Previous Page Next Page 
డాళింగ్ పేజి 53

 

    "జయేంద్ర!" నెమ్మదిగా పిలుస్తూ తన చేత్తో భర్త చేతిని నొక్కుతూ-----
    "అది మనబాబు కాలే కదూ!" అంది బలవంతం మీద.
    డోర్ లోంచి రెండో కాలు బయటికొచ్చింది----
    రుక్మిణి ముఖం వాలిపోతోంది- అప్పుడు మసక వెల్తురులో స్పష్టంగా చూసాడు జయేంద్ర.
    రుక్మిణి పెదవుల పక్కనుంచి ధారాపాతంగా కారుతున్న రక్తాన్ని,
    "తెరమీద బాబు ముఖాన్ని చూడాలని వుంది-- జయేంద్ర!"
    ఒక్కొక్క మాటనీ వత్తి పలుకుతూ అంది రుక్మిణి.
    కెమెరా కాళ్ళమీద నుంచి నెమ్మదిగా పైకి వెళ్తోంది.
    జయేంద్ర, దూరంగా ఉన్న డైరెక్టర్ వేపు చూసాడు.
    హీరోని, హీమాన్ గా ఇంట్రడ్యూస్ చెయ్యడం కోసం , రెండొందల అడుగుల, క్లోజప్ సీన్ ని తీసాడు డైరెక్టర్. కానీ అదే ఇక్కడ దెబ్బ కొట్టేస్తుందనుకోలేదు డైరెక్టర్. ఆ సమయంలో డైరెక్టర్ దగ్గరగా ఉంటే, జయేంద్ర అతన్ని చంపేసేవాడే.
    రుక్మిణి తల జయేంద్ర భుజాల మీద మెల్లగా వాలిపోయింది.
    అదే సమయంలో తెరపై హీరో విమల్ నవ్వు ముఖం -
    "మైడియర్ ఫ్రెండ్స్ ......నా పేరే విమల్ ......" అనే డైలాగు వినాబడింది.
    తెరమీద ఆ ముఖాన్ని చూసే అదృష్టం లేదు రుక్మిణికి.
    కొడుకు చెప్పిన ఆ మొట్ట మొదటి డైలాగ్ వినే అదృష్టం లేదు రుక్మిణికి.
    "డాక్టర్ ......"  జయేంద్ర అరుపుకి ఆ హాలంతా దద్దరిల్లిపోయింది.
    చటుక్కున దీపాలన్నీ వెలిగాయి.
    అందరి దృష్టి రుక్మిణి మీదే...
    రుక్మిణి .....మహానటి రుక్మిణి .....
    భర్త భుజమ్మీద తలపెట్టి ఓకే చేతిని భర్త చేతిలో, రెండో చేతిని కొడుకు విమల్ తలమీద ఉంచి -----
    శాశ్వతంగా నిద్రపోతుంది-
    "అమ్మా!" వినమ్ర గొల్లుమంది.
    మహానటి మహాభి నిష్క్రమనం......
    జయేంద్ర దాదాపు పిచ్చివాడై పోయాడు.
    తల్లిలేని ఇంటిని మొట్టమొదటి సారి చూసి, విమల్, వినమ్ర బావురుమన్నారు.
    ఒక అధ్యాయం పరిసమాప్తమైనది.

                                                     *    *    *    *
    మహానటి రుక్మిణి మరణం సినీ పరిశ్రమకేం షాక్ కలిగించలేదు. పాత తరానికి చెందిన కొంతమంది చిత్ర ప్రముఖులు మాత్రం శోక సంతాప హృదయ భారంతో శ్రద్దాంజలి వ్యక్తం చేసారు. రుక్మిణి కి దాదా పాల్కే అవార్డు ఇవ్వాలని కొన్ని సినిమా పత్రికలు దుఃఖంతో ఘోషించాయి.
    కానీ------
    రుక్మిణి మరణం వల్ల జయేంద్ర చూపుపోయిన వాడిలా అయిపోయాడు. రుక్మిణి ఎవరు? తన భార్య కాదు, తనకు పుట్టిన ఇద్దరి పిల్లల తల్లి కాదు. రుక్మిణి తన మార్గాదర్శి!
    ఆనాడు రుక్మిణి కనక, తనకు కనబడని పక్షంలో , తనేవై ఉండేవాడు. ఎక్కడో దగ్గర, ఏదో మాములు సాదా జీవితంలో కూరుకుపోయి ఉండేవాడు.
    తన జీవితానికో ఉనికిని, వెలుగును ఇచ్చింది మాహనటి రుక్మిణి.
    ఓక నెలరోజులు జయేంద్ర మనిషి కాలేకపోయాడు.
    వాళ్ళిద్దరూ గడిపిన బెడ్ రూమ్ లోనే అతని ఏకాంతం.
    స్కాచ్ విస్కితో దుఃఖాన్ని ఉపశమింపజేయడం కోసం ప్రయత్నించాడు. రుక్మిణిని, రుక్మిణి జ్ఞాపకాలను మరిచిపోవడానికి తాగితే, తాగిన నిషాలో మరింతగా రుక్మిణి జ్ఞాపకాలు , జ్ఞాపకమొచ్చి, మరింత మరింత బాధపెట్టేవి.
    పగలూ, రాత్రి మరో ధ్యాస లేదు తాగుడు తప్ప.
    అతను వర్క్ చేస్తున్న సినిమా షూటింగ్ లాన్నీ అర్దాంతరంగా ఆగిపోయాయి.
    తల్లిలేని ఇంటిలో, తల్లిని గురించి తలచుకుని కుమిలిపోతున్న పిల్లలు విమల్, వినమ్ర లను ఓడర్చాల్సిన తన బాధ్యతను కూడా మరిచిపోయాడు జయేంద్ర.
    అంతటి , విషాద పరిస్థితుల్లోనూ ధైర్యం వహించినవాడు విమల్.
    తల్లి బతుకుండగా తల్లి దండ్రుల బెడ్ రూమ్ వేపు వెళ్ళలేదు విమల్.
    కొంతమంది జయేంద్రతో సినిమాలు తీస్తున్న ప్రొడ్యుసర్, డైరక్టర్ల బాధను చూడలేక -----
    తండ్రి ఆలోచనలను మళ్ళీ సినిమాల వేపు మళ్ళించడానికి , మొట్ట మొదటిసారి ఆ బెడ్ రూం లోకి అడుగుపెట్టాడు విమల్.
    మసక, మసక చీకటి గదిలో జయేంద్ర మగత నిద్రలో ఉన్నాడు.
    లైటు వేసాడు విమల్.
    గది నాలుగు గోడల వేపూ చూసాడు. ఆయా పాత చిత్రాల్లోని రుక్మిణి దేవి లైఫ్ సైజ్ ఫోటోలు నవ్వుతూ -----
    ఆ బెడ్ రూమ్ అతనికో దేవాలయం లా కన్పించింది.
    "డాడీ........" నెమ్మదిగా పిలిచాడు.
    ఆ పిలుపుకి, ఒత్తిగిలి , కళ్ళు నెమ్మదిగా తెరిచాడు జయేంద్ర.
    అతని కళ్ళు పండిన బాదంకాయల్లా ఎర్రగా వున్నాయి.
    "బాబూ, నన్ను, మిమ్మల్ని వదిలేసి మీ అమ్మ వెళ్ళిపోయిందిరా ......." కొడుకు ఆకారంలో భార్య రుక్మిణిని చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు జయేంద్ర.
    చిన్నపిల్లడిలా ఏడుస్తున్నాడు జయేంద్ర.
    "డాడీ బాధపడితే అమ్మోస్తుందా......" మెల్లగా అన్నాడు విమల్.
    "నీకు తెలీదు విమల్, మీ అమ్మను కలవకపోతే నేనేక్కడో  అధఃపాతాళంలో వుండేవాడ్నిరా------ఈ ప్రపంచానికి నేనేవడ్నో -----నన్ను మీ అమ్మ పిల్లాడ్ని పెంచినట్లు పెంచిందిరా-----నా కొత్త జీవితానికి అమ్మలా నిలిచిందిరా మీ అమ్మ .......మీ అమ్మ ఎప్పుడూ స్వార్ధ్రజీవే  అందుకే నన్నొదిలేసి, తను వెళ్ళిపోయిందిరా ......తను అన్నేళ్ళు క్యాన్సర్ తో, అ భయంకరమైన వ్యాధితో బాధపడినా , నాతో ఎప్పుడూ చెప్పలేదు. నాకు తెలీకుండా ఎన్నీ జాగ్రత్తలూ తీసుకుందో చూడరా......."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS