Previous Page Next Page 
డాళింగ్ పేజి 51

 

    ఇప్పటికి అతన్ని హీరోగా పెట్టి, సినిమాలు తియ్యడానికి ప్రోడ్యుసర్లు సిద్దంగా వున్నా.
    "నా వయసుకు తగ్గ పాత్రే వేస్తాను......." అని నిర్ణయం చేసుకున్నాడు జయేంద్ర.
    
                                          *    *    *    *
    రుక్మిణికి ఆ రోజు చాలా పవిత్రమైన రోజు, ఆ రోజు రుక్మిణి జయేంద్ర పెళ్ళిరోజు.
    ఆ రోజున, ఎంత బిజీ షెడ్యులున్నా ఇంట్లోనే వుంటాడు జయేంద్ర.
    ఇద్దరూ పిల్లలూ డెహ్రాడూన్ నుంచి వచ్చేసాడు.
    రుక్మిణి ఆరోజు స్వయంగా వంట చేసింది. భర్తకు, పిల్లలకు వడ్డించింది. తను భోజనం చెయ్యడానికి కూర్చోబోతున్న సమయంలో గొంతులోకి ఏదో అడ్డురావడంతో పోరబడింది.
    తెరలు తెరలుగా దగ్గు,
    గబగబా మంచినీళ్ళ గ్లాసుతో నీళ్ళు పట్టబోయి, రుక్మిణి నోటి నుంచి కారుతున్న రక్తాన్ని చూసి, షాక్ తిన్నాడు జయేంద్ర.
    "ఏంటిది రుక్మిణి .....డాక్టర్ని పిలుస్తాను......."
    "వద్దు జయేంద్ర.......జీవితం నాలుగో దశలో కొచ్చేశాను....... ఏదో వ్యాధులు రావడం సహజం .....ఏదీ రాకుండా ఎల్లకాలం ఉండగలమా చెప్పు?"
    ఫామిలీ డాక్టర్ వచ్చాడు వెళ్తున్నప్పుడు ఆయన్ని పక్కకి పిలిచి అడిగాడు జయేంద్ర.
    "ఏవిటి డాక్టర్----రుక్మిణికి ఏమిటి ప్రాబ్లం?"\
    నలబై ఏళ్ళుగా రుక్మిణికి ఆయనే పర్సనల్ డాక్టర్. డాక్టరే కాదు మంచి ప్రెండ్ కూడా.
    "జయేంద్ర-----రుక్మిణి కోరిక మీద చాలాకాలం నీ దగ్గర ఓ విషయం రహాస్యంగా వుంచాను----తన అనారోగ్య కారణంగా తనమీద ఏ ఒక్కరూ సానుభూతి చూపించకూడదని రుక్మిణి అభిప్రాయం ----జీవితం రెండో భాగంలో అనారోగ్యం తనమీద పడినా, నీ సహచర్యం వల్ల రుక్మిణి , మోడులాంటి రుక్మిణి మొలకెత్తింది . ఎవరూ ఊహించని విధంగా పిల్లల తల్లయింది. తను ఏ ఆనందాన్నయితే  కోరుకుందో ఆ ఆనందాన్ని అందుకుంది. అందుకే నీక్కూడా తన అనారోగ్య విషయం చెప్పకూడదని నన్ను రిక్వెస్ట్ చేసింది.
    తనకోసం నువ్వు చేసిన అపురూపమైన త్యాగానికి ప్రతిఫలంగా తను చనిపోయే చివరిక్షణం వరకూ నీకు అనందాన్నివ్వడం కోసమే తన అనారోగ్యాన్ని తను కూడా నీకు చెప్పకుండా దాచింది---"
    "ఇంతకీ ఏమిటి డాక్టర్! రుక్మిణి , రుక్మిణికేమైంది డాక్టర్?'
    "కేన్సర్ , మీ పెళ్ళయిన కొత్తలోనే దాని సింస్థమ్స్ కనిపించాయి. ఇన్నాళ్ళు న శాయశక్తులా వైద్యం చేసాను ....మధ్యలో కొంతకాలం తగ్గుముఖం పట్టినట్లు కనిపించింది. అయినా ఏం ఫర్వాలేదు . వీలైంత తొందరలో అమెరికాకు తీసికెళ్తే అంతా మామూలే."
    "ఇన్నాళ్ళు నాకు తెలీకుండా ఎందుకుంచారు డాక్టర్?" బాధగా అన్నాడు జయేంద్ర షాక్ నుంచి కొద్ది క్షణాలకు తేరుకుని.
    ఆ మాటకు డాక్టర్ జవాబివ్వలేదు.\


                                                       *    *    *    *

    ఆ రోజు రాత్రి----
    రుక్మిణిని  అదేమాట అడిగాడు జయేంద్ర.
    "వైద్యం కోసం నేను అమెరికా వెళ్ళాననుకో, ఓకే రెండు నెలలైనా నీకు, మన పిల్లలకు దూరంగా వుండాలి. అలా వుండలేక నేను వెళ్ళలేదు. చచ్చిపోవడమంటావా\.....నేను చావుకేప్పుడూ భయపడలేదు ....నా వాళ్ళందరూ వున్న ఇప్పుడూ భయపడను. బతికిన కాసిన్ని రోజులు మీ మధ్య బతకాలని " చెప్పింది రుక్మిణి.
    "నువ్వు చాలా స్వార్ధపరురాలవు రుక్మిణి! నువ్వు నీ గురించి ఆలోచించుకుంటున్నావ్. నా గురించి నువ్వెప్పుడూ ఆలోచించలేదు" నీళ్ళు నిండిన కళ్ళతో అన్నాడు జయేంద్ర.
    మెల్లగా నవ్వింది రుక్మిణి. ఆ నవ్వుని విశ్లేషిస్తే ఎన్నో భావాలు అతనికి కనబడతాయి.
    "నిన్ను వెంటనే అమెరికా తీసికేల్తాను" మరో పావుగంట తర్వాత అన్నాడు జయేంద్ర.
    "నాకోసం నువ్వు కాదనకూడదు."
    ఏం మాట్లాడలేదు రుక్మిణి.
    "అక్కడకు వెళ్తే మళ్ళీ తిరిగోస్తాననుకున్నావా -- రాను." నిరాశగా అంది రుక్మిణి.
    "ఎంతమంది బతుకుల్లోనో , ఆశలు నూరిపోసిన నువ్వు, నిరాశలో కూరుకు పోవడం నాకాశ్చర్యంగా ఉంది రుక్మిణి...."
    "నిజమే జయేంద్ర......ఎందుకంటే.....ఇది నా బ్రతుకు ఇక్కడ నేను వాస్తవంగా ఆలోచించుకోవాలి గదా?
    "అందుకే అంటున్నాను.....ఆపరేషన్ అయితే ......నువ్వు మునుపటి లాగే ఆరోగ్యంగా ఉంటావు , మాతృ భూమిలోని రుక్మిణి నా కళ్ళ ముందు తిరుగాడాలి.....ఒప్పుకో .......అర్ధించాడు జయేంద్ర.
    "అలాగే ......చిన్న షరతు .......ఆపరేషన్ కు అమెరికా వెళ్ళే ముందు మన బాబుని హీరోగా చూడాలి .......అది నా కోరిక తీరుస్తావా?"
    ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు జయేంద్ర.
    "ఒకే.....అలాగే రుక్మిణి ...చేసే మన స్వంత బానర్ మీద పిక్చర్ ఎనౌన్స్ చేస్తాను.......సినిమా పేరు నువ్వే పెట్టు."
    "బాబు పేరే సినిమా పేరు......" నెమ్మదిగా అంది రుక్మిణి.

                                                    *    *    *    *

    "విమల్"
    రుక్మిణి సమర్పణలో , జయేంద్ర నిర్మాతగా, విమల్ హీరోగా రుక్మిణి మూవీస్ ప్రప్రధమ కానుక------
    "విమల్"
    స్టోరీ డిస్కషన్స్ ప్రారంభమయ్యాయి. ఒక్క ప్రక్క ప్రెస్ పబ్లిసిటీ......ఇంకోపక్క మ్యూజిక్ సిట్టింగ్స్ ......రెండు స్టూడియోల్లో సెట్స్ నిర్మాణం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS