కుక్క - గాడిద
వసుంధర
ఇన్ స్పెక్టర్ రాఘవరావు అప్పుడు డ్యూటీ లో లేడు. కాబట్టి డబ్బెట్టి పెకాడుతున్నాడు. ఆ విషయం నవ్వుతూ అన్నట్లుగా అన్నాడు అతని స్నేహితుడు గోవిందం.
రాఘవరావు జోకును కాస్త సీరియస్ గానే తీసుకుని "స్నేహితులతో డబ్బెట్టి పెకాడ్డం తప్పుకాదు --" అన్నాడు.
"అలా అనుకుందామనుకున్నా ఇక్కడున్న వారంతా నీ స్నేహితులు కారు" అన్నాడు గోవిందం స్నేహితుణ్ణి కవ్వించడానికి.
అయితే అతనన్న మాటలు నిజమే! అక్కడున్న నలుగురిలో గోవిందం ఒక్కడే రాఘవరావు స్నేహితుడు. మిగతా ఇద్దరూ గోవిందం స్నేహితులు. అందులో రామానుజం తో రాఘవరావు కిదివరకే పరిచయముంది కానీ సుబ్బారావు ను చూడడం ఇదే ప్రధమం.
"పేకాడే వాళ్ళ మధ్య నున్న స్నేహం అన్నదమ్ముల అనుబంధాన్ని మించిందని నీకు తెలీదను కుంటాను . ఏ క్షణాన ఒక పంక్తిలో కూర్చున్నామో అప్పుడే రాఘవరావు నాకు స్నేహితుడైపోయాడు " అన్నాడు సుబ్బారావు.
రాఘవరావు ముఖం వికసించింది. అయితే ఈలోగా గోవిందం "పేకాడే వాళ్ళంతా స్నేహితులే అయితే, స్నేహితులతో డబ్బెట్టి పెకాడ్డం తప్పు కాకపోతే మొన్న నువ్వెందుకురా "ఫ్రెండ్స్ క్లబ్" మీద రెయిడ్ చేసి పెకాడుతున్న నేరానికి పదిమందిని అరెస్ట్ చేశావు?" అన్నాడు.
సుబ్బారావు మరోసారి రాఘవరావు ను ఆదుకున్నాడు. 'అయితే నీ ఇల్లు క్లాబ్బూ ఒకటే నంటావు..." అని కాస్త తెల్లబోయి గోవిందం వంక చూసి చిన్నగా నవ్వుతూ "క్లబ్ లో పెకాడితే తప్పు. ఇంట్లో పెకాడితే తప్పు కాదు. ఇంట్లో చేసే చాలా పనులు క్లబ్బు లో చేయడం తప్పు...." అన్నాడు.
"ఎందుకట?" అన్నాడు రామానుజం.
"తెలుసుకోవాలనున్నవాడు స్వంత పెళ్ళాన్ని ఒకసారి నడిరోడ్డు మీద ముద్దు పెట్టుకుని చూస్తె - పోలీసులు కోర్టులు, లాయర్లు, తనంతట తానె అదెందుకు తప్పో తెలుసుకుంటాడు...." అన్నాడు సుబ్బారావు.
"సుబ్బారావుతో వాదించడం కష్టం. వాడు ఇన్ స్పెక్టర్ గార్ని రక్షించాలను కున్నాడు. ఆయనకు సాయపడుతున్నాడు. వాడి సాయం లభించినవాళ్ళ జోలికి వెళ్ళడం మంచిది కాదు. నేను విరమించుకుంటున్నాను" అన్నాడు గోవిందం.
"చాలా థాంక్స్ అండీ సుబ్బారావు గారు- ఈరోజు నాకో మంచి స్నేహితుడు లభించినందుకు చాలా సంతోషంగా వుంది" అన్నాడు రాఘవరావు.
"పోలీసులతో స్నేహం నాకే మంచిది. ఎప్పుడైనా అవసరానికి సాయపడతారు. నావల్ల మీకేం ప్రయోజన ముంటుంది?" అన్నాడు సుబ్బారావు.
'అలా నిన్ను నువ్వు చిన్నబుచ్చు కోకు. నీ సలహాల వల్ల ఎంతమంది బాగుపడలేదు? అందులోనూ అపరాధ పరిశోధన నీకు హాబీ కదా...." అన్నాడు గోవిందం.
"ఈజిట్!" అని ఆశ్చర్యపడ్డాడు రాఘవరావు.
"హాబీ లోనూ సామాన్యం కాదు. ఎక్కడైనా ఏదైనా కేసు వివరం తెలిస్తే దాన్ని బట్టి వీడు క్షుణ్ణంగా పాయింట్లు లాగి ఇలా ఇలా జరిగుండవచ్చునని అంటుంటాడు. చాలాసార్లు ఇలాగే జరగడం నాకు ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది" అన్నాడు గోవిందం.
"ఎందుకురా ఇప్పుడవన్నీ" అన్నాడు సుబ్బారావు.
ఆ మాట వినిపించుకోకుండా "వీడి లేటెస్ట్ ప్రిడిక్షన్ చెప్పనా?" అన్నాడు గోవిందం.
రాఘవరావు ఉత్సాహంగా తలాడించాడు.
"ఫ్రెండ్స్ క్లబ్ ను రెయిడ్ చేసి అరెస్టులు చేశాక నువ్వు నేరస్థులను వదిలిపెట్టవలసి వచ్చింది. అందుకు కారణం " అని ఆగిపోయాడు గోవిందం ఎందుకంటె సుబ్బారావు అతని వంక ఉరిమి చూస్తున్నాడు.
"చెప్పు!" అన్నాడు రాఘవరావు కుతూహలంగా.
"చెప్పెస్తాన్రా మరి!" అని గోవిందం చెప్పసాగాడు.
ఆ క్లబ్ లో దొరికిన వారందరూ పెద్ద మనుషులూ, డబ్బున్న వారు. వారు రాఘవరావు ను బెదిరించారు. అతను లొంగలేదు. రాఘవరావు పాత కక్షను సాధించడం కోసం ఈ పని చేసినట్లు కధ అల్లి సాక్ష్యాలు సంపాదిస్తామని వారు బెదిరించారు. ఆ పెద్దమనుషులకు పేరు మోసిన లాయర్లున్నారు.
పోలీసు అధికారి అయుండీ , ఒక నేరానికి ప్రత్యక్ష సాక్షి అయుండీ కూడా సరైన ఇతర సాక్ష్యాధారాలు లేకుండా కేసుల వ్రాయిస్తే అతను ప్రమాదంలో పడగలడు. అందుకే రేయిడింగ్ సమయంలో అతను కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. ఆ ఫోటోల సాక్ష్యంతో అతను అనుకున్నది సాధించగలడు. అయితే ఆ ఫోటోలు పోయాయి. దాంతో రాఘవరావు భయపడి నేరస్తులను వదిలి పెట్టేశాడు.
"అద్భుతం . నిజంగా ఇదంతా మీరే చేయించి నంత సులభంగా ఊహించారు" అన్నాడు రాఘవరావు.
"ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందనే నా ఊహలు పోలీసులకు చెప్పడం ఇష్టముండదు నాకు" అన్నాడు సుబ్బారావు.
"సారీ" అన్నాడు గోవిందం.
"నేను కూడా సారీ చెబుతున్నాను కానీ మీరు అన్యధా భావించకుండా నేనడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి...." అన్నాడు రాఘవరావు.
"మీరెప్పుడు డ్యూటీలో లేరు" అన్నాడు సుబ్బారావు.
"ఇది డ్యూటీకి సంబంధించిన విషయం కాదు. నేనిప్పుడు మీ స్నేహితుడ్ని!"
"అయితే అడగండి ..." అన్నాడు సుబ్బారావు.
"మీరు విషయాన్ని ఇంత పెర్ ఫెక్టు గా ఎలా ఊహించగలిగారు?" అన్నాడు రాఘవరావు.
'అంటే - నిజంగా ఆ ఫోటోలు పోయాయా?"
"పోయాయి. కానీ ఆ విషయం నేను నేరస్థులకు చెప్పలేదు. అలా చెప్పడం వల్ల వాళ్ళు మరింత పెట్రేగిపోతారని భయపడ్డాను. చిన్నగా హెచ్చరించి వదిలేశాను...."
"పోలీసులతో గొడవ ఎవరికీ ఇష్టముండదు. వాళ్ళు తమ జాగ్రత్తలో తాముంటారు. ఇంక మీ జోలికీ రారు ..." అన్నాడు సుబ్బారావు.
"కానీ....ఈ విషయాన్ని ఇంత కచ్చితంగా మీరెలా ఊహించగలిగారు? ఇలాంటి అనుభవాలు ఇదివరలో మీకేమైనా ఎదురయ్యాయా?" అన్నాడు రాఘవరావు.
"చెప్పాలంటే ఇందాకా గోవిందం అన్నట్లు అపరాధ పరిశోచన నాకు హాబీ. నేను వార్తల్లో నేరాల గురించే వెతుకుతుంటాను. వాటి నుంచి కేసులు తయారు చేసి వివరాలూహించడానికి ప్రయత్నిస్తుంటాను. అనుభవం నా పేర ఫక్షన్ కి కారణమయుండవచ్చు. కానీ మీరు నన్ను మరీ మరీ ఈ ప్రశ్న అడగటానికి కారణమేమిటి?"
'ఆ దొంగతనం ఎలా జరిగిందో తెలుకోవాలనుంది నాకు. ఆ ఫోటోల విషయంలో చాలా జాగ్రత్త వహించాను నేను. వాటి ఉనికి అతి రహస్యంగా ఉంచబడింది" అన్నాడు రాఘవరావు.
'అన్నీ ఊహలో కనుక్కోవడం సాధ్యపడితే ఈ ప్రపంచంలో జీవితానికి థ్రిల్ వుండదు. ఆ దొంగతనం ఆ పెద్దమనుషులు చేయించి వుండవచ్చు. లేదా సామాన్యమైన దొంగ ఏమో అనుకుని ఏమో తీసుకుని వుండవచ్చు. ఎవరైనా బ్లాక్ మెయిలర్ కావచ్చును. ఆ ఫోటోలు మీనుంచి కాజేసి ఆ పెద్ద మనుష్యుల్ని బ్లాక్ మెయిల్ చేస్తుండవచ్చు....."
"నిజమే కానీ ఆ దొంగతనం ఎలా జరిగింది అని!"
సుబ్బారావు క్షణం అలోచించి "మీరు అది తెలుసుకోవాలంటే మీరా ఫోటోలను దాచడంలో ఎటువంటి జాగ్రత్త వహించారో నేను తెలుసుకోవలసి వుంది" అన్నాడు.
'సామాన్యంగా పోలీసులు ఇటువంటి వ్యవహారాల్లో ఎటువంటి జాగ్రత్త వహిస్తారో ఊహించలేరా?" అన్నాడు రాఘవరావు.
"ఊహించగలను కానీ చెప్పదల్చుకోలేదు. ఎందుకంటె ఎప్పుడైనా అవసరం నన్ను దొంగలా మారిస్తే -- ఈ ఊహాలన్నీ అప్పుడు ఉపయోగపడతాయి. అవన్నీ ఒక పోలీసు అధికారికి చెప్పడం వల్ల నాకు చాలా నష్టం కదా మరి" అని నవ్వేశాడు సుబ్బారావు. అతనితో శృతి కలిపారు గోవిందం , రామానుజం.
రాఘవరావు మాత్రం ఆశ్చర్యంగా అనుమానంగా అతని వంక చూశాడు.
2
నగరంలో ఒక హత్య జరిగింది. హతుడు బ్రహ్మచారి' మధ్యతరగతి వాడు. ఒక్కడూ గది తీసుకుని ఉంటున్నాడు. పరిచయాలు చాలా స్వల్పం. విష ప్రయోగం వల్ల మరణించాడతను.
హతుడు ఆత్మహత్య చేసుకుంటాడనుకునేందుకు ఏ మాత్రమూ అవకాశం లేదు. అతడికి డైరీ రాసే అలవాటుంది. చనిపోయే ముందు రోజు వరకూ అతడు డైరీ రాశాడు.
అతడికి ఏవిధమైన సమస్యలూ లేనట్లూ, జీవితం పై ఏమాత్రమూ విముఖం లేనట్లూ ఆ డైరీ కచ్చితంగా చెబుతోంది. అదీ కాక హత్య జరిగిన నాటికి వారం రోజుల్లో అతను పెళ్ళి చూపులకు వెళ్ళబోతూన్నాడు. ఆ పిల్ల గురించి అతనికి ముందే కొంత తెలుసును. ఆ అమ్మాయే భార్య అయితే తను చాలా అదృష్ట వంతుడినని అతను భావిస్తున్నాడు. ఆమెను గురించి అతడు కంటున్న కలలు కూడా కొన్ని డైరీలో వ్రాయబడ్డాయి.
