Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 52


                                డబ్బుతో పేచీ!

    ఏడేళ్ళ కొడుకుని దగ్గరగా తీసుకుని ఆప్యాయంగా నుదురుమీద ముద్దెట్టుకుని-"నువ్వు చాలా గొప్పవాడౌతావురా...." అన్నాడు జగ్గడు.
    అప్పాయమ్మ కిసుక్కున నవ్వింది. భార్య వంక అదోలా చూసి-"ఎందుకే నవ్వుతావ్? నీ కడుపున ఓ కాయ కాస్తే వాణ్ణీ ఇలాగే ముద్దులాడతాలే...." అన్నాడు జగ్గడు.
    అప్పయమ్మ మళ్ళీ నవ్వింది. ఆ నవ్వులో కవ్వింపు వుంది.
    అప్పాయమ్మ జగ్గడి రెండో పెళ్ళాం. ఏన్నర్ధం క్రితం అతని మొదటి భార్య చనిపోయింది. ఆర్నెల్ల క్రితం జగ్గడు అప్పాయమ్మని పెళ్ళిచేసుకున్నాడు. జగ్గడికి కొడుకు సుబ్బన్నంటే చాలా యిష్టం. వాణ్ణి చాలా చాలా గొప్పవాణ్ణి చేసేయాలని తరచుగా కలలు కంటూంటాడు కొత్తగా వచ్చిన అప్పాయమ్మకు సుబ్బన్నపట్ల రాగద్వేషం లేమీ లేవు కానీ-సినిమా హీరోయిన్లా ఉండాలని మాత్రం మహాతాపత్రయపడిపోతూంటుంది.
    ముఖం చాలా అందంగా వుంటుందప్పాయమ్మది. మనిషికూడా చాలా నాజూగ్గా వుంటుంది. ఎటొచ్చీ చదువుకోనందువల్లనూ, పెద్దింటి ఫ్యాషన్లు తెలియని మూలానూ మామూలువాళ్ళకి చూడ్డానికి మామూలుగానే కనబడుతుంది కానీ ఓ మాదిరి రసికతున్న వాళ్ళుకూడా ఆమె అందాన్ని గుర్తించడం చాలా సులభం.
    జగ్గడు కాయకష్టం చేసి బ్రతికేమనిషి కాడు. వాడో ధనవంతున్నాశ్రయించి బ్రతుకుతున్నాడు. ఆ ధనవంతుడి పేరు రంగారావు. జగ్గడు అవసరాలన్నీ ఆయనే చూస్తాడు ఆయన చెబితే జగ్గడు మనుషుల్ని కొడతాడు-చంపుతాడు కూడా! జగ్గడికి తన యజమానంటే చాలాగౌరవముంది.
    రంగారావు ప్రస్తుతం జగ్గడికోసం కబురుపెట్టాడు. వెళ్ళేముందు కొడుకును ముద్దులాడి మరీ బయల్దేరాడు. అతను వెళ్ళేసరికి రంగారావు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు.
    "ఒరేయ్ జగ్గా-రాత్రంతా బాగా ఆలోచించేక చివరికి నీకీ విషయం చెప్పాలనుకుంటున్నాన్రా-నువ్వేమీ అనుకోకూడదు...." అన్నాడు రంగారావు.
    "చెప్పండి బాబూ...." అన్నాడు జగ్గడు.
    "నీ పెళ్ళాంమీద మనసైందిరా నాకు...." అన్నాడు రంగారావు తటపటాయించకుండా.
    జగ్గడు తెల్లబోయాడు. అతని రక్తం వుడికింది. ఆవేశంతో నోటమాటరాలేదు.
    "ఆవేశపడకురా-నువ్వు కనిపెట్టావో లేదో కానీ నీ పెళ్ళాం అంతస్థిరమైనది కాదు. అదెలాగూ ఒక మగాడికి కట్టుబడే రకంకాదు. నా విషయంలో చూసీ చూడనట్లూరుకున్నావో అది నిన్నూనన్నూ తప్ప మరొకన్ని పట్టకుండా కట్టుదిట్టం చేస్తాను. నీ కొడుకును చదివించడానికి అన్ని ఖర్చులూ నేను భరిస్తాను. ఒకసారి నా దగ్గరకొచ్చేక-దాన్నింక నీ పెళ్ళాంగా చెప్పుకొనేందు కిష్టంలేకపోతే-దాన్ని పూర్తిగా నాకే వదిలేసి-ఇంకొహత్తిని కట్టుకో బాగా ఆలోచించు...."
    "బాబూ-మీరు చెప్పిన ఎదవపన్లు చేస్తున్నానని-నన్నుత్తి ఎదవకింద కట్టేశారా-తాళికట్టి పెళ్ళాడినదాన్ని పరాయిమగాడి కప్పగించేటంత నీచుణ్ణి కాదు బాబూ నేను. అది నన్ను పెళ్ళాడింది బోగందానిగా మారడానిక్కాదు. ఇల్లాలిగా బ్రతకడానికి. తమరేమీ అనుకోనంటే ఒక్కముక్క అంటాను" అన్నాడు జగ్గడు.
    "చెప్పరా...."
    "మీయావిడ గురించడిగితే నాకేం చెబుతారు బాబూ మీరు?"
    రంగారావేమీ ఆవేశపడలేదు-"అంతేనా? అది ఆవిడకు సంబంధించిన విషయం. నా మూలంగా ఆవిడకు సమాజంలో వున్నతస్థానం లభించింది. అదవసరం లేదనుకుంటే వెళ్ళిపోతుంది...."
    తన యజమాని ఆవేశపడిపోతాడనుకున్న జగ్గడికేం మాట్లాడాలో తోచలేడు "దొరా-నేను చదువుకున్నోన్ని కాదు. ఆవేశాన్నదుపు చేసుకోవటం నాకు చేతకాదు. ఇంకోసారిలాంటి మాటలాడ్డం మీకూ నాకూ కూడా మంచిది కాదని మాత్రం చెబుతున్నాను...."

                                       2

    "అప్పీ-"
    "బాబూ...."
    "నాతో వుండిపోకూడదుటే...."
    "నేనడిగినవన్నీ ఇస్తే వుండిపోతాను బాబూ...." అంది అప్పాయమ్మా.
    "అడిగినవన్నీ ఇవ్వడంకాదే! నీకు చదువు కూడా చెప్పిస్తా, నా ఇంట్లోనే సెక్రటరీగా వుంటావన్న మాట" అన్నాడు రంగారావు.
    అప్పయమ్మ కళ్ళు మెరిసాయి.
    "ఆ బీరువా తెరు. నీక్కావల్సిన బట్టలు కట్టుకో...." అన్నాడు రంగారావు.
    అప్పాయమ్మ ఉత్సాహంగా వెళ్ళి బీరువా తెరిచింది. అందులో వున్న బట్టలు చూస్తూంటే ఆమెకు పిచ్చెక్కినట్లయింది. ఏమి సెలక్ట్ చేసుకోవాలో కూడా తెలియలేదామెకు. రంగారావే ఆమెకు కొన్ని మ్యాచింగ్ బట్టలు తీసిచ్చాడు. అప్పటికప్పుడా బట్టలు వేసుకొన్నాక రంగారావామెకు నిలువుటద్దంముందుకు నడిపించాడు. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని అదిరిపడింది అప్పాయమ్మ ఆ తర్వాత మురిసిపోయింది.
    "ఇప్పుడు మీ ఆయనొస్తాడు. భయపడతావా-నేను చెప్పినట్లు చేస్తావా?"
    "వాడంటే నాకు భయం బాబూ...." అంది అప్పాయమ్మ.
    "నేనుండగా కూడానా?"- అన్నాడు రంగారావు. మరి కాసేపట్లో అక్కడికి జగ్గడు రానేవచ్చాడు. వస్తూనే చూసిన దృశ్యానికి అతని శరీరం కుతకుతలాడిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS