శివప్రసాద్ ఉలిక్కిపడి "మిడతల దండు యేమిటి నాకు తెలియదు" అన్నాడు. అతని కళ్ళలో భయం స్పష్టంగా కనబడుతోంది.
"అన్నీ నాకు తెలుసు. నా దగ్గర మీరు భయపడనవసరం లేదు. ఏమీ దాచనక్కర లేదు. నేనుండగా మిడతల దండు మిమ్మల్నేమీ చేయలేదు."
శివప్రసాద్ కు నోట మాట రావడం లేదు. అతనికి ఒక హెచ్చరిక చెవిలో మెదుల్తోంది. "మేము నిన్ను కలుసుకున్నట్లు గానీ మాట్లాడినట్లు గానీ మూడో వ్యక్తికీ తెలిసిందా, ఈ భూమ్మీదా బ్రతకవు నువ్వు" అది మిడతల దండుకు చెందిన వ్యక్తీ చేసిన హెచ్చరిక.
"మీకు నామీద నమ్మకం కలిగినట్లు లేదు" అందామె.
"దయచేసి మీరవరో కానీ వెంటనే వెళ్ళిపొండి. నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను" అన్నాడు శివప్రసాద్.
"చందమామ ఇచ్చేయండి. వెళ్ళిపోతాను..." అంది కల్పన.
"చందమామ ఏమిటి?" అన్నాడు శివప్రసాద్ ఆశ్చర్యంగా.
కల్పన ముఖంలో కోపం తొంగి చూసింది. "మీకై మీరు మొండివాడో లేక మిడతల దండు మిమ్మల్ని బాగా భయపేట్టిందో తెలియడం లేదు. లేకపోతె మీరు కనిపెట్టిన చందమామ మీకు తెలియక పోవడమేమిటి?"
"చందమామ నేను కనిపెట్టాడమేమిటి?" అన్నాడు శివప్రసాద్ మొండిగా.
అప్పుడు కల్పన చేతిలో రివాల్వర్ మెరిసింది. "మిస్టర్ శివప్రసాద్ మర్యాదగా చందమామ నిస్తారా, ఎవ్వరా అంది.
శివప్రసాద్ కంగారుగా ఆమె వంకే చూస్తున్నాడు. అంతలోనే అతని కళ్ళు మెరిశాయి. కల్పన వీపుకు ఏదో బలంగా గుచ్చుకుంది. అది రివాల్వర్ మోన అని ఆమె గ్రహించ గలిగింది.
"మిస్ కల్పనా! మిడతల దండును తక్కువ అంచనా వేసి ధైర్యంగా ఇంతవరకూ రావడం బాగానే ఉంది. నీ సాహసాన్ని అభినందిస్తున్నాను. కానీ వెంటనే రివాలర్ జారవిడిచేయ్!" అన్న మాటలామెకు వినిపించాయి. ఆమె తక్షణం రివాల్వర్ వదిలి పెట్టేసింది.
"వెరీ గుడ్!' అంటూ ఆమె వెనుకనున్న వ్యక్తీ ఓ త్రాళ్ళ కట్టను శివప్రసాద్ వేపు విసిరాడు. "మిస్టర్ శివప్రసాద్! త్వరగా వచ్చి ఈమెను బంధించు."
శివప్రసాద్ కల్పనను కాళ్ళు చేతులు కట్టేశాక -- "మీరేనా మిడతల దండుకు చెందిన వ్యక్తీ. వినడమే కానీ చూసే భాగ్యం కలుగలేదు నాకు" అన్నాడు ఆ వ్యక్తితో.
ఆ వ్యక్తీ ముందహసం చేసి "ఇంక జాప్యం చేసి లాభం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మా వ్యూహాలు శత్రువు తెలుసుకుంటున్నాడు. చందమామనిలా తీసుకు రండి." అన్నాడు.
శివప్రసాద్ ఆలశ్యం చేయకుండా లోపలికి వెళ్ళి ఒక పుస్తకం తీసుకుని వచ్చాడు. దాని మీద చందమామ అని వ్రాసి ఉంది. లోపల అయిదు ప్రకరణలలో చంద్రుడిగురించిన సైంటిఫిక్ సమాచారముంది. ఆ వ్యక్తీ ఒకసారి పరీక్షించి ఆ పుస్తకాన్ని చూసి తృప్తిగా తలాడించాడు.
"వెల్ డన్! శివప్రసాద్" అంటూ అతను శివప్రసాద్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ సమయంలో యేమి చేశాడో ఏమో శివప్రసాద్ కుప్పగా కూలిపోయాడు.
అతను వెంటనే శివప్రసాద్ ని పక్క గదిలోకి ఎత్తుకు వెళ్ళి మంచం మీద పడుకో బెట్టాడు. ఇవతలకి వచ్చి కల్పనకు కట్లు విప్పాడు.
"వెల్ డన్ మధూ! నీ పాత్రను బాగా రక్తి కట్టించావు. ఇంకో విధంగా అయితే చందమామ మనకు దక్కి ఉండేది కాదు." అంది కల్పన.
"మరోలా అయితే నాకూ సాధ్యపడేది కాదు. అంతా నీ మాస్టర్ బ్రెయిన్ " అంటూ అభినందించాడు మధు.
5
"ఇది చాలా తమాషాగా ఉంది" అన్నాడు పోలీసు కమీషనర్.
"తమాషా మాట ఎలా వున్నా డిపార్ట్ మెంటు కు పెద్ద యిబ్బంది వచ్చేలా గుంది. ఇది చాలా తికమక వ్యవహారం . మిడతల దండు గురించి ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే పులి మీద పుట్రలా రంగంలోకి కొత్త దండు దిగింది" అన్నాడు డీయస్పీ.
నగరంలో దిపార్టు మెంటుకు చెందిన ప్రముఖులందరూ పరిస్థితి ని సమీక్షించారు.
మిడతల దండు పేరుతొ ఒక ముఠా వెలసి యేడాది దాటింది. పంట చేల మీద ఒకసారి మిడతల దండు వాలి లేచిందంటే యింక ఏమీ మిగలదు. మిడతల దండు ముఠా ఆశయం కూడా అదే! ఒక సంస్థ నీదండు దోపిడీ చేయాలనుకుంటే ఆ సంస్థ సర్వనాశనం కావాలి. ఈ ఆశయంతో వెలసిన మిడతల దండు అసలు యెందుకు వెలసిందో అందులో సభ్యులెందరో యెవ్వరికీ తెలియదు.
మిడతల దండు ఒక సంస్థను సర్వనాశనం చేయాలని నిశ్చయించుకున్నాక ముందు లోపాయి కారీగా కొన్ని హెచ్చరికలు చేస్తుంది. ఆ సంస్థ ఆ హెచ్చరికలను పాటించి తనను సంస్కరించుకోవాలి. అలా జరగకపోతే సంస్థకు సంబంధించిన కీలక వస్తువులు అపహరించబడతాయి. ఆ తర్వాత మిడతల దండు తను ఏయే కారణాల వల్ల ఏ సంస్థ ను నాశనం చేయాలనుకుంటుందో బహిర్గతంగా వాల్ పోస్టర్లు అంటించి ప్రజలకు తెలియ జేస్తుంది. అ సంస్థ ఆస్తి అంతా అపహరించబడాలి. వ్యక్తులందరూ హత్య కావించ బడాలి.
ఈ విషయంలో మిడతల దండుకు ఎవరయినా సహాయపడవచ్చు. సహాయపడిన ప్రతి ఒక్కడూ మిడతల దండు లో సభ్యుడవుతాడు. అటువంటి వ్యక్తు లను గుర్తించడానికి మిడతల దండుకు ప్రత్యేకమైన పద్ధతులున్నాయి.
పల్లె కూ, పట్నానికీ మధ్య రకంగా ఉండే వొక ఊళ్ళో ని పాఠశాలను మిడతలదండు మొట్ట మొదటిసారిగా ఎన్నుకుంది. అది ఒక కమిటీ స్కూలు. యాజమాన్యం సరిగా ప్రవర్తించడం లేదని ఒక హెచ్చరిక పంపింది మిడతల దండు.
యాజమాన్యం దానిని లెక్క చేయలేదు. మిడతల దండు చెప్పిన ప్రకారం ఆస్కూల్లో టీచర్ల కు సరిగా జీతాలివ్వడం లేదు. అడ టీచర్లజు , విద్యార్ధినులకు సరియైన మాన సంరక్షణ లేదు. విద్యార్ధుల్లో అక్రమ ప్రవర్తన అక్కడ ప్రోత్సహించబడుతోంది. పేరుకి అది పాఠశాల అయినా విద్యార్ధులక్కడ చదువుకోవడం ద్వారా మంచి కంటే చెడు ఎక్కువగా నేర్చుకుంటున్నారు.
మిదతలదండు చివరిసారిగా హెచ్చరించింది. "త్వరలో ఈ పాఠశాల సర్వనాశం కాబోతుంది. ప్రాణాల మీద ఆశగల ఉద్యోగు లందరూ రాజీనామా లిచ్చేయండి."
ఈ హెచ్చరిక ను కూడా ఎవ్వరూ లక్ష్య పెట్టలేదు. సరిగ్గా మరో వారం రోజులకు ఓ నలభయి మంది దారుణంగా హత్య గావించబడ్డారు. అందులో విద్యార్ధులున్నారు ఉపాద్యాయులున్నారు. ఇతర ఉద్యోగులున్నారు. యాజమాన్యానికి చెందిన వారందరూ ఉన్నారు.
ఈ హత్య పెద్ద సంచలనాన్నే కలిగించింది. పోలీసులు రంగంలోకి ప్రవేశించి మిడతల దండు ను పట్టుకోలేక పోయారు సరిగదా దాని గురించి ఏవిధమైన ఆచూకీ సంపాదించ లేక పోయారు.
ఈలోగా మిడతల దండు మరో పెద్ద పట్టణములోని చిట్ ఫండ్ సంస్థ ను ఇదే విధంగా చిన్నా భిన్నం చేసింది. ఆ తర్వాత ఒక బ్యాంకు ని, ఒక చిన్న కంపెనీని మట్టు బెట్టింది. మిడతల దండు పేరు వింటే ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెత్తడం ఆరంభ మయింది.
ప్రజల నైతిక జీవనంలో ఆరోగ్య కరమైన మార్పు తీసుకు రావడమే తమ లక్ష్యమని మిడతల దండు ప్రకటించి నప్పటికీ ఆచరణ ను బట్టి అది నిజమని పించడం లేదు. మిడతల దండు ఘోరాలకు యెందరో అమాయకులు కూడా బలి అయిపోయారు.
తమ మనుషులను కొందరిని మిడతల దండు లో ప్రవేశ పెట్టాలని పోలీసు డిపార్టుమెంటు ప్రయత్నించింది. అలా వెళ్ళిన వారిలో కొంతమంది ఆచూకీ తెలియలేదు. కొందరి శవాలు మాత్రం పార్సె ల్లో పోలీస్ స్టేషన్స్ చేరాయి.
మిడతల దండు ఏదో విదేశానికి చెందిన ముఠా అనీ దేశంలో అల్లకల్లోలం సృష్టించడమే దాని ధ్యేయమని ప్రభుత్వం భావించింది. అయితే అదేంత వరకూ సరయినదో ఇటీవల సంఘటనలు తెలియకుండా చేశాయి.
ఒకప్పుడు మిదతలదండు డబ్బు గురించి ఆలోచించేది కాదు. సంస్థలను సంస్కరించడమే దాని ముఖ్యశయంగా ప్రకటించేది. కానీ ఇటీవల బ్యాంకులనూ, ధనికులనూ కొల్ల గట్టడం మిడతల దండు ఆరంభించడం లో ఈకేసులో ఏం చేయాలో పోలీసులకు తోచలేదు.
మిదతలదండు అసలు లక్ష్యం త్వరలో బయటపడగలదనీ, ఈలోగా పోలీసుల ఆలోచనలను తప్పు దారి తొక్కించడం కోసం అది రకరకాలుగా ప్రవర్తిస్తుందని ప్రముఖల అభిప్రాయ పడ్డారు.
అయితే పోలీసుల కృషి ఫలించక పోలేదు. వారి తాలుకూ మనుషులు కొందరు మిడతల దండులో ప్రవేశించగలిగినట్లే తెలుస్తోంది. ముఠా ఆశయాలు మాత్రమే వారికి తెలుస్తున్నాయి. ఏం చేయాలో మాత్రమే వారికి తెలుస్తోంది. కీలక స్థావరమూ, అసలు మనుష్యులూ ఎవరికీ తెలియడం లేదు. అదీకాక మిడతల దండు సభ్యులు ఒకరికిఒకరు తెలియదు. ఎవరి మీద ఎటువంటి నిఘా ఉన్నదో తెలుసుకోవడం కష్టం.
