Previous Page Next Page 
వసుంధర కధలు -11 పేజి 53


                                   వీడనిజంట

    వాళ్ళిద్దరూ స్మగ్లర్సు ఒకడిపేరు రాజా, రెండోవాడిపేరు విక్టర్ ఇద్దరూ పెద్ద పనిమీదే నగరం వస్తున్నారు. వాళ్ళిద్దరి చేతుల్లోనూ చెరో బ్రీఫ్ కేసు వున్నాయి. వారి దగ్గర లక్షలు విలువచేసే మత్తుపదార్ధాలున్నాయి. ఆ నగరంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త సదానంద్ కు వారా మత్తుపదార్ధాల నందజేయాలి.
    రాజా, విక్టర్-ఇద్దరూ కూడా పోలీస్ రికార్డ్సులో వున్నారు. ఒకటి రెండుసార్లు జైలుక్కూడా వెళ్ళివచ్చారు. పెద్దల ప్రాపకంవల్ల జైల్లో ఎక్కువకాలం మగ్గకుండా బయట తిరగ్గలుగుతున్నారు. స్మగ్లింగ్ ఆపరేషన్సు లో వారికి వారేసాటి అని అంతా చెప్పుకుంటారు. అయితే వాళ్ళు స్వయంగా ఏ వ్యాపారమో చేయడంలేదు. ఒక చోటి వస్తువును మరో చోటుకు చేర్చడం వారి బాధ్యత. అందువల్ల వచ్చే ప్రతిఫలంతో ఇద్దరి జీవితమూ సుఖంగా, దర్జాగా వెళ్ళిపోతోంది.
    ట్రెయిన్ నగరం చేరుకుంటోంది. ఔటర్ సిగ్నల్ కోసం ఆగింది. రాజా, విక్టర్-ఇద్దరూ సిద్దంగా వున్నారు.
    తమపై పోలీసు నిఘా వుందని వారికి తెలుసు. ఎక్కడెవరు తమను గుర్తుపట్టినా-ఓసారి సోదాచేసికానీ వదలరు. ఇప్పుడు సోదా జరిగిందంటే తాము రెడ్ హాండెడ్ గా పట్టుబడిపోతారు. తాము పట్టుబడిపోవడంవల్ల ప్రమాదం తమకేకాదు-పేరుపొందిన ఇద్దరు పారిశ్రామికవేత్తల బ్రతుకులు బయటపడతాయి. అందువల్ల వాళ్ళు కూడా తమను వేయికళ్ళతో కనిపెడుతూంటారు. తాము పోలీసులకు దొరికితే వాళ్ళు తమను ప్రాణాలతో బ్రతకనివ్వరు.
    చేసేపని ప్రమాదకరమైనదని తెలిసినా కొందరికి ప్రమాదాల్లో జీవించడంలోనే మజావుంటుంది. ప్రస్తుతం రాజా శ్రీనివాసున్నీ, విక్టర్ జీసస్ నీ ప్రార్దించుకుంటున్నారు తాము తలపెట్టిన కార్యక్రమం జయప్రదంగా నెరవేరేలా చూడమంటున్నారు తప్పితే తమకు వేరే జీవనవిధానం ఏర్పాటుచేయమని వాళ్ళు భగవంతుణ్ణి వేడుకోవడం లేదు.
    ప్రస్తుతానికిద్దరూ మారువేషాల్లో వున్నారు రాజాముస్లింవేషంలో వున్నాడు. విక్టర్ పిలక బ్రాహ్మణుడు. తమనెవరైనా గుర్తిస్తారన్న భయం వారికి లేదు.
    ట్రెయిన్ ఔటర్ సిగ్నల్లోంచి కదిలే సమయంలో ఓ వ్యక్తి వారి కంపార్టుమెంట్లో ప్రవేశించా
డు రాజా, విక్టర్ - యిద్దరూ కూడా అతణ్ణి గుర్తుపట్టారు. అతడు డిటెక్టివ్ వెంకన్న. ఓసారి అతడే తామిద్దర్నీ పట్టుకున్నాడు.
    ఇప్పుడు వెంకన్న కంపార్టుమెంట్లోకి ఎందుకొచ్చాడూ అని ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. ఇద్దరికీ శరీరాల్లో సన్నని వణుకు ప్రారంభమైంది.
    అది ఫస్ట్ క్లాస్ కూపే అక్కడిప్పుడు వాళ్ళుముగ్గురే వున్నారు.
    వెంకన్న తనుసీట్లో కూర్చుని ఇద్దరివంకా చూసి- "బండి ఫ్లాట్ ఫారం మీదకు చేరడానికింక పదినిముషాలు పడుతుందనుకుంటాను-" అన్నాడు.
    రాజా. విక్టర్-ఇద్దరూ ముఖ ముఖాలు చూసుకున్నారు. ఇద్దరూ వెంకన్నమాటలు విననట్లూరుకున్నారు.
    "పదినిమిషాలేనా అనుకుంటాంకానీ-ఆ కాసేపట్లో ఎన్నో ఘనకార్యాలు సాధించొచ్చు-" అన్నాడు వెంకన్న మళ్ళీ.
    రాజా, విక్టర్-ఇద్దారూ కూడా ఆ మాటలు వినని వాళ్ళలా తమ తమ సీట్లకు జారబడ్డారు.
    "పదినిముషాలుకాదు-రోజంతా టైమిచ్చినాసరే- సాధించలేని ఘనకార్యం ఒకటుంది. అదే నా నుంచి తప్పించుకోవడం!" అన్నాడు వెంకన్న మళ్ళీ.
    ఇద్దరూ వులిక్కిపడ్డారు. అంటే వెంకన్న తమను గుర్తుపట్టాడన్నమాట. ఎప్పుడు పట్టాడో, ఎలా పట్టాడో - ఇప్పుడేం చేస్తాడో?
    డిటెక్టివ్ వెంకన్నకు ఎదురు తిరిగి పారిపోవడం ప్రాణాంతకమని చాలామంది నేరస్థులకు తెలుసు. అయితే అతడికి నేరస్థులపట్ల శత్రుభావం లేదనీ వారికి తెలుసు. మనిషిలోని నేరాన్నేకానీ మనిషిని శిక్షించకూడదన్నది వెంకన్న సిద్ధాంతం ఆ కారణంగా అతడెన్నో నేరాలను పరిష్కరించినా నేరస్థులను వదిలిపెట్టేయడంవల్ల అతడి పరిశోధనల ఫలితాలు చాలావరకూ అపన పాఠకులకు మాత్రమే పరిమితమైనాయి.
    "ప్రపంచంలో నేరస్థులున్నారు. వారిని పట్టుకునేవారు న్నారు. తాము చాలా తెలివైనవారిమని నేరస్థులనుకుంటారు. కానీ, పట్టుకునేవారే ఎక్కువ తెలివైనవారు. అందువల్ల పట్టుబడని నేరస్థులు అరుదుగా వుంటారు...." అన్నాడు వెంకన్న.
    "ఎవరు మీరు? ఇవన్నీ మా కెందుకు చెబుతున్నారు?" అన్నాడు రాజా చిరాకును ప్రదర్శిస్తూ.
    "ట్రెయిన్ ఫ్లాట్ ఫారం చేరడానికింక ఏడు నిముషాలే టయిముంది. నేనెవరో తెలియనట్లు నటించి మీరు మీ కాలాన్ని వృధాచేసుకోవద్దు. మీరిలా బయల్దేరినట్లు పోలీసు లకు సమాచారం అందింది. నా తరఫున నేనూ బయల్దేరి వచ్చాను. ఈ క్షణంలో మిమ్మల్నరెస్ట్ చేసి పోలీసుల కప్పగించగలను. కానీ అలా చేయడంలేదు. మీ బ్రీఫ్ కేసులు రెండూ నాకు అప్పగించండి. మిమ్మల్ని వదిలి పెట్టినందుకు ప్రతిఫలంగా చెరో వెయ్యి నాకు చెల్లించు కోండి. అటుపైన యింకెప్పుడూ యిలాంటి జీవితంపట్ల ఆకర్షితులంకామని నాకు మాటివ్వండి...." అన్నాడు వెంకన్న.
    "మీరెవరో, ఎవరిగురించి మాట్లాడుతున్నారో నా కర్ధం కావడంలేదు" అన్నాడు విక్టర్ కానీ అతడి మనసులో బెంగపట్టుకుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అతడి మనసు దారులు వెతుకుతోంది.
    "కాలం వృధాచేయొద్దు మీరు నేరాలకు పనికిరారు. మీ పద్ధతుల్లో చాల లోపాలున్నాయి కావాలంటే ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి ఆరోజు టైమిచ్చి మిమ్మల్ని పట్టుకోగలను కానీ...." అని ఆగాడు వెంకన్న.
    "మీ కంత నమ్మకముంటే మమ్మల్ని వదిలిపెట్టి చూడండి-" అన్నాడు విక్టర్ తను బైటపడుతూ.
    "మిమ్మల్ని వదుల్తాను కానీ మీ వద్దనున్న మత్తుపదార్ధాలు తీసుకుంటాను ఇద్దరివద్దా చెరో వెయ్యి తీసుకుంటాను ఆ తర్వాత నా వేట ప్రారంభిస్తాను ఒక్క రోజులో తప్పించుకోలేక పోయారో-మీరు నేరాలు చేయడం మానేస్తానని నాకు మాటివ్వాలి-" అన్నాడు వెంకన్న.
    "మమ్మల్ని మీరు పట్టుకోలేకపోతే?"
    "అప్పుడు మీ దగ్గర తీసుకున్నవన్నీ మీకు తిరిగి అప్పగిస్తాను...."
    చటుక్కున విక్టర్ వెంకన్నమీద దెబ్బతీయాలని చూశాడు. వెంకన్న మెరుపువేగంతో అతడి భుజంమీద ఓ దేబ్బవేసి-"నా జోలికి రావడంవల్ల మీ రిద్దరూ స్పృహ లేకుండా ఈ ట్రెయిన్లో పడివుంటారు. ఆ విధంగా పోలీసుల పాల్పడడం మరింత సులభమవుతుంది-" అన్నాడు.
    వాళ్ళకు తప్పులేదు. ఇద్దరూ వెంకన్నకు బ్రీఫ్ కేసులూ, చెరోవెయ్యి సమర్పించుకున్నారు. వెంకన్న క్షణాలమీద అక్కణ్ణించి మాయమయ్యాడు.
    ట్రెయిన్ ఫ్లాట్ ఫారంమీద ఆగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS