Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 52

 

    "నా విషయంలోనూ అంతే." అని రాజు అక్కడ్నించి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. అప్పటికి నేనార్డరిచ్చిన ఊతప్పం వచ్చేసింది. అది నెమ్మదిగా తింటూ ఆ యువతినే చూస్తూ కూర్చున్నాడతను. అతని మెదడు ఊతప్పం రుచికి ఆనందించకుండా ఆమె ఎక్కడ కనుమరుగైపోతుందోనని భయపడుతోంది.
    అయితే ఆ యువతి అక్కడ్నించి అంత త్వరగా కదిలే ప్రయత్నంలో వున్నట్లు లేదు. ఆమె ఐస్ క్రీం తినడమయ్యాక ఫ్రూట్ సలాడ్ ను అర్దరిచ్చింది. అర్దరిచ్జిన ప్రతీదీ చాలా నెమ్మదిగా తింటుందేమో ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్ హోటల్లో అడుగు పెట్టె సమయానికి రాజు ఊతప్పం తిని కాఫీ తాగటం కూడా అయిపొయింది. కానీ ఆమె ఇంకా ఫ్రూట్ సలాడ్ తింటూనే ఉంది.
    రాజు పరుగెత్తుకుని ఇన్ స్పెక్టర్ ని సమీపించి హడావుడిగా ఆమెను చూపించాడు. ఈ గొడవకు ఏదో కుతూహలం కలిగినట్లుగా ఆమె ఇన్ స్పెక్టర్ ని రాజునీ చూసింది. అలా చూస్తున్నా ఆమె ఫ్రూట్ సలాడ్ తింటూనే వుంది. ఆమె చూపుల్లో ఏవిధమైన భయమూ, ఆందోళన కనబడటం లేదు.
    రాజు, చంద్రశేఖర్ ఆమెను సమీపించారు.
    "మేడమ్! మీ పేరు తెలుసుకోవచ్చా?' అన్నాడు చంద్రశేఖర్.
    "ఎందుకు?' అన్నదామె. ఆమె గొంతులో ఏ మాత్రమూ భయం లేదు.
    "మీ ప్రశ్నకు సమాధానం ఈ హోటల్లో చెప్పలేను. మీరు ఫ్రూట్ సలాడ్ తినడం అయేక మనం బయటకు పోదాం." అన్నాడు చంద్రశేఖర్.
    "నేను ఫ్రూట్ సలాడ్ తినడాని కింకా అయిదు నిముషాలైనా పట్టవచ్చు. ఆతర్వాత నేను హల్వాకు అర్దరిద్డామానుకుంటున్నాను...." అందామె.
    "అప్పుడు ఈహోటల్లో ఇంతమంది ముందు మిమ్మల్ని ఇబ్బంది కరమైన ప్రశ్న లడగవలసి ఉంటుంది , మీరు వెంటనే నాతొ బయల్దేరి వస్తే...."
    ఇన్స్ పెక్టర్ మాటలను మధ్యలోనే ఆపి, "అడగదల్చుకున్నదేదో ఇక్కడే అడగండి. హల్వా మానేయడం కంటే మీ మాటలిబ్బందికరంగా ఉంటాయని నేననుకోవడం లేదు" అందామె.
    జంకు, బొంకు లేకుండా ఆమె అలా మాట్లాడుతుంటే చంద్రశేఖర్ కు అనుమానం వచ్చింది. అతను అనుమానంగా రాజు వంక చూసి, "మీరు చెప్పదల్చుకున్నది చెప్పండి. అడగదల్చినది అడగండి."అన్నాడు.
    రాజు గొంతు సవరించుకుని, "నిన్న మీరు మా బ్యాంకు కి వచ్చారు..." అన్నాడు. ఆమె అదోలా అతని వంక చూసి , "మా బ్యాంకంటే ?" అందామె.
    పేరు చెప్పాడు రాజు. విని నవ్వుతూ , "ఆ బ్యాంకుకు నేనెందు కొస్తాను? మా ఇంటికది చాలా దూరం. పైగా అందులో నా అకౌంట్ లేదు కూడాను...." అంది.
    రాజు తెల్లబోయాడు. "అదంతా నాకు తెలియదు . నిన్న మీరు మా బ్యాంకు కు వచ్చి నాతొ మాట్లాడేరు సిబి ఐ ఏజెంటు నని నన్ను నమ్మించారు...."
    ఆమె చురుగ్గా అతని వంక చూసి , "మీరెవరో మీ వ్యవహార మేమిటో నాకు తెలియదు. కానీ మీ మాటలు మాత్రం మర్యాదగా లేవు. మీ బ్యాంకు కు రావలసిన అవసరం గానీ, సి.బి.ఐ ఏజెంటు నని ఒకళ్ళని నమ్మించవలసిన అవసరం గానీ -- నాకు లేవు. అలా చేయడం వల్ల నాకేం లాభం?" అంది.
    "కొన్ని లక్షలు...." అన్నాడు కసిగా రాజు.
    "హోటళ్ళ లో ఫ్రూట్ సలాడ్స్, ఐస్ క్రీమ్ లు, హల్వా లు ఆగకుండా తినవచ్చు..." అన్నాడు ఇన స్పెక్టర్ కోపంగా.
    "మీలాంటి వాళ్ళుంటే ఆగకుండా తినడం ఎలాగా కుదరదు! నా ఫ్రూట్ సలాడ్ నీళ్ళు కారిపోయింది...." అందామె విసుగ్గా.    
    "బహుశా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్ళాల్సి ఉంటుంది. హల్వా తిండం మరీ అంత ముఖ్యమను కుంటే పార్సిల్ కట్టించుకు తీసుకు వెడదాం...." అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "మీ ముఖం చూస్తుంటే కాఫీ హోటల్లోనే ఏమీ సహించడం లేదు. ఇంకా పోలీస్ స్టేషన్ కు కూడా హల్వా తెచ్చుకోవాలా కర్మ!" అందామె.
    "అదే గొంతు . అదే మనిషి. నేనే విధంగానూ పొరబడడం లేదు. " తనలో తనే అనుకుంటున్నట్లుగా అన్నాడు రాజు. ఆమె ప్రవర్తనతో రాజుకు తన మీద తనకే నమ్మకం పోయిందని అనుకున్నాడు ఇన్ స్పెక్టర్.
    "చూడండి ఇన్ స్పెక్టర్! ఇతనే బ్యాంకు లో పని చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఓ గంట నుంచి నా వెంట పడుతున్నాడు. ఇలా మగపిల్లలు వెంటబడడం నాకు కొత్త కాదు. కానీ పోలీసుల్ని తీసుకొచ్చి బెదిరించడం మాత్రం ఇదే ప్రధమం. నా అనుమానం మీరు డూప్లికేట్ పోలీసని. అలాంటి అనుమానం నాకున్నప్పుడు మీ జీపు నేను ఎక్కను. ఈ మధ్య ఇలాంటి మోసాలు చేసి అందమైన ఆడపిల్లల్ని ఎత్తుకు పోవడం తరచుగా జరుగుతోంది..." అందామె.
    చంద్రశేఖర్ ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు. నదురూ బెదురూ లేదు. తొణుకూ బెణుకూ లేదు. ఆ వయసులో అందులోనూ ఆడపిల్ల కింత ధైర్య ముండడం అద్భుతమూ, అరుదూ కూడాను.
    "అటువంటి సందేహం మీకుంటే మనం నడిచే వేడదాము. కానీ తప్పించుకు వెళ్ళడానికి ప్రయత్నించ కూడదు....'అన్నాడు ఇన్ స్పెక్టర్.
    'అలా చేయవలసిన కర్మ నాకేం పట్టింది?' అందామె.
    ఆమె కౌంటర్లో బిల్లు చెల్లించింది. ఇన స్పెక్టర్ ఫోన్ చేసి తన జీపు గురించి ఏవో సూచనలిచ్చాడు. ముగ్గురూ రోడ్డుమీదకు వచ్చేక, "ఇప్పుడు స్టేషన్ దాకా ఎందుకు చెప్పండి? అడగవలసిన వన్నీ స్పష్టంగా అడగండి. నా సమాధానాలు చెబుతాను....'అందామె.
    ఆమెపేరు లత. అమేదీ ఊరు కాదు. రెండు నెలలైంది ఆమె ఆ ఊరొచ్చి. బియ్యే తప్పిందట. ఎకనామిక్స్ లో , ఆ సబ్జక్టు లో ట్యూషన్ చెప్పించుకోవడానికి ఊరు వచిందిట. వేరే గది తీసుకుని వుంటోందిట. తన గది అడ్రస్ కూడా ఇచ్చిందామె. నిన్నటి దినం ఉదయం పది నుంచి సాయంత్రం మూడు వరకూ సబ్జక్టు చదువుతూ కాలక్షేపం చేసిందిట. ఈ బ్యాంకు వ్యవహారమే తెలియదట ఆమెకు. రాజు మనసులోని ఉద్దేశ్యం పట్ల ఆమెకు చాలా అనుమానాలున్నాయి.
    "ఎకనామిక్స్ లో ట్యూషన్ కోసం ఇంతదూరం వచ్చారంటే ఆశ్చర్యంగా వుంది....' అన్నాడు ఇన్స్ పెక్టర్.
    "మిమ్మల్ని మా బ్యాంకులో నేను కాక యింకా చాలామంది గుర్తు పట్టగలరు." అన్నాడు రాజు.
    "అలా గుర్తుపట్టగలిగిన వారందరూ మీ బ్యాంకు ఉద్యోగ స్తులే అయుంటారు. అయిదారుగురుద్యోగులు తలచుకుంటే బ్యాంకులో ఏమనా చేయవచ్చు. మీరు చెప్పిన కధ వింటుంటే అంతా సహజంగానే వుంది. ఒక్క నా రాక తప్ప! ఎందుకంటె ఒక్క ఆడపిల్ల వల్ల అంత సాహసం సాధ్యపడదు. పధకం వేసి నిన్న దొంగతనం జరిగిపోయేక , నాలాంటి అన్నెం పున్నెం ఎరుగని అమాయకురాలి నిందులో ఇరికించడానికి కుట్ర పన్నుతున్నారు." అంది లత.
    ఇన స్పెక్టర్ గతుక్కుమన్నాడు. ఇలాంటి అవకాశ మొకటి ఉన్నదని తనకు స్పురించనే లేదని అతనికి అనుమానం వచ్చింది. అతను అదోరకంగా రాజు వంక చూశాడు.
    పరిస్థితి తనకు ప్రతికూలంగా మారేలా గున వున్నదని నాకు అనుమానం వచ్చింది.
    "బ్యాంకుల్లో అటువంటివి సాధ్యపడవు. ఇటువంటిది ఇంతవరకూ ఒక్క సారి కూడా ఏ దేశంలోనూ జరుగలేదు. ఉద్యోగుల్ల్లో ఒకరిద్దరు ద్రోహులుండవచ్చును గానీ- ఎక్కువ మంది కలిసి బ్యాంకును దోచుకోవడం అసాధ్యం.
    ఈమెను మా బ్యాంకులో ఇంచుమించు అందరు ఉద్యోగస్తులూ గుర్తించగలరు. అంతేకాదు, ఈమెను గుర్తించగల కస్టమర్స్ పేర్లు కూడా కొన్ని చెప్పగలను...." అన్నాడతను ఆవేశంగా.
    లత నవ్వి "మీ కధ మీరు చెప్పారు. మరి నా కధ నన్ను చెప్పనివ్వండి. నేను నిన్న రోజల్లా నా ఇంట్లోనే ఉన్నానని నా వీధిలో జనమంతా ఏక కంఠం తో చెబుతారు. ఒకసారి నా గదికి వచ్చి వెళ్ళండి. ఎటొచ్చి పెద్ద మనుషుల్లా ప్రవర్తించాలి ...." అంది.
    ఇన స్పెక్టర్ క్షణం అలోచించి సరేనన్నాడు.
    ముగ్గురూ ఆమె గదికి బయల్దేరి ఓ పావుగంటలో అక్కడికి చేరుకున్నారు. లత తలుపు తాళం తీసి, చాప పరిచి "కూర్చోండి ." అంది. వాళ్ళు కూర్చుంటూ వుండగా స్వేచ్ నొక్కి దీపం వేసిందామె.
    చంద్రశేఖర్ పరిశీలించి ఆ గదిని చూసి, "ఈమె నిజమేచేబుతోంది 'అనుకున్నాడు.
    ఎకనామిక్స్ లో స్పెషల్ కోచింగు కు ఆ ఊళ్ళోని రవీంద్ర ట్యుటోరియల్ కాలేజీ పేరెన్నికగన్నది. అక్కడ చదువుకోవడానికి చుట్టూ పక్కల చాలా ప్రాంతాల నుంచి విద్యార్దులు వచ్చి వెడుతుంటారు. రవీంద్ర ట్యుటోరియల్ కాలేజీలో లత గురించి అడిగి తెలుసుకోవాలని అతననుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS