Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 51


    అందుకే కావాలని తనతని కా విధంగా జోస్యం చెప్పాడు. ఒకోసారి ఇలాంటిమాటలు-అలాంటి బలహీనులపైనా పనిచేసి మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి.
    పంతులు తన జోస్యంలో ఎదుటివారికి భవిష్యత్తు గురించి చెప్పడం మాత్రమేకాక-భావిపైనవారికి ఆశ పుట్టేలా చేస్తాడు. తన ప్రోత్సాహం వారిచేత మంచిపనులను చేయించాలన్నది అతని ఆశయం. ఇప్పుడు జరిగినది చూస్తూంటే అతనికి గతంలో జరిగిన మరో విచిత్ర సంఘటన గుర్తుకొచ్చింది.
    ఒకసారి ఒకాయన వచ్చాడు. ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. ఏవో కొద్దిగా ఆచూకీలున్నాయి. దొంగబట్టుబడతాడా-తన డబ్బు తనకు దొరుకుతుందా అన్నదాయన బాధ! ఆయన డబ్బున్నవాడే-ఆ డబ్బు పోవడం వల్ల ఆయనకు కలిగే నష్టమేమీ లేదు. పంతులాయన కోదార్పు మాటలుచెప్పి అంతా దొరక్కపోయినా కొంత దొరకవచ్చునన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు.
    ఇంకోగంట తర్వాత అతని దగ్గరకు ఆ డబ్బు దొంగిలించినవాడు వచ్చాడు. పంతులుకు అయిదు నిముషాల్లో పరిస్థితి అర్ధమైపోయింది-"తప్పుచేసినా నువ్వు పట్టుబడిపోయే ప్రమాదముంది. ఎలాగో అలా సగం అసలు యజమానికి వెనక్కు వెళ్ళేలాచేస్తే ప్రమాదముండదు" అని చెప్పాడు పంతులు.
    ఆ మనిషికి సంబంధించిన రెండు వస్తువులు అసలు ఆసామీ ఇంట్లో వుండిపోయాయి. ఇతర ఇబ్బందులు గురించి భయపడి ఆసామీ పోలీసు రిపోర్టివ్వలేదు కానీ ఆ రెండు వస్తువులూ నేరస్తునికి చెందినవిగా-పోలీసులకు పోస్టులో ఆకాశరామన్న కవర్లో పంపుదామా అని ఆయన ఆలోచిస్తూండగా ఆయనకే ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. ఆ రెండువస్తువులనీ నగరంలో ఫలానాచోట-అగ్గిపుల్లవేసి అంటించివేస్తే-సగం డబ్బు ఆయనకు తిరిగి రాగలదని.
    ఆ ఆసామీ అలాగేచేశాడు. ఆయనకు డబ్బు తిరిగి వచ్చింది. ఆసామీ పంతులుకి ప్రత్యేక బహుమానమిచ్చి జరిగినది చెప్పాడు. దొంగకుకూడా మనశ్శాంతి లభించింది. అతనా డబ్బుతో వ్యాపారం ప్రారంభించి న్యాయంగా జీవిస్తున్నాడు. పంతులుకు తనెంతో ఋణపడి వున్నానని అంటూంటాడా దొంగ.
    ప్రత్యేకమైన ప్రయోజన ముంటుందన్న నమ్మకంలో కాకపోయినా పంతులు తను చెప్పే జోస్యంలో గుప్తంగా నీతినీ, ప్రోత్సాహాన్నీ మేళవిస్తూంటాడు. అందువల్లనే అతనికి మంచి పాప్యులారిటీ వుండి వుండవచ్చును.
    ఆరోజు పంతులు కింకా మంచిబేరాలు తగిలాయి. ఆదాయం ముఫ్ఫైరూపాయలు దాటిపోయింది-సాయంత్రం అయిదుగంటలలకే! అదేసమయంలో అతనాశ్చర్యపోయేలా అక్కడికి రాజమ్మ వచ్చింది.
    "ఏమిటిలా వచ్చావ్?" అన్నాడు పంతులు ఆశ్చర్యంగా.
    "అడవిరాముడు సినిమా చూద్దామని వచ్చాను. తీసుకెడతావా?" అంది రాజమ్మ.
    "ఒక్కర్తినీ పంపేడా మీ అయ్య...."
    "పంపకేం చేస్తాడు-రేపే మన పెళ్ళిమాటలు జరుగుతాయిగదా...."
    "రేపెక్కడ-ఇంకా అయిదొందలు చేరాలిగదా...."
    రాజమ్మ నవ్వి- "నీకు తెలియదుగానీ-నీ జోస్యం కరెక్టు మావా, నా అయ్యకు తెలీకుండా నేనూ డబ్బు నిలవేస్తున్నాను నీ కోసమని. నిన్నటికి అయిదొందలు పోగడ్డాయి అవి నీకిచ్చేస్తాను, అవున్నాయికాబట్టే మొన్న నిన్ను బ్యాంకులోంచి డబ్బు తియ్యమన్నాను. అయ్యతో చెప్పేశాను కూడా-రేపు నువ్వు డబ్బు తెచ్చి ఇచ్చేస్తావని....." అంది.
    పంతులు ఆశ్చర్యంగా రాజమ్మవంక చూశాడు. తన జోస్యంతో ఈ సంగతి ఊహించలేక పోయాడు. రాజమ్మ తనని గాఢంగా ప్రేమిస్తున్నదన్నమాట. నిజంగానే తన దృష్టవంతుడు.
    "రావడానికి నేనూ సూరీ కలసొచ్చాం మావా-ఇక్కడొచ్చేక అది వాళ్ళ మావ దగ్గరికెళ్ళిపోయింది. నేను నీ దగ్గరకొచ్చాను...." అంది రాజమ్మ.
    ఇది వాళ్ళకి మామూలే, పట్నంలో సూరి చుట్టాలు కూడా ఉన్నారు. రాత్రికి వాళ్ళింట్లో పడుకుంటారు సూరీ, రాజమ్మా.
    పంతులుకీ ఉత్సాహం కలిగింది. రాజమ్మతో కలిసి సినిమా చూడాలనుంది-"పద-పోదాం...." అంటూ అతను బిచాణా ఎత్తేశాడు.
    "సూరి కూడా వస్తుంది మావా సినిమాకి సినిమా అయిపోయేక మేమిద్దరం వెళ్ళిపోతాం...." అంది రాజమ్మ.
    పంతులు మామూలుగానే రైల్వేస్టేషన్లో పడుకుందామనుకున్నాడు.
    పట్నం నుంచి పల్లెకు రాత్రిపూట వెళ్ళడానికి ప్రయాణ సాధనాలు లేవు.
    రాజమ్మ, పంతులు అడవిరాముడు సినిమా కలిసిచూసి ఆనందించారు. పంతులు రంగుల కలల్లో తేలిపోతున్నాడు. రాజమ్మ శాశ్వతంగా తన స్వంత కాబోతోందన్న ఆలోచన అతన్ని మైమరిపింపజేస్తోంది.
    మర్నాడుదయం పల్లెచేరిన పంతులు మ్రాన్పడి పోయాడు.
    అతనిల్లు చేరేసరికి తలుపులు తాళం వేసిలేవు, ఇంట్లోకి వెళ్ళి చూస్తే దాచిన చోట డబ్బులేదు. తను చాలా తెలివిగా గోడలో దాచిన డబ్బు విషయం దొంగ అంతకంటే తెలివిగా ఊహించి పట్టుకుపోయాడు. ఒకటికాదు, రెండు కాదు-పదిహేనువందలు.....
    ఆ డబ్బు తను బ్యాంకులోనే దాచాడు. రెండ్రోజుల క్రితం రాజమ్మే చెప్పింది-డబ్బు ఎంతుంట్ అంతగా ఓసారి చూపించమని తను ఏదో మంత్రంవేసి మిగతా డబ్బు తెప్పిస్తానని ఆమె అంటే తను మనసులో నమ్మలేదు. తన దగ్గర నిజంగా పదిహేనొందలుందోలేదో తెలుసుకోవడం కోసం ఆమె అలా అన్నదనుకున్నాడు.
    అందుకే రెండ్రోజుల క్రితం బ్యాంకు నుంచి డబ్బు తీశాడు. అప్పుడెవరో అది చూసి తన్ననుసరించి ఉండాలి. నిన్న తను సినిమా పేరుతో పట్నంలో ఉండిపోయాడు. దొంగ తీరుబడిగా ఇల్లంతా శోధించి డబ్బు పట్టుకుపోయాడు.
    ఊళ్ళో ఎవరికీ ఈ విషయం తెలియదు. తనుమాత్రం ఎలా చెప్పుకుంటాడు? తను పేరున్న జ్యోతిష్కుడాయె! పదిమందికీ జరగబోయేది చెప్పి సంపాదించిన డబ్బు విషయంలో జరగబోయేది తనకు తెలియదని ఎలా ఒప్పుకుంటాడు?
    దిగాలుగా కూర్చుండి పోయిన పంతులింటికి రాజమ్మ వచ్చింది.
    "పెళ్ళి మాటలాడవలసినవాడి వలా దిగాల్పడి పోయే వేమిటి?" అంది.
    "మన పెళ్ళి జరగదే రాజమ్మా-" అన్నాడు పంతులు.
    తెల్లబోయిన రాజమ్మకు వివరం చెప్పాడు పంతులు. రాజమ్మ కూడా దిగాలు పడిపోయింది. పంతులు మాత్రం బింకంగా-"పేరుమోసిన జ్యోతిష్యున్ని వాడెవరో వాడి అంతుతేలుస్తాను...." అన్నాడు.
    "సరేలే-ఇలాంటి విషయాల్లో జోస్యాలు పనికిరావు. అయినా వాడిది కాని సొమ్ము తీసుకుపోడానికి వాడికెంత ధైర్యం- నీదైన సొమ్ము నువ్వు తీసుకెళ్ళలేక పోతున్నావ్-మా అయ్యకు భయపడి...." అంది రాజమ్మ.
    పంతులుకు రాజమ్మ మాటలర్ధం కాలేదు-" ఏమిటే నువ్వనేది?"
    "నువ్వు జోస్యం చెప్పడం మానేయ్ మావా-అది నీకచ్చి రాలేదు. నా గొలుసమ్మేస్తాను. నా అయిదొందలు నీకిచ్చేస్తాను. రెండు పాడిగేదెలు కొనుక్కుందాం. మా అయ్య గొంతెమ్మ కోర్కెలు తీర్చాలనుకుంటే మనకు వయసై పోయేలా ఉంది...." అంది రాజమ్మ.
    అవును రాజమ్మ తన్ను ప్రేమించింది. తను పెళ్ళి చేసుకుంటానంటే ఆడడానికి శివయ్యెవడు? రాజమ్మ తన సొత్తు. దొంగతనం అవసరంలేదు. పబ్లిగ్గానే వెళ్ళి అడిగి మరీ తీసుకుపోతా డామెను.
    "నువ్వెళ్ళు-నేను వెనకాలే వచ్చి నీ అయ్యతో మాట్లాడతాను...." అన్నాడు పంతులు.
    ఆమె వెళ్ళిపోయేక పంతులుకా ఇంట్లో ఒకచోట ఓ కాగితం కనబడింది. పరీక్షగా చూడగా అది ఒక మనిషి జాతకం. ఇంకా బాగా చూడగా-అది వేణు జాతకం అని గ్రహింపయింది పంతులుకి.
    అతను తలపెట్టిన పని నిర్విఘ్నంగా కొనసాగిపోతుందని ప్రోత్సహించి ఆరోజే ముహూర్తం పెట్టాడు తను. అన్నట్లుగానే అతని పని నిర్విఘ్నంగా నెరవేరింది.
    తన జోస్యానికి తిరుగులేదు.
    అయితే వేణు తలపెట్టిన పని తన ఇంట్లో దొంగతనమనీ దాన్ని తను ప్రోత్సహించాడనీ, అది నెరవేరడం కోసమే ఒకరాత్రి తను పట్నంలో ఉండిపోయాడనీ అనుకుంటూంటే పంతులుకి తన జోస్యం గురించి ఏమనుకోవాలో తెలియదు.
    తను జోస్యాన్ని వదిలిపెట్టాలా, కొనసాగించాలా?
    రాజమ్మ మాటలు అతని చెవుల్లో గింగురుమంటున్నాయి-"అది నీకచ్చిరాలేదు మావా....."
    పంతులు లేచి-గుడిసె తలుపులు తాళం వేయకుండానే శివయ్య ఇంటికి బయల్దేరాడు.
    
                                       * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS