Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 53


    "నేనేం తప్పుచేయలేదురా జగ్గా-అంతా అంగీకారం మీదనే జరిగింది."
    "అవునా?"-అంటూ ఉమ్మాడు జగ్గడు భార్యవంక చూసి.
    అప్పయమ్మ భయపడలేదు-"ఎంత కష్టపడితే మాత్రం నువ్వు నాకిలాంటి బట్టలు కొనగలవా? నాకేమో ఇలాంటివి కట్టుకుని షోగ్గా తిరగాలని వుంటుంది. నువ్వడిగినప్పుడల్లా కాదనను. నీతోనే వుంటాను. ఎవడితోపడితే వాడితో తిరగను. ఒక్క ఈ బాబు విషయంలో చూసీచూడనట్లూరుకోరా-హాయిగా జీవిద్దాం. మన సుబ్బన్నను కూడా పై చదువులు చదివిద్దాం...." అంది ధైర్యంగా.
    జగ్గడి ఆవేశం అణగారిపోయింది. వాడు దిగాలు పడిపోయి-"మీ డబ్బున్నవాళ్ళెన్ని మాయల్చేస్తారు బాబూ-క్షణాలమీద నా ఆడదాన్ని వల్లో వేసుకున్నారు" అన్నాడు.
    "జగ్గా-వెధవ సెంటిమెంట్లుకు పోకుండావుంటే నీకిప్పుడొచ్చిన బాధేమీలేదు. అసలేమీ జరగలేదనుకో. ఆవేశపడి నీ పెళ్ళాన్నేమైనా చేస్తే-నువ్వు జైలుకిపోయి నీ కొడుకు భవిష్యత్తులో అంధకారం నింపడం మినహా ఏం వుపయోగముండదు. విషయం చెప్పడంకోసం పిలిచాను. ఇంటికి పోయి పడుకో-నీ పెళ్ళాం ఇంకో అరగంట పోయింతర్వాతొస్తుంది...."

                                        3


    "ఎందుకురా జగ్గా ఏడుస్తున్నావ్?"
    "బావయ్యా-నీ చెల్లెలు చచ్చి నాబ్రతుక్కు పూర్తిగా న్యాయంచేసి వెళ్ళిపోయింది. నేనేమైపోతానో తెలియదు నా కొడుకును నువ్వే కాపాడాలి...." అన్నాడు జగ్గడు.
    "అసలేమయిందిరా? నా చెల్లెలుచచ్చి ఏన్నర్దమైంది. నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకొని అప్పుడే ఆర్నెల్లవుతోంది. ఇప్పుడెందుకు గుర్తొచ్చింది-?" అన్నాడు వెంకడు.
    "నేనూ నీకులా రిక్షాలాగి బతుకుతుంటే బాగుండేదిరా-కానీ డబ్బున్నోళ్ళ వల్లోపడిపోయి చెడిపోయాను. నేనుత్త ఎదవని. నామీద ఎవరికి జాలివుండదు. నాకే అన్యాయం జరిగినా ఎవరూ నాకు సాయానికి రారు..." అంటూ జరిగినదంతా చెప్పాడు వెంకడు.
    "అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావ్?"
    "పగ-పగతీర్చుకుంటాను. అందులో నేనేమై పోతానో తెలియదు. కానీ నాకొడుకుని నువ్వే కాపాడాలి. వాణ్ణి నువ్వేసాకాలి...."
    "నీ కొడుక్కేం భయంలేదురా-నేను చూస్తాను కానీ ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి నీ పగ తీర్చుకో-యేం చేద్దామనుకొంటున్నావ్-నీ పెళ్ళాన్ని చంపేస్తావా?"
    "దాన్నని లాభమేముంది బావయ్యా-చేసిందంతా ఆ రంగారావు చేశాడు. వాడికి నమ్మినబంటుగావున్న నాకింత ద్రోహం చేస్తే చీమకుట్టినట్లేనా లేదువాడికి. నా పగ వాడి ముందే...."
    "శభాషైన మాటన్నావ్.....వెళ్ళు" అన్నాడు వెంకడు.
    జగ్గడక్కన్నించి బయలుదేరాడు. కాసేపు వీధులన్నీ తిరిగాడు. తర్వాత యింటికి వెళ్ళాడు. అప్పటికి అప్పాయమ్మ ఇంట్లోనే వుంది.
    "ఎంతసేపయిందే వచ్చి!"-అన్నాడు తాపీగా.
    చెప్పింది-"సుబ్బన్నేడిరా?"-అంది.
    జగ్గడు జవాబివ్వకుండా-"నాతో వచ్చి నేను చెప్పినట్లు చేస్తావా-లేక చస్తావా?"-అనడిగాడు.
    అప్పాయమ్మ తెల్లబోయింది. అప్పటికి జగ్గడు చేతిలో పదునయినకత్తి మెరుస్తోంది.
    "నువ్వు చెప్పినట్లే చేస్తాను" అంది అప్పాయమ్మ.
    ఇంట్లో మూలనున్న చేంతాడుతీసి మొలకు ఏడెనిమిది చుట్లు చుట్టుకున్నాడు జగ్గడు-"పద"-అన్నాడు పెళ్ళాంతో.
    ఇద్దరూ బయలుదేరి రంగారావిల్లు చేరారు. అప్పటికి సమయం రాత్రి పదకొండు గంటలు కావచ్చు. జగ్గడాయింటికి పరిచయస్తుడే కావడంవల్ల గేటుదగ్గర వాచ్ మాన్ అతన్ని ఆపలేదు.
    అతను తిన్నగా రంగారావు బెడ్రూం దగ్గరకు వెళ్ళాడు. తలుపులు జారగిల వేసివున్నాయి. తోశాడు జగ్గడు.
    లోపల సన్నగాదీపం వెలుగుతోంది. రెండు మంచాలొకదానికొకటి దగ్గరగా వేసివున్నాయి. ఒక మంచంమీద రంగారావు పడుకొని వున్నాడు. రెండో మంచంమీద రంగారావు భార్య అనసూయ తనకూతురును దగ్గరగా హత్తుకొని పడుకొనివుంది.
    "వెళ్ళి లేపు నీ ప్రియుణ్ణి...." అన్నాడు జగ్గడు. ఆమె కదిలింది. జగ్గడు తలుపులు గడియవేశాడు.
    అప్పాయమ్మ రంగారావుని తట్టిలేపింది. రంగారావుకు వెంటనే మెలకువ వచ్చింది! కళ్ళు తెరచి అప్పాయమ్మ ను చూసి చటుక్కున కౌగలించుకొని-"ఇప్పుడెలా వచ్చావ్" అన్నాడు.
    అప్పటికి జగ్గడా మంచాన్ని సమీపించాడు. అప్పాయమ్మ కౌగిలి విడిపించుకొని-జగ్గన్ని చూపించింది రంగారావుకి. రంగారావు తడబడ్డాడు.
    "భయంగా వుందా?" అన్నాడు జగ్గడు.
    "ఆకారం పెద్దదయినా దున్నపోతు సింహానికి భయం కలిగించదు...." అన్నాడు రంగారావు కంగారు పడకుండా.
    "సరేలే-దున్నపోతుబలం చూద్దువుగాని...." అని రంగారావును లేచినిలబడి వెనక్కు తిరగమన్నాడు. అతని చేతిలో కత్తి రంగారావును చెప్పినమాట వినేలా చేసింది. తాడుతో అప్పాయమ్మ-రంగారావును మంచానిక్కట్టేసింది. మిగిలిన తాడుముక్కతో జగ్గడు అప్పాయమ్మను మంచానికి మరోవైపు కట్టేశాడు.
    "దొంగ నాయాలా-డబ్బు చూపించి నా పెళ్ళాన్ని వల్లో వేసుకున్నావ్. కత్తిచూపిస్తే అదే నిన్ను కట్టేసింది. నాదగ్గర కత్తుంది. నీదగ్గర డబ్బుంది. కత్తి చూపిస్తే నీ పెళ్ళాం ఏం చేస్తుందో చూద్దాం...." అంటూ జగ్గడు నెమ్మడిగా అవతల మంచాన్ని సమీపించి అనసూయను తట్టి లేపాడు.
    మంచి గాఢనిద్రలోవున్న అనసూయకు మెలకువ వచ్చింది. నాలుగేళ్ళ ఆమెకూతురికి మెలకువ రాకుండా అనసూయను జాగ్రత్తగా మంచంమీదనుంచి ఎత్తిదింపి-"అరవకు-అరిస్తే కత్తిగుండెల్లో దిగుతుంది" అన్నాడు జగ్గడు.
    అనసూయ మాట్లాడలేదు. జగ్గడు ఆమెచేయి పట్టుకుని రంగారావు కెదురుగా తీసుకెళ్ళాడు-"ఎవరు అరచినా మాట్లాడినా కుక్కచావు చస్తారు. నాజీవితం ఏమైపోయిన సరే పగతీర్చుకోవాలని వచ్చాను. కత్తి నీ పెళ్ళాన్నెలా లొంగదీస్కుంటుందో చూడు" అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS