భార్య పోయి నాలుగేళ్లయింది. ఒక్కగా నొక్క కొడుకు, ఆశలన్నీ అతడి మీదే పెట్టుకుని జీవిస్తున్నాడాయన. కొడుకు ఉద్యోగం చేస్తుండగా చూసే అదృష్టం ఆమెకు లభించలేదని ఆయనకు బాధగా వుంటుంది. కొడుక్కు ఉద్యోగం వచ్చి ఏనార్ధం దాటింది. అతడికే త్వరగా పెళ్ళి చేసి తన మకాం కొడుకు దగ్గరకు మార్చేయాలని అయన ఆత్రుతపడుతున్నాడు. తన జీవితమంతా కొడుకు దగ్గరే గడిచి పోవాలన్నది అయన ఆశ. అయితే ఆయనకు కొన్ని చాదస్తాలున్నాయి.
ఈ రోజుల్లో ఆడవాళ్ళలలో ఫాషన్ల వ్యామోహం వెర్రి తలలు వేస్తోంది. అలాంటివి లేకుండా సంప్రదాయాన్ని పాటిస్తూ, మన కట్టూ బొట్టూ మీద అభిమానముండే పిల్లనే కోడలిగా చేసుకోవాలని ఆయననుకుంటూన్నాడు. ఎందుకంటె అయన తనకు నచ్చని పని ఎవరైనా చేస్తే చూస్తూ ఊరుకోలేడు. దెబ్బలాడతాడు. ఫలితంగా గొడవలోస్తాయి. కొడుకు మెత్తని వాడు. అతడేవరి మనసూ నోప్పించలేడు. ఎవరినీ కాదనలేడు. భార్య మంచిదైతే సుఖపడతాడు. చెడ్డ దైతే నరకం అనుభవిస్తాడు.
ముహూర్తం తనే పెట్టించి కబురు చేస్తానని ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు నా గుండెల్లో రాయి పడింది.
నేననుకున్నదేమిటి . జరుగుతున్నదేమిటి?
మామగారు చెప్పిన ప్రకారం మోహన్ చాలా మంచి వాడు. బుద్ది మంతుడు . అతడి వంటి భర్త దొరకడం నా అదృష్టమే అవుతుంది. కానీ మామగారి సంగతేమిటి ? ఆయన పరమచాదస్టుడిలాగున్నాడు. నేను మా యింట్లో గడుపుతున్న జీవితం కంటే అధమంగా వుంటుందేమో అక్కడ!
నాకు తీరని సరదాలు చాలా ఉన్నాయి. లిప్ స్టిక్ వేసుకువాలని వుంటుంది. హెయిర్ స్టయిల్స్ రకరకాలుగా మార్చుకోవాలని వుంటుంది. అసలు కొన్నాళ్ళ పాటు బాబ్డ్ హెయిర్ తో ఉండాలని కూడా వుంది. చీరలు మానేసి కొన్నాళ్ళ పాటు బెల్ బాటమ్ను, చుడీ దార్లూ, మాక్సీ లూ వేసుకుని తిరగాలనుంది.
నా ఈ కోరికలను చాలాసార్లు అమ్మకు చెప్పాను. అమ్మ అభ్యంతర పెట్టలేదు. "నన్నకివి నచ్చవమ్మా- పెళ్ళయితే మీ ఆయనోప్పుకుంటే ఆ సరదాలన్నీ తీర్చుకోవచ్చు" అంది.
అందుకే నేను పెళ్ళి కోసం ఎదురు చూస్తున్నాను.
తీరా చూస్తె యిప్పుడిలాగయింది.
మామగారి వద్ద నుంచి పెళ్ళి ముహూర్తం నిర్ణయిస్తూ ఉత్తరం వచ్చింది. ముహూర్తం యింకా నాలుగు నెలలయింది.
ముహూర్తం నిర్ణయం అయిపొయింది. కాబట్టి ఇప్పుడు నేను. మోహన్ ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళే అవకాశం వచ్చింది. అమ్మ మాత్రం నన్ను తొందరపడవద్దని హెచ్చరించేది. ముహూర్తం కుదిరినా ఆడపిల్లలు పెళ్ళయ్యే వరకూ జాగ్రత్తగా వుండాలిట.
ఆ సంగతి నాకూ తెలుసు. ఈ దేశంలో ఆడపిల్లకు ఈ విషయం పుట్టుకతోనే తెలుస్తుంది. అయినా ఒకోసారి తప్పు జరిగిపోతుందంటే అది అమాయకత్వం కాదు - ఆకలి ప్రభావం!
ముహూర్తం కుదరగానే మోహన్ నా నుంచి పొగడ్తల నశించాడు. ఊహించిన కంటే ఎక్కువగానే అతడిని పొగిడి "మీ నాన్నగారు మీ గురించి చెప్పింది విన్నాక నాకు కలిగిన సంతోషమింతా అంతా కాదు. మీరు చాలా మంచి వారనీ, ఎదుటి వారి కోరికలు తీర్చడానికి ప్రయత్నిస్తారనీ తెలియగానే మీరు నాకు వరప్రసాదుడిలా కనిపించారు. అంటూ నేను నా తీరని కోరికల గురించి అతడికి చెప్పి "ఈ కోరికల కారణంగా భర్త జీవితం నరకం కాదు. డబ్బు ఖర్చు పెరిగిపోదు. ఇది కేవలం అభిరుచికి సంబంధించిన విషయం" అన్నాను.
అతడు తడబడ్డాడు. అతడి మోహంలో మార్పులు వచ్చాయి. రవంత కలవరాన్ని వ్యక్తపరుస్తూ "నువ్వు నా గురించి మా నాన్న చెప్పింది విన్నావు. మరి తన గురించి అయన చెప్పింది వినలేదా?" అన్నాడు.
"ఏమో మోహన్! నా దృష్టి అంతా మీమీదే! మీ గురించి తప్ప మరే మాటలూ నాకు వినబడలేదు. వినపడినా అర్ధం కాలేదు" అన్నాను.
ఈ మాటలకు అతడు చాలా సంతోచించాడు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అతడు తన తండ్రి గురించి చెప్పాడు. అయన ఆధునికతను బొత్తిగా సహించలేడుట, ఇంట్లో తనమాటే నేగ్గాలంటాడుట.
"దాందేముంది ?" అయన మనతో ఉండరు కదా " అన్నాను ఏమీ ఎరుగనిదానిలాగున.
"అయ్యో - నాతొ వుండడం కోసమే అయన నా పెళ్ళి కోసం ఆదుర్దా చెందుతున్నారు" అన్నాడు మోహన్.
"పెద్దవాళ్ళలాగే అంటారు మోహన్! కానీ వాళ్ళు అన్నంత సులభంగా తాముండే చోటును వదిలిపెట్టి రారు" అన్నాను తేలికగా.
"నీకు తెలియదు. ఆయాన నాతోనే ఉంటారు" అన్నాడతను.
"దాందేముంది మోహన్! మీకు నేనంటే ప్రేమ వుంది. అదే చాలు నాకు. మీ మీద నా ప్రేమ గొప్పదైతే మీకోసం నేనేమైనా త్యాగం చేయగలుగుతాను. జీవితంలో నాకు తీరని సరదాలు కొన్ని వున్నాయి. అవి మీ ద్వారా తీరుతాయనుకున్నాను. ఆ సరదాలు తీర్చుకుందుకైనా ఇంకో అయిదారుళ్ళు అవకాశం. ఆతర్వాత నా వయసూ పెరుగుతుంది. ఆ సరదాలు తీర్చ్జుకుందుకు బాగానూ వుండదు. అయినా వాటిని మీకోసం త్యాగం చేయగలను. మీరు నా మీద ప్రేమతో వేరే వుండడమే మంచిదనుకుంటే అది వేరే సంగతి. అందుకు మిమ్మల్ని నిక్కించను" అన్నాను.
నేను చాలా తెలివిగా మాట్లాడి వేరే కాపురం గురించి అతడి బుర్రలో బీజాలు నాటాను. వారం రోజుల్లోనే అవి మొలకెత్తాయి. కొత్తగా పెళ్ళయిన మా మధ్య తన తండ్రి అడ్డంగా ఉంటాడన్న విషయం అతడికి వంటబట్టింది. తండ్రిని మా మధ్యకు రాకుండా చేయడానికి ఉపాయం గురించి ఆవేశిస్తున్నాడతను.
"నేనేం చెప్పినా మన సుఖం కోసం. అయన మన మధ్య వుంటే మనకూ ఆయనకూ కూడా సుఖముండదు. ఎటొచ్చీ ఇది నా అభిప్రాయంగా మీరు మీ యింట్లో చెప్పకూడదు. అంతా నన్నాపర్ధం చేసుకునే ప్రమాదముంది" అన్నాను నేను. ఇలా అనగల ధైర్యం నాకు మోహన్ ఇచ్చాడు.
మోహన్ కూడా తీవ్రంగా ఆలోచిస్తూ "పెళ్ళికి ముందే నేనీ విషయం నాన్నకు స్పష్టం చేస్తాను. నువ్వు చెప్పినట్లు తర్వాత మళ్ళీ అపార్ధాలు వస్తాయి" అన్నాడు.
నేను చాలా సంతోషించాను. అన్ని విధాల నాకు అనుకూలుడయిన భర్త లభించబోతున్నాడు. ఇంతకంటే అదృష్టం వేరే వుండదు నాకు.
ఉన్నట్లుండి యింత అదృష్టమూ దురదృష్టంగా మారి పోయింది నాకు.
బ్యాంకు నుండి కట్నం డబ్బు తీసుకున్నాడు నాన్న. పెళ్లి వారి కివ్వాలని. నా మామగారు శేఖరం గారు డబ్బు తీసుకునేందుకు స్వయంగా బయలుదేరి వస్తున్నట్లు రాశారు.
ఎవడో చాలా తెలివిగా నాన్నను కనిపెట్టి అనుసరించి ఆ డబ్బు కొట్టేశాడు. ఒకటి కాదు.... రెండు కాదు.... పది వేలు . మొత్తం అంతా పోయింది.
నాన్న ఇంటికి వచ్చి మొహానికి రెండు చేతులు కప్పుకుని భోరున ఏడ్చాడు. అమ్మ యేడ్చింది. ఇంట్లో అంతా ఏడుస్తున్నారు. నాకు యేడుపు వచ్చింది.
అసలు ఏడుపంతా నాదే!
అమ్మ నాన్నను ఓదార్చడానికి ప్రయత్నించింది. అంతా కలసి నెమ్మదిగా దురదృష్టమంతా నాదని తేల్చారు. తప్పు నాన్న చేసినా నాది దారిద్ర గొట్టు జాతకమని కూడా అన్నారు. పది వేలు పోగొట్టుకున్న దుఃఖంలో, ఉక్రోషం లో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. మౌనంగా ఏడుస్తున్నది నేను మాత్రమే!
ఈ విషయం అన్నయ్య ఫోన్ చేసి మోహన్ కు అందజేశాడు.
"తల తాకట్టు పెట్టయినా సరే మళ్ళీ ఆ డబ్బు మీ కిచ్చుకుంటాం. పెళ్ళి మాత్రం ఆగకుండా చూడండి. డబ్బు యివ్వడానికి మాకు కొంత వ్యవధి కావాలి" అని అన్నయ్య అతడికి చెప్పాడు. అతడు అంతా విని "నేను చేసేదేమీ లేదు. అంతా మా నాన్నగారిలో వుంది" అన్నాడు. కానీ ఈ వ్యవహారం అతడికి నచ్చినట్లు లేదని మాటలను బట్టి తెలిసిందన్నాడు అన్నయ్య.
నేను మోహన్ ని మళ్ళీ కలుసుకోదల్చుకోలేదు. అన్నయ్య చెప్పిందాన్ని బట్టి నాకు తెలిసిందేమిటంటే మోహన్ మమ్మల్నం'దర్నీ మోసగాళ్ళుగా కట్టేశాడు. పది వేలు పోయాయన్న కధ నతడు నమ్మలేదు. అతడికి చాలా కోపం వచ్చినట్లు కూడా వుంది. ఇన్నాళ్ళూ అతడు నన్ను గౌరవించాడు. ఈ సంఘటనతో అతడు నన్నొక మోసగత్తెగా కట్టేసి వుంటాడు. నేనింక అతడి కంట పడక పోవడమే మంచిది.
ఆ రాత్రి శేఖరం గారు మా యింటికి వచ్చారు. మోహన్ రాలేదు.మా యింట్లో యెక్కడా కళాకాంతులు లేవు.
నాన్నఅయన రెండు చేతులూ పుచ్చుకుని రుద్ద కంఠంతో "బావగారు ! మమ్మల్ని మోసగాళ్ళని మాత్రం అనుకోవద్దు !" అన్నాడు.
శేఖరం గారు బదులివ్వలేదు . అయన కాసేపు నాన్న వంక చూశారు. తర్వాత నెమ్మదిగా " నేను అమ్మాయితో ఒక్కసారి మాట్లాడాలి" అన్నాడు.
పక్క గదిలోంచి వ్యవహార మంతా తొంగి చూస్తున్నాను నేను. ఈ మాటలు విని ఉలిక్కిపడ్డాను. అయన నాతో ఏం మాట్లాడుతాడు?
నేను ఆలోచిస్తుండగానే అయన నా గదిలోకి ప్రవేశించాడు. నా శరీరంలో వణుకు ప్రారంభమయింది.
"ఏమ్మా! బెంగ పెట్టుకున్నావా ?" అన్నాడు శేఖరం ఎంతో ఆప్యాయంగా.
ఏం చెప్పాలో తెలియక ఊరుకున్నాను. కానీ అప్రయత్నంగా నా కంట నీరు తిరిగింది. కొంగుతో ఒత్తుకున్నాను. "
"అరే ! నీ కంట ఆ నీరేమిటి? నేను నీ కన్నీరు తుడుద్దామని రాలేదు యిక్కడికి. నువ్వు నా కన్నీరు తుడుస్తున్నావని వచ్చాను" అన్నాడాయన.
ఆశ్చర్యంగా అయన వంక చూశాను. నిజంగానే అయన కంటిలో నీరుంది.
అయన పంచ కొంగుతో నీళ్ళోత్తుకుని "అన్ని ఆశలు నీ మీదే పెట్టుకుని వచ్చాను. నాకు డబ్బు మీద మమకారం లేదు. ఈ కట్నం డబ్బు లేదని పెళ్ళి ఆగిపోదు. అసలు మొదట్లో పెళ్ళి ఆర్బాటంగా జరుపుదామనుకున్నాను. ముహూర్తం జరిగిన వారం పది రోజులకే మా అబ్బాయిలో మార్పు వచ్చింది. వాడు ఒక్కడూ ఉందామనుకుంటున్నాడు. మీ మధ్య నే నుండడం వాడి కిష్టం లేదు. దాంతో నాకు పెళ్ళి సరదా అంతా పోయింది.
పెళ్ళయిన యెన్నో ఏళ్ళకి నాకు లేక లేక పుట్టిన బిడ్డ వాడు. చిన్నప్పట్నించీ వాడంటే ప్రాణం. మీ అత్తగారు పోయినప్పట్నించీ నాకు వాడే ప్రాణమయ్యాడు. ఇప్పటికి నాకు అరవై నిండాయి. ఇంకెంత కాలం బ్రతుకుతానో తెలియదు. వాడితో ఉంటూ, వాడిని చూసుకుంటూ యీ చివరి రోజులు వాడి దగ్గర గడిపేయాలని నా ఆశ! వాడి మనసు నువ్వే మార్చాలి. నువ్వు నాకు నచ్చావు. నువ్వయితేనే వాడి మనసు మార్చాలని అనుకుంటావు , పెళ్ళి కాగానే నాకు కాకుండా పోవాలని చూస్తున్నాడు వాడు. అలా జరగకుండా చూస్తానని మాటిస్తావా?" అని అన్నాడు.
నాకు కలిగిన ఆశ్చర్యం యింతా అంతా కాదు.
ఇప్పుడీ పెళ్ళి జరగడం ఆయనలోనే వుంది. కొడుకు పూర్తిగా ఆయనకు పెత్తనమిచ్చాడు. కానీ పెళ్ళి జరిగితే మాత్రం అతడు తన చేతుల్లోకి వచ్చేడ్డామనుకుంటున్నాడు. అందుకు కారణం నేను. నా కారణంగానే దాంపత్య జీవితం పట్ల అతడి బుద్ది మారింది. అతడి బుద్దిని యధాప్రకారం ఉంచడం కోసం మామగారు నన్నే కోడలిగా కోరుకుంటున్నారు.
అయన పదివేల గురించీ నన్ను నొక్కించడం లేదు. అయన డబ్బు మనిషి కాదు. కొడుకు మీది ప్రేమానురాగాలతో అయన బహుశా నా అభిరుచులను కూడా మన్నించవచ్చును. చాల గొప్ప హృదయం ఆయనది!
మరి నేను!
నేనెవరో నాకు వెంటనే స్పురించింది.
ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి నాన్న పదివేలు కూడా బెడితే ఒక్క పూటలో కాజేశాడు దొంగ. అలాంటి నేరం చేసినందుకు వాడ్ని మా యింటిల్లి పాదీ శాపనార్ధాలు పెట్టారు. మరి పాతికేళ్ళుగా తను ప్రాణానికి ప్రాణంగా పెంచిన కొడుకును తనకు కాకుండా చేస్తే శేఖరం గారు ఏమనుకుంటారు!
అయన ఏమనుకున్నా నాకూ ఆ దొంగకు తేడా ఏముంది?
నేను శేఖరం గారి కాళ్ళ మీద పడి -- "మీరు భగవంతుడి కంటే గొప్పవారు మామయ్యా- " అన్నాను.
ఆ పదివేలు పోవడం సంగతటుంచితే మాకు పెళ్ళి ఖర్చులు కూడా చాలా తక్కువయ్యాయి. సింపుల్ గా గుడిలో జరిగింది మా వివాహం.
కాపురం పెట్టాక కోరిక మీదనే మామగారు మాతో వున్నారు.
కొడుకును ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే మామగారు మా మధ్య నుండడం ఎంత అదృష్టమో -- కాపురం పెట్టాకనే నాకు తెలిసింది. కొడుకు సంతోషం కోసం అయన నన్ను భర్త కంటే అపురూపంగా చూస్తున్నాడు.
ఆ దొంగ ఎవరో కాని - పది వేలు కాజేసినా -- నన్ను దొంగను కాకుండా కాపాడాడు.
***
