మనిషి వెల్లకిలా పడి వున్నాడు, గుండెల్లో కత్తి . ఛాతీ నిండుగా రక్తం. తను హత్య జరిగిందనుకోవడానికి కారణాలు ఆమె ఇన్ స్పెక్టర్ కి చెప్పింది.
ఇన్ స్పెక్టర్ తాళం తీశాడు. తలుపులు తోశాడు. జనం మళ్ళీ వీధి గుమ్మం దగ్గర పోగవుతున్నారు.
పోలీసు బలగం గదిలో ప్రవేశించి తమ తమ పోజిషన్స్ అడ్జస్టు చేసుకుంటున్నారు.
రాఘవరావు శవాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. గుండెల దగ్గర గాయం అయితే వున్నది కానీ ఆ స్థానంలో వుండవలసిన కత్తి లేదు. అతను చటుక్కున పనిమనిషి వంక చూసి "నీ పేరేమిటన్నావ్?" అన్నాడు.
"లక్ష్మీ!" అందామె.
"చూడు లక్ష్మీ శవం గుండెల్లో కత్తిని చూశానన్నావ్ కదూ" అన్నాడు రాఘవరావు.
అప్పటికి లక్ష్మీ శవాన్ని చూసింది. ఆమె వణికిపోతూ 'అవును, కాదు" అంది.
అయితే రాఘవరావు ఆమె వద్ద నుంచి అసలు విషయం రాబట్టడానికి ఏంతో సేపు పట్టలేదు. ఆమె జరిగిన విషయం చెబుతుంటే ఆతడు ఆశ్చర్యంగా విన్నాడు.
"హంతకుడు గుండెలు తీసిన బంటు"అన్నాడతను అప్రయత్నంగా.
'అతను హంతకుడా?" అందామె మరింతగా వణికి పోతూ.
'అవును, లేకపోతే హత్యా యుధంతో వాడికేం పని" అన్నాడు రాఘవరావు. అతని ముఖం ఎర్రబడింది. ఎంత ధైర్యం ఆ మనిషికి? నడివీధి లో ఎంతో మంది జనం అతన్ని చూశారు. పనిమనిషి లక్ష్మీ అతన్ని చక్కగా గుర్తు పట్టగలదు. ఆ పరిస్థితుల్లో ఆమెకు మాయమాటలు చెప్పి మోసం చేసి తన పని తను చేసుకుపోయాడు.
"నువ్వు వాణ్ని గుర్తు పట్టగలవు కదూ?" అన్నాడు రాఘవరావు.
"గుర్తు పట్టగలనండి" అంది లక్ష్మీ. కానీ ఆమెకు మానసులో భయంగా వుంది.
అక్కడి తతంగం అంతా ముగించుకుని రాఘవరావు లక్ష్మీని పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళాడు. అక్కడ పాత నేరస్థుల ఫొటోలన్నీ చూపించాడు. వాటిలో ఎక్కడా ఆ మనిషి లేడు.
"ఇవన్నీ దొంగ ముఖాలండి. అతను చాలా పెద్దమనిషి లాగున్నాడు" అంది లక్ష్మీ.
"నీ తెలివి తక్కువతనం మూలంగా హంతకుడు తప్పించుకు పోయాడు. ఈ హత్యలో నీకు చాలా బాధ్యత వుంది. అసలు నువ్వే ఈ హత్య చేసి హత్యాయుదాన్ని దాచేసి ఈ కట్టు కధంతా చెబుతున్నావని నాకు అనుమానంగా వుంది" అన్నాడు రాఘవరావు.
లక్ష్మీ గొల్లుమని గోలపెట్టి రాఘవరావు కాళ్ళ మీద పడిపోయి "నాకు నిజంగా ఏమీ తెలియదు. నన్ను నమ్మండి బాబూ" అంది.
తన అనుభవాన్ని బట్టి లక్ష్మీ ఈ కేసులో ఏవిధమైన సంబంధమూ వుండి వుండదని రాఘవరావు ఊహించాడు. అయితే హంతకుడు చాలా తెలివైనవాడు. అతన్ని గుర్తు పట్టడానికి ఏకైక ఆధారం లక్ష్మీ. అసలు హంతకుడు ఎదురుగా వున్నా లక్ష్మీ నిర్లిప్తంగా వుంటే అతన్ని తెలుసుకొనడం తనకు సాధ్యపడక పోవచ్చు. లక్ష్మీని నిర్లిప్తంగా వుంచడానికి అతను చాలా ప్రయత్నాలు చేయవచ్చు. అందువల్ల హంతకుడి ఆచూకీ పోలీసులకు తెలియజేయవలసిన బాధ్యతను లక్ష్మీ ఫీలవ్వాలి. అందుకు ఆమెను భయపెట్టాలి.
"ఓకే వారం రోజుల్లో నువ్వు ఆ హంతకుడి ఆచూకీ మా కివ్వాలి. లేకపోతే నిన్ను నేను రక్షించలేను" అన్నాడు రాఘవరావు.
లక్ష్మీ దిగులుగా అక్కణ్ణించి బయల్దేరింది.
రాఘవరావు లక్ష్మీ పై నిఘా వుంచమని ఒక మనిషిని నియోగించాడు. హంతకుడు ఆమెను కలుసుకుని హెచ్చరించవచ్చు.
ఇటీవల తను చేపట్టిన కేసులన్నీ విచిత్రమైన మలుపులు తిరిగి తనకు ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఈ సమస్య తన దొక్కడిదేనా, లేక అందరు పోలీసాఫీసర్ల కూ వుందా అని ఆలోచిస్తున్నాడు రాఘవరావు. అతనా ఆలోచనల్లో తాత్కాలికంగా జగనాధస్వామి హత్య గురించి మరిచిపోయాడు.
5
"మీ ఆలోచనల్లో చాలా లోపాలున్నాయి" అన్నాడు సుబ్బారావు.
"చెప్పండి " అన్నాడు రాఘవరావు.
"హంతకుడు, హత్యాయుధాన్ని కాజేసిన వాడూ ఒక్కడే ననుకుందాం. హత్యాయుధాన్ని కాజేయడం లో ధైర్య సాహసాల్ని ప్రదర్శించినా యెంతో తెలివిగా ఎన్నో జాగ్రత్తలూ కూడా తీసుకున్నాడతను. అన్ని జాగ్రత్తలు తీసుకునేవాడు హత్యాయుధాన్ని తీసుకువెళ్ళడం వెంటనే చేయక హత్య జరిగిన కొన్ని గంటలకు అ పని ఎందుకు చేస్తాడు?" అన్నాడు సుబ్బారావు.
"ఎందుకంటె ఏం చెబుతాం? హత్య అనేది ముందుగా ఆలోచించుకుని పకడ్బందీగా చేస్తే అది వేరే సంగతి. అలా కాకుండా అప్పటికప్పుడు కలిగిన ఆవేశంలో హత్య జరిగిందనుకొండి. అప్పుడు హంతకుడు గాబరాగా అక్కణ్ణించి వెళ్ళిపోవచ్చు. తర్వాత తన పొరపాటు గుర్తించి వుండవచ్చు."
"మీరు చెప్పింది బాగానే వుంది కానీ అప్పటికప్పుడు కలిగిన ఆవేశంలో హత్య చేశాడనుకొండి. అంటే హత్యాయుధం అతని వద్ద సిద్దంగా వుండి వుండదు. అందుబాటులో వుండేదాన్ని హత్యాయుధంగా వాడతాడు. దీన్ని బట్టి జగన్నాధస్వామి తన గదిలో హత్య చేయబడ్డానికి పనికి వచ్చే ఓ పెద్ద కత్తి వుంచుకుంటున్నాడనుకోవాలి. బాగానే వుంది. అతని కత్తితో అతన్ని చంపినప్పుడు హంతకుడు హత్యాయుధం గురించి అంతగా భయపడవలసిన దేముంది? దాని మీద తన వేలిముద్రలు లుంటాయేమో నన్న భయముంటే అని జాగ్రత్తగా తుడిచేస్తే సరిపోతుంది గదా! హత్యాయుధాన్ని దొంగిలించమెందుకు?" అన్నాడు సుబ్బారావు.
"అలాకాదు . పోనీ హంతకుడు పకడ్బందీగా ప్లాను వేసుకుని వచ్చాడు. కూడా తన కత్తి తెచ్చుకుని వచ్చాడు. హత్య చేశాక వెంటనే ఏదో అలికిడికి భయపడి అక్కణ్ణించి పారిపోయాడు. తర్వాత వచ్చి తన హత్యాయుధాన్ని తీసుకు వెళ్ళాడు" అన్నాడు రాఘవరావు.
'అలా అనుకుందామనుకున్నా -- హత్యాయుధాన్ని తీసుకు వెళ్ళడానికి పగటి సమయన్నెందుకు నిర్ణయించు కుంటాడు? పట్టపగలే అంతకు తెగించిన వాడు రాత్రి ఆ పని పూర్తీ చేసుకోలేడా? అదీగాక రాత్రి ఎక్కడా ఆ వీధిలో ఎవ్వరూ హత్య జరిగినట్లు గుర్తించడం జరుగలేదని మీరే అన్నారు. హత్యాయుధాన్ని కాజేసింది హంతకుడే అయుంటే - అందుకు ఒకే ఒక్క కారణం స్పురిస్తుంది" అని ఆగాడు సుబ్బారావు.
"చెప్పండి !" అన్నాడు రాఘవరావు.
"హంతకుడు సామాన్యుడు కాడు. తన శక్తి సామర్ధ్యాలను పోలీసులకు ప్రత్యేకంగా తెలియబర్చి ఓ సవాల్ పారేయాలనుకుంటున్నాడు."
రాఘవరావు పిడికిళ్ళు బిగిశాయి. "అదే నిజమైతే వాడికి నిజంగా మూడింది.
'అందుకే నా అనుమానం ఆ కత్తిని తీసుకు వెళ్ళింది హంతకుడయుండదని" అన్నాడు సుబ్బారావు.
రాఘవరావు చిత్రంగా సుబ్బారావు కళ్ళలోకి చూసి 'అయితే ఎవరయుంటారు ? మీరా?" అన్నాడు.
"ఎవరైనప్పటికీ బ్లాక్ మెయిలింగ్ కోసం ఆ పని చేసి వుండవచ్చు."
రాఘవరావు నవ్వి "జగన్నాధస్వామి హత్య కేసులో అనుమానితులు ముగ్గురు. ముగ్గురిలో ఏ ఒక్కడ్ని బ్లాక్ మెయిల్ చేసినా పది పైసలు కూడా రావు మీకు" అన్నాడు.
"వాళ్ళు అనుమానితులు. అసలు హంతకుడు వేరే వున్నారేమో - ఆ కత్తి అతణ్ణి పట్టివ్వగలదేమో" అన్నాడు సుబ్బారావు.
"మీరు గమనించారో లేదో మన వాదన మళ్ళీ మొదటి కొచ్చింది" అని గట్టిగా నవ్వాడు రాఘవరావు.
"కావాలనే అలా చేశాను. లేకపోతే నన్నే బ్లాక్ మేయిలర్ని చేస్తున్నారు మీరు" అని తనూ నవ్వాడు సుబ్బారావు.
6
'అపు" అందామె.
అటో ఆగలేదు. శరవేగంతో ముందుకు దూసుకు పోతోంది.
