఒక రోడ్డు రోలరు కూడా వెళ్ళింది."
"చిత్రంగా ఉందే - ఇంతకీ ప్రొఫెసర్ జగదీష్ ఇటువంటి లేన్సెస్ ఎందుకు కనిపెట్టాడో ."
పోలీస్ ఇన్ స్పెక్టర్ నవ్వి, "వైద్యానికి, డిఫెన్స్ డిపార్ట్ మెంటుకీ పనికొస్తుందని అయన అభిప్రాయ పడ్డాడట. కానీ ఇతగాడు దానికి మరో ప్రయోజనం కనిపెట్టాడు...."
* * * *
పోలీస్ ఇన్ స్పెక్టర్ దయ వల్ల నేను ఈ కేసులోంచి సులువుగానే తప్పించుకున్నాను. మరెప్పుడైనా ఇటువంటి వాళ్ళ పరిచయం లభిస్తే తక్షణం పోలీసులకు తెలియజేయవలసిందిగా నేను హెచ్చరించ బడ్డాను. అన్ని తతంగాలు ముగిశాక ఆ సాయంత్రం వసంతతో పార్కులో మాట్లాడుతూ అన్నాను. "అటువంటి కళ్ళజోడు అటువంటి వాడి దగ్గరుంటే ఎంతమంది కాపురాలు కూలి పోయేవో "
"ఎందుకు కూలిపూవూ ? అనుమానించడానికి సిద్దంగా వుండే మగవాళ్ళున్నారు కాబట్టే ,మనదేశంలో రంగారావు వంటి వాళ్ళు ఆటలు సాగుతున్నాయి. పురుషుడు వివేకంతో ప్రవర్తించి స్త్రీని గౌరవించడం నేర్చుకున్నప్పుడు లక్షల కొద్దీ రంగారావులున్నా కాపురాలు కూలవు. రంగారావు విజయం మీ పురుషుల అవివేకానికి, మా అతివల దుర్భల మనస్తత్వానికి నిదర్శనం....." అంది వసంత ఆవేశంగా.
ఆమె మాటల్లోంచి ఒక బాణం వచ్చి నన్ను తాకింది కలుక్కుమంది. మనసు 'అబ్బా! అనుకున్నాను. బాధను ప్రకటించడానికి సిగ్గు బడ్డడం రాగా ముఖం వంచుకున్నాను. వంగిన నా ముఖాన్ని తన ముని వేళ్ళతో పైకి ఎత్తింది వసంత.....
---------
