'మిడతల దండు '
వసుంధర
బ్యాంకులో ఆమె అడుగు పెట్టగానే చాలామంది ఆమెను చూశారు. ఒకసారి ఆమె వంక చూసిన వారు అప్రయత్నంగానే అలా వుండిపోతున్నారు. చాలా అందంగా ఉన్నదామే.
టైము రెండు కావస్తోంది. కొత్త వాళ్ళేవరినీ లోపలకు రాకుండా బ్యాంకు దగ్గర దర్వాన్ అద్దేస్తున్నాడు. లోపల ఉన్న వారినందరనూ త్వరగా తెమిల్చి పంపెడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆమె ఎవరినీ ఏమీ అడగలేదు. బ్యాంకుకు వచ్చిన వారిని ఒక్కొక్కరినే గమనిస్తోందామె. అంతకు మించి వేరే పని వున్న మనిషిలా ఆమె కనపడడం లేదు. అయితే ఏం అక్కడున్న చాలామందిని ఆమె ఆకర్షించింది. చాలామందికి ఆమెను చూడడం కాలక్షేపం గా వుంది ప్రస్తుతం. తనను గమించే వారిని కూడా ఓ కంట కనిపెడుతోందామె జాగ్రత్తగా.
ఆమె బ్యాంకు లోపల ఆవరణ లో సుమారు అర్ధగంట సేపు గడిపింది. లోపల వున్న చాలామందికి పనులై పోయినట్లుంది. ఒకరిద్దరు మినహాయించి అందరూ వెళ్ళి పోయారు.
అప్పుడే ఒక బ్యాంకు ఉద్యోగి ఆమె చాలాసేపటి నుంచి అలా నిలబడి పోయిందని గుర్తించి -- "మేడమ్ వాట్ కేనైడూ ఫర్ యూ--" అన్నాడు.
"మీరు నాకోసం ఏమీ చేయలేరు. పైగా నేను మీకో ఉపకారం చేయడానికి వచ్చాను." అందామె చిన్నగా నవ్వి.
ఉద్యోగి ఆమె వంక ఆశ్చర్యంగా చూసి "మీరంటున్నది నా కర్ధం కావడం లేదు." అన్నాడు.
"మిడతల దండు తెలుసు గదా మీకు...." అందామె.
"మిడతల దండు గురించి తెలియని బ్యాంకు ఉద్యోగి ఉంటాడా?" అన్నాడతను. కానీ ఈ అమ్మాయి హటాత్తుగా మిడతల దండు ప్రసక్తి తీసుకురావడం అతనికి ఆశ్చర్యంగా తోచింది.
ఆమె స్వరం తగ్గించి - "నేను సిబిఐ లో పని చేస్తున్నాను. మిడతల దండుకు సంబంధించిన ఒక వ్యక్తీని అనుసరిస్తున్నాను. అతనిప్పుడు మీ బ్యాంకు ఆవరణలో వున్నాడు." అంది ఆ ఉద్యోగి ముఖంలో కలవరపాటు కనబడింది. "అయిడెంటిఫికేషన్ చూపించగలరా?" అన్నాడు.
ఆమె సందేహించకుండా తన జాకెట్లోంచి ఒక చిన్న కార్డు తీసి చూపించింది. అతనది చూసి తృప్తిగా తల పంకించి - "ఆ వ్యక్తీ ఎవరో చెప్పండి?" అని ఆ కార్డుని ఆమెకు తిరిగి ఇచ్చేశాడు.
"ఒకసారి మీ దర్వాన్ ని లోపలకు పిలిచి ముఖం కడుక్కోమనండి. తర్వాత తమాషా చూడవచ్చు." అంది ఆమె.
అతను సాలోచనగా చుట్టూ పరికించాడు. ఒకరిద్దరు బ్యాంకు ఉద్యోగులు కుతూహలంగా తమ ఇద్దర్నీ పరికిస్తున్నారు.
అది ఒక ఏరియాలో ఆ బ్యాంకు ఏర్పరచుకున్న బ్రాంచి ఆఫీసు. అక్కడ స్టాపు పన్నెండుగురు. వీళ్ళు కాక బ్రాంచి మేనేజరు, దర్వాను. ఆ ఏరియాకు చుట్టూ పక్కల వుండేవన్నీ గొప్పవాళ్ళ ఇళ్ళు. వారిలో ఎక్కువ మంది నగల వ్యాపారులూ, వడ్డీ వ్యాపారులూనూ , అందువల్ల ఆ బ్యాంకు ఎక్కువ టర్నోవర్ లోనే నడుస్తుంది. ఆ బ్యాంకు లాకర్ల లో చాలా విలువైన వస్తువులుంటాయని చెప్పు కుంటుంటారు.
బ్యాంకు ఉద్యోగి గుమ్మం దగ్గరకు వచ్చాడు.
అక్కడ దర్వాన్ కూర్చుని వున్నాడు. అ దర్వాన్ ని అతను రెండు సంవత్సరాలుగా ఎరుగును. మారువేషంలో మరొక వ్యక్తీ అలా కూర్చున్నాడంటే అతనికి నమ్మకం కలగలేదు. నిజంగా అది మారు వేషమే అయిన పక్షంలో ఆ మేకప్ టెక్నిక్ చాలా గొప్పదే అయి వుండాలి.
అతను ఆలోచిస్తూనే దర్వాన్ ని మరికాస్త పరీక్షగా చూసాడు. అలా చూస్తె అతని ప్రవర్తనలో, చూపుల్లో అనుమానించవలసిన లక్షణాలు కనబడ్డాయి.
"ఒసారిలా రా! " అంటూ వుద్యోగి దర్వాన్ని పిలిచాడు. దర్వాన్ ముందు బయటకు చూశాడు. చుట్టూ పక్కల జనసంచారం లేదు. అప్పుడతను లోపలకు చూశాడు. ఉద్యోగి తననే పిలుస్తున్నాడు. అతను చటుక్కున లేచి లోపలకు వెళ్ళాడు.
"ముఖం నిండా చెమటలు పోసేశాయ్. కాస్త చన్నీళ్ళతో ముఖం కడుక్కో -" అన్నాడు ఉద్యోగి. దర్వాన్ ఆశ్చర్యంగా అతని వంక చూసి "డ్యూటీలో వుండగా ముఖం కడుక్కోను నేను. గుమ్మం దగ్గర కూర్చోవడమే నా డ్యూటీ. ఇప్పుడు ముఖం కడుకున్నా ఎండకు మళ్ళీ ఎలాగూ చెమటలు పట్టేస్తాయి....' అన్నాడు.
బ్యాంకు ఉద్యోగికి అనుమానం పెరిగింది. సిబిఐ మనిషి గా తనను పరిచయం చేసుకున్న యువతి గుమ్మం దగ్గరకు నడవడం అతను చూడలేదు. అతనింకా దర్వాన్ తో వాదించబోతుండగానే ఆమె హ్యాండ్ బాగ్ లోంచి ఏవో వుండల్లాటివి తీసి బ్యాంకులో విసిరేసి చటుక్కున తలుపులు మూసేసింది. ఆమె ముక్కుకు అడ్డంగా రుమాలు పెట్టుకుంది.
ఇటువంటిది జరుగుతున్నదని ఎవరూ అనుమానించినట్టు లేదు. గదిలో ఏదో గ్యాసు వ్యాపించింది. జనం ఒక్కొక్కరే మూర్చ పోతున్నారు. ఆమె యాక్టివ్ గా రంగం లోకి దిగింది. ఆమె చేతిలో ఇప్పుడు రివాల్వర్ కూడా వుంది.
బ్యాంకు మొత్తం నాలుగు భాగాలుగా వుంది. ఓ మాదిరి విశాలమైన హాలు. పబ్లిక్ ట్రాన్స్ యాక్షన్స న్నీ అక్కడే. ఆపక్కనే చిన్న ఇరుకైన గదిలో డ్రాప్తులు వగైరాలు తయారవుతాయి. అ తర్వాత గదిలో బ్యాంకు బ్రాంచి మేనజరు కూర్చుని ఉంటాడు. ఆ వెనక గదిలో లాకర్లుంటాయి.
హల్లో అందరూ మూర్చ పోయారని గ్రహించి ఆమె లోపలకు వెళ్ళింది. గ్యాసు అక్కడి వరకూ వ్యాపించింది. బ్రాంచి మేనేజరుతో సహా అందరూ మూర్చపోయారు.
అరగంట నుంచి ఆమె బ్యాంకులో ఏయే తాళాలు ఎక్క డెక్కడున్నదీ వగైరా వివరాలు చూసు కుంటోంది. అందువల్ల ఆమెకు క్యాషు బాక్సు లోంచి క్యాషు తీసుకోవడానికీ లాకర్స్ మాస్టర్ కీ సంపాదించడానికీ ఎక్కువ సేపు పట్టలేదు.
ఆమె హ్యాండ్ బ్యాగులో చాలా లాకర్ తాళాలున్నాయి.మాస్టర్ కీని వాటిని కలిపి ఉపయోగించి - చాలా లాకర్లు తెరిచి విలువైన వస్తువుల నెన్నింటినో సంగ్రహించిందామె. వజ్రాలను, రత్నాలను, నగలను తన హ్యాండ్ బాగ్ లోకి జారవిడిచింది. దానిలోంచే ఒక కాగితం మడతను తీసింది. దానిని విప్పిందామె. ఎంతో బరువును అవలీలగా భరించగల ఒకరకమైన ప్లాస్టిక్ తో తయారయిన సంచీ అది. చూడ్డానికి కాగితం సంచీ లా వున్నదానిలో ఆమె వంద రూపాయల నోట్ల కట్టలనూ, హ్యాండు బ్యాగు లో పట్టని విలువైన వస్తువులనూ చేర్చింది.
తర్వాత లాకరు తలుపులన్నీ యదా ప్రకారం మూసేసింది. అన్నీ వాటి స్థానాల్లో వుంచేసి త్వరగా బ్యాంకు లోంచి బయటపడింది.
2
"ఏం కావాలి సార్!" అనడిగాడు సర్వర్. అతను చెప్పాడు. సర్వర్ వెళ్ళి రెండు గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చి అతని ముందు పెట్టాడు. చల్లటి మంచినీళ్ళు తాగుతుంటే అతనికి ప్రాణం లేచి వచ్చింది. ఓ రెండు గుక్కలు తాగి అటూ ఇటూ చూస్తూ అతను త్రుళ్ళి పడ్డాడు.
సందేహం లేదు. నిన్నటి దినం తనతో బ్యాంకులో మాట్లాడినది ఆమె!
అతనికి ఆశ్చర్యం కలిగింది. గుండెలు తీసిన బంటు లాగుంది ఆమె. నిన్న బ్యాంకులో పట్టపగలు అంతమంది ఎదురుగా దొంగతనం చేసి ఈరోజు ఏమీ ఎరుగని దానిలా హోటల్లో దర్జాగా కూర్చుని ఐస్ క్రీం తింటోంది.
అతను నెమ్మదిగా తన సీట్లోంచి లేచాడు. బిల్లు కౌంటర్ వైపు నడిచాడు. అయితే అతని కళ్ళన్నీ ఆమెనే గమనిస్తున్నాయి. ఆమె అతన్ని ఏమాత్రమూ గమనించినట్లు లేదు. నెమ్మదిగా ఐస్ క్రీం సిప్ చేస్తూ ఏదో ఆలోచిస్తుంది.
అతను కౌంటర్లో కి నడిచి - యాభై పైసలిచ్చి, టెలిఫోన్ డయల్ చేశాడు. అదృష్టవశాత్తు అవతల నుంచి ఎంగేజ్యి లేదు.
"హల్లో! ఇన్స్ పెక్టర్ చంద్ర శేఖరం గారా! నమస్కారమండీ- రాజాని మాట్లాడుతున్నాను. అదేనండీ. నిన్న దోపిడీ అయిన బ్యాంకులో ఉద్యోగిని. నిన్న నన్ను మాటల్లో పెట్టి నాచేత దర్వాన్ ని లోపలకు పిలిపించిందన్నానే ఆ అమ్మాయి యిప్పుడు ఊర్వశీ హోటల్లో ఐస్ క్రీం తింటోంది. ఇంకాఎంత సేపు వుంటుందో తెలియదు. మీరు వెంటనే బయల్దేరి రాగలరా....సరేలెండి . ఈ లోగా నేనామె హోటల్ దాటి పోకుండా చూస్తుంటాన్లెండి...." అని ఫోన్ పెట్టేశాడు. అతను చాలా నెమ్మదిగా మాట్లాడి నప్పటికీ కౌంటర్లో వ్యక్తీ కా మాటలు వినబడి నట్లున్నాయి.
"ఎవరండీ ఆ అమ్మాయి....' అన్నాడు కుతూహలంగా.
రాజు తడబడలేదు. సూచన ప్రాయంగా అతనికా అమ్మాయి కూర్చున్న చోటు తెలియజేసి -- "ఎలాగో అలా కొంతసేపు మీరామె హోటల్ వదిలి వెళ్ళకుండా చూడాలి " అని కోరాడు.
"అంత నాజూగ్గా అందంగా వున్న అమ్మాయి అపరాది అంటే నమ్మబుద్ది కావడం లేదు. మీరు పోరాబడ్డారిమో!" అన్నాడు కౌంటర్లో వ్యక్తీ.
"సరే మీరా అమ్మాయి నిప్పుడు చూశారు గదా! రేపేవారైనా ఆ అమ్మాయిని చూపించి నిన్నటి రోజంతా ఆమె హాస్పిటల్లో ఉందన్నారానుకోండి పోరాబడ్డాననుకుంటారా?" అన్నాడు రాజు చిరాగ్గా.
"ఇంత అందాన్ని అంతలో ఎలా మరిచి పోతామండీ?"
