"ఇంకేమైనా సందేహాలుంటే అడిగి తెలుసుకోవచ్చు. ఈ ఇంటావిడ నేను చదువుకుంటుం'డగా మధ్యలో వచ్చింది. ఒంటి గంట నుంచి రెండు దాటే దాకా ఇక్కడే కూర్చుని కబుర్లు చెప్పింది. కావాలంటే ఆవిణ్ణి ప్రశ్నలడుగుదురు గాని , పిలుచుకు వస్తాను" అంది లత.
చంద్రశేఖర్ మొహమాటానికి కూడా వద్దని అనలేదు. లత ఆ గదిలోంచి బయటకు వచ్చి ఇంటివాళ్ళ తలుపు తట్టింది. ఓ కుర్రాడు తలుపు తీయగా, "మీ అమ్మగారు ఉన్నారా?" అనడిగింది. లోపల ఉన్నారని చెప్పాడు ఆకుర్రాడు. లత లోపలకు వెళ్ళింది.
అయిదు, పది, పదిహేను , ఇరవై నిమిషాలు గడిచాయి. చంచ్రశేఖర్ గుమ్మం వంకేచూస్తున్నాడు. లత మాత్రమే కాదు, ఎవ్వరూ బయటకు రాలేదు. ఓపిక నశించేక అతను తిన్నగా ఆ ఇంట్లోకి ప్రవేశించాడు.
"ఎవరు కావాలండీ?" అనడిగాడు ముందు గదిలో కూర్చున్న ఓ కుర్రాడు. ఇన స్పెక్తర్ని చూసి అతను గతుక్కుమన్నాడు.
"లత!" అన్నాడు చంద్రశేఖర్.
"లత ఎవరు?" అన్నాడా కుర్రాడు ఆశ్చర్యంగా.
"మీ ముందు గదిలో అద్దె కుంటున్న అమ్మాయి..." అన్నాడు చంద్రశేఖర్.
"ఆ అమ్మాయి పేరు రాణి. లత కాదు...." అన్నాడు ఆ కుర్రాడు.
"ఏదో ఒకటి. ఇప్పుడే వస్తానని లోపలకు వెళ్ళింది. ఎంతకూ రాదేం?" అన్నాడు చంద్రశేఖర్.
'అమ్మతో మాట్లాడడానికి వెళ్ళింది. పిల్చుకు వస్తానుండండి" అంటూ కుర్రాడు లోపలకు వెళ్ళాడు. మరు క్షణంలోనే ఒకావిడ హడావుడిగా వచ్చి "ఏమయ్యా బుద్ది లేదూ, ఆడపిల్లని వేషా లేసుకు వచ్చి బెదిరిస్తారా? గదిలో కాసేపు విశ్రాంతి తీసుకుందామనుకున్న ఆ పిల్ల హడలి పోయి దొడ్డి గుమ్మాన బయటకు వెళ్ళిపోయింది..." అంటూ చంద్రశేఖర్ ని దులిపేసింది.
లత మాట్లాడిన పద్దతి,వ్యవహరించిన తీరు చూసేక చంద్ర శేఖర్ ఆమెను ఏమాత్రమూ అనుమానించలేక పోయాడు. ఈ విధంగా మోసం చేసి తప్పించు కుంటుందని ఏమాత్రం ఊహకు తోచినా తను అజాగ్రత్తగా ఉండే వాడు కాదు. ఇంటావిడ మాటల కతనిక్కోపం కూడా వచ్చింది.
జరిగిన కధ క్లుప్తంగా ఆవిడకు తెలియబర్చి, "రాణి అనే పేరుతొ మీ ఇంట్లో ఉంటున్న ఆ అమ్మాయి మళ్ళీ మీయింటికి రాగానే పోలీసులకు అప్పగించవలసిన బాధ్యత మీది" అని చెప్పాడు.
"మిస్టర్ రాజూ, ఆ పిల్ల చేయి దారిపోయింది." అన్నాడతను రాజుతో.
"అయితే ఇప్పుడెం చేయాలి?"
"పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేస్తాను. ఈ ఇంటిని ఓ ఇద్దరు కానిస్టేబుల్స్ కాపలా కాయాలని...."
"ఇంతకీ ఆ అమ్మాయి ఇంటావిడ నిన్న మాట్లాడు కున్నారుటా?" అనడిగాడు రాజు. చంద్రశేఖర్ చిరాగ్గా ముఖం పెట్టి, "మాట్లాడుకుని వుంటే తప్పించుకుని ఎందుకు పారిపోతుంది? నిన్న ఉదయం తొమ్మిది గంటల తర్వాత మళ్ళీ రాత్రి ఎనిమిది గంటల దాకా ఆమె గురించి వీళ్ళ కేమీ తెలియదట. ఆ మధ్యలో ఎప్పుడూ చూసినా తలుపు తాళం వేసి ఉన్నదట....' అన్నాడు.
చంద్రశేఖర్ , రాజూ కలిసి అక్కడికి దగ్గర్లో ఉన్న హోటల్లోంచి పోలీస్ స్టేషన్ కి టెలిఫోన్ చేయగా అవతల నుంచి ఇన స్పెక్టర్ చంద్ర శేఖరమేనా?" అన్న ప్రశ్న వినబడింది.
"అవును...' అన్నాడు ఇన స్పెక్టర్.
"ఊర్వశీ హోటల్ ముందు మన జీపు లేదని అక్కడకు వెళ్ళిన సబీనస్పెక్టరు గారు ఫోన్ చేశారండి. మీరిక్కడికి వెళ్ళారో తెలియక...."
ఇన స్పెక్టర్ బుర్ర తిరిగిపోయింది. అతను అవతలి వ్యక్తిని క్షణం ఆగమని తను చెప్పదల్చుకున్నది చెప్పేసి, "ఇప్పుడే వస్తున్నాను" అని కూడా అన్నాడు.
జీపు ఏ విధంగా మాయమైందా అని అతను ఆలోచిస్తున్నాడు.
3
లత దొడ్డి గుమ్మం దాటి సందులోకి వచ్చి అక్కణ్ణించి అవతల రోడ్డు దగ్గరకు వెళ్ళేసరికి ఆమె కోసం అక్కడ పోలీసు జీపు సిద్దంగా ఉంది. ఆమె వెంటనే అందులో ఎక్కి కూర్చుంది. వెంటనే జీపు అక్కణ్ణించి కదిలింది.
ఆ జీపు తిన్నగా ఒక దారిని వెళ్ళలేదు. ఎన్నో సందులు ఎన్నో మలుపులు తిరుగుతూ అది చివరకు ఒక సందులోని బంగళా ముందు ఆగింది.
లత జీపు దిగి తిన్నగా బంగళా లోకి ప్రవేశించబోయింది. ముందు హల్లో కూర్చున్న ఒక వ్యక్తీ"ఎవరు కావాలండీ" అనడిగాడు.
"శంకర దాస్ గుప్తా ---"
ఆ మనిషి ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. శంకర్ దాస్ గుప్తా . ఈ సమయంలో అక్కడుంటాడని చాలా తక్కువ మందికి తెలుసు. ముందుగా అప్పాయింట్ మెంట్ లేనిదే అతనక్కడికి ఎవరిని రానివ్వడు. ముఖ్యంగా ఇప్పుడు...ఈ సమయంలో....
"అలా ఆలోచిస్తూ నిలబడితే లాభం లేదు. అవతల నాకు చాలా అర్జంటు పనులున్నాయి. త్వరగా నేను గుప్తాజీని కలుసుకోవాలి.' అసహనంగా అంది లత.
"యేమని చెప్పాలాయనకు?"
"చంద్రిక వచ్చిందని చెప్పు...."
అతను అక్కడే బల్ల మీద వున్న ఇంటర్ కాం లో ఫోన్ చేశాడు. అవతల నుంచి సమాధానం విని బాగా ఆశ్చర్య పోయినట్లు ముఖం పెట్టాడు. ఫోన్ పెట్టేసి ఆమె వంక గౌరవ భావంతో చూసి - "అలా కూర్చోండి" అంటూ మర్యాద చేశాడు. ఆమె వెళ్ళి దర్జాగా సోఫాలో కూర్చుంది.
హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు శంకర్ దాస్ గుప్తా. 'ఆలస్యానికి మన్నించాలి మేడమ్! మావాడు మీకు ట్రబుల్ ఇవ్వలేదు గదా. ఇది నేను ముఖ్యమైన వస్తువులు దాచుకునే వేళ. ఈ సమయంలో యెవ్వరినీ ఇక్కడకు రానివ్వను. వచ్చినా నన్ను చూడనివ్వను. మీసంగతి వేరనుకొండి...."
"ఒక్క క్షణం ఆగి నేను చెప్పేది వినండి గుప్తాజీ! మిడతల దండు మీ యింటికి రేపు రాబోతుంది. మీకు సంబంధించిన ముఖ్యమైన వస్తువులన్నీ తక్షణం నాకు ఇచ్చేయండి. నేను పోలీసుల మనిషినని తెలియడం ఇష్టం లేదు నాకు. అయినా కొన్ని జాగ్రత్తల కోసం ఈ పూట పోలీస్ జీప్ లో రావాల్సోచ్చింది. అదెక్కవసేపు మీ ఇంటి ముందాగడం మనకు మంచిది కాదు. ఈ ప్రాంతాల్లో మిడతల దండు మనుషులుండవచ్చు."
గుప్తా క్షణం అలోచించి "ఒక్కసారి మీ అయిడెంటిఫికేషన్ ...." అంటూ నసిగాడు. లత వెంటనే తన జకేట్లోంచి అయిడెంటి ఫికేషన్ చూపించి, "త్వరగా ఆలశ్యం చేయకండి" అంటూ హెచ్చరించింది.
శంకర్ దాస్ గుప్తా ఆలశ్యం చేయలేదు." అయిడెంటి ఫికేషన్ చూడగానే అతనికి తృప్తి కలిగింది. ఉత్సాహంగా లోపలకు వెళ్ళి కొన్ని విలువయిన వజ్రాలు, రత్నాలు ఏరి ఒక సూట్ కేసు లో సర్ధసాగాడు. అవి సర్దడం పూర్తీ అయ్యాక మాత్రం అతని మనసుపీకింది.
ఒకటి కాదు, రెండు కాదు.... సుమారు డెబ్బయి లక్షలు విలువ చేస్తుంది ఆ సూట్ కేసు. కానీ అది ఈ అపరిచితురాలి చేతి కివ్వక తప్పలేదు. పోలీసు జీపు,అయిడెంటిఫికేషన్ ఈ రెండే తనకు ఈమె మీద నమ్మకం కలిగించే ఐటమ్స్. మోసం జరిగితే డెబ్బైయి లక్షలు గోవిందా! అలాగని సూట్ కేసు ఈమె కివ్వకపోతే -- రేపు మిడతల దండు వచ్చి పడిందంటే......
గుప్తా సూట్ కేసు తో బయటకు వచ్చాడు. ఈ డబ్బు తను అన్యాయాలూ, అక్రమాలూ చేసి సంపాదించాడు. ఇది పోయినంతలో తనకు కలిగిన నష్టమేమీ లేదు. మళ్ళీ ఇంతకూ మించి సంపాదించగలడు. పోలీసులు కూడా తనను మోసం చేస్తే అది వేరే సంగతి. కానీ ప్రస్తుతానికి వాళ్ళ'ను నమ్మడం మినహా వేరే గత్యంతరం లేదు.
అసలీమే పోలీసులకు చెందిన మనిషి అవునా కాదా అన్న అనుమానుం కూడా అతన్ని పీడిస్తోంది. కానీ గత నాలుగు రోజులుగా తనకీమే దగ్గర్నుంచీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మిడతల దండు నుంచి తన గుప్త నిధిని సంరక్షించగల శక్తి తనకున్నదని,సి.బి.ఐ కు చెందిన మనిషి ననీ ఆమె ఫోన్ లో చెబుతోంది. ఈరోజు మొదటి సారిగా తనామేను చూస్తున్నాడు.
"మిస్ చెంద్రికా! అన్నింటికీ నిన్నే నమ్ముకున్నాను" అంటూ అతనామేకు సూట్ కేస్ అందించాడు.
"నన్ను నమ్మి చెడిన వారి లోకంలో లేరు. నన్ను నమ్మించడానికి ప్రయత్నిస్తే మాత్రం చెడిపోయేది మీరే-- ఈ విషయం గుర్తించుకుంటే చాలు" అంటూ సూట్ కేసు అందుకుంది లత.
4
"నమస్కారం శివ ప్రసాద్ గారూ!"
శివప్రసాద్ ఆ యువతి వంక ఆశ్చర్యంగా చూసి -- "ఎవరు మీరు?"అన్నాడు.
నవ్విందామె. "నా పేరు కల్పన. నన్ను మీరెరుగరు. కానీ నా అవసరం మీకుంది?"
"ఏమిటా అవసరం?"
"మిడతల దండు నించి మిమ్మల్ని రక్షించడం."
