Previous Page Next Page 
డాళింగ్ పేజి 52

 

    సినిమా రికార్డ్ టైం లో , నెలరోజుల్లో పూర్తీ కావాలి. అదీ జయేంద్ర పంతం ---షూటింగ్ జరుగుతుండ\గానే ఎడిటింగ్, డబ్బింగ్ , రీ రికార్డింగ్ జరిగిపోవాలని - జయేంద్ర తన్ షూటింగ్ అన్నీ కాన్సిల్ చేసుకున్నాడు. షూటింగ్ పూర్తీ కావడం, ఫస్ట్ కాపీ రుక్మిణి కి చూపించడం-----
    వెంటనే రుక్మిణిని అమెరికాకు తీసుకెళ్లడం ----ముందుగానే న్యూయార్క్ లో కేన్సర్ హాస్పిటల్ స్పెషలిస్టుల్ని సంప్రదించాడు. అప్పటికే ఫామిలీ డాక్టర్ ఒకసారి న్యూయార్క్ వెళ్ళి, తగిన ఎరేంజ్ మెంట్స్ చేసొచ్చాడు.
    షూటింగ్ శరవేగంతో రాత్రింబవళ్ళు జరుగుతోంది.
    డైరెక్టర్ గా ఓకే కొత్త వ్యక్తికీ అవకాశం ఇచ్చాడు జయేంద్ర అతనికి.
    అదే మొదటి సినిమా.
    అతనెంతో ప్రతిభ ఉన్న వ్యక్తీ - చాలా చాలెంజింగ్ గా చేస్తున్నాడు పిక్చర్.
    -----ఒకరోజు
    షూటింగ్ జోరుగా జరుగుతున్న సమయంలో -----
    జయేంద్రకు ఫోన్ వచ్చింది .
    ఫామిలీ డాక్టర్ ఫోన్ చేసాడు.
    "జయేంద్ర రుక్మిణికి సీరియస్ గ ఉంది, అర్జంటుగా రండి --" అంటూ.
    బాత్ రూంలో రక్తం కక్కుకుని స్పృహ తప్పి పడిపోయింది రుక్మిణి.
    వెంటనే హాస్పిటల్ లో చేర్చారు.
    'అమెరికా తీసికెళ్ళడం మంచిది ----వ్యాధి ముదిరిపోయింది."
    కేన్సర్ స్పెషలిస్ట్ చెప్పారు.
    అప్పటికప్పుడు ఏర్పాట్లన్నీ పూర్తీ చేసాడు జయేంద్ర.
    "ఏం చేస్తున్నారు?" మెలుకువొచ్చాక అడిగింది రుక్మిణి.
    "నువ్వు మరేం అడ్డుచెప్పక------నీవెంత సీరియస్ పరిస్థితిలో ఉన్నావో నీకు తెలీదు!" చెప్పాడు జయేంద్ర.."
    "ఫస్ట్ కాపీ రానీ జయేంద్ర ......బాబుని ఒక్కసారి తెరమీద నటుడిగా చూడని, అప్పుడు నాకు అమెరికా వెళ్ళినా, స్మశానికి కెళ్ళినా రెండూ ఒక్కటే -----ఇదే నా నిర్ణయం."
    "రుక్మిణి!" విలవిలలాడుతూ అన్నాడు జయేంద్ర.
    "నా కోరికను నువ్వెప్పుడూ గౌరవిస్తావని నాకు తెలుసు." ఆ మాటతో మరేం మాట్లాడలేక పోయాడు జయేంద్ర.
    జయా హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది రుక్మిణి.
    న్యూయార్క్ నుంచి స్పెషలిస్టులోచ్చారు- పదిమంది నిపుణుల ప్రత్యేక బృందం, అహర్నిశలూ మహానటి రుక్మిణిని కనిపెట్టుకుని ఉన్నారు. లక్షలకు లక్షలు ఖర్చయిపోతున్నా వేరవటం లేదు. జయేంద్ర.
    అయిన రోజు, రోజుకూ రుక్మిణి పరిస్థితి క్షీణిస్తోంది . ఆ విషయం డాక్టర్లకు మాత్రమే తెలుసు.
    మెలుకువ వచ్చినప్పుడల్లా రుక్మిణి అడిగే ప్రశ్న ఒక్కటే .
    "సినిమా పూర్తయ్యిందా?" అని.

                                                  *    *    *    *
    "విమల్" చిత్రం పూర్తయ్యింది.
    ఫస్ట్ కాపీ వచ్చింది. స్పెషల్ పర్మిషన్ మీద.
    హాస్పిటల్ కాన్ఫరెన్స్ హల్లో సినిమా ప్రదర్శన ఏర్పాటు చేసారు.
    ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోంచి మహానటి రుక్మిణిని తీసుకొచ్చారు.
    రుక్మిణికి ఎడంపక్కన జయేంద్ర, కుడిపక్కన విమల్. ఆ పక్కన వినమ్ర, అ పక్కన ఫామిలీ డాక్టర్ , మిగతా సిబ్బంది.
    దూరంగా డైరెక్టర్ కూర్చున్నాడు.
    కాన్ఫరెన్స్ హల్లో లైట్లు ఆగిపోయాయి.
    ప్రొజెక్టర్ అన్ చేసారు - తెరమీద మహానటి.
    రుక్మిణి సమర్పణలో -------
    అన్న కార్డ్ ని చూసి , భర్త వేపు చీకట్లో చూసింది.
    "మహానటి' ఆ ఒక్కమాట - తన పేరు ముందుకి రావడానికి, తను ఎన్ని, ఎన్నెన్ని విషాద అనుభవాల్ని చవిచూసింది తను ---
    ఎన్నెన్ని నిద్రలేని రాత్రులు గడిపింది.
    ఎన్ని మానసిక హింసలు, ఎన్ని అవమానాలు, ఎన్నెన్ని అవహేళనలు, కృత్రిమ విలువల వలయంలో ఇన్నేళ్ళు ఎలా బతికింది తను.......?
    తన మట్టుకు తనకే ఆశ్చర్యంగా ఉంది రుక్మిణికి.
    "మహానటి రుక్మిణి జయేంద్ర కొడుకు విమలేంద్ర హీరోగా పరిచయం అవుతున్న ------
    "విమల్'
    కొడుకు విమల్ చుబుకాన్ని ప్రేమగా నిమిరింది. తల్లి అమృతమయమైన చేతులమీద చేతులు వేసి, ఆమె కళ్ళల్లోకి చూసాడు.
    ఆమె కనుగుడ్లమీద కదులుతున్న తడి, మసక వెలుతురులో మిలమిల మెరుస్తోంది.
    "నాన్నా విమల్, ఎవరికో రాని వరం నటన......దానిని గౌరవించు. నిన్ను గౌరవించే వాళ్ళను ప్రేమించు ......విజయాల్ని, విఫలాల్నీ రెంటినీ ఒకేరకంగా తీసుకో. జ్ఞాపకం ఉంచుకుంటావు కదూ!" నెమ్మదిగా అంది. ఆ మాటల్ని స్పష్టంగా , జాగ్రత్తగా విన్నాడు విమల్.
    టైటిల్స్ పూర్తయ్యాయి.
    లాంగ్ షాట్ లో కారొచ్చి , ఓకే బిల్డింగ్ ముందు ఆగింది.
    క్లోజప్ .
    డోర్ తెరచుకుంది.
    డోర్ లోంచి ఓకే కాలు బయటికొచ్చింది.
    ------అప్పుడే రుక్మిణిలో ఏదో సంచలనం మొదలైంది. ఎవరో గుండెల్ని పిండేస్తున్న భ్రమ. వేయి ఇనుప శూలాలతో మెదడు మీద గుచ్చుతున్న ఫీలింగ్ ......
    ఆమె కళ్ళకి అంతా మసకలు, మసకలుగా ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS