Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 54


    "జగ్గా నీకిది తగదురా...." అన్నాడు రంగారావు.
    "చూడు బాబూ-అదేమాట నేనూ నా పెళ్ళాం గురించి చెబితేనువ్వు వినలేదు. నీకున్న ఆయుధం డబ్బు. దాన్ని చూపించి నీవల్లో వేసుకున్నావ్. ఆయుధాలున్నాయిగదా అని మనిషి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఏమౌతుంది? నా ఆయుధం నాకూవుంది. నీహద్ధుల్లో నీవులేవు. నా హద్దులు నేనూ దాటుతున్నాను...." అని అనసూయవంక తిరిగి -"ఊఁ బట్టలువిప్పు...." అన్నాడు.
    అనసూయచలించలేదు. జగ్గడు కత్తి దురుసుగా గాలి లోకి లేచింది - "చెప్పినట్లు చేస్తావా - లేదా-?" అన్నాడు.
    అనసూయ కళ్ళలో ప్రాణభయం కనబడింది. అసహాయంగా భర్తవంక చూసింది. అతని కళ్ళలోనూ అసహాయత కనబడగా జగ్గడి వంక చూసింది.
    "ఊఁ బట్టలు విప్పు త్వరగా...." అన్నాడు జగ్గడు.    
    తన భర్త ప్రవర్తన సరైనది కాదనీ-అతను చాలా మంది ఆడవాళ్ళని మరిగాడనీ అనసూయకు తెలుసును. అయినా అందుకామె ప్రతీకారాన్ని తలపెట్టలేదు. మగవాడికీ. ఆడదానికీ, సాంఘిక న్యాయాలు వేరని ఆమెకు మెదడులో బాగా నాటుకుపోయింది. భర్తయెన్ని తప్పుడు పనులు చేసినా తనుమాత్రం శీలాన్ని పవిత్రంగా కాపాడుకోవాలని ఆమె విశ్వసిస్తోంది. అందువలననే ఇప్పటి పరిస్థితి జీవన్మరణ సమస్యగా తోచిందామెకు. లేకపోతే భర్తచేసే తప్పులకు తనే ఇప్పుడు జగ్గన్ని ప్రోత్సహించి వుండాలి.
    "ఉఁ ఇంకా మొదలు పెట్టలేదు. లేకపోతే నేనే...." అంటూ ముందుకు నడిచి ఆమెను సమీపించి పైటకొంగు పట్టుకున్నాడు జగ్గడు.
    "అన్నయ్యా...." అంది చటుక్కున అనసూయ-నాకెవ్వరూ అన్నయ్యలు లేరు. నాభర్త నీకేదో ద్రోహం చేశాడని నా కన్యాయం తలపెట్టవద్దన్నయ్యా చంపదల్చుకుంటే నన్ను చంపేయ్. కానీ నీ అన్యాయం కొనసాగితే ఆ తర్వాత ఈ చెల్లి ఎలాగూ బ్రతకదన్నయ్యా."
    జగ్గడు తగబడ్డాడు-"ఏమిటీ అర్ధంలేని వరసలు....." అన్నాడు విసుగ్గా.    
    "నా భర్త పరమ దుర్మార్గుడు కావచ్చు. కానీ నా అన్నయ్య అలాంటివాడు కాకూడదు. నిన్ను నా మానం కాపాడిన అన్నయ్యగా జీవితాంతం గుర్తుంచుకుని పూజిస్తాను. నన్ను వదిలిపెట్టు అన్నయ్యా...." అంది అనసూయ.
    జగ్గడు ఆగిపోయాడు. అనసూయ కళ్ళు మూసుకుంది.
    "ఫరవాలేదు-కళ్ళు తెరు...." అన్నాడు జగ్గడు. అనసూయ కళ్ళు తెరిచింది.
    "అన్నయ్యా అని పిలిచిన ఆడదాని ఒంటిమీద చెయ్యేసేటంత ఎదవకాడీ జగ్గడు. కానీ నన్ను అన్నయ్యా అని పిలిచావుగదా-మరి నా పెళ్ళాం నీకేమవుతుంది!"- అన్నాడు జగ్గడు.
    అనసూయ మాట్లాడలేదు.
    "అదీ నీకు చెల్లెలే అవుతుంది. ఎలాగో నీ మొగన్నడుగు. నేను వెడతాను...." అని అక్కణ్ణించి కదిలి వెళ్ళే ముందు-"ఒసేవ్ అప్పీ-నువ్వు గనుక మళ్ళీ నా ఇంటి గడప తొక్కావో-ప్రాణాలు తీసేస్తాను. అందుకింకేమీ అనుమానంలేదు...." అన్నాడు.
    
                                         4

    జైల్లో ఉన్న జగ్గడిని వెంకడు కలుసుకున్నాడు.
    "ఒరేయ్ వెంకా-ఒక్కటేరా నాకోరిక. నా కొడుకు గొప్పవాడు నాకక్కర్లేదు. రాజ్యాలేలక్కర్లేదు. వాడికి సెంటిమెంటుండ కూడదురా. ఆ ఎదవ సెంటిమెంటే నన్నీగతికి తెచ్చింది...." అన్నాడు.
    జగ్గడి ఏన్నర్ధం జైలు శిక్షపడింది. కోర్టులో అతని మీద మానభంగ ప్రయత్నం నేరంగా మోపబడింది. అప్పాయమ్మ, అనసూయ, వాచ్ మెన్, రంగారావు అతనికి వ్యతిరేకంగా సాక్ష్య మిచ్చారు. చక్కని కట్టుకథ అల్లబడింది. జగ్గడు అప్పాయమ్మకూ, రంగారావుకూ ఉన్న పవిత్రానుబంధాన్ని శంకించి ప్రతీకారంగా అనసూయమీద అత్యాచారం చేయబోయాడనీ-రంగారావు సమయస్ఫూర్తి ఆమెను కాపాడిందనీ కోర్టులో తేలింది.
    అవసరానికి అన్నయ్యా అనిపిలిచినా అనసూయ కోర్టులో జగ్గన్ని కర్కోటకుడనీ, దుర్మార్గుడనీ, నీచుడనీ-అన్నా అనిపించినా చలించని దుర్మార్గుడనీ అంది. ఆమె ఆరోపణలు విన్న జగ్గడి మనసు అవమానంతో కుంచించుకు పోయింది.
    "ఒరేయ్ వెంకా-అవన్ని చేసినా నాకు దానిమీద అత్యాచారం చేయాలని లేదురా. అన్నయ్యా అని పిలిచిందిరా అది. దానిజోలికి నేనింక వెళ్ళలేను. ఆ పిలుపు నన్ను కట్టేసింది. ఎదవ సెంటిమెంట్లు చంపుకోమన్నాడు రంగారావు నన్ను-నా పెళ్ళాన్ని తననుభవించినప్పుడు. ఆ ఎదవ సెంటిమెంటే వాడి పెళ్ళాన్ని రక్షించింది. ఈ డబ్బున్నోళ్ళ ఆటలు కట్టాలంటే మనకు సెంటిమెంటుండకూడదురా-అందుకే నా కొడుకుని ఇప్పట్నించీ సెంటిమెంటు లేకుండా పెంచాలిరా....."
    వెంకడు మాట్లాడలేదు.
    ఏన్నర్ధం తర్వాత జగ్గడు జైల్నించి తిరిగొచ్చేదాకా సుబ్బన్న వెంకడిదగ్గరే పెరిగాడు. జైల్నించి తిరిగొచ్చేక జగ్గడిలో కొన్ని మార్పులొచ్చాయి. అతనో కిళ్ళీబడ్డీ తెరిచాడు. కొడుకుని బడి మానిపించేశాడు.
    బళ్ళో చెప్పిన పాఠాలేవీ నమ్మొద్దన్నాడు. ఈ ప్రపంచమంతా డబ్బుమీదే నడుస్తోందన్నాడు. డబ్బు కోసం ఏంచేసినా తప్పులేదు. కానీ పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడాలన్నాడు. ఎవడైనా ఎప్పుడైనా చేతికి చిక్కితే ఏమాత్రం కనికరించకూడదన్నాడు. మనకుపకారం చేసిన వాడిమీద ఏ పరిస్థితుల్లోనూ జాలిపడకూడదన్నాడు. ప్రపంచ వ్యవహారాల్లో వావివరుసలూ, బంధుత్వాలూ గురించి పట్టించుకోకూడదన్నాడు.
    తండ్రి చెప్పినవన్నీ సుబ్బన్న పసి హృదయంమీద బాగా పనిచేశాయి. ఎదుగుతున్నకొద్దీ అతను బాగా మొరటువాడుగా తయారయ్యాడు. డబ్బుకోసం ఏమైనా చేస్తాడతను. తను చేయబోయే పని-ఎలాంటిదీ అన్న ఆలోచన కూడా ఉండదు సుబ్బన్నకు.
    సుబ్బన్న కిరవైఏళ్ళు వచ్చేసరికి అతను ఊళ్ళో మంచి పేరు సంపాదించాడు. సుబ్బన్న అంటే చాలామందికి భయం. అతను నేరాలవలీలగా చేస్తాడని ఎక్కువమంది చెప్పుకుంటారు. కానీ అతను పోలీసుల కెన్నడూ దొరకలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS